వరవరరావుకు అస్వస్థత: జైలులో కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు.. ప్రస్తుతం కోలుకుంటున్న విరసం నేత

వరవరరావు

ఫొటో సోర్స్, FACEBOOK/BHASKER KOORAPATI

ఫొటో క్యాప్షన్, వరవరరావు

రచయిత, విరసం నాయకులు వరవరరావు ముంబయిలోని జేజే ఆసుపత్రిలో చేరారు. ఏడాదిన్నరగా జైల్లో ఉన్న 80 ఏళ్ల వరవరరావు ఆరోగ్యం బాగోకపోవడంతో ఆయన్ను జేజే ఆసుపత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది.

పుణె పోలీసులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్చిన విషయాన్ని హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వరవరరావు భార్య హేమలతకు సమాచారం ఇచ్చారు.

కుటుంబసభ్యులకు అంతకు మించి వివరాలు తెలియకపోవడంతో వారు పుణె, ముంబయిల్లో ఆరా తీశారు. శుక్రవారం సాయంత్రానికి ఆయన విషమ స్థితి నుంచి బయటపడ్డారని తెలిసినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు.

వరవరరావు ఆరోగ్యం బాగాలేకపోవడంతో మూడు రోజులుగా ఆయన మహారాష్ట్రలోని తలోజా జైలు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

గురువారం జైలు ఆసుపత్రిలో కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ముంబయిలోని జేజే ఆసుపత్రికి ఆయన్ను తరలించినట్టు తమకు తెలిసిందని ఆయన భార్య హేమలత విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఆయన్ను చూడడానికి ముంబయి వెళ్లడానికి కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు కానీ, ప్రయాణం అనుమతుల విషయంలో సందిగ్ధత నెలకొంది. తాము అనుమతిస్తామని హైదారాబాద్ పోలీసులు ప్రకటించారు.

''కానీ తెలంగాణ సరిహద్దు దాటాక పరిస్థితి ఏంటి, అక్కడ ఉండడానికి ఏర్పాటు లేదు, క్వారంటైన్లోకి పంపకుండా ఉంటారా? తీరా వెళ్లాక ఆయన అండర్ ట్రయల్ కాబట్టి ఆసుపత్రిలో కలవనిస్తారా వంటి అంశాలు చూస్తున్నాం'' అని వరవరరావు అల్లుడు కూర్మనాథ్ బీబీసీతో చెప్పారు.

హేమలత
ఫొటో క్యాప్షన్, హేమలత

‘వెళ్లి చూడాలనుకుంటున్నాం’

''అసలు ఆయనకు ఏ ఆరోగ్య సమస్య వచ్చిందో తెలియదు. ఎవరూ చెప్పే పరిస్థితి లేదు. తెలిసిన వారి ద్వారా ప్రయత్నిస్తే కొన్ని విషయాలు తెలిశాయి.

జైలరో, కోర్టో ఆయన్ను కలవడానికి అనుమతినివ్వాలి. అలాగే ముంబయిలో ప్రయాణం, ఉండడం అనుమతులు కూడా తేలాలి.

ఒక విలేకరి అడిగితే అక్కడ జైలర్ స్పందించారు. ''జైల్లో ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయగలం. కానీ ఆసుపత్రిలో చేయలేం'' అన్నట్టు తెలిసింది. మా అత్తగారు 72 ఏళ్ల వయసులో వెళ్లలేరు.

మాకు స్పష్టత వస్తే మేం వెళ్లి చూడాలనుకుంటున్నాం'' అన్నారు కూర్మనాథ్.వరవర రావుకు పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అల్సర్, బీపీ, పైల్స్, సైనస్, లో హార్ట్ బీట్ సమస్యలతో బాధపడుతున్నారు.

ఆయన వయసు రీత్యా కోవిడ్ సోకితే ఇబ్బంది అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

వరవరరావు విడుదల కోరుతూ రాసిన లేఖ

‘కిషన్ రెడ్డి జోక్యం చేసుకోవాలి’

''ముంబయి ప్రయాణానికి అనుమతిస్తామని పోలీసులు చెప్పడం మా ఆందోళన పెంచింది. ఆయన్ను కలిసే అనుమతి కోసం న్యాయస్థానం ద్వారా ప్రయత్నం చేస్తాం.

