మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 4 వారాల గడువు.. ఆర్టికల్ 370 పిటిషన్లపై 28 రోజుల్లో బదులివ్వాలని ఆదేశం

కశ్మీరీలు

ఫొటో సోర్స్, Getty Images

ఆర్టికల్ 370 సవరణతోపాటు కశ్మీర్‌కు సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లపై సమాధానం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు 28 రోజుల గడువు ఇచ్చింది.

పిటిషన్లపై స్పందించేందుకు నాలుగు వారాల గడువు కావాలని కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోరారు.

జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అందుకు అనుమతించింది.

మరోవైపు, ప్రభుత్వం స్పందించిన తర్వాత ఒక వారం లోపు వారివారి వాదనలు సమర్పించాలని పిటిషనర్లకు కూడా కోర్టు సూచించింది.

అనంతరం ఈ విషయంపై తదుపరి విచారణను నవంబర్ 14కి వాయిదా వేసింది.

ఆర్టికల్ 370ని సవరించి జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని భారత్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్కడ కర్ఫ్యూ విధించి.. మీడియా, ఫోన్, ఇంటర్నెట్ సేవలు, రాకపోకలపైనా కేంద్రం ఆంక్షలు అమలు చేసింది.

ఈ చర్యలను వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పిటిషన్లు కూడా వేశారు.

కశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

వీటన్నింటిపై సుప్రీం కోర్టు మంగళవారం తొలి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు.

పిటిషన్లపై సత్వరమే వాదనలు వినాలన్న అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది.

''నిర్ణయం మీకు అనుకూలంగా వస్తే అన్నింటినీ పునరుద్ధరించవచ్చు'' అని పిటిషనర్లను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది.

ఈ విషయంలో మరే ఇతర పిటిషన్లను అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది.

కేంద్రానికి కోర్టు నాలుగు వారాల గడువు ఇవ్వడాన్ని పిటిషన్‌దారులు వ్యతిరేకించారు.

అలా చేస్తే ఈ పిటిషన్లు వేయడం అర్థరహిత చర్య అవుతోందని వ్యాఖ్యానించారు.

లద్దాఖ్, జమ్మూకశ్మీర్ అక్టోబర్ 31న కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారబోతున్నాయి. ఈ రెండు ప్రాంతాల నడుమ ఆస్తుల విభజన కోసం ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)