నరేంద్ర మోదీ: ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని రాసిన లేఖలో ఏముంది

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చి శనివారానికి ఏడాది పూర్తయ్యింది.

ఈ సందర్భంగా దేశప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ ఒక లేఖ రాశారు.

కరోనా మహమ్మారి వల్ల దేశంలో సాధారణ పరిస్థితి లేదని, అందుకే దేశప్రజల పేరున తను లేఖ రాయాల్సి వస్తోందని ఆయన దానిలో ప్రారంభంలో చెప్పారు.

“భారత్‌లో దశాబ్దాల తర్వాత వరసగా రెండోసారి సంపూర్ణ మెజారిటీతో ఏర్పడిన ఒక ప్రభుత్వానికి ప్రజలు బాధ్యతలు అప్పగించారు. ఇది భారత చరిత్రలోనే సువర్ణాధ్యాయం” అన్నారు.

మోదీ తన లేఖలో తమ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలను ప్రస్తావించారు. కరోనా మహమ్మారి గురించి చెబుతూ ఎలాంటి కఠిన పరిస్థితులు అయినా, మన భవిష్యత్తును నిర్ణయించలేవని చెప్పారు.

మోదీ

ఫొటో సోర్స్, Ani

  • 2014 సంవత్సరంలో దేశ విధానాలు, పద్ధతులు మార్పు కోసం ప్రజలు ఓటు వేశారు. ఆ ఐదేళ్లలో జడత్వం, అవినీతి అనే ఊబి నుంచి వ్యవస్థలు బయటకు రావడాన్ని దేశం చూసింది. అంత్యోదయ స్ఫూర్తితో పేదల జీవనం సులభతరం చేసేందుకు పాలనలో మార్పు రావడం గమనించింది.
  • ఆ పదవీకాలాన్ని దేశంలో ఎన్నింటినో నెరవేర్చడానికి కేటాయించాం. అంటే, పేదలకు బ్యాంకు ఖాతాలు, ఉచిత గ్యాస్ కనెక్షన్, ఉచిత విద్యుత్ కనెక్షన్, మరుగుదొడ్లు, ఇళ్లు అందించాం. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్స్ చేశాం. వన్ ర్యాంక్ వన్ నేషన్, వన్ నేషన్ వన్ టాక్స్-జీఎస్‌టీ లాంటివి అమలు చేశాం. రైతుల ఎంఎస్‌పి డిమాండ్లను నెరవేర్చడంలో అంకితభావం చూపించాం.
  • జాతీయ సమగ్రత కోసం తెచ్చిన ఆర్టికల్ 370 అయినా, శతాబ్దాల నాటి సంఘర్షణకు సంతోషకరమైన ఫలితం, రామమందిర నిర్మాణం అంశమైనా, ఆధునిక సామాజిక వ్యవస్థకు అడ్డంకిగా మారిన ట్రిపుల్ తలాక్ అయినా లేక భారత్ దయాగుణానికి ప్రతీకగా నిలిచిన పౌరసత్వ సవరణ చట్టం అయినా, అన్నీ మీకు గుర్తుండే ఉంటాయి.
  • చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని ఏర్పాటు చేయడం వల్ల సైనిక దళాల మధ్య సమన్వయం పెరిగింది. అటు మిషన్ గగన్‌యాన్ కోసం కూడా భారత్ తన సన్నాహాలను వేగవంతం చేసింది.
  • దేశంలోని రైతులు, వ్యవసాయ కూలీలు, చిన్న షాపుల వారు, అసంఘటిత రంగాల కార్మికులు, అందరికీ 60 ఏళ్ల వయసు నిండిన తర్వాత, ప్రతి నెలా 3 వేల రూపాయల ఫించన్ క్రమం తప్పకుండా చెల్లిస్తామని భరోసా ఇవ్వడం దేశ చరిత్రలో మొదటిసారి జరిగింది.
  • సామాన్యుల ప్రయోజనాలు అందించేందుకు మెరుగైన చట్టాలు రూపొందాయి. దానికోసం గత ఏడాది వేగంగా కూడా పనిచేశాం, మన పార్లమెంటు తన పనితీరులో దశాబ్దాల పాత రికార్డులను బద్దలు కొట్టింది.
  • దేశప్రజల ఆశలు-ఆకాంక్షలను నెరవేర్చేందుకు మేం వేగంగా ముందుకు వెళ్తున్న సమయంలో కరోనా మహమ్మారి భారత్‌ను చుట్టుముట్టింది. కరోనా దేశంలో వ్యాపించిన సమయంలో భారత్ మొత్తం ప్రపంచానికే ఒక సంక్షోభంలా మారుతుందని చాలామంది అనుకున్నారు. కానీ ఈరోజు దేశ ప్రజలందరూ భారత్‌ను వారు చూసే ఆ దృక్పథాన్ని మార్చి చూపించారు. చప్పట్లు, పళ్లాలు మోగిస్తూ, దీపాలు వెలిగిస్తూ, భారత సైన్యం ద్వారా కరోనా వారియర్స్ ను గౌరవించినా. జనతా కర్ఫ్యూ లేదా దేశవ్యాప్త లాక్‌డౌన్ సమయంలో నిబంధనలను నిష్ఠగా పాటించినా, ప్రతి సందర్భంలోనూ భారతదేశం, అత్యుత్తమ భారతదేశంగా మారగదలని మీరు హామీ ఇచ్చారు.
  • కానీ మనం జీవితంలో ఎదురవుతున్న అసౌకర్యాలు, మన జీవితాన్నే ఇబ్బందుల్లోకి నెట్టకుండా మనం దృష్టిపెట్టాలి. ప్రతి భారతీయుడు, ప్రతి మార్గనిర్దేశాన్నీ పాటించడం చాలా ముఖ్యం. ఇది సుదీర్ఘ పోరాటం. కానీ మనం విజయపథంలో నడక ప్రారంభించాం. అందులో విజయం సాధించడమే మనందరి సమష్టి సంకల్పం కావాలి.
  • భారత్ సహా అన్ని దేశాల ఆర్థికవ్యవస్థలు ఎలా కోలుకుంటాయా.. అని ఇప్పుడు చాలా విస్తృత చర్చ జరుగుతోంది. ఈరోజు మనకు మన కాళ్ల మీద మనం నిలబడ్డానికి సమయం కావాలి. దానికోసం ఒకే ఒక మార్గం ఉంది. స్వయం సమృద్ధి భారత్. ఇటీవల ఆత్మనిర్భర భారత్ ప్రచారం కోసం ఇచ్చిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ, ఆ దిశగా తీసుకున్న ఒక పెద్ద చర్య. ఇది దేశంలోని ప్రతి పౌరుడు, ప్రతి రైతు, ప్రతి కార్మికుడు, ప్రతి చిన్న పారిశ్రామికవేత్త, మన స్టార్టప్స్ కు సంబంధించిన యువత అందరికోసం కొత్త అవకాశాలను తీసుకొస్తుంది.
  • విశ్వ మహమ్మారి వల్ల ఇది మనకు సంక్షోభ సమయమే. కానీ దేశ ప్రజలందరికీ ఇది ఒక నిర్ణయాత్మక సమయం కూడా. ఏ విపత్తైనా, ఎలాంటి సంక్షోభమైనా 130 కోట్ల మంది భారతీయుల వర్తమానాన్ని, భవిష్యత్తును నిర్ణయించలేదనే విషయం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)