కాసినో చీటింగ్: టీ షర్ట్‌లో సీక్రెట్ కెమెరా పెట్టుకుని గ్యాంబ్లింగ్‌లో లక్షల డాలర్లు గెలిచిన దంపతుల అరెస్టు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలెక్స్ ఫిలిప్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కజకిస్తాన్‌కు చెందిన ఒక భార్యభర్తల జంట, రహస్య కెమరాలను, ఇయర్ పీసులను వాడి, ఆస్ట్రేలియాలోని ఒక క్యాసినోలో మోసపూరితంగా 12 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు( సుమారు రూ.70 లక్షలు ) గెలుచుకున్నట్లు బయటపడింది.
పోలీసుల వివరాల ప్రకారం, సిడ్నీలోని ఓ క్యాసినోలో దిల్నోజా ఇస్రాయ్‌లోవా అనే మహిళ తాను ధరించిన టీ-షర్ట్‌లో సీక్రెట్ కెమెరాను దాచినట్లు సిబ్బంది గమనించారు.
పట్టుబడ్డ దిల్నోజాను, ఆమె భర్త అలిషెరిఖోజా ఇస్రాయ్‌లోవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా మ్యాగ్నెటైజ్డ్ ప్రోబ్స్‌తోపాటు ఫోన్‌కు అతికించే అద్దం వంటి పరికరాలు లభ్యమయ్యాయని, వీటిని గేమ్‌లో మోసం చేసేందుకు వాడారని వెల్లడించారు.
మోసపూరితంగా డబ్బును గెలుచుకున్న ఆరోపణల మీద వీరిద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.


ఫొటో సోర్స్, NSW Police
న్యూ సౌత్ వేల్స్ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, కజకిస్తాన్ నుంచి అక్టోబర్‌లో సిడ్నీకి వచ్చిన ఈ దంపతులు అదే రోజున క్యాసినో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
అనంతరం వారాలపాటు, వారు సిడ్నీ వాటర్‌ఫ్రంట్‌పై ఉన్న క్రౌన్ క్యాసినోకు పలుమార్లు వెళ్లి 12 లక్షల డాలర్ల ( సుమారు రూ. 70 లక్షలు) వరకు గెలుచుకున్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.
వీరు సాధిస్తున్న విజయాలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన క్యాసినో సిబ్బంది, గురువారంనాడు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఫొటో సోర్స్, NSW Police
పోలీసుల అందించిన వివరాల ప్రకారం, టేబుల్‌పై ఉన్న కార్డుల చిత్రాలను వెంటనే రికార్డు చేసి చూడగలిగే విధంగా, రహస్య డివైస్‌లను ఈ ఇద్దరు వారి మొబైల్ ఫోన్లకు కనెక్ట్ చేసుకున్నారు.
అంతేకాకుండా సీక్రెట్ ఇయర్‌పీసులు ధరించారని, వాటి ద్వారా కార్డ్ గేమ్‌లలో ఎప్పుడు పందెం వేయాలో సూచనలు అందుకున్నారని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ఇంకెవరి కోసం ప్రస్తుతం గాలించట్లేదని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ ప్రతినిధి బీబీసీకి చెప్పారు.
క్యాసినో సమీపంలో వీరు ఉంటున్న హోటల్‌ను సోదా చేయగా జూదానికి ఉపయోగించే పరికరాలు, విలువైన ఆభరణాలు, దాదాపు రెండు లక్షల యూరోల ( సుమారు రూ. 2 లక్షలు) నగదు లభించిందని అధికారులు తెలిపారు.
ఈ దంపతులు శుక్రవారం కోర్టుకు హాజరుకాగా, వీరి బెయిల్‌ను కోర్టు నిరాకరించినట్టు పోలీసులు వెల్లడించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














