అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: సుంకాలు తగ్గించేందుకు చైనా అంగీకరించిందన్న ట్రంప్ ప్రకటనపై అయోమయం

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా కార్ల దిగుమతులపై సుంకాలు తగ్గించాలన్న చైనా ప్రతిపాదన మీద అమెరికాలో అయోమయం నెలకొంది. ఈ సుంకాలను తగ్గించటానికి చైనా అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోమవారం నాడే ప్రకటించారు.
ఈ నిర్ణయాన్ని చైనా ఇంకా నిర్ధరించలేదు. ఈ ఒప్పందం విషయంలో ట్రంప్ సలహాదారులు ధీమాగా ఉన్నట్లు కనిపించటం లేదు.
జీ20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంగా అమెరికా - చైనాల మధ్య జరిగిన వాణిజ్య యుద్ధ సంధికి సంబంధించిన వివరాలు కూడా అస్పష్టంగానే ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో సదరు సంధి గురించి మరిన్ని వివరాల కోసం వేచిచూస్తున్నామని అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్.. బీబీసీతో పేర్కొంది.
చైనా అన్యాయమైన వాణిజ్య విధానాలను అవలంబిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఆ దేశపు ఉత్పత్తులతో అమెరికా సంస్థలు పోటీపడటం కష్టమవుతోందని.. అందువల్ల చైనా విధానాలను తిప్పికొట్టే ఉద్దేశంతో సుంకాలు విధించాలని నిర్ణయం తీసుకున్నామని అమెరికా చెప్తోంది.
ఈ సుంకాలతో.. దిగుమతి చేసుకున్న వస్తువులకన్నా అమెరికాలో తయారైన ఉత్పత్తులు చౌకగా లభిస్తాయని.. వినియోగదారులు అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేయటాన్ని ఇది ప్రోత్సహిస్తుందనేది అమెరికా వాదన.

ఫొటో సోర్స్, Reuters
కొద్ది నెలలుగా పరస్పరం తీవ్ర హెచ్చరికల అనంతరం.. తమ వాణిజ్య వివాదం విషయంలో గత వారాంతంలో అర్జెంటీనాలో జరిగిన జీ20 సమావేశం వద్ద తాత్కాలిక ఒప్పందానికి వచ్చామని అమెరికా, చైనాలు చెప్పాయి.
చర్చలు జరపటానికి వీలుగా 90 రోజుల పాటు సుంకాలు పెంచరాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లు అంగీకరించటం ఈ ఒప్పందంలో కీలకమైన అంశం.
అమెరికా అధ్యక్షుడు ఆ తర్వాత ఒక ట్వీట్‌లో.. ‘‘అమెరికా నుంచి చైనాలోకి వచ్చే కార్ల మీద సుంకాలు తగ్గిస్తామని, తొలగిస్తామని’’ చైనా అంగీకరించినట్లు పేర్కొన్నారు.
వాణిజ్య యుద్ధంలో భాగంగా.. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వాహనాలపై చైనా జూలై నెలలో విధించిన 40 శాతం సుంకాల గురించి ఈ ట్వీట్ ప్రస్తావిస్తోంది. చైనా తన ఇతర వాణిజ్య భాగస్వాములపై విధించే 15 శాతం సుంకం కన్నా ఇది చాలా ఎక్కువ. ఈ నిర్ణయం ఫలితంగా.. ప్రపంచంలో అతి పెద్ద కార్ల మార్కెట్ అయిన చైనాలో చాలా కార్ల తయారీ సంస్థలు ధరలు పెంచాల్సి వచ్చింది.
అయితే.. కార్ల మీద సుంకాన్ని తగ్గించటానికి చైనా అంగీకరించిందన్న ప్రకటన చేసిన మరుసటి రోజు.. దానికి సంబంధించిన వివరాలపై అమెరికాలో గందరగోళం నెలకొంది. అధ్యక్ష భవనంలోని సీనియర్లు పరస్పర విరుద్ధంగా స్పందించారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా వాహనాల దిగుమతులపై విధించిన 40 శాతం సుంకాన్ని చైనా తొలగిస్తుందా అన్న ప్రశ్నకు అధ్యక్షుడు ట్రంప్‌కి అత్యున్నత ఆర్థిక సలహాదారైన ల్యారీ కుద్లోవ్ బదులిస్తూ.. ‘‘ఆమేరకు హామీ ఇచ్చినట్లు నేను అనుకుంటున్నా’’ అని చెప్పారు.
మరోవైపు విలేకరులతో మాట్లాడుతూ.. వాహనాలపై సుంకాల విషయంలో చైనాతో అమెరికా ఇంకా ‘‘నిర్దిష్ట ఒప్పందం’’ చేసుకోలేదని పేర్కొన్నారు.
అధ్యక్ష భవనంలోని మరో సీనియర్ అధికారి, వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో కూడా.. ‘‘ఈ విషయం జీ20 వద్ద చర్చల్లోకి వచ్చింది’’ అని వ్యాఖ్యానించారు.
ఇక.. ట్రంప్ - జిన్‌పింగ్ అంగీకరించినట్లుగా చెప్తున్న.. చర్చలకు 90 రోజుల కాలపరిమితి ఎప్పుడు మొదలవుతుందన్న అంశం మీద కూడా అయోమయం తలెత్తింది. కొందరు ఇప్పుడే మొదలవుతుందని చెప్తుంటే.. ఇంకొందరు జనవరి నుంచి మొదలవుతుందని అంటున్నారు.
ఈ అంశాలపై స్పష్టత కోసం వేచిచూస్తున్న పెద్ద కంపెనీల్లో ఫోర్డ్ ఒకటి మాత్రమే. ‘‘ఈ వాణిజ్య చర్చలు మాకు ప్రోత్సాహకరంగా ఉన్నాయ’’ని.. మరిన్ని వివరాల కోసం తాము వేచిచూస్తున్నామని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