కోవిడ్ పరిస్థితుల్లో ముంబయిలో అనుమతుల కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం.

ఆయనకు కుటుంబ సభ్యులతో తక్షణం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలి. బెయిల్ పై విడుదల చేయాలి.

ఆయనకు ఏ ఆరోగ్య సమస్య వచ్చింది, ఆయనకున్న పాత వ్యాధుల్లో ఏదైనా సీరియస్ అయిందా అనే విషయం వెంటనే చెప్పాలి. తక్షణ వైద్య పరీక్షలు చేయాలి.

ఎన్ఐఎ తన కక్షపూరిత వైఖరి మానుకోవాలి. తెలుగువారైన కేంద్ర హోం సహాయమంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకోవాలి. 1969 తెలంగాణ ఉద్యమం నుంచీ ప్రత్యేక ఉద్యమంలో ఉన్న వరవరరావు గురించి తెలంగాణ ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి'' అని ఆయన భార్య డిమాండ్ చేశారు.

గత 47 ఏళ్లలో వరవర రావు తనపై మోపిన 25 కేసుల్లో నిర్దోషిగా విడుదల అయ్యారని ఆయన కుమార్తెలు చెప్పారు

ఫొటో సోర్స్, FACEBOOK/KRANTHI TEKULA

ఫొటో క్యాప్షన్, గత 47 ఏళ్లలో వరవర రావు తనపై మోపిన 25 కేసుల్లో నిర్దోషిగా విడుదల అయ్యారని ఆయన కుమార్తెలు చెప్పారు

వరవరరావు, మావోయిస్టులతో సంబంధాల కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబాల ఆరోగ్యంపై వారి కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నేతలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉండడం.. జైళ్లలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో వీరిని విడుదల చేయాలని కోరుతున్నారు.

తమ తండ్రిని విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు కొద్దిరోజుల కిందట లేఖ రాశారు.

మరోవైపు మహారాష్ట్రలోని నాగపూర్ జైలులో ఉన్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని కలిసేందుకు అనుమతించాలంటూ ఇటీవల దరఖాస్తు పెట్టుకోగా బొంబాయి హైకోర్టు దాన్ని తిరస్కరించింది.

వరవరరావు ఏడాదిన్నరగా విచారణ ఖైదీగానే

మావోయిస్టులతో కలిసి ప్రధాని హత్యకు కుట్ర పన్నారన్న అభియోగంపై విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవర రావు దాదాపు ఏడాదిన్నరగా విచారణ ఖైదీగా జైల్లో ఉన్నారు.

వరవర రావుతో పాటు మరో నలుగురిని పుణె పోలీసులు 2018 ఆగస్టులో అరెస్టు చేశారు.

మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరెగావ్‌ అల్లర్లలో పాత్ర, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధాని మోదీ హత్యకు కుట్ర వంటి అభియోగాలు వీరిపై ఉన్నాయి.

సుప్రీం కోర్టు ఆదేశాలతో కొన్ని రోజులు వీరిని గృహ నిర్బంధంలో ఉంచిన అధికారులు, ఆ తర్వాత మళ్లీ జైలుకు తరలించారు.

వరవర రావును మొదట్లో పుణెలోని ఎరవాడ జైలులో ఉంచారు. అనంతరం అక్కడి నుంచి కొన్నాళ్ల కిందట నవీ ముంబయిలోని తలోజా జైలుకు ఆయన్ను తరలించారు.

వరవర రావు వయసు సుమారు 80 ఏళ్లు.

తలోజా, ఎరవాడ కేంద్ర కారాగారాల్లో, ధూలె జిల్లా జైల్లో ఒక్కొక్కరు చొప్పున ఖైదీలు మరణించినట్లు ఇటీవల బొంబాయి హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌ ద్వారా తెలిపింది.

