మదర్స్ డే ఎప్పుడు, ఎలా మొదలైంది? మదరింగ్ సండే ఎక్కడి నుంచి వచ్చింది?

ఫొటో సోర్స్, Getty Images
అమ్మ కోసం ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా చేసుకునే వేడుక మదర్స్ డే.
దాదాపు 117 ఏళ్ల కిందట అమెరికాలో ‘మదర్స్ డే’ మొదలైంది. అందుకు స్ఫూర్తి అన్నా జార్విస్.
1907 మే 12న అమెరికన్ మహిళ అన్నా జార్విస్ తన తల్లి కోసం ఒక మెమోరియల్ సర్వీస్ నిర్వహించడంతో మదర్స్ డే అనే ఆలోచన ప్రారంభమైంది.
ఆ తర్వాత అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఏటా మే నెలలో రెండో ఆదివారం నాడు అమ్మను గుర్తు చేసుకునేందుకు కొన్నికార్యక్రమాలు చేయడం మొదలైంది. దీంతో 1914లో అప్పటి అమెరికా అధ్యక్షుడు దీన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించారు.

ఫొటో సోర్స్, HERITAGE IMAGES/GETTY
తల్లి నుంచి వచ్చిన ఆలోచన..
అమ్మ కోసం ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలన్న ఆలోచన జార్విస్‌కు తన తల్లి నుంచే వచ్చింది. జార్విస్ తల్లి ఇతర తల్లులను చైతన్యపరుస్తూ వారు తమ పిల్లల భవిష్యత్ గురించి జాగ్రత్తలు తీసుకునేలా చేసేవారని చరిత్రకారిణి, వెస్ట్ వర్జీనియా వెస్లియాన్ కాలేజీ ప్రొఫెసర్ క్యాథరీన్ ఆంటోలినీ చెప్పారు.
అమ్మలు చేసేపనికి గుర్తింపు ఉండాలని ఆమె భావించేవారు. 1858లో ఆమె మదర్స్ డే వర్క్ క్లబ్ ప్రారంభించినప్పటి నుంచి మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చి కార్యకలాపాల్లో చురుగ్గా ఉండేవారు.
మదర్స్ డే వర్క్ క్లబ్బులు శిశుమరణాల రేటు తగ్గించడానికి పనిచేసేవి.
అప్పటికి పశ్చిమ వర్జీనియాలోని గ్రాఫ్టన్ ప్రాంతంలో శిశుమరణాలు అధికంగా ఉండేవి. ప్లేగు, ఇతర అంటువ్యాధుల కారణంగా పిల్లలు చనిపోతుండేవారు.
తన తల్లిదండ్రుల 13 మంది సంతానంలో అన్నా జార్విస్ ఒకరు. ఆ 13 మందిలో తొమ్మిది మంది చిన్నతనంలోనే మరణించారు. మిగిలిన నలుగురిలో అన్నా జార్విస్ పెద్దన్న ఒక్కరికే పిల్లలున్నారు. అందులోనూ చాలామంది చిన్నతనంలోనే టీబీ, ఇతర కారణాలతో చనిపోయారు.
1905లో ఆమె మరణించినప్పుడు ఆమె చుట్టూ ఉన్న మిగిలిన నలుగురు పిల్లల్లో అన్నా జార్విస్ అత్యంత బాధతో తన తల్లి స్ఫూర్తి కొనసాగిస్తానని మాటిచ్చారని ప్రొఫెసర్ ఆంటోలినీ చెప్పారు.
అయితే.. అన్నా జార్విస్ తల్లి ఇతరుల జీవితాలు మెరుగుపడేలా అమ్మలు చేసే పనికి గుర్తింపు దక్కాలని, అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకోగా అన్నా జార్విస్ మాత్రం ‘అత్యుత్తమ మాతృమూర్తి ఎవరైనా సరే ఆమె మీకు తల్లే’ అనే భావనతో ఈ మదర్స్ డేను జరపడం ప్రారంభించారు.
అందుకే ఇది Mothers Day అని బహువచనంతో కాకుండా Mother's Day అని ఏకవచనంతోనే ఉంటుంది.
‘తన జీవితాన్ని మీ కోసం అంకితం చేసిన మీ తల్లిని గౌరవించే రోజు ఇది’ అనేది అన్నా జార్విస్ అభిప్రాయం.

ఫొటో సోర్స్, Getty Images
మే రెండో ఆదివారమే ఎందుకు?
