తూర్పు గోదావరి జిల్లా దళిత యువకుడికి శిరోముండనం: ‘నువ్వు సిగ్గుపడాలి, ఉరేసుకోవాలి అంటూ జుట్టు, గడ్డం తీయించేశారు ఎస్సై గారు’

వెండుగమిల్లి ప్రసాద్
ఫొటో క్యాప్షన్, ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తోన్న సీతానగరం ఇన్‌చార్జి ఎస్సై షేక్ ఫిరోజ్ ని సస్పెండ్ చేశారు
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర్లోని సీతానగరం పోలీస్ స్టేషన్లో ఒక దళిత యువకుడిని అవమానించారు. స్టేషన్లో ఇన్‌చార్జి ఎస్సై ఆ యువకుడికి ట్రిమ్మర్ తో గుండు చేయించారు.

సీతానగరం స్టేషన్ పరిధిలోని మునికూడలి అనే గ్రామం దగ్గర ఇటీవలే ఇసుకలారీ ప్రమాదం జరిగింది. ఆ లారీ ప్రమాదం విషయమై స్థానిక యువకులు, లారీ నిర్వాహకుల మధ్య గొడవ అయింది. దీంతో ఆ లారీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సీతానగరం పోలీసులు వెండుగమిల్లి ప్రసాద్ అనే వ్యక్తిని స్టేషన్‌కి తీసుకు వచ్చారు. అతను ఆ కేసులో ఏ2గా ఉన్నారు.

పోలీస్ స్టేషన్లో ప్రసాద్‌ను గట్టిగా కొట్టారు. దాంతో పాటూ ట్రిమ్మర్‌తో అతని జుట్టు బాగా కత్తిరించి, గుండులాగా చేశారు. గడ్డం కూడా తీసేసారు.

ప్రస్తుతం బాధితుడు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటున్న సీతానగరం ఇన్‌చార్జి ఎస్సై షేక్ ఫిరోజ్, ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి అర్బన్ ఎస్పీ షిమోషి బాజ్‌పాయ్ తెలిపారు.

కాగా ఇప్పటికే ఎస్సైను సస్పెండ్ చేయడంతో పాటు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టినట్లు ఎస్పీ చెప్పారు.

నిందిత ఎస్సై గోకవరం స్టేషన్లో అడిషనల్ ఎస్సైగా ఉన్నారు. సీతానగరం పోస్టు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు.

స్పందించిన ముఖ్యమంత్రి జగన్

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో దళిత యువకుడి ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌‌మోహన్ రెడ్డి స్పందించారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

‘‘సీఎంఓ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్న జగన్ బాధ్యులైన సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు ఎట్టిపరిస్థితుల్లోనూ చోటు చేసుకోరాదని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు స్పందించిన డీజీపీ.. ఈ కేసుపై విచారణ జరిపి ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. చట్ట ప్రకారం తదుపరి చర్యలుంటాయని డీజీపీ తెలిపారు.’’

ప్రసాద్ చేతికి అయిన గాయం

ఎస్సై, సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటూ ఐపిసి 324,323,506, r/w 34 కింద కేసులు (క్రైం నంబర్ 257/2020) పెట్టారు.

''అధికార పార్టీకి చెందిన ఇసుక వ్యాపారి కె.కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పోలీస్ స్టేషన్లో దళిత యువకుడు ప్రసాద్‌ను చావబాది, శిరోముండనం చేయడం సిగ్గు చేటు. ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునే చర్య. ఇసుక మాఫియా ఆధ్వర్యంలోనే పోలీసులు ఈ దుశ్చర్యకు బరితెగించారు. పోలీసులతో పాటూ ఇసుక మాఫియాపై కూడా అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు పెట్టాలి. ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి'' అని కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి కోరారు.

బాధితుడు రెండు రోజుల క్రితం స్థానిక మీడియాకు ఇచ్చిన స్టేట్మెంట్:

''అక్కడ (మా ఊళ్ళో) యాక్సిడెంట్ అయింది. బాధితుడు తెలిసిన వ్యక్తి. మేమంతా అతణ్ణి లేపడానికి వెళ్లాం. అతని కాలు విరగడంతో లేపడం కష్టమైంది. దీంతో కొంత ట్రాఫిక్ ఆగింది. ఈలోపు కృష్ణమూర్తి అనే అతను స్పీడుగా కారు వేసుకుని వచ్చి, హారన్ కొట్టాడు. కొద్దిసేపు ఆగమని అంటే, సర్రుమని డోరు తీసుకుని వచ్చాడు. అతని డోర్ నా ముక్కుకు తగిలి రక్తం వచ్చింది. దీంతో నాకు కోపం వచ్చి, కారును చేతితో గుద్దాను. వెంటనే బూతులు తిట్టాడు. ‘నా కారుపైనే చెయ్యి వేస్తావా? నేనెవరో తెలుసా? నిన్ను గుండు గీయించి, బట్టలిప్పి రోడ్డుపై తిప్పుతా. ఉరేసుకుని చస్తావ్..’ అంటూ వాళ్ల మనుషులు, ఒక 30-40 మందిని పిలిపించాడు. వాళ్లంతా వచ్చి మా ఊరి వాళ్లతో గొడవ పడ్డారు. ఈలోపు నన్ను మావాళ్లు ఇంటికి తీసుకెళ్లారు. మరునాడు మేమెళ్లి కేసు పెడదాం అనుకుంటే మా అమ్మ గారు వద్దన్నారు. ‘వాళ్లు పెద్దవాళ్లు, వాళ్లతో మనం పడలేం. మేమే వెళ్లి అతని కాళ్లపై పడి రాజీ కుదురుస్తాం’ అన్నారు. మా అమ్మగారు వెళ్తే రెండుసార్లు తిప్పారు. ఆ తరువాత వాళ్లు వెళ్లి కేసు పెట్టేశారు. నిన్న ఎస్సై, కానిస్టేబుళ్లు వచ్చి నన్ను ఈడ్చుకుని స్టేషన్ కి తీసుకెళ్లారు. నేనేం అడిగినా చెప్పలేదు. టైర్ బెల్టుకు చెక్కు ముక్క అతికించి ఉంది. దాంతో కొట్టారు. కాళ్లు విడదీసి పట్టుకున్నారు. షూతో ముఖంపై తన్నారు. పొట్టపై తన్నారు. మోకాళ్లపై నుంచున్నారు. నువ్వెవరితో పెట్టుకున్నావో తెలుసా అన్నారు. నువ్వు సిగ్గుపడాలి, ఉరేసుకోవాలి అంటూ మంగలిని పిలిపించి జుట్టు, గెడ్డం తీయించేశారు ఎస్సై గారు.''

