అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మహిళలు ప్రభంజనం సృష్టిస్తారా?
ఈ నవంబర్‌లో అమెరికా మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే అవి చాలా భిన్నం.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకంటే ఈసారి అత్యధిక సంఖ్యలో మహిళలు - ప్రధానంగా డెమోక్రటిక్ పార్టీ తరపున, ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.
ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌లో మహిళల సంఖ్య 20 శాతమే. వారిలో 23 మంది సెనేటర్లు (23 శాతం), 84 మంది (19.3 శాతం) హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో ఉన్నారు. అంటే మొత్తం 535 మంది సభ్యుల్లో మహిళలు కేవలం 107 మంది (78 మంది డెమోక్రాట్లు, 29 మంది రిపబ్లికన్లు) మాత్రమే.
ప్రభుత్వంలో మహిళల సంఖ్య పరంగా చూస్తే 193 దేశాల జాబితాలో అమెరికా 102వ స్థానంలో ఉంది. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలోని 5 రాష్ట్రాల నుంచి అమెరికా కాంగ్రెస్‌కు ఒక్క ప్రతినిధీ లేరు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మధ్యంతర ఎన్నికల్లో హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో 435 సీట్లకు, సెనేట్‌లో 100 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. దాంతోపాటు 36 గవర్నర్ స్థానాలు, మేయర్లు, స్థానిక ప్రభుత్వాధికారుల స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు.
2012లో హౌస్, సెనేట్‌లకు మొత్తం 298 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడ్డారు. 2016లో ఆ సంఖ్య 312కు పెరిగింది.
ఈసారి అది రికార్డు స్థాయిలో 529కి చేరింది.
ప్రైమరీల తర్వాత ఇంకా 271 మంది రేసులో ఉన్నారు. వారిలో 24 మంది సెనేట్‌కు, 247 మంది హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌కు పోటీ పడుతున్నారు.
అమెరికా మీడియాలో దీనిని 'పింక్ వేవ్'గా అభివర్ణిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతమంది పోటీ చేయడానికి కారణమేంటి?
ఈ మహిళ్లో ఎక్కువ మంది డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరపున 194 మంది అమెరికా హౌస్‌కు, 16 మంది సెనేట్‌కు పోటీ చేస్తున్నారు.
రిపబ్లికన్ పార్టీ తరపున కూడా మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నా వారి సంఖ్య తక్కువగా ఉంది. ఆ పార్టీ తరపున 53 మంది మహిళలు హౌజ్‌కు, 8 మంది సెనేట్‌కు పోటీపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
#MeToo స్ఫూర్తితో..
ట్రంప్ విధానాలపై వ్యతిరేకత, #MeToo ఉద్యమం తర్వాత దేశంలోని పరిస్థితులే ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు పోటీ చేయడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికాలోని పరిస్థితులపై చాలామంది మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. వారు మార్పును కోరుకుంటున్నారు.
మహిళల పట్ల వివక్ష, అసమానతలు, లైంగిక వేధింపులు, సమాన వేతనాలు తదితర అనేక సమస్యలపై గత 12 నెలలుగా అమెరికాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది.
''మహిళలు రాజకీయాల్లో పాల్గొన్నపుడే ప్రజాస్వామ్యం పూర్తిగా పని చేసినట్లు'' అని గతంలో విస్కాన్సిన్ గవర్నర్ పదవికి పోటీ చేసిన డెమోక్రాట్ కెల్డా రాయ్స్ తెలిపారు. ఆమె ఆ పోటీలో ఓడిపోయినా, ప్రచారంలో కూడా తన బిడ్డకు పాలిస్తూ కనిపించి, అనేక ఆంక్షలను బద్దలు కొట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అయానా ప్రెస్లే.. ట్రంప్‌ను జాత్యహంకారవాది, స్త్రీద్వేషిగా అభివర్ణించారు. ప్రెస్లేకు అనుభవం లేదని కొంతమంది అన్నా, ఆమె ప్రైమరీలలో డెమోక్రటిక్ పార్టీలోని వృద్ధ నేత కపువానోను ఓడించారు.
అయితే పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులంతా ట్రంప్ విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నవారు కాదు. వాషింగ్టన్‌లో రాజకీయాలు చాలా నెమ్మదిగా ఉన్నాయని భావిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు.
ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే.. ఈ మధ్యంతర ఎన్నికల్లో ‘పింక్ వేవ్’ ప్రభావం కారణంగా అమెరికా కాంగ్రెస్‌లో పురుషులు, మహిళల సంఖ్య దాదాపు సమానం కావచ్చేమో.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








