జీ20 సదస్సు: అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం వాయిదా.. రైతులకు మేలన్న ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య సుంకాలను పెంచే అంశాన్ని 90రోజులపాటు వాయిదా వేయడానికి ఇరు దేశాధ్యక్షులు డోనల్డ్ ట్రంప్, జింగ్‌పింగ్ అంగీకరించారు. ఈ సమయంలో రెండు దేశాల మధ్య చర్చలు జరపనున్నట్లు అమెరికా ప్రకటించింది.
200బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాన్ని 10% నుంచి 25%కి పెంచాలని తొలుత అమెరికా నిర్ణయించింది.
కానీ అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ నగరంలో జరిగిన జీ20 సమావేశం అనంతరం ఈ సుంకాలను మూడు నెలలపాటు వాయిదా వేయడానికి ట్రంప్ అంగీకరించారు.
సమావేశం అనంతరం, చైనా అమెరికా నుంచి పెద్దమొత్తంలో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులను కొంటుందని అమెరికా తెలిపింది. ఇరుదేశాలు తమ మార్కెట్ల తలుపులు తెరవడానికి అంగీకరించాయని చైనా ప్రకటించింది.

ఫొటో సోర్స్, Reuters
ఈ సంవత్సరం తొలినాళ్లలో ఇరుదేశాల మధ్య వాణిజ్య యద్ధం మొదలైనప్పటినుంచి, ట్రంప్, జింగ్‌పింగ్ మధ్య ముఖాముఖి చర్చలు జరగడం ఇదే తొలిసారి.
చైనా వ్యాపార విధానాలు న్యాయబద్ధంగా లేవని అమెరికా ఆరోపిస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్యంలో భాగంగా, చైనా చేస్తోన్న అధిక ఎగుమతులను తగ్గించడానికి చైనా అంగీకరించడంలేదని ట్రంప్ ఆరోపించినప్పటినుంచి వివాదం చెలరేగింది.
అమెరికా-చైనా ఒప్పంద వివరాలు
ట్రంప్, జింగ్‌పింగ్‌ల సమావేశం విజయవంతమైందని శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది. ''చైనా ఎగుమతులపై మూడు నెలలపాటు ఎటువంటి మార్పు ఉండదు. కానీ ఈ గడువు ముగిసేలోపు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదరకపోతే, చైనా ఎగుమతులపై ఉన్న 10% సుంకాలు 25%కి పెరుగుతాయి'' అని అమెరికా ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
''ఇరు దేశాల మధ్య నెలకొన్న వ్యాపార అసమానతలను తగ్గించడానికి చైనా అమెరికా నుంచి పెద్దమొత్తంలో వ్యవసాయ, పారిశ్రామిక, ఇతర ఉత్పత్తులను కొనడానికి చైనా అంగీకరించింది'' అని అమెరికా తెలిపింది.
ఇరు దేశాలు.. ''వ్యాపార విధానాల్లో నిర్మాణాత్మకమైన మార్పుల కోసం వెంటనే చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇందులో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్, సుంకాలు లేని వ్యాపారం, సైబర్ సమాచారం దొంగలించడం వంటి అంశాలు ప్రధానమైనవి'' అని వైట్ హౌస్ ప్రకటించింది.
ఇంతవరకూ చైనా నిబంధనలు వ్యతిరేకిస్తున్న ఉన్న రెండు సెమీ కండక్టర్ తయారీ సంస్థలతో చైనా ఒప్పందం చేసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని అమెరికా తెలిపింది. గతంలో నిరాకరించిన క్వాల్‌కమ్-ఎన్ఎక్స్‌పీ ఒప్పందానికి కూడా చైనా అంగీకరించిందని వైట్‌హౌస్ ప్రకటన పేర్కొంది.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ఇ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఒప్పందం .. ఇరుదేశాల మధ్య ఏర్పడే ఆర్థికరంగ సమస్యలను నివారించేలా ఉందని అన్నారు.
ఇంతవరకూ ఏం జరిగింది?
అమెరికా, చైనా రెండు దేశాలూ.. వందల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులపై సుంకాలను పెంచేశాయి. 250బిలియన్ డాలర్ల చైనా ఎగుమతులపై సుంకాన్ని పెంచితే, అందుకు ప్రతిచర్యగా 110బిలియన్ డాలర్ల అమెరికా ఎగుమతులపై చైనా సుంకాలను పెంచింది.
ఒకవేళ జీ20 సదస్సులోభాగంగా చైనాతో జరిగే చర్చలు విఫలమైతే, సుంకాలు పెంచగా మిగిలిన 267బిలియన్ డాలర్లు విలువచేసే చైనా వార్షిక ఎగుమతులపై కూడా 10 నుంచి 25శాతం మధ్య సుంకాలను పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు.
డోనల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..
''ఇది ఒక అద్భుతమైన ఒప్పందం. వ్యవసాయరంగంపై దీని ప్రభావం గొప్పగా ఉంటుంది'' అని అన్నారు.
జీ20లో ఏం జరిగింది?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ దేశాల మధ్య తలెత్తే వ్యాపార విభేదాలను నియంత్రించే 'వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్'(డబ్ల్యూ.టి.ఒ)ను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఒక సీనియర్ అమెరికా అధికారి రాయిటర్స్ వార్తాసంస్థతో మాట్లాడుతూ, జీ20 సదస్సులో తొలిసారిగా డబ్ల్యూటీఓను సంస్కరించాల్సిన అవసరాన్ని గుర్తించారని అన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








