అమెరికా మధ్యంతర ఎన్నికలు: ఆసియన్ల జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రియాలిటీ చెక్
- హోదా, బీబీసీ న్యూస్
ఇవాళ అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో అమెరికన్లు 435 మంది హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌ను, సెనేట్‌లోని 100 మందిలో 33 మంది కొత్త సభ్యులను ఎన్నుకోబోతున్నారు.
హౌస్, సెనేట్ రెంటినీ కలిపి అమెరికా కాంగ్రెస్‌గా వ్యవహరిస్తారు.
ప్రస్తుతం కాంగ్రెస్‌లో 80 శాతం సీట్లు శ్వేతజాతి రాజకీయనాయకులే ఆక్రమించారు. అయితే జనాభా లెక్కల ప్రకారం మొత్తం అమెరికా జనాభాలో శ్వేత జాతీయులు 60 శాతమే.
అమెరికా జనాభాలో మహిళలు 50 శాతం ఉన్నా, ఎన్నికైన ప్రజాప్రతినిధులలో వారు 20 శాతమే ఉన్నారు.
అత్యధిక సంఖ్యలో ఉన్న మైనారిటీ జాతులు - హిస్పానిక్, ఆసియన్, ఆఫ్రికన్ అమెరికన్లకు కూడా కాంగ్రెస్‌లో సరైన ప్రాతినిధ్యం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
కాలక్రమంలో మారిన ప్రాతినిధ్యం
గత కొన్ని దశాబ్దాల నుంచి చూస్తే, ఈ వర్గాల భాగస్వామ్యం క్రమక్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. మరీ ప్రత్యేకించి గత రెండు దశాబ్దాలలో మహిళల ప్రాతినిధ్యం బాగా పెరిగింది.
గత ఐదేళ్ల కాలంలో కాంగ్రెస్‌కు ఎన్నికైన హిస్పానిక్ అమెరికన్ల సంఖ్య కూడా చెప్పుకోదగినంతగా పెరిగింది.
వాళ్లు సులభంగా ఎన్నికలలో పాల్గొనగలిగేలా ఓటు హక్కు చట్టం, ఇతర చట్టాలలో మార్పులు చేయడం వల్ల మైనారిటీ జాతులు, మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని తెలుస్తోంది.
ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌లో 45 మంది హిస్పానిక్ అమెరికన్లు, 48 మంది ఆఫ్రికన్ అమెరికన్లు ఉన్నారు.
బరాక్ ఒబామా సెనేట్‌కు ఎన్నికైనపుడు, ఆయన కేవలం ఐదవ ఆఫ్రికన్ అమెరికన్ సెనేటర్.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్‌లో మహిళలు
1992 ఎన్నికలలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. ఆ ఏడాది కాంగ్రెస్‌కు 54 మంది మహిళలు ఎన్నికయ్యారు. అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే అది 69 శాతం ఎక్కువ. నేడు వారి సంఖ్య 107. అయితే జనాభా నిష్పత్తి ప్రకారం చూసినప్పుడు వారి సంఖ్య ఇంకా తక్కువే.
ఈ మధ్యంతర ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేనంత మంది మహిళలు పోటీ పడుతున్నారు. ప్రైమరీలో ఎంపిక అనంతరం సుమారు 250 మంది మహిళలు ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
1965లో లిండన్ జాన్సన్ అధ్యక్షునిగా ఉన్నపుడు ఎన్నికలలో వివక్ష తొలగించడానికి చట్టాలలో అనేక సవరణలు తీసుకువచ్చారు. నాటి నుంచి అమెరికా ఎన్నికలలో ఆఫ్రికన్ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగింది.
అంతకు ముందు, మైనారిటీ అభ్యర్థులు ఎన్నికలలో పాల్గొనడానికి ఎన్నో అడ్డంకులు ఉండేవి. అలాగే వారి ఓటింగ్ హక్కు విషయంలో కూడా.

