‘ఎన్నికల వెబ్‌సైట్ల’ను పది నిమిషాల్లో హ్యాక్ చేసేసిన పిల్లలు

ఆడ్రే జోన్స్
ఫొటో క్యాప్షన్, ఆడ్రే జోన్స్ అనే ఈ పదకొండేళ్ల బాలిక పది నిమిషాల్లోనే ఎన్నికల వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసింది
    • రచయిత, డేవ్ లీ
    • హోదా, నార్త్ అమెరికా టెక్నాలజీ రిపోర్టర్

బియాంకా లూయిస్ వయసు పదకొండేళ్లు.. బార్బీతో ఆడుకోవటం, వీడియో గేమ్స్, కత్తులతో పోరాటం, పాటలు పాడటంతో పాటు.. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం ఎన్నికల సామగ్రిని హ్యాక్ చేయడం.. ఆమె హాబీలు.

‘‘డొనాల్డ్ ట్రంప్‌కి వచ్చే ఓట్లను మార్చేయటానికి నేను ప్రయత్నం చేస్తా. ఆయన ఓట్లను తగ్గించటానికి ప్రయత్నిస్తా. అసలు ఎన్నికల్లో ఆయన పేరునే తీసేస్తానేమో’’ అంటోంది బియాంకా.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదృష్టం కొద్దీ.. బియాంకా దాడిచేస్తున్నది ఒక అసలు వెబ్‌సైట్ మీద కాదు, దానిని పోలిన నకలు వెబ్‌సైట్ మీద.

‘‘మంచి కోసం హ్యాకింగ్’’ను ప్రోత్సహించే రూట్జ్ అసైలమ్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఓ హ్యాకింగ్ పోటీలో బియాంక పాల్గొంది.

చిన్నారి హ్యాకర్లు
ఫొటో క్యాప్షన్, ఎన్నికల టెక్నాలజీని పటిష్ట భద్రతతో రూపొందించాలని పదకొండేళ్ల బియాంకా అంటోంది

కొద్ది నిమిషాల కోచింగ్‌తోనే...

అమెరికా వ్యాప్తంగా నవంబరులో జరగబోయే మధ్యంతర ఎన్నికలు చిన్న పిల్లలు కూడా కొద్ది నిమిషాల శిక్షణతో హ్యాక్ చేయగలిగేంత బలహీనమైనవి అనే హెచ్చరిక పంపించటం ఈ పోటీల లక్ష్యం.

‘‘ఎన్నికల ఫలితాలను ప్రజలకు నివేదించే వెబ్‌సైట్‌లు ఇవి. జనం ఓట్లు వేయటానికి ఎక్కడికి వెళ్లాలో కూడా అవి చెప్తాయి. ఈ రెండు అంశాల్లో దేనిని మార్చినా ఎంత గందరగోళం తలెత్తుతుందో ఊహించొచ్చు’’ అని వివరించారు రూట్జ్ అసైలమ్ వ్యవస్థాపకురాలు నికో సెల్.

నిజమైన వెబ్‌సైట్లను హ్యాక్ చేయటం చట్టవ్యతిరేకం. కాబట్టి.. నిజమైన వెబ్‌సైట్లను పోలిన 13 వెబ్‌సైట్లను.. వాటిలోని లోపాలతో సహా సెల్ టీమ్ తయారు చేసింది. ఎన్నికల్లో హోరాహోరీ పోటీ జరుగుతుందని భావించే 13 రాష్ట్రాల కోసం ఈ వెబ్‌సైట్లను రూపొందించారు.

హ్యాకింగ్ పోటీలో.. 8 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వరకూ వయసున్న 39 మంది పిల్లలు పాల్గొన్నారు. వారిలో 35 మంది పిల్లలు ఆ వెబ్‌సైట్ల భద్రతను ఛేదించగలిగారు. ప్రాక్టికల్ జోకులు చేర్చారు. ఆ వెబ్‌సైట్ ఒక సమయంలో 1,200 కోట్ల ఓట్లు (ప్రపంచ జనాభా కన్నా దాదాపు రెట్టింపు ఓట్లు) పోలైనట్లు చెప్పింది. ఆ తర్వాత.. ‘‘బాబ్ ద బిల్డర్’’ ఈ ఎన్నికల్లో గెలిచినట్లు పేర్కొంది.

డెఫ్ కాన్‌లో ఓ చిన్నారి
ఫొటో క్యాప్షన్, డెఫ్ కాన్‌లో చిన్నారుల విభాగంలో ఈసారి 300 మందికి పైగా పిల్లలు పాల్గొన్నారు.. అందులో సగం మంది బాలికలే...

‘మనమే గెలిచేశామని చూపించొచ్చు’

మొట్టమొదటగా ఈ వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన బాలిక పేరు ఆడ్రీ జోన్స్. పదకొండేళ్ల ఈ చిన్నారి కేవలం 10 నిమిషాల్లో వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసేసింది.

