అఫ్గాన్ మహిళా పుట్‌బాల్ జట్టుపై లైంగిక హింస: 'నీ అందాలు చూపిస్తేనే టీమ్‌లో చోటిస్తా'

ఫొటో సోర్స్, AFP
- రచయిత, జిల్ మెక్‌గివరింగ్
- హోదా, బీబీసీ న్యూస్ - దక్షిణాసియా ఎడిటర్
తాలిబన్ అనంతర అఫ్గానిస్తాన్‌లో మహిళలకు కొత్తగా లభించిన స్వేచ్ఛకు ఆ దేశ మహిళా ఫుట్‌బాల్ జట్టు ఒక ప్రతీక అని ప్రపంచమంతా కీర్తించింది.
కానీ, క్రీడాకారిణులు ఫుట్‌బాల్ మైదానంలో అడుగుపెట్టలేక పోతున్నారు. అతివాదులు, మిలిటెంట్లను ధిక్కరించిన ఆఫ్గాన్ క్రీడాకారిణులపై లైంగిక దాడులు, వేధింపులు జరిగాయని ఆ దేశ అత్యున్నత క్రీడాధికారుల్లో ఒకరు అంగీకరించారు.
ఇది కేవలం ఫుట్‌బాల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఇతర క్రీడల్లోనూ ఈ సమస్య ఉందని ఆయన అంగీకరించారు.
కానీ, కోచ్‌లు, క్రీడల అధికారులు తమపై చేస్తున్న లైంగిక దాడుల గురించి బహిరంగంగా మాట్లాడటానికి చాలా మంది క్రీడాకారిణులు తీవ్రంగా భయపడుతున్నారు. కొంతమంది తాము ఎదుర్కొన్న పరిస్థితులను వ్యక్తిగతంగా బీబీసీకి వెల్లడించారు.
ఈ కుంభకోణం కొన్ని రోజుల కిందట బట్టబయలైంది. జాతీయ ఫుట్‌బాల్ బృందంలోని కొందరు మహిళలు చేసిన ఆరోపణల మీద దర్యాప్తు చేస్తున్నట్లు ఫుట్‌బాల్ పాలక సంస్థ ఫిఫా గత శుక్రవారం నాడు చెప్పింది.
ఆ మరుసటి రోజు అఫ్గాన్ అటార్నీ జనరల్ కార్యాలయం కూడా తను సొంతగా దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఆరోపణలకు అఫ్గాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఎఫ్ఎఫ్) కేంద్ర బిందువుగా ఉంది. ఈ సమాఖ్య అధ్యక్షుడు కెరాముద్దీన్ కరీమ్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ సంస్థకు అందిస్తున్న స్పాన్సర్‌షిప్‌ను డెన్మార్క్ క్రీడాదుస్తుల సంస్థ హమ్మెల్ ఉపసంహరించింది.
అయితే, ఆరోపణలను ఏఎఫ్ఎఫ్ సెక్రటరీ జనరల్ సయ్యద్ అలీరెజా అకాజదా తిరస్కరించారు. ఆ మహిళల కథనాలు నిజం కాదన్నారు. ‘‘క్రీడాకారిణి మీదా ఎటువంటి లైంగిక వేధింపులూ జరగలేదు’’ అని పేర్కొన్నారు.
కానీ, ఆగ్రహం చల్లారే సూచనలేవీ కనిపించటం లేదు. అఫ్గానిస్తాన్ పార్లమెంటులోని ఉభయ సభల్లోనూ సోమవారం ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ ఒలింపిక్ కమిటీ అధినేత హఫీజుల్లా రహిమి, కాబూల్‌లో మీడియా ముందు అనూహ్య ప్రకటన చేశారు.
