ట్రంప్-కిమ్ భేటీ: ఉత్తర కొరియాలో ఉత్సాహం.. అమెరికాలో భిన్నాభిప్రాయం

ఫొటో సోర్స్, Reuters
డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య జరిగిన చరిత్రాత్మక శాంతి సమావేశం అనంతరం రెండు దేశాల్లోనూ దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా ఉత్తర కొరియాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి మీడియా ఈ పరిణామాన్ని ఆశావహ కోణంలో చూస్తోంది. దీన్ని తమ దేశం సాధించిన విజయంగా అభివర్ణిస్తోంది.
అక్కడి ప్రభుత్వ మీడియా అయితే అమెరికా తమ దేశంపై విధించిన ఆంక్షలను ఉపసంహరించుకునే అవకాశం ఉందని పేర్కొంది.
ట్రంప్, కిమ్‌లు మంగళవారం సింగపూర్‌లో భేటీ కావడం.. ఉద్రిక్తతలు తగ్గించుకోవడం, అణు నిరాయుధీకరణకు సంబంధించి నాలుగు అంశాలతో ఒక సంయుక్త ప్రకటలను విడుదల చేశారు.
ప్రస్తుతానికి ఆంక్షలు కొనసాగుతాయని, అనంతర కాలంలో అణు నిరాయుధీకరణను అనుసరించి వాటిని ఎత్తివేస్తామని వెల్లడించారు.
అంతేకాదు, అమెరికా-దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలకు కూడా ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు.
సైనిక విన్యాసాలను నిలిపివేయాలని, ఆంక్షలు ఎత్తివేయాలని ఉత్తర కొరియా సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ఆ దేశానికి ప్రయోజనకరంగా మారుతుండగా.. ఆ ప్రాంతంలోని అమెరికా మిత్ర దేశాలను మాత్రం ఆశ్చర్యపరిచాయి.
మరోవైపు అమెరికా అక్కడి తన మిత్ర దేశాలకు అభేద్యమైన భద్రత విషయంలో హామీగా ఉండేందుకు ప్రయత్నించింది.

ఫొటో సోర్స్, Rodong Sinmun
‘ఈ శతాబ్దపు భేటీ’
సాధారణంగా ఉత్తరకొరియా మీడియా పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. అక్కడి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను మాత్రమే పూర్తి సానుకూలంగా ప్రసారం చేస్తుంది. కిమ్ జోంగ్ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రసారం చేయడం, ప్రచురించడం కూడా అరుదే.
కానీ, అందుకు భిన్నంగా మంగళవారం నాటి కిమ్, ట్రంప్ భేటీకి అక్కడి ప్రసార మాధ్యమాలు అత్యంత ప్రాధాన్యమిచ్చాయి. కిమ్, ట్రంప్‌ల భేటీకి సంబంధించిన చిత్రాలను మొదటి పేజీల్లో ప్రచురించాయి.
అధికారిక పత్రిక 'రొడాంగ్ సిన్మన్'.. 'ఈ శతాబ్దపు భేటీ'గా అభివర్ణిస్తూ మొదటి పేజీలో పతాక శీర్షికగా ప్రచురించింది.
ప్రభుత్వ నిర్వహణలోని మరో మీడియా సంస్థ కేసీఎన్‌ఏ అయితే ఈ చర్చలు చరిత్రాత్మకం అంటూ ప్రశంసలు కురిపించింది.

ఫొటో సోర్స్, Handout
ఆశలన్నీ ఆంక్షల ఎత్తివేతపైనే..
''అమెరికా, దక్షిణకొరియాల సైనిక విన్యాసాలకు విరామం ఇవ్వడం, ఆంక్షల ఎత్తివేత, భద్రతకు పూచీ కల్పించడం, సంప్రదింపులు.. చర్చలతో రెండు దేశాల మధ్య సంబంధాలు పెంచుకోవడంపై ట్రంప్ ఆసక్తిగా ఉన్నారు'' అంటూ కేసీఎన్ఏ ప్రచురించింది.
అలాగే, అమెరికాలో కిమ్ జోంగ్ పర్యటించేందుకు.. ఉత్తరకొరియాలో ట్రంప్ పర్యటించేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారని కేసీఎన్‌ఏ పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
జపాన్, చైనాలు ఏమంటున్నాయ్?
ఈ భేటీ అనంతరం ట్రంప్‌తో జపాన్ ప్రధాని షింజో అబే మాట్లాడుతూ.. పూర్తి అణు నిరాయుధీకరణకు కిమ్ స్పష్టంగా అంగీకరించడంపై హర్షం వ్యక్తం చేశారు.
అయితే, తూర్పు ఆసియా భద్రత దృష్ట్యా దక్షిణ కొరియాలో అమెరికా సైన్యం ఉండడం కీలకమని జపాన్ రక్షణ మంత్రి ఇత్సునోరి ఒనెడెరా అభిప్రాయపడ్డారు.
మరోవైపు చైనా విదేశాంగ మంత్రి 'వాంగ్ యి' దీనిపై స్పందిస్తూ.. ట్రంప్, కిమ్‌ల భేటీ విషయంలో చైనా పాత్రను ఎవరూ సందేహించడానికి వీల్లేదని.. ముందుముందు కూడా తమ పాత్ర కొనసాగుతుందని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
మారుతున్న రాజకీయ చిత్రం
రెండేళ్ల కిందట అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్యూబా వెళ్లారు. అప్పట్లో ఆయన చొరవపై అమెరికాలో ప్రశంసలు, విమర్శలూ వచ్చాయి.
తాజాగా ఉత్తర కొరియా విషయంలో ట్రంప్ చూపిన చొరవపైనా అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దౌత్యపరంగా ఇదో పెద్ద మలుపు అంటూ ఫాక్స్ న్యూస్ పేర్కొంది.
మరోవైపు... దీని వల్ల ఒరిగేది పెద్దగా ఏమీ ఉండకపోయినా ట్రంప్ మాత్రం విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారంటూ డెమొక్రాట్లలో అత్యధికులు అభిప్రాయపడుతున్నారు.
మరికొందరు అమెరికా, ఉత్తర కొరియా జెండాలు పక్కపక్కనే ఉండడం చూసి విస్మయం చెందారు. మానవ హక్కుల ఉల్లంఘనలో ఉత్తర కొరియా చరిత్రను వారు గుర్తు చేస్తున్నారు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








