సిద్ధూ మూసేవాలా హత్య: పంజాబీ సింగర్, కాంగ్రెస్ నాయకుడిపై కాల్పులు, హత్య... కేజ్రీవాల్, భగవంత్ మాన్ ఏమన్నారంటే..

ఫొటో సోర్స్, Getty Images
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్ధూ మూసేవాలాను పంజాబ్ రాష్ట్రంలోని మాన్సా జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
ఈ కాల్పుల ఘటనలో సిద్ధూ సహా మొత్తం ముగ్గురు గాయపడ్డారని ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రకటించింది.
శనివారం పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 424 మంది మతం, రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు పోలీసు రక్షణను ఉపసంహరించుకుంది. వీరిలో సిద్ధూ కూడా ఒకరు.
కాల్పుల అనంతరం సిద్ధూను మాన్సా ఆసుపత్రికి తరలించారు. అక్కడి సివిల్ సర్జన్ డాక్టర్ రంజీత్ రాయ్ సిద్ధూ మరణాన్ని ధ్రువీకరించారు.
‘‘సిద్ధూ మూసేవాలా సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఆసుపత్రికి వచ్చేసరికే సిద్ధూ మూసె వాలా మరణించారు. గాయపడిన మిగతా ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం పాటియాలాలోని రజింద్ర ఆసుపత్రికి పంపించాం. సిద్ధూ గుండెలపైన, తొడపైన కాల్చారు’’ అని డాక్టర్ రంజీత్ రాయ్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, SIDHU MOOSE WALA/FB
సిద్ధూ మూసెవాలా ఎవరు?
అసలు పేరు శుభదీప్ సింగ్ సిద్ధూ. మాన్సా జిల్లాలోని ఒక గ్రామంలో జన్మించారు.
కొన్నేళ్లుగా పంజాబీ వినోద ప్రపంచంలో ఆయన సిద్ధూ మూసేవాలాగా పేరు తెచ్చుకున్నారు.
ఒకసారి ఓ టబీఛానెల్ యాంకర్ కాలేజీలో క్యాంపస్ విద్యార్థులతో మాట్లాడుతుండగా.. శుభదీప్ సింగ్ సిద్ధూ అలియాస్ సిద్ధూ మూసేవాలా అందరికీ పరిచయం అయ్యారు.
యాంకర్ రెండుసార్లు అతని పేరు అడిగారు. రెండు సార్లూ అతను తన పేరును చెప్పడానికి పెద్దగా ఇష్టపడలేదు. అయినా, అయిష్టంగానే చెప్పారు. యాంకర్ మళ్లీ అడగ్గా.. శుభదీప్ సింగ్ సిద్ధూ అని చెప్పారు.
క్యాంపస్‌లో శుభదీప్ పాటపాడగా అందరూ అభినందించారు.
2018లో తుపాకీ సంస్కృతికి సంబంధించిన పాటలతో సిద్ధూ మూసేవాలా అందరి దృష్టినీ ఆకర్షించారు.
సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్‌జిత్ కౌర్ మూసా గ్రామ సర్పంచ్.
సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సిద్ధూ మూసెవాలా తన తల్లి గెలుపుకోసం ఎన్నికల్లో ప్రచారం చేశారు.
తర్వాతి కాలంలో ఆయన వినోద ప్రపంచం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రెండు చోట్లా పేరు తెచ్చుకున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
మాన్సాలోని సర్దార్ చేతన్ సింగ్ సర్వహిత్కారీ విద్యా మందిర్‌లో 12వ తరగతి వరకు చదువుకున్నారని, తర్వాత పంజాబ్‌లో డిగ్రీ వరకు చదివి కెనడా వెళ్లి అక్కడ ఒక సంవత్సరం డిప్లమో చేశారని బీబీసీ ప్రతినిధి సురీందర్ మాన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కేజ్రీవాల్, భగవంత్ మాన్ రాజీనామా చేయాలి - యూత్ కాంగ్రెస్ డిమాండ్
సిద్ధూ మూసేవాలా హత్యకు పంజాబ్‌లోని ఆమ్‌ఆద్మీ ప్రభుత్వమే కారణమని యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘‘అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్.. సిద్ధూ మూసెవాలా రక్తం మీ చేతులకు అంటుకుంది. సిగ్గుతో తలవంచుకోండి, రాజీనామా చేయండి’’ అని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, సిద్ధూపై జరిపిన కాల్పుల్లో గాయపడిన ఇద్దరికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్య చికిత్సకు రిఫర్ చేసినట్లు మాన్సా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సంతాపం
సిద్ధూ మూసెవాలా మృతికి కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, స్నేహితులకు సానుభూతి తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా సంతాపం ప్రకటించారు. సిద్ధూ భవిష్యత్ ఉన్న కాంగ్రెస్ నాయకుడు, ప్రతిభ ఉన్న కళాకారుడు అని, ఆయన మరణ వార్త తననకు తీవ్రంగా కలచివేసిందని ట్వీట్ చేశారు.
పంజాబ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విఫలమైందని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆరోపించారు. పంజాబ్‌లో ఎవరూ సురక్షితంగా లేరని అన్నారు.
శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా సిద్ధూ హత్యపై విచారం వ్యక్తం చేశారు.
నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు.
సిద్ధూ మూసేవాలా హత్య తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పంజాబ్ బీజేపీ నేత సునీల్ జాఖర్ పేర్కొన్నారు. చౌకబారు రాజకీయాల కోసం రాష్ట్ర శాంతి భద్రతలను దిగజారుస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీయే ఈ హత్యకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కేజ్రీవాల్, భగవంత్ మాన్ స్పందన..
సిద్ధూ మూసేవాలా మృతిపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇద్దరూ స్పందించారు.
‘‘సిద్ధూ మూసేవాలాహత్య దురదృష్టకరం. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో మాట్లాడాను. దోషులను కఠినంగా శిక్షిస్తాం. అందరూ శాంతియుతంగా ఉండాలి’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
‘‘సిద్ధూ మూసేవాలా దారుణ హత్య గురించి విని షాక్‌కు గురయ్యాను. దీనికి బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. సిద్ధూ కుటుంబ సభ్యులు, అభిమానులకు నా సంతాపం’’ అని భగవంత్ మాన్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- కాంటాక్ట్స్ లెన్స్ కంప్యూటర్ స్క్రీన్లు కాబోతున్నాయా? స్మార్ట్ లెన్స్‌లలో రాబోతున్న కొత్త ఫీచర్లేంటి?
- కోనసీమకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాంతం అంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది?
- 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
- భారత్-నేపాల్ మధ్య ఒక నది ఎలా చిచ్చు పెడుతోంది
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
- జానీ డెప్–అంబర్ హెర్డ్: పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ నటుడికి, ఆయన మాజీ భార్యకు మధ్య కేసులో 5 విస్తుపోయే వాదనలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












