ఆ వెబ్ సైట్స్‌పై విజయ్ దేవరకొండ ఆగ్రహం ఎందుకు? వివాదం ఏంటి? -ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/TheDeverakonda
ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ గాసిప్ వార్తల వెబ్‌సైట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారని దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలు వార్తలు ప్రచురించాయి.
ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం.. ఈ వివాదానికి కారణాలు ఇలా ఉన్నాయి..
లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజలకు సాయం చేయడానికి ఆయన 'మిడిల్ క్లాస్ ఫండ్' ఏర్పాటు చేశారు.
చిత్ర పరిశ్రమలో వ్యక్తులు, ప్రజలు ఆయనకు విరాళాలు ఇచ్చారు.
ఎప్పటికప్పుడు లెక్కలను 'దేవరకొండ ఫౌండేషన్' వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తూ, పారదర్శకంగా సహాయ కార్యక్రమాలు చేస్తుంటే... అవే కొన్ని వెబ్‌సైట్స్ తప్పుడు వార్తలు రాయడం ప్రారంభించాయని విజయ్ దేవరకొండ ఆగ్రహం వ్యక్తం చేశారు.
''నేను ఎప్పుడో ఈ విషయమై మాట్లాడదామని అనుకున్నప్పటికీ... బురద దగ్గరకు వెళితే మనపై పడుతుందనీ, చెత్తకుంప దగ్గరకు వెళితే మనకే వాసన వస్తుందనీ నన్ను ఆపారు. కానీ, ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ఈ వెబ్‌సైట్స్ వ్యక్తులు వాళ్ల లాభం గురించి ఏం చేయడానికైనా రెడీ అయ్యారు. వాళ్ల ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడానికి ఎంతవరకూ అయినా వెళతారు. వ్యక్తిగత జీవితాలు, విలువలు అన్నీ దాటి వెళారు. బ్లాక్ మెయిల్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు'' అని ఆయన అన్నారు.
మరీ ముఖ్యంగా ఒక వెబ్‌సైట్‌లో తనపై తప్పుగా రాసిన ఆర్టికల్‌ను విజయ్ దేవరకొండ చదివి వినిపించారు. అంతకు ముందు ''కొంచెం కామన్‌సెన్స్‌తో ఎవరైనా ఈ వెబ్‌సైట్స్‌లో అర్టికల్స్ చదివితే వీళ్లు ఎంత ఫేక్ బ్యాచ్ అనేది మనకు వెంటనే అర్ధమవుతుంది. నెల రోజులుగా ఈ వెబ్‌సైట్ నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. విపరీతంగా నా మీద ఆర్టికల్స్ రాశారు. 'విజయ్ దేవరకొండ ఎక్కడ? దాక్కున్నాడా? సాయం అందించడా?' అని రకరకాలుగా రాశారు. వాళ్లకు నా సమాధానం ఇదే... అసలు నన్ను విరాళాల లెక్క అడగడానికి మీరెవరు?'' అని విజయ్ దేవరకొండ ప్రశ్నించారు.
''తప్పుడు వార్తలకు వివరణ ఇస్తూ వెళితే... జీవితంలో ఏమీ చేయలేం. వివరణ ఇస్తూ కూర్చోవాలి. ప్రజలకు చెప్పడం నా బాధ్యత కనుక చెబుతున్నా. కిల్ ఫేక్ న్యూస్! వాళ్లు నాన్‌సెన్స్ రాస్తూ... నా కెరీర్, పేరు నాశనం చేయాలని చూస్తున్నారు'' అని విజయ్ దేవరకొండ వివరించారు.
ఫేక్ న్యూస్ రాసే వెబ్‌సైట్స్‌పై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తెలియజేసింది. ఫేక్ న్యూస్, గాసి్‌ప్సకి తాము వ్యతిరేకమని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేర్కొంది.