‘‘కోడ్‌లో ఉన్న లోపాలు(బగ్స్).. మనం ఏకావాలంటే అది చేయటానికి వీలు కల్పిస్తున్నాయి. ఎవరి పేరు దగ్గరైనా మన సొంత పేరు పెట్టేయొచ్చు.. ఎన్నికల్లో మనమే గెలిచినట్లు కనిపించేలా చేయొచ్చు’’ అని ఆమె చెప్తోంది.

లాస్ వేగాస్‌లో ఏటా జరిగి హ్యాకింగ్ సదస్సులో పిల్లల విభాగమైన డెఫ్ కాన్‌లో భాగంగా ఈ పోటీ నిర్వహించారు. ఈ ఏడాది 300 మందికి పైగా చిన్నారులు చాలా ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోల్డరింగ్ నుంచి లాక్ చేయటం వరకూ అనేక పనుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఒక టేబుల్ దగ్గర.. రెండేళ్ల వయసున్న కేథరీన్ సబోనిస్.. చాలా ఆనందంగా ఒక డెబిట్ కార్డును విడదీస్తూ కనిపించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది బాలికలేనని నిర్వాహకులు నాకు చెప్పారు.

ఎన్నికల హ్యాకింగ్

అసలు ఓట్ల లెక్కలు మారవు కానీ...

ఎన్నికల హ్యాకింగ్‌ అంశం మీద పిల్లలకు పోటీలు నిర్వహించటం ఇదే మొదటిసారి. 2017లో పెద్ద వాళ్ల కోసం ఇదే తరహా పోటీలు పెట్టారు.

ఇక్కడ నేర్చుకున్న హ్యాకింగ్‌ను.. నిజమైన వెబ్‌సైట్ల మీద ప్రయోగించినప్పటికీ.. వాస్తవమైన ఓట్ల లెక్క మారదు. ఎందుకంటే.. ఓట్ల లెక్కింపు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లలో చూపే విధానాన్ని మాత్రమే హ్యాకర్లు మార్చగలరు.

ఎన్నికలకు సంబంధించిన ఒక అధికారిక వెబ్‌సైట్.. నిజంగా గెలిచిన అభ్యర్థిని కాకుండా వేరే వ్యక్తి గెలిచినట్లు ప్రకటిస్తే వెల్లువెత్తే ఆగ్రహావేశాలు, గందరగోళం ఎలా ఉంటుందో ఈజీగానే ఊహించవచ్చు.

2016 అధ్యక్ష ఎన్నికల నాటి నుంచి ఈ వెబ్‌సైట్లలో లోపాలపై ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల వెబ్‌సైట్ల విషయంలో ఇంకా ముందునుంచే అనుమానాలున్నాయి. అమెరికాలో ప్రతి రాష్ట్రానికీ సొంత ఎన్నికల వెబ్‌సైట్లున్నాయి. అయితే.. నిధుల కొరత కారణంగా అవి సరైన భద్రత లేని డాటాబేస్‌ల మీద ఆధారపడుతున్నాయి. దశాబ్ద కాలం కిందటి సాఫ్ట్‌వేర్ మీద నడిచే ఓటంగ్ మెషీన్లనే ఉపయోగిస్తున్నాయి.

హ్యాకింగ్

‘‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’’

ఎన్నికల్లో ఈ భద్రతను పెంపొందించటానికి 2019లో 380 మిలియన్ డాలర్లు వ్యయం చేయాలంటూ డెమొక్రటిక్ పార్టీ ప్రతిపాదించిన సవరణను.. గత నెలలో అమెరికా కాంగ్రెస్ ఓటింగ్ ద్వారా తిరస్కరించింది.

వాడివేడిగా జరిగిన ఆ సమావేశంలో ఈ సవరణకు మద్దతు తెలిపిన వారు ‘అమెరికా! అమెరికా!’ అంటూ సభలో నినాదాలు చేశారు. అయినా.. రిపబ్లిక్ పార్టీ సభ్యుల మద్దతు లభించలేదు.

‘‘ఈ ముప్పుని మనం సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరముంది’’ అంటారు సెల్. ‘‘ప్రభుత్వ వెబ్‌సైట్లు ఇంత బలహీనంగా ఉండకూడదు. ఇవన్నీ స్పష్టంగా తెలిసిన లోపాలే. ఒక సమాజంగా మనం కలసికట్టుగా సరిచేయాల్సిన సమస్య ఇది. ఎందుకంటే.. మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

హ్యాకింగ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్న బియాంకా నాతో మాట్లాడేటపుడు.. ‘ఈ వెబ్‌సైట్ల భద్రత లోపించటం ఆందోళనకలిగిస్తోందా?’ అని నేను అడిగాను. ‘‘ఇంకా చాలా పటిష్టమైన భద్రత ఉండాలి... రష్యా వాళ్లు కాచుకుని ఉన్నారు’’ అని ఆమె వ్యాఖ్యానించింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)