కొడంగల్‌లో రేవంత్ రెడ్డి: ‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు.. ఒక్కొక్కరు కాదు... ముగ్గురూ కలిసి రండి’

ఫొటో సోర్స్, revanthofficial/facebook
‘ముందస్తు ఎన్నికలు తెచ్చారు.. ముందస్తు అరెస్టులు చేయిస్తున్నారు.. వీటితో కేసీఆర్‌కు ముందస్తు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది’ అని తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
అరెస్ట్ అనంతరం.. పోలీసులు రేవంత్ రెడ్డిని కొడంగల్ తీసుకెళ్లి వదిలేశారు.
ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
‘నియంతల పాలనలో, సమైక్య పాలనలో కూడా ఇంత అరాచకంగా, దుర్మార్గంగా, ఆధిపత్యాన్ని చెలాయించడం చూడలేదు. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుల గొంతులు నులమడానికి కేసీఆర్ బరితెగిస్తారనడానికి ఇదొక ఉదాహరణ. ఆనాడు కోదండరామ్ ఇంటిపై దాడి చేసి, తలుపులు బద్దలుగొట్టి, వారిని ఈడ్చుకుపోయిన రోజే తెలంగాణ సమాజమంతా చైతన్యంతో స్పందించి ఉంటే, అన్ని రాజకీయ పార్టీలూ ఖండించి కోదండరామ్‌కు అండగా నిలిచి ఉంటే ఈరోజు ఈ పరిస్థితులు ఉండేవి కావు’ అన్నారు.
‘ప్రజల మనసు గెలవకుండా.. నామీద దాడులు చేయడం ద్వారా, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి ఎన్నికల్లో గెలుద్దామనుకోవడం కేసీఆర్ భ్రమ’ అన్నారు.
‘మొదట నీ అల్లుడు, తర్వాత నీ కొడుకు వచ్చారు.. వారితో ఏం కాలేదు.. ఇయ్యాల నువ్వే వచ్చావు కదా.. ఇంకా 48 గంటలు ఉంది ఎన్నికలకు.. ఒక్కొక్కరు కాదు.. ముగ్గురూ కలసి రండి.. రేపు కొడంగల్ చౌరస్తాలో తేల్చుకుందాం’ అని రేవంత్ అన్నారు.

ఫొటో సోర్స్, revanthofficial/facebook
‘కేసీఆర్‌కు విశ్రాంతి’
రేవంత్ అరెస్ట్‌పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు.
‘‘అరెస్టులతో కాంగ్రెస్ ప్రభంజనాన్ని టీఆర్ఎస్ అడ్డుకోలేదు. కేసీఆర్ నిరంకుశ ధోరణికి పరాకాష్టే రేవంత్ రెడ్డి అరెస్ట్. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు రోజులు దగ్గరపడ్డాయి. ఓటమి భయం వల్లే అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్‌ను ప్రజలు చిత్తుగా ఓడించి కేసీఆర్‌కు విశ్రాంతి ఇవ్వబోతున్నారు’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘నీ కూతురి ఇంట్లో బెడ్రూమ్ పగలగొడితే ఒప్పుకుంటావా?’
కొడంగల్‌లో బంద్ ప్రకటన విరమించుకుని, నిరసన కార్యక్రమాన్ని మాత్రమే రేవంత్ రెడ్డి చేపట్టారని.. అది కూడా కేసీఆర్ బహిరంగ సభ జరుగుతున్న కోస్గి పట్టణం వెలుపల అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి అన్నారు.
‘‘ఏమయ్యా కేసీఆర్ గారూ.. రేపు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి.. నీ కూతురి ఇంట్లో నోటీసు లేకుండా బెడ్రూమ్ పగలగొడితే ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకున్నా సమాజం, రాజ్యాంగం ఒప్పుకుంటాయా?’’ అని జైపాల్ రెడ్డి ప్రశ్నించారు.
‘‘నువ్వు లేకలేక ముఖ్యమంత్రి అయితే.. నీ శక్తి ఎంత? నువ్వెవ్వరసలు? అప్పుడే ఇంత నికృష్ట నియంతలాగా వ్యవహరిస్తున్నావు’’ అని జైపాల్ రెడ్డి విమర్శించారు.

ఫొటో సోర్స్, KTRTRS/facebook
‘ఏపీ సీఎం తెలంగాణలో ప్రచారం చేయొచ్చు.. తెలంగాణ సీఎం ఒక నియోజకవర్గంలో ప్రచారం చేయకుండా ఆపుతారా?’
కొడంగల్‌లో కేసీఆర్ బహిరంగ సభ, రేవంత్ రెడ్డి అరెస్టు ఘటనలపై టీఆర్ఎస్ నాయకుడు కేటీ రామారావు స్పందించారు.
‘‘తెలంగాణలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాహుల్ గాంధీ ప్రచారం చేయాలని మహాకూటమి కోరుకుంటుంది. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత రాష్ట్రంలోని ఒక నియోజకవర్గంలో ప్రచారం చేయకుండా ఆపేందుకు ప్రయత్నిస్తారా’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
‘‘ఎన్నికల సమయంలో ఈసీయే సుప్రీం అథార్టీ. సీఎం కొడంగల్ మీటింగ్‌ను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించటంతో.. (రేవంత్ రెడ్డి) ముందస్తు అరెస్టుకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై పలువురు చేసిన ట్వీట్లను, వీడియోను కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.
‘శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త’
కాగా, రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై సీఈవో రజత్ కుమార్ స్పందించారు.
కేసీఆర్ సభ రోజు కొడంగల్‌లో బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు ఈ నెల 2న కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని, దీనిపై టీఆర్ఎస్ తమకు ఫిర్యాదు చేసిందని ఆయన తెలిపారు. ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపామని.. వారి ఆదేశాలపై ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాశామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్తలో భాగంగా రేవంత్‌ను అరెస్ట్ చేశారని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








