ఆర్టికల్ 370 రద్దు కోసం దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న కశ్మీరీ గుజ్జర్లు ఎవరు?

జమ్మూకశ్మీర్‌లో నివసించే గుజ్జర్-బకర్వాల్ తెగకు చెందిన ఆదివాసీలు ఆర్టికల్ 370ని రద్దు చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మోదీ ప్రభుత్వ చర్యలతో తమ జీవితాల్లో మార్పులు రావాలని వారు ఆశిస్తున్నారు.
జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రధాన సంచార జాతుల్లో గుజ్జర్-బకర్వాల్ తెగ కూడా ఒకటి. ఇక్కడ ఆర్టికల్ 370ని రద్దు చేయాలని దశాబ్దాలుగా పోరాడుతున్నారు.
భారత రాజ్యాంగం ప్రసాదించే అటవీ హక్కులు పొందేందుకు, ఆదివాసీలుగా గుర్తింపు పొందేందుకూ ఆర్టికల్ 370 ఒక అడ్డంకిగా ఉందని వారు చెబుతున్నారు.
ఈ సంచార జాతి ప్రజలు తమ పాడిపశువులతో కలిసి జమ్మూకశ్మీర్ లోని ఒక మూల నుంచి మరో మూలకు ప్రయాణిస్తూనే జీవనం గడుపుతారు. వారికి ఒకచోట స్థిర నివాసం అంటూ ఉండదు.
శీతాకాలంలో ఈ సంచార జాతుల ప్రజలు కొండప్రాంతాల నుంచి దిగువన ఉండే మైదాన ప్రాంతాలకు వలస వెళ్తారు. వేసవి కాలంలో మళ్లీ పర్వత ప్రాంతాలకు వచ్చేస్తారు.

''మిలిటెంట్లు, సైన్యం మధ్య నలిగిపోతున్నాం''
''ఇప్పటి వరకు మాకు ఓటు హక్కే లేదు. మా పూర్వీకుల్లో కూడా ఎవరూ ఓట్లు వేయలేదు. మా తెగలో 70 ఏళ్లు నిండిన వాళ్లలో కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓటు వేయనివారు ఉన్నారు''అని గుజ్జర్-బకర్వాల్ తెగకు చెందిన చౌధరీ మహ్మద్ చిచీ వివరించారు.
''మిలిటెంట్లు వస్తారు. వాళ్లు మా తలకు తుపాకీ గురి పెట్టి భోజనం పెట్టాలని డిమాండ్ చేస్తారు. మేం ఎదురుతిరిగితే చంపేస్తారు. తర్వాత ఆర్మీ వాళ్లొస్తారు. మేం మిలిటెంట్లకు అండగా ఉంటూ, వారికి అన్నం పెడుతున్నామని ఆరోపిస్తారు. ఇద్దరి మధ్యలో మేం నలిగిపోతున్నాం. కానీ మేం ఎక్కడకి పోవాలి?''అని తెగకు చెందిన చౌధరి షంసుద్దీన్ వివరించారు.
భారత రాజ్యాంగంలోని అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలకు అటవీ భూములపై ప్రత్యేక అధికారాలుంటాయి. కానీ ఆర్టికల్ 370 మూలంగా వీరికి జమ్మూకశ్మీర్ లోని అడవులపైన ఎటువంటి హక్కులూ లేవు.
''కనీసం వారు మమ్మల్ని ఇక్కడ ఉండనిస్తే మేం ఈ పూరిళ్లలోనైనా సంతోషంగానే ఉంటాం. జమ్మూకశ్మీర్ మేం పుట్టిన గడ్డ. కానీ ఇక్కడ స్థిరపడేందుకు మాకు చోటు లేదు. మేం ఎవరికీ అక్కర్లేదు. మేం భారతీయులం. ఏళ్ల తరబడి ఇక్కడే నివసిస్తున్నాం'' అని చౌధరి వివరించారు.

అమర్‌నాథ్ యాత్రలో కీలకపాత్ర
ఏటా హిందువులు జరిపే అమర్‌నాథ్ యాత్రలో తాము భాగం కావడం పట్ల కూడా ఈ ఆదివాసీలు గర్వపడతారు. ఈ దైవాన్ని మొదట తమ పూర్వీకులే కనుగొన్నారని వీరు చెబుతుంటారు.
''అమర్‌నాథ్ యాత్రకు వచ్చేవారికి సహాయపడేందుకు వెళ్తుంటాం. మేం యాత్రికులను భుజాలపై మోసుకువెళతాం. యాత్రను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న వారిలో భారత సైన్యం తర్వాతి స్థానం బకర్వాల్-గుజ్జర్లదే''అని చౌధరీ తెలిపారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత, హోం మంత్రి అమిత్ షా, తదితర బీజేపీ నేతలు బకర్వాల్-గుజ్జర్లను ఉద్దేశించి ప్రసంగించారు. డీలిమిటేషన్ ప్రక్రియ, కొత్త సంస్కరణలలో భాగంగా జమ్మూ కశ్మీర్ లోని ఆదివాసీల కోసం సుమారు ఎనిమిది స్థానాలు కేటాయించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
వారి మాటలు వేలాది మంది ఆదివాసీలకు ఓ చిరు ఆశను, భరోసాను ఇచ్చాయి.
''ప్రభుత్వం చాలా గ్రామాలలో అనేక అభివృద్ది పథకాలను అమలు చేస్తోంది. కుట్టు మిషన్లు, కంప్యూటర్ సెంటర్లు వంటివి అందిస్తోంది. కానీ మా గుజ్జర్ల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు''అని ఖాదీజా బానో బానియా తెలిపారు.
బకర్వాల్-గుజ్జర్లు కేంద్రంలో అధికార పార్టీ ఇచ్చిన హామీలపై సంతృప్తితో ఉన్నారు. నాయకులు తమ వాగ్దానాలను నిలబెట్టుకుంటే తమ జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తాయని వారు ఆశిస్తున్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఇవి కూడా చదవండి:
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి
- హైదరాబాద్ శివార్లలోని అద్రాస్పల్లి శ్మశానంలో సెప్టెంబర్ 18 రాత్రి ఏం జరిగింది?
- తాజ్‌మహల్ కన్నా ఈ మురికి వాడకు వచ్చే సందర్శకులే ఎక్కువ
- మోదీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ. 1.76 లక్షల కోట్ల నిధులు ఎందుకు తీసుకుంది?
- దళితుడి శవాన్ని వంతెన మీంచి కిందకు తాళ్ళు కట్టి ఎందుకు దింపారు...
- ఏపీ రాజధాని అమరావతిపై బీబీసీతో బొత్స ఏమన్నారంటే...
- మూర్ఛ వ్యాధికి చంద్రుడి ప్రభావమే కారణమా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