‘‘విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ తరహా ఆందోళనలు మా వరకూ వచ్చాయి’’ అని ఆయన చెప్పారు. ‘‘లైంగిక వేధింపులు ఉన్నాయి. ఒక్క ఫుట్‌బాల్ ఫెడరేషన్‌లో మాత్రమే కాదు. ఇతర క్రీడల సమాఖ్యల్లోనూ ఉన్నాయి. దానిపై మనం పోరాడాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పురుష కోచ్‌లు, అధికార పదవుల్లో ఉన్న ఇతర పురుషుల లైంగిక వేధింపులు తీవ్రంగా ఉన్నాయంటూ జాతీయ మహిళా ఫుట్‌బాల్ టీమ్ మాజీ సభ్యులు కొంత కాలంగా చేస్తున్న ఆరోపణలు విశ్వసనీయమైనవి కావచ్చునని లాంఛనంగా అంగీకరించటం ఇదే తొలిసారి.
అఫ్గాన్ మహిళల జాతీయ ఫుట్‌బాల్ టీం మాజీ కెప్టెన్, మాజీ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఖలీదా పోపాల్ నుంచి ఈ ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. అఫ్గానిస్తాన్ ఇంకా తాలిబన్ పాలనలో ఉన్న కాలంలో ఆమె టీనేజీ వయసులోనే తన ప్రాణాలకు తెగించి రహస్యంగా ఫుట్‌బాల్ ఆడేవారు. స్కూలు గోడ అవతలివైపు ఉన్న తాలిబన్ గార్డులకు వినిపించి, పట్టుపడకుండా ఉండటానికి ఆమె, ఆమె స్నేహితులు మౌనంగా ఆట కొనసాగించేవారు.
అఫ్గాన్‌లో చంపేస్తామన్న బెదిరింపులతో తన దేశం వదిలేసిన ఖలీదా 2011 నుంచి డెన్మార్క్‌లో నివసిస్తున్నారు. ఆమె అక్కడి నుంచి బీబీసీతో మాట్లాడారు. బాలికలు, యువతులపై.. కోచ్‌లు, ఫెడరేషన్ అధికారులు భౌతిక, లైంగిక దాడులకు పాల్పడటం ఎంత తీవ్రంగా ఉందనే దానికి తాను ప్రత్యక్ష సాక్షినని పేర్కొన్నారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులు, అసభ్యంగా తాకటాలు వంటివి సర్వసాధారణమన్నారు.
ఇద్దరు కోచ్‌ల అకృత్యాలను తాను నమోదు చేసిన తర్వాత ఈ విషయం గురించి ఏదైనా చేయగలమన్న ఆశలు తనకు దాదాపు మృగ్యమయ్యాయని ఆమె చెప్తారు. తను గుర్తించిన విషయాలను కొన్నేళ్ల కిందటే ఆమె అఫ్గాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ దృష్టికి తీసుకువెళ్ళారు.
‘‘వారిని తొలగించడం లేదా శిక్షించడానికి బదులు పదోన్నతులు కల్పించారు’’ అని ఖలీదా తెలిపారు.
కీలక నేరస్తుల్లో కొందరు అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న బలవంతులని ఆమె చెప్పారు. ఫెడరేషన్‌లోని అధికారులు తమతో సెక్స్ చేస్తే టీమ్ జాబితాలో వారికి చోటు కల్పిస్తామని, డబ్బు ఇస్తామని క్రీడాకారిణులకు చెప్తుంటారని వివరించారు.
అఫ్గానిస్తాన్‌లోనే నివసిస్తున్న కొందరు యువతులతో, ఫుట్‌బాల్, ఇంకా ఇతర క్రీడలకు సంబంధించిన క్రీడాకారిణులతో బీబీసీ మాట్లాడింది. వారు తమకు ఎదురైన లైంగిక దాడులు, బెదిరింపుల అనుభవాలను పంచుకున్నారు. తాము జాతీయ టీంలో స్థానం కోసం పోటీపడుతున్నపుడు, లేదంటే విదేశాల్లో శిక్షణ కోసమో, ఆడటం కోసం అవకాశం కోసం పోటీ పడుతున్నపుడు తరచుగా లైంగిక వేధింపులు జరిగాయని వారు చెప్పారు.