1905లో అన్నా జార్విస్ తల్లి మరణించిన తరువాత మూడేళ్లకు అంటే 1908లో తొలిసారి గ్రాఫ్టన్ మెథడిస్ట్ చర్చిలో మే రెండో ఆదివారం నాడు మదర్స్ డే నిర్వహించారు.
అన్నా జార్విస్ రెండో ఆదివారాన్ని ఎంచుకోవడానికి కారణం ఆమె తల్లి మరణించిన మే 9వ తేదీకి రెండో ఆదివారం సమీపంలో ఉండడమే కారణం.
ఆ తరువాత మదర్స్ డేకు ప్రాచుర్యం విపరీతంగా పెరిగింది. 1910లో వెస్ట్ వర్జీనియా రాష్ట్రంలో మదర్స్ డేకు సెలవు ఇచ్చారు.
1914కి వచ్చేసరికి ఏకంగా అమెరికా వ్యాప్తంగా ఆ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించారు అప్పటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్.

ఫొటో సోర్స్, Getty Images
వాణిజ్యానికి వ్యతిరేకంగా పోరాటం
‘‘అన్నా జార్విస్ ఈ వేడుకలను ఎన్నడూ వాణిజ్యంగా కోరుకోనప్పటికీ కొద్దికాలంలోనే ఇవి పూర్తిగా వ్యాపారంగా మారిపోయాయి. పూల బొకేలు, గ్రీటింగు కార్డులు, బహుమతులు, చాక్లెట్ల రంగాలు ఈ మదర్స్ డేను వాణిజ్యంగా మార్చేశాయి’’ అని ప్రొఫెసర్ అంటోలినీ చెప్పారు.
కానీ, అన్నా జార్విస్ కోరుకున్నది ఇది కాదు. వేడుకలు పూర్తిగా వాణిజ్య రూపం దాల్చినప్పుడు ఆమె ఒక పత్రికాప్రకటన విడుదల చేసి మదర్స్ డేను వ్యాపారంగా మార్చొద్దని అర్థించారు.
1920 నాటికి మదర్స్ డే రోజు పూలు కొనడం, బొకేలు కొనడం మానుకోవాలంటూ ఆమె ప్రజలను కూడా అర్థించారు. తాను కోరుకున్న స్ఫూర్తిని మరచి వివిధ సంస్థలు కూడా దీన్ని పూర్తిగా మార్చేయడంపై ఆమె బాధపడేవారని ఆంటోలినీ చెప్పారు.
‘‘దీంతో పూల వ్యాపారులు ఆమెను డబ్బుతో కొనాలనుకున్నారు.. కానీ, అందుకు ఆమె ఏమాత్రం అంగీకరించలేదు. ఈ మదర్స్ డేను అడ్డంపెట్టుకుని లాభపడే మార్గం ఉన్నా కూడా ఆమె ఎన్నడూ అలాంటి పని చేయలేదని.. అంధురాలైన తన సోదరి లిలియాన్‌తో కలిసి ఆమె తన తండ్రి, సోదరుడి నుంచి వచ్చిన వారసత్వ ఆస్తిపై ఆధారపడి సాదాసీదా జీవితం గడిపారు’’ అని ఆంటోలినీ వివరించారు.
పైగా మదర్స్ డే వాణిజ్యంగా మారిపోకుండా పోరాడేందుకు అన్నా జార్విస్ సొంత డబ్బు ఖర్చు చేశారని ఆంటోలిని చెప్పారు.
మదర్స్ డేను జాతీయ సెలవు దినంగా ప్రకటించడానికి ముందు ఆమె ‘మే రెండో ఆదివారం, మదర్స్ డే’ అనేదానికి కాపీరైట్ తీసుకున్నారు. మదర్స్ డేను వాణిజ్యపరంగా నిర్వహించేవారిపై ఆమె కేసులు వేసేవారు.
దీంతో కొన్ని సంస్థలు ఈ వేడుకలను జరిపేటప్పుడు మదర్స్ డేను బహువచనం (Mothers Day)గా వాడుతూ కాపీరైట్ నుంచి తప్పించుకునేవారు.
1944లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం అప్పటికి ఆమె వేసిన 33 కాపీరైట్ కేసులు పెండింగులో ఉన్నాయి.
అప్పటికి ఆమె వయసు 80 ఏళ్లు.. కళ్లు, చెవులు సరిగా పనిచేసేవి కావు. ఫిలడెల్ఫియాలోని ఒక శానిటోరియంలో ఆమె ఉండేవారు.
