ఆంధ్రప్రదేశ్: అడవిలో గుప్తనిధుల వేట.. నీళ్లు లేక మరణించిన బ్యాంకు ఉద్యోగి - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, prakasam.nic.in/
గుప్త నిధుల కోసం వెళ్లి ప్రకాశం జిల్లా వెలుగొండ అడవుల్లో ఓ బ్యాంకు ఉద్యోగి నీళ్లు, ఆహారం దొరక్క అక్కడే చనిపోయారన్న వార్తను ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది.
ప్రకాశం జిల్లా పొదిలి సీఐ చిన్న మిరాసాహెబ్ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగికి చెందిన హనుమంతునాయక్ (70) గుప్తనిధుల కోసం అడవుల్లో తిరుగుతుంటారు.
అదే గ్రామానికి చెందిన కృష్ణానాయక్ (40)తో ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లి గ్రామం సమీపంలోని ఓ ఆలయంలో గుప్తనిధులు ఉన్నాయనే విషయం చెప్పారు. ఆ నిధులు కాటమరాజు కాలంనాటివని, ఒకప్పుడు నక్సలైట్లకు మంచి పట్టున్న ఆ ప్రాంతంలో భారీ డంప్ ఉందని వివరించారు.
హైదరాబాద్ కెనరా బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న కట్టా శివకుమార్(39) ఆ విషయాన్ని కృష్ణానాయక్ ద్వారా తెలుసుకున్నారు. ఈ నెల 12వ తేదీన ఈ ముగ్గురూ తర్లుపాడు చేరుకున్నారు. అక్కడి నుంచి తాడివారిపల్లికి వెళ్లారు.
తాడివారిపల్లి-వెలుగుగొండ అటవీ ప్రాంతంలో నందనవనం సమీపంలోని పాత శివాలయ కొలను ఎదుట ఉన్న పాండురంగ స్వామి దేవాలయం వీరి లక్ష్యం.
మూడు నీళ్ల బాటిళ్లు, 15 మజ్జిగ ప్యాకెట్లు, కొన్ని చిరుతిళ్లు వెంటతీసుకుని ఆదివారం రాత్రికి అడవిలోకి వెళ్లారు.
సోమవారం ఉదయం అడవిలో దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణించాక, మండుటెండలకు విలవిలలాడిపోయారు. వెంట తెచ్చుకున్న నీళ్లు, మజ్జిగ అయిపోవడంతో... తాగునీటి కోసం తలోదిక్కు వెళ్లారు.
కనుచూపు మేర గ్రామాలు, నీటి జాడ లేకపోవడంతో... ముగ్గురూ అడవిలో తప్పిపోయారు.
ఈ క్రమంలో కృష్ణానాయక్‌కు ఓ రోడ్డు కనిపించడంతో... దాని వెంట వెళ్లి తాడివారిపల్లికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంభం చేరుకున్నారు.
ఆకలి, దాహంతో అలమటిస్తూ శివ కుమార్ ఆ అడవిలోనే ప్రాణాలు కోల్పోయారు.
కృష్ణానాయక్ సోమవారం మధ్యాహ్నానికి కంభం చేరుకున్నా... అతడు మిగతా ఇద్దరి కుటుంబ సభ్యులకు విషయం చెప్పలేదు. వారు అడవిలో తప్పిపోయారనే విషయాన్ని పోలీసులకు సమాచారం అందించి ఉంటే... అదే రోజు అటవీ ప్రాంతంలో గాలింపు మొదలయ్యేది. పోలీసులు శివకుమార్‌ను క్షేమంగా తీసుకువచ్చి ఉండేవారు.
బుధవారం సాయంత్రం శివకుమార్ కుమారుడు ఫోన్ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలో గురువారం ఉదయం నుంచి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. గురువారం మధ్యాహ్నానికి శివకుమార్ మృతదేహాన్ని గుర్తించారు. సాయంత్రం వరకు హనుమంతునాయక్ కోసం వెతికారు.

ఫొటో సోర్స్, fb/kcr
కాళేశ్వరం: జులై నుంచి నీటిని ఎత్తిపోయాలి
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఏటా 540 టీఎంసీల నుంచి 600 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారంటూ ఈనాడు ఒక కథనం ప్రచురించింది.
రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేసీఆర్ చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు వినియోగించే విద్యుత్తుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
ఈ ఏడాది నుంచి రెండు టీఎంసీలు, వచ్చే ఏడాది నుంచి మూడు టీఎంసీలను గోదావరి నుంచి ఎత్తిపోయడానికి నిర్ణయించామన్నారు. రెండు టీఎంసీలకు 3,800 మెగావాట్లు, మూడు టీఎంసీలకు 6,100 మెగావాట్ల విద్యుత్తు అవసరమని చెప్పారు. కావాల్సినంత విద్యుత్తును సమకూర్చుకుని గోదావరిలో ప్రవాహం ఉండే ఆరు నెలలపాటు నిర్విరామంగా సరఫరా చేయాలని విద్యుత్తు సంస్థను కోరారు.
వచ్చే నెల పదో తేదీలోగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌ల నిర్మాణం పూర్తిచేయాలని జులై నుంచి నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన విద్యుత్తు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్తు సరఫరాపై ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇతర రంగాలకు 24 గంటలతోపాటు కాళేశ్వరం, ఇతర ఎత్తిపోతలకు అవసరమైన విద్యుత్తును నిరాటంకంగా సరఫరా చేస్తామని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు వివరించారు.
రైతులను బతికించడానికి, సాగునీటి కోసం ఎంతైనా ఖర్చు చేస్తామని కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం పూర్తయితే ఏడాది, రెండేళ్లలోపే ప్రాజెక్టు కోసం పెట్టిన ఖర్చుకు సమానమైన పంట పండుతుందన్నారు. దాంతో, రైతుల జీవితాలు, తెలంగాణ వాతావరణం మారిపోతాయని చెప్పారు.

