'ఆర్ఆర్‌ఆర్' కథ ఇదీ... ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల సినిమాపై రాజమౌళి ప్రకటన- ప్రెస్ రివ్యూ

ఆర్‌ఆర్‌ఆర్ పోస్టర్

ఫొటో సోర్స్, FB/SSRajamouli

ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రధారులుగా తెర తెక్కుతున్న 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' సినిమా కథ గురించి వస్తున్న ఊహాగానాలన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెడుతూ దర్శకుడు ఎస్‌‌ఎస్ రాజమౌళి ఈ చిత్ర కథను సంక్షిప్తంగా మీడియా సమావేశంలో చెప్పేశారని ఈనాడు తెలిపింది.

అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తారు. ఆలియాభట్‌, జైసీ ఎడ్గర్‌ జోన్స్‌ కథానాయికలు. కీలక పాత్రల్లో అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని కనిపిస్తారు.

సీతారామరాజు, కొమరం భీమ్‌ల కథే.. 'ఆర్‌ ఆర్‌ ఆర్‌'

కథేమిటంటే- ''1897లో అల్లూరి సీతారామరాజు పుట్టారు. ఆంగ్లంతో పాటు వేదాలు, ఇతిహాసాలు బాగా చదువుకున్నారు. మూడేళ్ల పాటు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ మూడేళ్ల కాలంలో ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేశారు? అనే సంగతి తెలీదు. తిరిగొచ్చాక స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. ఆ తరవాత ఏం చేశారో అందరికీ తెలిసిందే. అలాగే 1909లో కొమరం భీమ్‌ పుట్టారు. ఆయన ఏం చదువుకోలేదు. కొన్నాళ్ల పాటు ఇంటికి దూరంగా వెళ్లిపోయారు. ఓ విద్యాధికుడిగా తిరిగొచ్చారు. ఆయన కూడా అల్లూరి సీతారామరాజులానే స్వాతంత్య్ర పోరాటం చేశారు. అలా దాదాపు ఒకేసారి పుట్టి, ఒకే సమయంలో ఇల్లు వదిలి వెళ్లిపోయి, తిరిగొచ్చి ఒకే రీతిలో పోరాటం చేసిన ఇద్దరు తెలుగు వీరులు వీరిద్దరూ. వీరిద్దరి కథ నన్ను చాలా ఆకర్షించింది. ఇంటికి దూరంగా వెళ్లిపోయిన వీళ్లు ఇద్దరూ కలిస్తే.. స్నేహితులుగా మారితే ఎలా ఉంటుందన్న ఆలోచనే 'ఆర్‌ ఆర్‌ ఆర్‌'. చరణ్‌ యుక్త వయసు అల్లూరి సీతారామరాజులా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ కొమరం పాత్ర పోషిస్తారు. బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ సీతగా కనిపించనుంది''అని రాజమౌళి వివరించారు.

ఈ సినిమా మొదలైనప్పట్నుంచే 'ఆర్‌ ఆర్‌ ఆర్‌'గా (రాజమౌళి, రామారావు, రామ్‌చరణ్‌) చలామణీ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా తమ సినిమా 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' అనే బ్రాండింగ్‌తోనే విడుదల అవుతుందని, ఒక్కో భాషలో ఒక్కో టైటిల్‌ని ప్రకటిస్తామని అని రాజమౌళి చెప్పారు. చిత్రాన్ని 2020 జులై 30న విడుదల చేస్తామని తెలిపారు.

ఈ చిత్రాన్ని రూ.350 నుంచి రూ.400 కోట్ల బడ్జెట్‌లో రూపొందించబోతున్నట్టు నిర్మాత డి.వి.వి దానయ్య తెలిపారు.

నాగార్జునసాగర్ జలాశయం (పాతచిత్రం)

ఫొటో సోర్స్, irrigationap.cgg.gov.in

ఫొటో క్యాప్షన్, నాగార్జునసాగర్ జలాశయం (పాతచిత్రం)

తెలంగాణకు 29 టీఎంసీలు.. ఆంధ్రప్రదేశ్‌కు 17.5 టీఎంసీలు

ఎండాకాలం ప్రారంభంలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలను మరింత తోడేసేందుకు కృష్ణా బోర్డు గేట్లు తెరిచిందని, తెలంగాణకు 29 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 17.5 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసిందని నమస్తే తెలంగాణ తెలిపింది.

శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఎండీడీఎల్ దిగువన నీటిని పంచేందుకు జలసౌధలో గురువారం బోర్డు చైర్మన్ జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు మురళీధర్‌రావు, వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ఇటీవల సమర్పించిన 17 టీఎంసీల ఇండెంట్‌పై చర్చ జరిగింది. ఈ మేరకు నీళ్లు కావాలంటే ఏ జలాశయంలో ఎంత లోతుకు వెళ్లాలనేదానిపై లెక్కలు వేయాలని నిర్ణయించారు.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 827.40 అడుగులతో 46.98 టీఎంసీల నిల్వ ఉండగా... 800 అడుగుల లోతుకు వెళ్తే 18 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 524.20 అడుగులతో 123.337 టీఎంసీలున్నందున 505 అడుగుల వరకు పోతే అక్కడ 33.713 టీఎంసీలు.. మొత్తంగా 51.713 టీఎంసీల నిల్వ ఉన్నట్టుగా తేల్చారు.

రెండు రాష్ట్రాలు ఇండెంట్లు సమర్పించగా 51.713 టీఎంసీల్లో తెలంగాణకు 29 టీఎంసీలు, ఏపీకి 17.5 టీఎంసీలు కేటాయించి 46.5 టీఎంసీలు వాడుకునేందుకు కృష్ణా బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది.

చంద్రబాబు

ఫొటో సోర్స్, Facebook/Andhra PradeshCM

'టీడీపీలో చాలా మంది వారసులకు టికెట్లు'

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో చాలా మంది సీనియరు నేతల వారసులకు టికెట్లు దక్కాయని ఈనాడు తెలిపింది. వారసులనూ కలిపి చూస్తే 83 మంది సిట్టింగులు టికెట్లు దక్కించుకున్నారని చెప్పింది. 15 మంది మహిళలకు చోటు లభించింది.

గురువారం అర్ధరాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేసిన జాబితాలో 126 మంది పేర్లున్నాయి. కొంతమంది సిట్టింగుల నియోజకవర్గాలు మారాయి. విజయవాడ పశ్చిమ, గుంటూరు తూర్పు నియోజకవర్గాలు మైనారిటీలకు దక్కాయి.

పోటీ ఎక్కువగా ఉన్న చోట్ల, ఒక పట్టాన ఏకాభిప్రాయం సాధించలేకపోయిన నియోజకవర్గాలు, లోక్‌సభ స్థానాల ఎంపికతో ముడిపడిన నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన వాయిదా పడింది.

అత్యధికంగా 126 నియోజకవర్గాలకు తొలి విడతలోనే అభ్యర్థుల్ని ప్రకటించడంతో ఇక 49 నియోజకవర్గాలే మిగిలినట్లైంది. జాబితా విడుదలకు ముందు పొలిట్‌ బ్యూరో సమావేశంలోనూ, జిల్లా పార్టీ అధ్యక్షులతోనూ ముఖ్యమంత్రి చర్చించారు.

'సీఎల్పీ విలీనం లక్ష్యంగా టీఆర్‌ఎస్ వ్యూహం'

తెలంగాణ చట్టసభల్లో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేకుండా చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నింస్తోదని సాక్షి ఒక కథనంలో పేర్కొంది. మార్చి ఆఖరుతో శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేకుండా పోతుందని, ఆ రోజు వరకు అసెంబ్లీలోనూ మెజారిటీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని, సీఎల్పీని విలీనం చేసుకొనేందుకు ప్రయత్నిస్తోందని చెప్పింది.

ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైంది. ఉపేందర్‌రెడ్డి గురువారం టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావుతో సమావేశమయ్యారు. అనంతరం ఆయ న టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌రావుపై ఉపేందర్‌రెడ్డి విజయం సాధించారు. గెలిచినప్పటి నుంచే టీఆర్‌ఎస్‌ అధిష్ఠానంతో ఆయన సంప్రదింపులు మొదలుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఉపేందర్‌రెడ్డి చేరికతో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి మారుతున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరుకుంది.

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 18న వెలువడనుంది. ఆలోపు కాంగ్రెస్‌ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు అధికార పార్టీ ముఖ్యనేతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)