ఆమె సంరక్షణ కోసం కొందరు పూల, గ్రీటింగ్ కార్డు వ్యాపారులు ఆమెకు తెలియకుండా శానిటోరియానికి డబ్బు చెల్లించేవారన్న ప్రచారం ఉంది.
జార్విస్ మాత్రం ఆ వయసులో కళ్లు కనిపించకపోయినా ఇళ్లిళ్లూ తిరుగుతూ మదర్స్ డే వేడుకలు వద్దంటూ సంతకాలు సేకరించేవారు.
జార్విస్ సోదరి లిలియన్ వారు నివసిస్తున్న శానిటోరియంలో గదిని వెచ్చబరిచే ప్రయత్నంలో కార్బన్ మోనాక్సైడ్ వ్యాపించి ఊపిరాడక చనిపోయారు.
జార్విస్ 1948లో గుండెపోటుతో మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో మదర్స్ డే
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్నట్లే భారత దేశంలోనూ మే నెల రెండో ఆదివారాన్ని మదర్స్ డేగా జరుపుకుంటున్నారు.
ఉపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన పిల్లలు, విదేశాల్లో ఉండే వారు ఈ రోజున అమ్మకు అభినందనలు తెలపడం, విదేశాల నుంచి ఫోన్లు చేసి మాట్లాడటం, బహుమతులు పంపించడం లాంటి సంస్కృతి భారత దేశంలో పెరుగుతోంది.
దేశంలోని మెట్రో నగరాల్లో మదర్స్ డే రోజున కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చెయ్యడం, ఇంట్లో అందరూ కలిసిన దృశ్యాలను మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.
పశ్చిమ దేశాలతో పోలిస్తే భారతదేశంలో తల్లులు- పిల్లల మధ్య ఉండే బాండింగ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఇండియాలో పిల్లలు యుక్త వయసు వచ్చే వరకు తల్లితోనే ఉంటారు. దీంతో వారికి అమ్మతో అనుబంధం ఎక్కువగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
మదరింగ్ సండే అంటే ఏంటి?
మదర్స్ డేను బ్రిటన్‌లో మదరింగ్ సండే అని కూడా పిలుస్తున్నారు. బ్రిటన్‌లో ఈ మదర్స్ డేకు భిన్నమైన చరిత్ర ఉంది. దానికి, అమెరికాలో మొదలైన మదర్స్ డేకు సంబంధం లేదు.
మధ్యయుగంలో చిన్నప్పటి నుంచి తాము పెరిగిన ఇంటిని, ప్రాంతాన్ని వదిలి వెళ్లిన పిల్లలు పెరిగి పెద్దైన తర్వాత క్రిస్టియన్ పండుగ లెంట్ జరుపుకునే నాలుగో ఆదివారం రోజును తిరిగి వచ్చి తమ ఇంటిని, మదర్ చర్చ్‌ను సందర్శించేవారని చెబుతారు.
పిల్లలకు పదేళ్ల వయసు వచ్చిన తర్వాత పని కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం గతంలో అసాధారణ వ్యవహారం ఏమీ కాదు. అయితే లెంట్ పండుగ రోజున కుటుంబ సభ్యులంతా మళ్లీ కలిసేవారు.
బ్రిటన్‌లో ఇది మదరింగ్ సండేగా గుర్తింపు పొందింది. లెంట్ పండుగ ఏటా వేర్వేరు తేదీల్లో వస్తూ ఉండటంతో మదరింగ్ సండే కూడా మారుతూ వచ్చింది.
మదర్స్ డే లేదా మదరింగ్ డేను వేర్వేరు దేశాల్లో వేర్వేరు తేదీల్లో జరుపుకుంటారు. బ్రిటన్‌లో ఈ ఏడాది మార్చి 10 మదర్స్ డే చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- హెచ్డి దేవేగౌడ: అన్నం లేక పస్తులున్న రోజుల నుంచి ప్రధానమంత్రి పదవి దాకా.
- దక్షిణ కొరియా: ప్రెప్పర్లు ఎవరు, ఉత్తర కొరియాతో యుద్ధం భయంతో ఎందుకు అన్నీ సర్దుకుంటున్నారు?
- లోక్‌సభ ఎన్నికలు: ఒకనాడు 400కు పైగా స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 స్థానాలలో మాత్రమే ఎందుకు పోటీ చేస్తోంది?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