వృద్ధుల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటం మూలాన వారికి కరోనావైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో వరవర రావు ఆరోగ్యం విషయమై కుటుంబ సభ్యులు, ఆయన శ్రేయోభిలాషులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మావోయిస్టులతో సంబంధాల కేసులో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను కూడా విడుదల చేయాలని ఆయన సన్నిహితులు డిమాండ్ చేస్తున్నారు.

వరవరరావు విడుదల కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి గతంలో హేమలత రాసిన బహిరంగ లేఖకు పలువురు మేధావులు మద్దతు తెలిపారు

ఫొటో సోర్స్, virasam

‘జీవించే హక్కును కాపాడండి’

వరవర రావును వెంటనే పెరోల్‌పై విడుదల చేయాలని ఆయన కూతుర్లు సహజ, అనల, పవన ఓ లేఖ రాశారు.

‘‘మా నాన్నగారి వయసు 80 ఏళ్లు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు కరోనా వైరస్ సోకే ప్రమాదముంది’’ అని వారు ఈ లేఖలో అన్నారు.

లాక్‌డౌన్ కారణంగా రెండు నెలల నుంచి తమ తండ్రిని కలిసేందుకు తమను అనుమతించడం లేదని, సాధారణ ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా అనుమతించడం లేదని వారు తెలిపారు.

న్యాయవాదులను సైతం కలవనివ్వడం లేదని, తమ తండ్రి ఆరోగ్యం ఎలా ఉందో అన్న ఆందోళనతో ఉన్నామని చెప్పారు.

‘‘మా అమ్మ వయసు 70 ఏళ్లు దాటింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెతో మూడు సార్లు ఫోన్‌లో మాట్లాడేందుకు మా నాన్నను అనుమతించారు. అది కూడా కేవలం రెండు నిమిషాలే’’ అని వివరించారు.

గత 47 ఏళ్లలో వరవర రావు తనపై మోపిన 25 కేసుల్లో నిర్దోషిగా విడుదల అయ్యారని ఆయన కుమార్తెలు చెప్పారు.

తమ తండ్రి ఇప్పుడు విచారణ ఖైదీ మాత్రమేనని, రాజ్యాంగంలోని 21వ అధికరణ విచారణలో ఉన్న ఖైదీలకు జీవించే హక్కు కల్పించిందని వారు గుర్తు చేశారు. ఆ హక్కుకు భంగం వాటిల్లకూడదని కోరారు.

‘‘తలోజా జైలులో ఖైదీ మరణం గురించి, కొవిడ్ -19 వ్యాప్తి గురించి వార్తా పత్రికల్లో చదివాం. ఆ జైలు అధికారులను కలిసి మా నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయాలని మా న్యాయవాది పద్మను అడిగాం. ఆమె ఈ విషయమై తలోజా జైలు అధికారులకు ఫోన్ చేయగా, ఫోన్ కాల్‌ను రిసీవ్ చేసుకున్నారు గానీ, ప్రశ్నలకు స్పందించలేదు’’ అని వరవర రావు కూతుర్లు తెలిపారు.

తమ తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళనతో, నిస్సహాయ స్థితిలో నాలుగు అభ్యర్థనలు చేస్తున్నామని అన్నారు.

వారు చేసిన ఐదు అభ్యర్థనలు ఇవే...

  • వరవర రావు వయసు, ఆరోగ్యం, కొవిడ్- 19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, ఆయన్ను వెంటనే తాత్కాలిక బెయిల్ లేదా పెరోల్‌పై విడుదల చేయాలి
  • వరవర రావు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకునేందుకు, భరోసా పొందేందుకు ఆయన్ను జైలులో సందర్శించేందుకు కుటుంబ సభ్యులకు అనుమతినివ్వాలి
  • కుటుంబ సభ్యులకు తరచూ ఫోన్ చేసేందుకు, ఉత్తరాలు రాసేందుకు వరవర రావుకు అనుమతినివ్వాలి
  • జైలులో వరవర రావును కలిసేందుకు న్యాయవాదులను అనుమతించాలి
వరవరరావు

ఫొటో సోర్స్, Virasam.org

‘ఏదైనా జరిగితే ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు’

వరవర రావు ఆరోగ్యం విషయమై విప్లవ రచయితల సంఘం (విరసం) కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

‘‘తలోజా జైల్లో కరోనా వ్యాపించి, ఒక ఖైదీ మరణించాడని తెలిసినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం గురించి మాలో ఆందోళన సహజంగానే మరింత పెరిగింది’’ అంటూ విరసం అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ, సహాయ కార్యదర్శి రివేరా, ఉపాధ్యక్షుడు బాసిత్ ఓ ప్రకటన విడుదల చేశారు.

జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వరవర రావు ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, కోర్టులదేనని గుర్తు చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఖైదీలతో సహా దేశపౌరులందరికీ జీవించే హక్కు ఉందని, వరవర రావుకు ఏమైనా జరిగితే అది మన ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు అవుతుందని వ్యాఖ్యానించారు.

ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రచయితలు, ప్రజాస్వామికవాదులు కూడా ఈ విషయమై గొంతు విప్పాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో వరవర రావుపై మోపిన అన్ని కేసుల్లోనూ ఆయన కోర్టుకు సహకరించి, నిర్దోషిగా బయటకు వచ్చారని గుర్తు చేశారు.

‘‘వరవరరావు తెలుగు సమాజంలోనూ, బయటా ఎంతో గౌరవనీయ వ్యక్తి, మేధావి. గతంలో ఆయనపై మోపిన అన్ని కేసుల్లో ఆయన కోర్టుకు సహకరించారు. అన్నింట్లో నిర్దోషిత్వం నిరూపించుకున్నారు. ఇప్పుడు కూడా కేవలం ఆరోపణలపైనే ఏడాదిన్నరగా జైల్లో ఉన్నారు. కాబట్టి బెయిల్‌పై విడుదల చేయవచ్చు’’ అని వ్యాఖ్యానించారు.

వసంత, సాయిబాబా (పాత ఫొటో)

ఫొటో సోర్స్, A S VASANTHA

ఫొటో క్యాప్షన్, వసంత, సాయిబాబా (పాత ఫొటో)

అనారోగ్యంతో ఉన్న తల్లిని కలవాలన్న ప్రొఫెసర్ సాయిబాబా పెరోల్ దరఖాస్తు తిరస్కరణ

నాగ్‌పుర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు అనుమతించాలంటూ పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోగా బాంబే హైకోర్టు దాన్ని తిరస్కరించింది.

హైదరాబాద్‌లో నివసిస్తున్న తన తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని.. ఆమెను చూడ్డానికి తాను వెళ్లేందుకు వీలుగా పెరోల్‌పై విడుదల చేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై బాంబే హైకోర్టులో జరిగిన విచారణలో.. అధికారులు సాయిబాబా వెళ్లాల్సిన ప్రాంతం కరోనా వైరస్ కంటెయిన్‌మెంట్ జోన్ అని నివేదించడంతో కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకుని పెరోల్ దరఖాస్తు తిరస్కరించింది.

సాయిబాబా తల్లి అవుట్ పేషెంట్‌గానే చికిత్స పొందుతున్నారని.. సాయిబాబా సోదరుడు ఆమె బాధ్యత చూసుకుంటున్నారని అధికారులు కోర్టుకు నివేదించారు.

దీంతో హైకోర్టు సాయిబాబా పెరోల్‌ దరఖాస్తును తిరస్కరించింది.

జీఎన్ సాయిబాబా

ఫొటో సోర్స్, A S VASANTHA

ప్రస్తుతం ప్రొఫెసర్ సాయిబాబా పరిస్థితి ఏమీ బాగులేదంటూ ఆయన సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మావోయిస్టులతో సంబంధాల కేసులో 2017లో సాయిబాబాకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆయన నాగ్‌పుర్ జైలులో ఉన్నారు.

అరెస్టయ్యేనాటికి సాయిబాబాది వీల్ ఛైర్ ఉంటే తప్ప ఎటూ కదల్లేని పరిస్థితి.

