బతికుండగానే శ్మశానానికి - ప్రకాశం జిల్లాలో దారుణం: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
మరికొన్ని గంటల్లో చనిపోతాడని డాక్టర్లు చెప్పడంతో, అద్దెకిచ్చిన వారు రానివ్వరని భయపడి, కొనఊపిరితో ఉన్న రోగిని బంధువులు నేరుగా శ్మశానానికే తీసుకెళ్లిన ఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగినట్లు ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.
ఈ కథనం ప్రకారం కందుకూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో కాలుజారి పడటంతో కుటుంబసభ్యులు ఆయనకు చికిత్స చేయించారు. ఆరోగ్యం కుదుట పడటకపోవడంతో మరోసారి ఆసుపత్రికి తీసుకెళ్లగా బతకడం కష్టమని, కొన్నిగంటల్లో చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. తాము ఉండేది అద్దె ఇల్లు కావడంతో శవాన్ని తీసుకెళితే ఇంటి యజమాని ఎక్కడ అభ్యంతరం చెబుతాడోనని భావించిన కుటుంబ సభ్యులు, ఎటూ కొద్దిగంటల్లో చనిపోతాడు కదా అని కొనఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని శ్మశానం పక్కనే ఉన్న ఓ ఆరామానికి చేర్చారు.
చనిపోతాడు కాబట్టి శనివారంనాడు ఖననానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు. దీన్ని గమనించిన స్థానికులు బతికుండగానే ఖననానికి ఎలా ఏర్పాట్లు చేస్తారని నిలదీయడంతో వారు రోగిని సమీపంలో ఉన్న మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందిన రోగి ఆదివారం సాయంత్రం మరణించినట్లు ఈనాడు కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
నెగెటివ్ వచ్చినా కరోనా చికిత్స- రూ.3 లక్షలు బిల్లు వేసిన ప్రైవేటు ఆసుపత్రి
వైరస్ సోకకున్నా కరోనా వార్డులో చేర్చి నాలుగు రోజుల చికిత్సకు మూడు లక్షల బిల్లు వేసిన ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకంపై ఆంధ్రజ్యోతి కథనం ఇచ్చింది.
ఈ కథనం ప్రకారం హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన ఓ లాయర్, జ్వరం తలనొప్పితో సోమాజీగూడలోని ఓ ఆసుపత్రిలో చేరారు. కరోనాగా అనుమానించిన వైద్యులు ఆయన్ను కోవిడ్-19 వార్డులో చేర్చారు. పరీక్ష ఫలితం నెగెటివ్ అని వచ్చినా ఆ విషయం చెప్పకుండా చికిత్స చేశారు.
తన రిపోర్టు కోసం ఆయన డిమాండ్ చేయడంతో నెగెటివ్ రిపోర్టు చూపించారు. నెగెటివ్ వచ్చినా ఎందుకు చికిత్స చేస్తున్నారని ప్రశ్నించినా ఆసుపత్రి నుంచి ఆయనకు సమాధానం రాలేదు.
ఈ విషయాన్ని మిత్రులైన కొందరు లాయర్లకు చెప్పడంతో, ఆసుపత్రి యాజమాన్యం ఆగస్టు 1న అర్ధరాత్రి ఆయన్ను హడావుడిగా డిశ్చార్జ్ చేసింది. రూ.3 లక్షల రూపాయలు బిల్లువేసి అందులో రూ.2 లక్షలు చెల్లించాకే బయటకు పంపింది. ఇంటికి వచ్చిన లాయర్ తనకు జరిగిన అన్యాయంపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫొటో సోర్స్, AP.GOV.IN
సీఆర్‌డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్
ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ) రద్దు కావడంతో దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏఎంఆర్‌డీఏ)ని ఏర్పాటు చేసినట్లు సాక్షిపత్రిక ఒక కథనం ఇచ్చింది.
పర్యావరణ మండలి సభ్యుడు లేదా పట్టణ గవర్నెన్స్ ప్లానింగ్, రవాణా రంగాల్లో పని చేసిన వ్యక్తిని చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుందని ఈ కథనం పేర్కొంది.
ఏఎంఆర్‌డీఏలో 11 మంది సభ్యులు ఉంటారు. ఇప్పటి వరకు సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న మొత్తం ప్రాంతాన్ని ఏఎంఆర్‌డీఏలో పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఆర్‌డీఏకు ప్రస్తుతం కమిషనర్‌గా పని చేస్తున్న అధికారినే ఈ సంస్థకు కూడా కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ ఉత్తర్వులను ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి రహస్యంగా విడుదల చేసిందని, ఆదివారం నాడు మాత్రమే బహిరంగ పరిచిందని ఈనాడు రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆన్‌లైన్ క్లాస్ అర్ధం కాలేదని ఆత్మహత్య- ప్రాణం తీసుకున్న ఇంటర్ విద్యార్ధి
ఆన్‌లైన్ క్లాసులు అర్ధంకాక హైదరాబాద్‌కు చెందిన యశ్వంత్ అనే ఓ ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆంధ్రప్రభ ఒక కథనం ఇచ్చింది.
కాలేజీలు తెరవకపోవడంతో సికింద్రాబాద్ బోయిన్‌పల్లికి చెందిన విద్యార్ధి యశ్వంత్ ఆన్‌లైన్‌లో క్లాసులు వింటున్నారు. అయితే తనకు పాఠాలు అర్ధం కావడంలేదని కొంతకాలంగా ఆవేదనతో ఉన్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్లాసులు వింటున్నా అర్ధం కాకపోవడంపై తీవ్ర మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆంధ్రప్రభ కథనం పేర్కొంది.
సూసైడ్ నోట్‌లో కూడా ఇదే విషయం ఉందని పోలీసులు నిర్ధరించినట్లు ఈ కథనం వెల్లడించంది. యశ్వంత్‌లాంటి ఎంతో మంది విద్యార్ధులు ఆన్‌లైన్ క్లాసుల విషయంలో ఒత్తిడిలో ఉన్నట్లు ఈ కథనంలో రాసింది.
కాలేజీలు ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పడం, పరీక్షలు పెట్టి ఆ మార్కులను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేస్తుండటంతో పాఠాలు అర్ధం చేసుకోలేని విద్యార్ధుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోందని, వారిపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోందని మానసిక నిపుణులు చెబుతున్నట్లు ఈ కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి.
- అయోధ్య రామమందిరం: మోదీ ముఖ్య అతిథిగా శంకుస్థాపన...ఇది భారత్ స్వరూపాన్నే మార్చేస్తుందా?
- జమ్ముకశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది.. కశ్మీరీ పండిట్ల జీవితాలలో వచ్చిన మార్పేమిటి
- భూమికి తిరిగొచ్చిన నాసా - స్పేస్ ఎక్స్ వ్యోమగాములు
- నూతన విద్యా విధానం.. కొత్తగా వచ్చే మార్పులేంటి?
- భారత్‌లో డిజిటల్ అసమానతలను బయటపెట్టిన ఆన్‌లైన్ చదువులు
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారైతే మీ వరకు ఎలా వస్తుంది... ముందుగా ఎవరికి ఇస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