రాజమహేంద్రవరం బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు వెండుగమిల్లి ప్రసాద్
ఫొటో క్యాప్షన్, రాజమహేంద్రవరం బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు వెండుగమిల్లి ప్రసాద్

‘ఈ గొడవకూ పార్టీకి ఏ సంబంధమూ లేదు’ - వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

ఈ వివాదంపై రాజానగరం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బీబీసీతో మాట్లాడుతూ.. ''రెండు రోజుల ముందు చిన్న వాదులాట వల్ల ఎస్సీలు, ఓసీల మధ్య ఘర్షణ జరిగింది. ఎస్సీలు కొందరు ఓసీలను కొట్టారు. మాజీ సర్పంచి కవల కృష్ణమూర్తి (ఓసీ - కాపు) రోడ్డుపై వెళ్తూ జనం ఎందుకు ఉన్నారా అంటూ ఆగారు. దీంతో కొందరు అతని కారు అద్దం పగలగొట్టారు. అతను వెళ్లిపోయాడు. తరువాత కొందరు ఎస్సీ కుల పెద్దలు మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి ఇంటికి వెళ్లారు. గొడవను స్టేషన్ కు తీసుకెళ్లకుండా రాజీ చేసుకుందామని ప్రతిపాదించారు. దానికి వారు అంగీకరించారు. కానీ ఆ గొడవలో దెబ్బలు తిన్న మరో వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ కేసులో నిందితుడిగా ఉన్న ప్రసాద్‌ను స్టేషన్ కి తీసుకెళ్లారు.

ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. మాజీ సర్పంచి కృష్ణమూర్తి వైఎస్‌ఆర్‌సీపీలో ఉన్నది వాస్తవం. కానీ ఈ గొడవకూ పార్టీకి ఏ సంబంధమూ లేదు. ఆ ఊళ్లో అంతకుముందు కూడా గొడవల్లేవు. నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితుడికి ప్రభుత్వం పక్షాన చేయగలిగిన సాయమంతా చేస్తాం’’ అన్నారు.

సీతానగరం వద్ద ఆందోళనకు దిగిన దళిత సంఘాలు
ఫొటో క్యాప్షన్, సీతానగరం వద్ద ఆందోళనకు దిగిన దళిత సంఘాలు

సీతానగరం పోలీసుల దాష్టీకాన్ని ఖండించిన చంద్రబాబు

ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

''ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న దళిత యువకుడికి శిరోముండనం రాష్ట్రంలో వైసీసీ పైశాచికాలకు పరాకాష్ట. తూర్పుగోదావరి జిల్లా వెదుళ్లపల్లి దళిత యువకుడు వరప్రసాద్ పై జరిగిన ఈ రాక్షస చర్యను ఖండిస్తున్నాం.

పోలీసులలో కొందరు వైసీపీ గుండాలుగా వ్యవహరించడం గర్హనీయం. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే అశాంతి, అభద్రత సృష్టించడం దారుణం. వైసీసీ నాయకులు చెప్పినట్లు ఆడే తోలుబొమ్మలుగా కొందరు పోలీసులు మారడాన్ని ఖండిస్తున్నాం.

దళితులపై ఇంత బరితెగించి దాడులు, దౌర్జన్యాలు, అమానుషాలు గతంలో చూడలేదు. 'మా అధికారం-మా ఇష్టం' అన్నట్లుగా వైసీసీ గూండాలు చెలరేగి పోతున్నారు.

ఇది యావత్ దళిత జాతిపై దాడి.. ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం..వైసీపీ దళిత వ్యతిరేక పార్టీ అనడానికి ఇవే ప్రత్యక్ష సాక్ష్యాలు. దళిత సంఘాలు, ప్రజా సంఘాలన్నీ ఏకమై ఈ దాడులను ప్రతిఘటించాలి. వైసీపీ గూండాల దుర్మార్గాలను అడ్డుకోవాలి. వైసీపీ దుశ్చర్యలకు దళితులే తగిన బుద్ది చెప్పాలి. బాధిత దళిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వారికి న్యాయం జరిగేదాకా, నిందితులను కఠినంగా శిక్షించేదాకా రాజీలేని పోరాటం చేస్తాం'' అని చంద్రబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)