సాయిబాబా 90 శాతం వైకల్యంతో బాధపడుతున్నారని... టాయిలెట్‌కు వెళ్లాలన్నా, ఆయనకు అవయవాలేవీ సహకరించే పరిస్థితి లేదని ఆయన సహచరి వసంత కుమారి అంటున్నారు. నాగ్‌పుర్ కేంద్ర కారాగారంలో ఆయన దయనీయ పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పెరోల్ కోసం సాయిబాబా పెట్టుకున్న అభ్యర్థనను, తప్పుడు సమాచారం ఆధారంగా హైకోర్టు తిరస్కరించిందని ఆమె చెప్పారు.

‘‘సాయిబాబా సోదరుడి కుటుంబం కోవిడ్-19 కంటెయిన్మెంట్ జోన్‌లో ఉందని చెబుతూ పెరోల్ కోసం పెట్టుకున్న అభ్యర్థనను తిరస్కరించారు. కానీ, ఇది నిజం కాదు. వారి ఇల్లు ఎలాంటి రెడ్ అలర్ట్ ప్రాంతాల్లోనూ లేదు’’ అని వసంత అన్నారు.

‘‘నాగ్‌పుర్‌లో వేసవి వేడి వల్ల ఆయన ఆరోగ్యం మరింత దెబ్బతింది. తనకు సహాయకులు కావాలని ఆయన చేసిన అభ్యర్థనను జైలు ఇటీవల తిరస్కరించింది. ఆయన 90 శాతం వైకల్యంతో ఉన్నారు. రెండు చేతులూ పనిచేయడం లేదు. ఆయన టాయిలెట్‌కు కూడా వెళ్లలేరు. రోజువారీ పనులు చేసుకోలేరు. కనీసం బెడ్‌పై నుంచి వీల్ ఛైర్‌లోకి ఎవరి సాయమూ లేకుండా మారే పరిస్థితిలో ఆయన లేరు’’ అని వసంత చెప్పారు.

సాయిబాబా వైకల్యంతో ఉన్నందున, ఇద్దరు సహాయకులను ఏర్పాటు చేసినట్లు ఇదివరకు బెయిల్ అభ్యర్థనల విచారణ సమయంలో కోర్టుకు అధికారులు తెలియజేశారని... కానీ, ఆ ఇద్దరూ సహాయకులు కాదని, సహచర ఖైదీలే మానవతా దృక్పథంతో ఆయనకు సాయం చేస్తున్నారని వసంత చెప్పారు. సాయిబాబా కోసం జైలు అదనపు సిబ్బంది ఎవరినీ ఏర్పాటు చేయలేదని వివరించారు.

సాయిబాబా

ఫొటో సోర్స్, A S VASANTHA

‘‘ఆయన్ను ఒంటరిగా అలాగే వదిలేస్తున్నారు. సహాయకుడి కోసం చేసుకున్న అభ్యర్థనను జైలు అధికారులు తిరస్కరించారు.

ఆయన ఇప్పుడు పదే పదే స్పృహ కోల్పోతున్నారు. వేళ్లు కూడా ముడుచుకోలేకపోతున్నారు. మూడు సార్లు ఛాతీ నొప్పి వచ్చింది.

కానీ, మార్చి నుంచి ఆయన్ను జైలు అధికారులు ఆసుపత్రికి తీసుకువెళ్లడం లేదు. ఆయన్ను అధికారులు చావమని వదిలేసినట్లు అనిపిస్తోంది’’ అని వసంత ఆవేదన వ్యక్తం చేశారు.

సాయిబాబా

ఫొటో సోర్స్, A S VASANTHA

ఫొటో క్యాప్షన్, సాయిబాబా (పాత ఫొటో)

సాయిబాబాకు సరైన వైద్యం, గౌరవంగా జీవించే పరిస్థితి కల్పించేలా న్యాయ వ్యవస్థ పారదర్శకంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

సాయిబాబా విడుదల కోసం మానవ హక్కుల కార్యకర్తలు, సంస్థలు, దివ్యాంగ సంస్థలు, పౌర సమాజం గొంతెత్తాలని ఆమె కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)