ఫొటో సోర్స్, RAVISANKAR LINGUTLA/BBc
బ్యాంకులపై మొండి బకాయిల బండ
ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు అంతకంతకూ పేరుకుపోతుండటంతో వాటికి బ్యాంక్‌లు అధికంగా కేటాయింపులు జరపాల్సి వస్తోంది. ఫలితంగా ప్రతి త్రైమాసికానికీ బ్యాంక్‌ల లాభదాయకత అంతకంతకూ క్షీణిస్తోందని సాక్షి రాసింది.
గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నిరర్థక ఆస్తులకు జరిపిన కేటాయింపులతో పోలిస్తే క్యూ4లో మొండి బకాయిల కేటాయింపులతో పోల్చితే ఇవి రూ.29,625 కోట్లు అధికం.
విమానయాన సంస్థ, జెట్ ఎయిర్‌వేస్ కూలిపోవడం, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీ కూడా మూతపడటంతో ప్రభుత్వ బ్యాంక్‌ల మొండి బకాయిల సమస్య మరింత తీవ్రంగా మారింది.
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 13 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొత్తం కేటాయింపులు రూ.52,739 కోట్లకు చేరటంతో ఈ ప్రభావం బ్యాంక్‌ల లాభదాయకతపై బాగానే పడింది. ఎనిమిది బ్యాంక్‌లకు రూ.15,192 కోట్ల మేర నికర నష్టాలు వచ్చాయి.
ఐదు బ్యాంక్‌లకు మాత్రమే నికర లాభాలొచ్చాయి. ఒక్కో బ్యాంక్ నష్టాలు వెయ్యి కోట్లకు పైగా ఉండగా, లాభాల్లో ఉన్న బ్యాంక్‌ల లాభాలు రూ.95 కోట్లు నుంచి రూ.838 కోట్ల రేంజ్‌లో మాత్రమే ఉన్నాయి.

ఫొటో సోర్స్, NCBN.IN
ఓట్లు లెక్కించాకా రీపోలింగ్ పెడతారా?
పక్షపాతంగా, ఏకపక్ష ధోరణితో అప్రజాస్వామికంగా వ్యవహరించేలా కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రవర్తిస్తోందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారని ఆంధ్రజ్యోతి రాసింది.
ఓట్ల లెక్కింపు తర్వాత కూడా రీపోలింగ్ నిర్వహిస్తారా సీఎం ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని.. ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ ఫిర్యాదు చేస్తే ఈసీ బుట్టదాఖలు చేసిందని.. కానీ వైసీపీ అభ్యర్థి ఫిర్యాదు చేస్తే ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశించడాన్ని ఆక్షేపించారు.
ఈ మేరకు చంద్రబాబు గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, అశోక్ లావాసా, సుశీల్‌చంద్రలకు మరో లేఖ రాశారు.
"ఇంతకు ముందు కూడా ఈ అంశాన్ని మీ దృష్టికి తెచ్చాను. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఈసీ ఈ నెల 15వ తేదీన ఆదేశించింది. ఈ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపు విషయంలో వచ్చిన అనేక ఫిర్యాదుల విషయాన్ని చెబుతూనే ఉన్నాం. ఇక్కడ టీడీపీ పార్టీ ఓట్లను తొలగించే కుట్ర చేశారు. ఇక్కడే కాదు.. రాష్ట్రమంతా అనేక నియోజకవర్గాల్లో ఈ కుట్రకు వైసీపీ వారు పాల్పడి ఓటర్ల హక్కును కాలరాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం చేసిన విజ్ఞప్తిని, నకిలీ ఫిర్యాదులు వచ్చిన కంప్యూటర్ల ఐపీ నంబర్లను రుజువుగా చూపెట్టినా ఈసీ స్పందించకపోవడం దిగ్ర్భాంతి కలిగిస్తోంది" అని చంద్రబాబు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ముగ్గురు భర్తలు... ముగ్గురు పిల్లలు...16 మంది అత్యాచార నిందితులు
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- ‘24 గంటల కరెంట్ మాకొద్దు’
- ప్రవాసాంధ్రులు ఏపీకి పంపిస్తున్న డబ్బులు ఎంతో తెలుసా?
- బ్రెగ్జిట్: యురోపియన్ యూనియన్‌కు ‘విడాకులిస్తున్న’ బ్రిటన్... ఎందుకు? ఏమిటి? ఎలా?
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటీ? చేయకపోతే ఏమవుతుంది?
- రిషబ్ పంత్‌ను ఎందుకు తీసోకోలేదంటే...: విరాట్ కోహ్లీ
- ‘మీరు అంటరానివాళ్లు అంటూ తుపాను పునరావాస శిబిరంలోకి మమ్మల్ని రానివ్వలేదు’
- వాట్సాప్: అప్డేట్, బ్యాకప్, 2FA, ప్రైవసీ ఫీచర్లను వాడుకోవడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








