ఏఐ: చైనా ఈ రంగంలో అమెరికాను మించి పోతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లిలీ జమాలి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రతి నెలా లక్షల మంది ప్రజలు సరికొత్త స్టైల్స్ తెలుసుకునేందుకు పింటరెస్ట్ యాప్‌ను ఓపెన్ చేస్తుంటారు.
దానిపై 'వియర్డెస్ట్ థింగ్స్' అనే ఒక పేజీ ఉంది. దానిలో సృజనాత్మకతను ఇష్టపడే ప్రజల కోసం వినూత్నమైన ఐడియాలు ఉంటాయి. క్రాక్స్‌తో చేసిన పూలకుండీలు, చీజ్‌బర్గర్ లాంటి ఐషాడోలు లేదా కూరగాయల నుంచి చేసిన జింజర్‌బ్రెడ్ హౌస్ ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి.
కానీ, దీనికి వెనుకాలనున్న టెక్నాలజీ అమెరికాలో రూపొందిందో లేదో చాలామందికి తెలియదు. పింటరెస్ట్ తన రికమండేషన్ ఇంజిన్‌ను మరింత మెరుగుపర్చేందుకు చైనాకు చెందిన ఏఐ విధానాలతో ప్రయోగాలు చేస్తోంది.
''పింటరెస్ట్‌ను ప్రాథమికంగా ఏఐ ఆధారిత షాపింగ్ అసిస్టెంట్‌గా మార్చేశాం'' అని ఆ కంపెనీ సీఈఓ బిల్ రెడీ చెప్పారు.
నిజమే, శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ తన టెక్నాలజీ పని కోసం అమెరికాకు చెందిన ఏదైనా ఏఐ ల్యాబులను ఎంపిక చేసుకోవచ్చు. కానీ, చైనా డీప్‌సీక్ ఆర్1 మోడల్ 2025 జనవరిలో విడుదలైనప్పటి నుంచి, పింటరెస్ట్‌లో చైనాకు చెందిన ఏఐ టెక్నాలజీ పాత్ర గణనీయంగా పెరుగుతోంది.

'డీప్‌సీక్ విప్లవం'
ఈ 'డీప్‌సీక్ విప్లవం' అనేది గణనీయమైన విజయం సాధించిందని పింటరెస్ట్ కంపెనీ సీఈఓ బిల్ రెడీ తెలిపారు.
''వారు ఓపెన్ సోర్స్ విధానాన్ని (అందరికీ అందుబాటులోకి ఉంచడం) అందిస్తున్నారు. ఓపెన్ సోర్స్ మోడళ్లలో ఇది ఒక పెద్ద విప్లవాన్నే ప్రారంభించింది'' అని తెలిపారు.
అలీబాబాకు చెందిన 'క్వెన్' , మూన్‌షాట్‌కు చెందిన 'కిమి', టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ 'బైట్‌డాన్స్' వంటి చైనాకు చెందిన ఇతర ప్రత్యర్థి కంపెనీలు ప్రస్తుతం ఇదే టెక్నాలజీని అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
''చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ ఏఐ వంటి అమెరికాకు చెందిన చాలా కంపెనీల మోడళ్లతో పోలిస్తే.. ఈ మోడళ్ల అతిపెద్ద బలం ఏంటంటే.. కంపెనీలు వీటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని, వారి అవసరాలకు తగ్గట్లు మార్చుకోవచ్చు'' అని పింటరెస్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మ్యాట్ మాడ్రిగల్ తెలిపారు.
''మా సొంత అవసరాల కోసం, ఇన్-హౌస్ మోడళ్లను ట్రైన్ చేసేందుకు వాడే ఓపెన్ సోర్స్ విధానాలు, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్ మోడళ్ల కంటే 30 శాతం ఎక్కువ కచ్చితత్వంతో పనిచేస్తున్నాయి'' అని మాడ్రిగల్ చెప్పారు. వీటి ఖర్చుల కూడా తక్కువే.
అమెరికా ఏఐ డెవలపర్లు రూపొందించిన ప్రొప్రైటరీ మోడళ్లతో (కేవలం యజమాన్య సంస్థ మాత్రమే నియంత్రించే మోడళ్లతో) పోలిస్తే ఇవి 90 శాతం వరకు తక్కువకు లభిస్తున్నాయన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'చౌకగా.. వేగంగా '
చైనా ఏఐ టెక్నాలజీపై ఆధారపడ్డ ఏకైక అమెరికా కంపెనీ పింటరెస్ట్ మాత్రమే కాదు. చాలా ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఈ మోడళ్లు ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
ఎయిర్‌బీఎన్‌బీ సీఈఓ బ్రియాన్ చెస్కీ గతేడాది అక్టోబర్‌లో బ్లూమ్‌బర్గ్‌తో మాట్లాడినప్పుడు.. తమ ఏఐ కస్టమర్ సర్వీసు ఏజెంట్ల పనితీరును పెంచడం కోసం తన కంపెనీ ఎక్కువగా అలీబాబా క్వెన్ మోడల్‌పై ఆధారపడుతుందని తెలిపారు.
దీనికి గల మూడు కారణాలను ఆయన వివరించారు. ఇది చాలా మంచిది, చాలా వేగంగా పనిచేస్తుంది. చౌకగా లభిస్తుందన్నారు.
ఈ మార్పు హగ్గింగ్ ఫేస్ అనే సైట్‌పై కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచే మెటా, అలిబాబా వంటి ప్రముఖ డెవలపర్ల నుంచి రెడీమేడ్ ఏఐ మోడళ్లను ప్రజలు డౌన్‌లోడ్ చేసుకుంటుంటారు.