‘‘నీ అందాలు నాకు చూపించు. అందమైన యువతులు మాత్రమే టీమ్‌లోకి వెళతారు’’ అని తనకు చెప్పినట్లు ఒక యువతి తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
2001లో తాలిబన్ పాలన అంతమైన తర్వాత, మరింత స్వేచ్ఛాయుతమైన అఫ్గానిస్తాన్‌కు ఒక చిహ్నంగా, బాలికలు, యువతులకు లభించిన స్వాతంత్ర్యానికి ప్రతీకగా ఆ దేశ మహిళల ఫుట్‌బాల్ జట్టు గతంలో ప్రశంసలు అందుకుంది. అదే ఫుట్‌బాల్ టీంలోని క్రీడాకారిణులపై ఈ తరహా లైంగిక దాడులు, వేధింపులు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
కాబూల్‌లో ఈ టీం సభ్యులకు శిక్షణనిచ్చిన ఫుట్‌బాల్ స్టేడియం ఒకప్పుడు తాలిబాన్ హత్యలకు వేదికగా ఉండేదన్న వాస్తవం. ఆ నీలి నీడలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయనిపిస్తోంది.
ఖలీదా పోపల్ ఫుట్‌బాల్ టీమ్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్నపుడు అమెరికాకు చెందిన మహిళా కోచ్‌లు, అమెరికాలోని అఫ్గాన్ మహిళలు చాలా మందిని నియమించారు. ‘‘ఆ అఫ్గాన్ మహిళలు తమ దేశానికి ఏదైనా చేయాలని కలలు కన్నారు. అఫ్గాన్‌లోని తమ సోదరిలకి మద్దతివ్వాలని ఆశించారు. అఫ్గాన్ మహిళల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచేలా ఒక బలమైన నేషనల్ టీంని అభివృద్ధి చేయాలనుకున్నారు’’ అని ఆమె చెప్పారు.
‘‘కానీ దురదృష్టవశాత్తూ మా కార్యక్రమాన్ని ధ్వంసం చేయటానికి పురుషులు ప్రయత్నించారు’’ అని పేర్కొన్నారు.
ది గార్డియన్ వార్తాపత్రికలో తన ఆరోపణలు శుక్రవారం ప్రచురితమైనప్పటి నుంచీ.. తాను వాటిని వెల్లడించినందుకు గాను డజను మంది మహిళలు, పురుషులు తనకు కృతజ్ఞతలు చెప్పారని.. కొందరు కన్నీటి పర్యంతమయ్యారని, వారికి కూడా ఇదే తరహా అనుభవాలు ఉన్నా కానీ భయం వల్ల ముందుకు రాలేకపోయామని చెప్పారని ఖలీదా తెలిపారు.
‘‘నా గళం చాలా జీవితాలను మార్చగలదని నాకు తెలుసు. వ్యవస్థను మార్చగలదని నాకు తెలుసు’’ అని ఆమె నాతో అన్నారు.
(బీబీసీ అఫ్గాన్ సర్వీస్ అందించిన అదనపు సమాచారంతో)
ఇవి కూడా చదవండి
- ‘పదేళ్ల పిల్లలు కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు’
- అఫ్గానిస్థాన్: 6 నెలల్లో 1692 మంది బలి
- సౌదీలో మహిళల కంటే రోబోకే ఎక్కువ స్వేచ్ఛ!
- సౌదీలో తొలిసారి: స్టేడియాల్లోకి మహిళలు
- భవిష్యత్తుపై ఆశలు రేపుతున్న మహిళల పోరాటం
- ఒసామా బిన్ లాడెన్ తల్లి: నా బిడ్డ చిన్నప్పుడు చాలా మంచివాడు
- ఆ గాయకుడు నన్ను లైంగికంగా వేధించాడు: ‘భాగ్ మిల్ఖా భాగ్’ నటి
- ‘మహిళలపై వారి కుటుంబ సభ్యులతోనే అత్యాచారం చేయించేవారు’
- లైంగిక నేరస్థుల జాబితా: భారత్‌లో ఎందుకు? ఇందులో ఎవరి పేర్లుంటాయ్?
- సిరియా: ‘ఆకలి తీరాలంటే కోరిక తీర్చాలన్నారు’
- జైనబ్ పాకిస్తాన్ 'నిర్భయ' అవుతుందా?
- పోప్ ఫ్రాన్సిస్: ‘చర్చిల్లో లైంగిక వేధింపులు నీచమైన నేరాలు.. సిగ్గుపడుతున్నా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








