‘పదేళ్ల పిల్లలు కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు’

సిరియా శరణార్థి బాలిక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 'మేమూ మా పిల్లలూ ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రతి క్షణం సిద్ధంగానే ఉంటాం. పిల్లలు రోజూ భయం భయంగా బతకడం మాకు ఇష్టంలేదు'

ప్రపంచంలోనే అత్యంత దారుణమైన శరణార్థుల శిబిరంగా గ్రీకు దీవిలోని మోరియా క్యాంప్‌కు పేరుంది. అక్కడ పదేళ్ల వయసు పిల్లలు కూడా ఆత్మహత్యాయత్నం చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

గ్రీకు దీవి లెస్బాస్‌లో ఉన్న ఈ శిబిరంలో శరణార్థులతోపాటు హింస కూడా ఎక్కువే.

ఈ క్యాంపు సామర్థ్యం 2 వేలు. కానీ ఇక్కడ 8వేల మంది ఉంటున్నారు. కింద ఉన్న వీడియోను బీబీసీ చిత్రీకరిస్తున్నప్పుడే ఆహారం కోసం క్యూలో నిలబడ్డ ఇద్దరు కత్తిపోట్లకు గురయ్యారు.

‘మేమూ మా పిల్లలూ ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రతి క్షణం సిద్ధంగానే ఉంటాం. పిల్లలు రోజూ భయం భయంగా బతకడం మాకు ఇష్టంలేదు’ అని అఫ్గానిస్థాన్‌కు చెందిన సారా ఖాన్ అనే శరణార్థి అంటున్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: ప్రపంచంలోనే అత్యంత దారుణమైన శరణార్థి శిబిరం

ఈ శరణార్థులను గతంలో గ్రీసులోకి పంపించేవారు. కానీ ఈయూ-టర్కీ ఒప్పందం కారణంగా వాళ్లను తిరిగి టర్కీ పంపాల్సి ఉంది. అలా పంపేవరకు వారిని లెస్బాస్ దీవిలోనే ఉంచుతున్నారు.

మార్చి 2016-జులై 2018 మధ్య 70వేల మందికి పైగా గ్రీసులో అడుగుపెట్టారు. కానీ ఈయూ లెక్కల ప్రకారం వారిలో 2వేల మందే తిరిగి టర్కీ వెళ్లారు.

ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్న గ్రీకు ప్రభుత్వానికి జార్జ్ అనే వ్యక్తి ప్రతినిధి. ‘మా దగ్గర డబ్బులేదు. మీకు గ్రీస్ పరిస్థితి తెలుసు కదా... నాకూ సాయం చేయాలనే ఉంది. కానీ ఈయూ సరిహద్దులను మూసేసింది. నేనేమీ చేయలేను’ అని జార్జ్ చెప్పారు.

నిత్యం హింసకు స్థావరాలుగా మారుతున్న ఈ శిబిరాల్లో ప్రజల జీవితం దినదినగండంగా సాగుతోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)