కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు: బళ్లారిలో బీజేపీ ఓటమి, ‘గాలి’ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ

ఫొటో సోర్స్, Getty Images
కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్రంలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాలు, రెండు శాసన సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో నాలుగు చోట్ల కూటమి అభ్యర్థులు విజయాన్ని సాధించారు. ఒకచోట బీజేపీ గెలిచింది.
బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప విజయం సాధించగా, మాండ్య లోక్‌సభ స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థి శివరామగౌడ గెలిచారు.
శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర విజయం సాధించారు.
జామ్‌ఖండి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్‌సిద్దు న్యామగౌడ గెలుపొందారు.
రామనగర అసెంబ్లీ స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామి విజయం సాధించారు.
తుది ఫలితాలు ఇవే..

ఫొటో సోర్స్, IMRAN QURESHI/BBC
గాలి బ్రదర్స్‌కు ఎదురు దెబ్బ
బళ్లారి పేరు వినగానే వెంటనే గుర్తుకువచ్చేది గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్. గత మూడు లోక్ సభ ఎన్నికల్లోనూ బళ్లారి నియోజకవర్గం నుంచి గాలి బ్రదర్స్ మద్దతున్న అభ్యర్థులే విజయం సాధించారు.
2004, 2009, 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో దిగిన కరుణాకర్ రెడ్డి, జే. శాంత, బి.శ్రీరాములు వరసుగా గెలుపొందారు. మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరాములు మొల్కమ్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున శ్రీరాములు సోదరి వి. శాంత బరిలో దిగగా, కాంగ్రెస్ నుంచి ఉగ్రప్ప పోటీ పడ్డారు. ఈయనకు జేడీఎస్ మద్దతిచ్చింది.
ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్ప భారీ మెజార్టీతో శాంతపై గెలుపొందారు.

ఫొటో సోర్స్, JDS
భర్త సీఎం.. భార్య ఎమ్మెల్యే
రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అనితా కుమారస్వామి.. రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య. ఈ నియోజకవర్గం జేడీఎస్‌కు గట్టి పట్టు ఉన్న ప్రాంతం. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి కుమారస్వామి తండ్రి దేవెగౌడ కూడా గెలుపొందారు.
ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయి?
మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా శివమొగ్గ ఎంపీ స్థానానికి మాజీ సీఎం యడ్యూరప్ప రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానంలో ఉపఎన్నిక నిర్వహించారు.
ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర పోటీ చేయగా, జేడీఎస్ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప బరిలో దిగారు.
బళ్లారి ఎంపీ బి.శ్రీరాములు మొల్కమ్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
జేడీఎస్ నేత, మాండ్య ఎంపీ సీఎస్ ముత్తరాజ్ మెల్కొటే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలు రామనగర్, చన్నపట్నా నుంచి గెలుపొందారు. రామనగర్ స్థానానికి రాజీనామా చేశారు.
జామ్‌ఖండి ఎమ్మెల్యే సిద్దూ నాయమగౌడ్ మరణించడంతో ఇక్క డ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- అభిప్రాయం: ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నపుడు ఆమెకు ఇద్దరు భర్తలు ఎందుకు ఉండకూడదు?
- విశ్లేషణ: 2019 ఎన్నికలపై కర్ణాటక ప్రభావమెంత?
- నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇస్తున్న సంకేతాలేంటి?
- కర్ణాటక ఫలితాలపై మోదీ, రాహుల్ ఇద్దరూ పరేషాన్.. ఎందుకు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- ఆంధ్రా, తెలంగాణ, తృతీయ ఫ్రంట్లపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఎంత?
- దీపావళి హరిత టపాసులు: ‘ధర తక్కువ.. మోత ఎక్కువ.. పైగా కాలుష్యం లేకుండా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