విజయ్ దేవరకొండకు చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, రవితేజ, 'అల్లరి' నరేశ్, రానా, కార్తికేయ గుమ్మకొండ, దర్శకులు పూరి జగన్నాథ్, కొరటాల శివ, క్రిష్ జాగర్లమూడి, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, నటి రాధికా శరత్‌కుమార్, హీరోయిన్ రాశీ ఖన్నా, నిర్మాత అనిల్ సుంకర సహా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మద్దతు తెలియజేసింది.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో నిరుద్యోగం రేటు 27.11 శాతం
దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని సాక్షి దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనం ప్రకారం.. కరోనావైరస్ కారణంగా నిరుద్యోగ రేటు మే 3వ తేదీతో ముగిసిన వారంలో 27.11 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అనే సంస్థ వెల్లడించింది. మార్చిలో కరోనావైరస్ తీవ్రరూపం దాల్చకముందు నిరుద్యోగ రేటు 7 శాతంగానే ఉన్నట్టు తెలిపింది. నిరుద్యోగ రేటు పట్టణాల్లోనే ఎక్కువగా ఉందని, కరోనా కారణంగా రెడ్ జోన్లు పట్టణాల్లో ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 29.22 శాతంగాను, గ్రామీణ ప్రాంతాల్లో 26.69 శాతంగాను ఉన్నట్లు తెలిపింది. సీఎంఐఈ డేటా ప్రకారం నెలవారీ నిరుద్యోగ రేటు మార్చిలో 8.74 శాతంగా ఉంటే, ఏప్రిల్‌లో 23.52 శాతానికి పెరిగిపోయింది. పుదుచ్చేరిలో అత్యధికంగా 75.8 శాతం, తమిళనాడులో 49.8 శాతం, జార్ఖండ్‌లో 47.1 శాతం, బిహార్‌లో 46.6 శాతం, మహారాష్ట్రలో 20.9 శాతం, హరియాణాలో 43.2 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 21.5 శాతం, కర్ణాటకలో 29.8 శాతం ఉన్నట్లు గణాంకాలను వెల్లడించింది.

ఫొటో సోర్స్, twitter/RGIAHyd
విదేశాల నుంచి తెలంగాణకు 9 విమానాలు..
విదేశాలలో చిక్కుకున్న ప్రయాణికులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఏడో తేదీ నుంచి నడపనున్న విమానాల్లో తొమ్మిది తెలంగాణకు రానున్నాయని ఈనాడు దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. అమెరికా నుంచి నాలుగు, బ్రిటన్, కువైట్, యూఏఈ, మలేసియా, ఫిలిప్పైన్స్‌ల నుంచి ఒక్కొక్కటి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరతాయి. వీటిలో రాష్ట్రానికి చెందిన 2350 మంది రానున్నారు.
* 7న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి 300 మందితో ముంబై మీదుగా
* 8న కువైట్ నుంచి 200 మందితో
* 9న బ్రిటన్‌లోని లండన్ నుంచి 250 మందితో
* 10న అమెరికాలోని వాషింగ్టన్ నుంచి దిల్లీ మీదుగా 300 మందితో
* యూఏఈలోని అబుధాబి నుంచి 200 మందితో
* 12న అమెరికాలోని న్యూయార్క్ నుంచి దిల్లీ మీదుగా 300 మందితో
* ఫిలిప్పీన్స్‌లోని మనీలా నుంచి 250 మందితో
* 13న అమెరికాలోని షికాగో నుంచి దిల్లీ మీదుగా 300 మందితో,
* మలేసియాలోని కౌలాలంపూర్ నుంచి 250 మందితో
త్వరలోనే ప్రయాణికుల వివరాలు..
ప్రయాణికుల సంఖ్యపై ఆయా దేశాల రాయబార కార్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాయని, త్వరలోనే ప్రయాణికుల వివరాలను పంపిస్తాయని ఈ కథనంలో తెలిపారు.