ఫొటో సోర్స్, Getty Images
‘శ్వేత జాతీయులు మాత్రమే’ నిబంధన
1940ల వరకు ఆఫ్రికన్ అమెరికన్లు, హిస్పానిక్ అభ్యర్థులు ఎన్నికలలో పాల్గొనకుండా ఉండేందుకు అమెరికాలోని దక్షిణ ప్రాంతంలో డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికలలో కేవలం శ్వేత జాతీయులు మాత్రమే పోటీ చేయాలనే నిబంధనలు విధించింది.
1975లో ఓటు హక్కుల చట్టంలో సవరణలు చేసి, ఆ ప్రాంతంలో ఓటు వేసేవారిలో 5 శాతం మంది తమ భాషలో ఓటింగ్ సామాగ్రి కావాలని అడిగితే, తప్పకుండా వాటిని అందుబాటులోకి తీసుకురావాలని చట్టం చేశారు.
ఆ రోజుల్లో స్పానిష్ మాట్లాడే ప్రజలు ఎన్నికలలో పాల్గొనాలంటే ఇలాంటి ఏర్పాటు తప్పనిసరి. తద్వారా వాళ్లు కూడా ఎన్నికలలో పాల్గొనడం మొదలైంది.
నేడు కూడా మైనారిటీ వర్గాలు ఓటరుగా నమోదు చేసుకొనే విషయంలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి.
ఆసియన్ అమెరికన్ వర్గాల ప్రజలకు 1952లో ఇమిగ్రేషన్ చట్టం తెచ్చిన తర్వాతే ఓటు హక్కు వచ్చింది. ఆసియన్లకు పౌర హక్కు కూడా అదే సమయంలో వచ్చింది.
ప్రస్తుతం కాంగ్రెస్‌లో 16 మంది ఆసియన్లు (భారతీయ, పసిఫిక్ ద్వీపానికి చెందిన వారు) ఉన్నారు.
ఈ మధ్యంతర ఎన్నికలలో 60 మందికి పైగా ఆసియన్ అమెరికన్లు కాంగ్రెస్‌కు పోటీ పడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్‌లో నేటివ్ అమెరికన్లు
1924 వరకు నేటివ్ అమెరికన్లకు అమెరికా పౌరసత్వం ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా అందరికీ ఓటు హక్కు ఇవ్వలేదు. చాలా రాష్ట్రాలు వాళ్లకు ఓటు హక్కు నిరాకరిస్తూ చట్టాలు చేశాయి. వాళ్లందరికీ ఓటు హక్కు ఇవ్వడానికి మరో 40 ఏళ్లు పట్టింది. న్యూ మెక్సికో చివరిగా 1962లో నేటివ్ అమెరికన్లకు ఓటు హక్కు ఇచ్చిన రాష్ట్రం.
ప్రస్తుతం ఇద్దరు హౌస్ ప్రతినిధులతో సహా ఇప్పటివరకు నేటివ్ అమెరికన్ వారసత్వం కలిగిన 14 మంది కాంగ్రెస్‌లో ఉన్నారని కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక వెల్లడించింది.
నేడు కాంగ్రెస్‌లో మహిళలు, హిస్పానిక్, ఆసియన్, ఆఫ్రికన్ అమెరికన్లు ఉన్నారన్న మాట వాస్తవం. అయినా, అమెరికా చట్టసభలు అమెరికా మొత్తం జనాభాను ప్రతిఫలించడం లేదు.
అయితే గెలిచినా, ఓడినా ఎన్నికలలో పాల్గొంటున్న మహిళలు, మైనారిటీల సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతుందన్న మాట వాస్తవం.
ఇవి కూడా చదవండి:
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు: బళ్లారిలో బీజేపీ ఓటమి... ‘గాలి’ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు ఎందుకు విధించింది? వాటి ప్రభావం ఎలా ఉంటుంది?
- ‘భయం’ అంటే మనకు ఎందుకంత ఇష్టం?
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- తెలంగాణ ఎన్నికలు : పరభాషా ఓటర్లే పెన్నిధి
- రాజకీయ ప్రకటనల గుట్టు ఇక రట్టు!
- అభిప్రాయం: కాంగ్రెస్ - టీడీపీ కలయికను ఎలా అర్థం చేసుకోవచ్చు?
- దీపావళి ప్రత్యేకం: లక్ష్మీదేవి బొమ్మలో ముఖం ఎవరిది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








