3డి ప్రింటింగ్ టెక్నాలజీతో కృత్రిమ కన్ను తయారీ.. ప్రపంచంలోనే తొలిసారిగా అమర్చుకున్న వ్యక్తి ఈయనే

స్టీవ్ వర్జీ

ఫొటో సోర్స్, Moorfields Eye Hospital

ఫొటో క్యాప్షన్, స్టీవ్ వర్జీ

లండన్‌లో ఒక రోగి ప్రపంచంలోనే తొలిసారిగా 3డి కృత్రిమ కన్నును అమర్చుకున్నారు. తూర్పు లండన్‌లోని హ్యక్నీకి చెందిన స్టీవ్ వర్జీకి ఈ కృత్రిమ కన్ను అమర్చారు. లండన్‌లోని మూర్ ఫీల్డ్స్ కంటి ఆసుపత్రిలో నవంబర్ 25వ తేదీన ఈ శస్త్ర చికిత్స జరిగింది.

సంప్రదాయ తరహాలో ఉండే యాక్రిలిక్ కృత్రిమ కంటి కంటే ఇది మరింత సహజంగా ఉంటుందని వైద్యులు ప్రకటించారు.

దీనిని రోగులకు అమర్చేందుకు సమయం కూడా తక్కువ పడుతుంది. సాధారణంగా దీనిని అమర్చేందుకు ఆరు వారాలు పట్టే ప్రక్రియ మూడు వారాలకు తగ్గుతుంది.

"నాకు 20 సంవత్సరాలున్నప్పటి నుంచి నాకు కృత్రిమ కన్ను అవసరం ఉంది. దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడిని" అని 40లలో ఉన్న వర్జీ చెప్పారు.

మూర్‌ఫీల్డ్స్ ఐ హాస్పిటల్
ఫొటో క్యాప్షన్, మూర్‌ఫీల్డ్స్ ఐ హాస్పిటల్

'చూసేందుకు అద్భుతంగా ఉంటుంది'

"నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, నన్ను నేను అద్దంలో రెండు సార్లు చూసుకుంటాను. కానీ, నా రూపం నాకు నచ్చేది కాదు".

"ఈ కొత్త కన్ను చూడటానికి బాగుంది. ఇది 3డి ప్రింటింగ్ టెక్నాలజీ పై ఆధారపడి పనిచేస్తుంది. దాంతో, ఇది మరింత మెరుగ్గా తయారైంది" అని వర్జీ అన్నారు.

సంప్రదాయ తరహాలో కృత్రిమ కన్ను ఉన్న వారు వారి కంటి సాకెట్‌ను మార్చుకునేందుకు 2 గంటల పాటు వైద్య ప్రక్రియకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత కృత్రిమ కన్నును అమర్చి రంగు వేస్తారు.

ఈ 3డి ప్రింట్ కృత్రిమ కన్ను తయారీకి అయ్యే సమయం కూడా రెండు నుంచి మూడు వారాలకు తగ్గిపోతుంది. మొదటి సారి క్లినిక్‌కి వెళ్ళినప్పుడు మాత్రం అరగంట అపాయింట్ మెంట్ తీసుకుంటే చాలని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

ఈ డిజిటల్ కృత్రిమ కంటి పని తీరు పట్ల సిబ్బంది చాలా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని, మూర్‌ఫీల్డ్స్ కంటి ఆసుపత్రి లో కన్సల్టెంట్ ఆప్తాలమాజిస్ట్ ప్రొఫెసర్ మన్‌దీప్ సాగూ చెప్పారు.

‘‘ఈ కొత్త సాంకేతికత అందించే విలువ గురించి రానున్న క్లినికల్ ట్రయల్స్ మరిన్ని ఆధారాలను అందించగలవని ఆశిస్తున్నాం. దీని వల్ల రోగులకు కలిగే మేలు కూడా తెలుస్తుంది. ’’

"కంటిని అమర్చుకునేందుకు వెయిటింగ్ లిస్టులో వేచి చూసే రోగుల సంఖ్యను కూడా ఈ టెక్నాలజీ తగ్గిస్తుంది".

వీడియో క్యాప్షన్, ‘కంటిచూపు కోల్పోయా.. కానీ అదే ఇప్పుడు నేను గోల్డ్ మెడల్స్ సాధించేలా సహకరిస్తోంది’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)