విమానాశ్రయాలకు చేరుకునే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, వారికి సంబంధించిన సమస్త సమాచారం తీసుకుంటారు. కరోనా లక్షణాలుంటే ఆస్పత్రికి తరలిస్తారు. మిగిలిన వారు 14 రోజుల పాటు ఇంటిలో స్వీయ నిర్బంధంలో ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రూప్ క్రియేట్ చేసి, గ్యాంగ్ రేప్‌కు ప్లాన్.. దిల్లీ విద్యార్థిని అరెస్ట్ చేసిన పోలీసులు
దిల్లీలో కొందరు స్టూడెంట్లు దారి తప్పి.. వికృత చేష్టలకు దిగారని, కేవలం సెక్స్, రేప్ గురించి చర్చించుకునేందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారని వీ6 వెలుగు పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. తోటి స్టూడెంట్ల ఫొటోలను మార్ఫ్ చేసి పైశాచిక ఆనందం పొంది, గ్యాంగ్ రేప్ చేసేందుకు ప్లాన్లు వేశారని, చివరికి మొత్తం వ్యవహారం బట్టబయలైందని తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఢిల్లీలోని నాలుగైదు ఫేమస్ స్కూళ్లల్లో చదువుతున్న 22 మందికిపైగా స్టూడెంట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో 'బాయ్స్ లాకర్ రూం' పేరిట ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. అందరూ 15-18 ఏళ్లు ఉన్న యువకులు. కొందరు 11, 12వ క్లాస్ చదువుతున్నారు. గ్రూప్‌లో అమ్మాయిల గురించి, తోటి స్టూడెంట్ల గురించి అసభ్యంగా చర్చించుకున్నారు. అమ్మాయిల న్యూడ్ ఫొటోలను గ్రూపులో పోస్టు చేసి వారిపై అసభ్యకరమైన కామెంట్లు చేశారు. తమ క్లాస్ మేట్స్‌ను గ్యాంగ్ రేప్ చేయాలని కూడా ప్లాన్ చేశారు.
'బాయ్స్ లాకర్ రూం' గ్రూప్‌లోకి ఈ మధ్య ఓ అబ్బాయిని చేర్చుకున్నారు. అతడు తనకు తెలిసిన అమ్మాయికి చాటింగ్ స్క్రీన్ షాట్లను పంపాడు. అయితే అందులో తన ఫొటోలు కూడా ఉండటంతో ఆ అమ్మాయి స్కూలులో కంప్లయింట్ చేసింది. దీంతో స్కూల్ యాజమాన్యం పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. విషయం తెలుసుకున్న ఆ గ్రూపు సభ్యులు.. తమ వివరాలను వెల్లడించిన అమ్మాయి, ఆమెకు సహకరించిన ఇతర మహిళల నగ్న చిత్రాలు వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు.
ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించి ఒక స్టూడెంట్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫోన్‌ను సీజ్ చేశారు. గ్రూప్‌ను డీయాక్టివేట్ చేశారు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఈ స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. 'బాయ్స్ లాకర్ రూమ్' హాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఆ గ్రూప్‌లో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశించింది.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: 'తెలంగాణలో మే 29 వరకు లాక్డౌన్ పొడిగింపు.. మద్యం షాపులు ఓపెన్' -కేసీఆర్
- కరోనావైరస్తో మనుషులు చనిపోతుంటే... మరో వైపు మాఫియా డాన్లు ఏం చేస్తున్నారు?
- కరోనావైరస్: కోవిడ్-19 భారత్‌లోని న్యూస్ రూమ్స్‌ను ఎలా ధ్వంసం చేస్తోంది?
- కరోనావైరస్: కోవిడ్ పరీక్షలు చేయడం ఎందుకంత కష్టం?
- తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క: నెత్తిన బస్తాలు మోస్తూ.. కాలి నడకన గిరిజన గ్రామాలకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