ఖర్చులు తక్కువగా ఉండటంతో అమెరికా మోడళ్ల కంటే చైనా మోడళ్లపై కొత్త స్టార్టప్ కంపెనీలు ఎక్కువగా ఆధారపడుతున్నాయని ఈ ప్లాట్‌ఫామ్ ప్రోడక్టు హెడ్ జెఫ్ బౌడియర్ తెలిపారు.
''హగ్గింగ్ ఫేస్‌పై ఎక్కువగా ట్రెండ్ అయ్యే మోడళ్లను అంటే ప్రజలు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకున్నవి, ఎక్కువగా ఇష్టపడిన వాటిని చూస్తే.. టాప్ 10లో చాలా మోడళ్లు చైనా ల్యాబ్‌లలో తయారు చేసినవే ఉన్నాయి'' అని చెప్పారు.
''కొన్ని వారాలైతే... టాప్ 5 ట్రైనింగ్ మోడళ్లలో నాలుగు కూడా చైనా ల్యాబ్‌లకు చెందినవే ఉన్నాయి'' అని అన్నారు.
సెప్టెంబర్‌లో హగ్గింగ్ ఫేస్ ప్లాట్‌ఫామ్‌పై అత్యంత ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన అతిపెద్ద లాంగ్వేజ్ మోడల్‌గా మెటా లామాను అలీబాబాకు చెందిన క్వెన్ దాటేసింది.
మెటా తన ఓపెన్ సోర్స్ లామా (Llama) మోడల్‌ను 2023లో విడుదల చేసింది. డీప్‌సీక్, అలీబాబా నుంచి కొత్త మోడళ్లు విడుదలయ్యేంత వరకు.. కస్టమ్ అప్లికేషన్లను అభివృద్ధి చేసేందుకు డెవలపర్లు లామానే ఎక్కువగా ఎంపిక చేసుకునేవారు.
అయితే, గతేడాది విడుదలైన లామా 4 డెవలపర్లను ఆకట్టుకోలేకపోయింది. అలీబాబా, గూగుల్, ఓపెన్ ఏఐ నుంచి ఓపెన్ సోర్స్ మోడళ్లను వాడుతూ మెటా ప్రస్తుతం తన సరికొత్త మోడల్‌ను సన్నద్ధం చేస్తోంది. ఇది త్వరలోనే విడుదల కాబోతుంది.
ఇక ఎయిర్‌బీఎన్‌బీ విషయానికొస్తే.. అమెరికా మోడల్‌తో పాటు ఎన్నో మోడళ్లను ఇది వాడుతోంది.
అయితే, ఏ ఏఐ మోడల్ డెవలపర్లకు తమ డేటాను షేర్ చేయడం లేదని ఈ కంపెనీ స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా విజయం ఎలా?
ప్రస్తుతం బెస్ట్ మోడల్ ఏదంటే.. అది ఓపెన్ సోర్సు మోడల్ అని జెఫ్ బౌడియర్ తెలిపారు.
చైనాకు చెందిన ఏఐ మోడళ్లు సామర్థ్యంలో కానీ, వినియోగదారుల పరంగా కానీ ప్రపంచంలోని మిగిలిన దేశాలతో సమానంగా ఎదిగాయని, లేదా వాటిని అధిగమించాయని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ గత నెలలో విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది.
ఒకానొక రోజు మానవ మేధస్సును అధిగమించే ఏఐను రూపొందించే ప్రక్రియలో అమెరికా కంపెనీలు అతిగా నిమగ్నమయ్యాయని ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రిటన్ మాజీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సర్ నిక్ క్లెగ్ అన్నారు.
గతేడాది మెటా నుంచి గ్లోబల్ అఫైర్స్ హెడ్‌గా సర్ నిక్ తప్పుకున్నారు.
''సూపర్‌ఇంటెలిజెన్స్''ను సాధించేందుకు బిలియన్ డాలర్లను వెచ్చిస్తామని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.
అయితే, అలాంటి లక్ష్యాలను మనం స్పష్టంగా నిర్వచించలేమని చాలామంది నిపుణులు చెబుతున్నారు. ఇదే చైనాకు ఓపెన్ సోర్స్ ఏఐలో పైచేయి సాధించడంలో మంచి అవకాశాన్ని అందిస్తోందన్నారు.
''ప్రపంచంలోనే అతిపెద్ద నియంతృత్వ దేశమైన చైనాకు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికాకు మధ్య జరుగుతున్న పోటీలో ఇదొక విచిత్రమైన పరిస్థితి’’ అని సర్ నిక్ తెలిపారు.
చైనా ఓపెన్ సోర్స్ మోడళ్ల విజయానికి ప్రధాన కారణం ప్రభుత్వ మద్దతు కూడా కావొచ్చని స్టాన్‌ఫోర్డ్ రిపోర్టు తెలిపింది.
మరోవైపు, ఓపెన్‌ఏఐ లాంటి అమెరికన్ కంపెనీలు తక్షణ రెవెన్యూ పెంపు, లాభాల విషయంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
గత కొన్నేళ్లలో తొలిసారి ఓపెన్ఏఐ రెండు ఓపెన్ సోర్సు మోడళ్లను గత వేసవిలో విడుదల చేసింది.
అయితే, ఆదాయం కోసం ఈ కంపెనీ ఎక్కువగా తన వనరులను ఖరీదైన, ప్రొప్రైటరీ మోడళ్లపైనే దృష్టిపెట్టేలా చేసింది.
గతేడాది అక్టోబర్‌లో మాట్లాడిన ఓపెన్ఏఐ సీఈఓ శామ్ అల్ట్‌మాన్, తమ కంపెనీ భాగస్వాములతో కలిసి మౌలిక సదుపాయాలను, కంప్యూటింగ్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














