విజయ్ దేవరకొండ పేరుతో చాటింగ్, అమ్మాయిలకు ఎర... యువకుడి అరెస్ట్ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/vijaydeverakonda
సినిమా హీరో విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న యువకుడిని హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.
''తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా, వాట్సప్ నంబర్లను వాడుతూ గుర్తుతెలియని వ్యక్తి చాటింగ్ చేస్తున్నాడని, ఇది తన ఇమేజ్‌కు భంగం కలిగించేదిగా ఉందంటూ సైబర్‌క్రైం పోలీసులకు విజయ్ దేవర్‌కొండ ఇటీవల ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకొన్న ఇన్‌స్పెక్టర్ మోహన్‌రావు బృందం పథకం ప్రకారం నిందితుడు సాయికృష్ణను హైదరాబాద్ రప్పించి అదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్ జిల్లా మిర్జాపూర్‌కు చెందిన సాయికృష్ణ పదో తరగతి వరకు చదివి అక్కడే ఇడ్లీ బండి నిర్వహిస్తున్నాడు. అతన్ని పట్టుకొనేందుకు సైబర్‌క్రైం పోలీసులు ఓ మహిళ పేరుతో పిలిపించారు. గురువారం రాత్రి ఎల్బీనగర్‌కు వచ్చి క్యాబ్ కోసం ఎదురు చూస్తుండగా అక్కడే కాపుకాసిన సైబర్‌క్రైం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సాయికృష్ణపై సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీచేసి ఆయన కుటుంబీకులకు అప్పగించార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/kcr
సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తాం: కేసీఆర్
ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్), జాతీయ పౌర పట్టిక (ఎన్‌సీఆర్)లపై విస్తృతంగా చర్చించి తీర్మానం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారని 'ఈనాడు' కథనం తెలిపింది.
''ఇప్పటికే తమ పార్టీ సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని నిర్ణయించిందని గుర్తుచేశారు. శుక్రవారం జరిగిన శాసన సభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశంలో ఈ మేరకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఏ మాత్రం లేదని, దీనిపై ప్రజలలో నెలకొన్న అనుమానాలు, భయాందోళనలను తొలగించేలా శాసన సభలో చర్చించి ప్రకటన చేద్దామన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తర్వాత కరోనాపై స్వల్పకాలిక చర్చ జరపాలని ఆయన సభాపతిని కోరార''ని అందులో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నేడు స్థానిక ఎన్నికలకు నోటిపికేషన్.. టెన్త్ పరీక్షలు వాయిదా
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు శనివారం షెడ్యూల్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''ఎన్నికల నోటిఫికేషన్‌నూ శనివారమే ఇస్తామని తెలిపారు. ఇంటర్, టెన్త్ పరీక్షలకు ఇబ్బందులేర్పడతాయని ఎక్కువ పార్టీలు పేర్కొన్న నేపథ్యంలో.. టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తామని, దానివల్ల ఎలాంటి ఇబ్బందులుండవని ప్రభుత్వం స్పష్టం చేసిందని వెల్లడించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యాలయంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై రమేశ్ కుమార్ వరుస సమావేశాలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 'సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో చర్చించాం. క్షేత్రస్థాయిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిబ్బంది, బందోబస్తు పూర్తి స్థాయిలో ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించేందుకు సరైన పరిస్థితులు ఉన్నాయని ఎస్‌ఈసీ భావిస్తోంద''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Samsung
ఎన్నికల్లో అక్రమాలకు మొబైల్ యాప్‌తో 'చెక్'
స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేసిందని 'సాక్షి' కథనం తెలిపింది.
''మొబైల్ ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారు ఎవరైనా తమ కళ్ల ముందు జరిగే ఎన్నికల అక్రమాలను వెంటనే పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. నిఘా పేరుతో పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన ఈ యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం లాంఛనంగా ఆవిష్కరిస్తారని ఆ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ శుక్రవారం తెలిపారు. కాగా, ఎన్నికల నియమావళిని అతిక్రమించి అభ్యర్థులు ఓటర్లను బెదిరింపులు లేదా ప్రలోభాలకు గురిచేసినట్లు రుజువైతే అటువంటి వ్యక్తులు గెలిచినప్పటికీ ఆయా పదవుల్లో కొనసాగటానికి వారిని అనర్హులుగా పరిగణించడంతో పాటు ఆరేళ్లపాటు తిరిగి పోటీచేయకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అంతేకాక.. వారికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.పదివేల వరకు జరిమానా విధిస్తారు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచి ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై ఈ యాప్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.
యాప్ ఉపయోగాలివీ..
- డబ్బు లేదా ఇతర బహుమతులు, మద్యం పంపిణీ చేస్తున్నా.. యజమాని అనుమతి లేకుండా వారి ఇంటికి పోస్టర్లు, బ్యానర్లు వంటి అతికించినా.. ఆయుధాలతో ఎవరైనా తిరిగినా.. ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా ప్రచారం కొనసాగించినా.. పరిమితికి మించిన శబ్దంతో మైక్‌లను ఉపయోగించినా.. కులమతాల ప్రసంగాలు వంటి అంశాలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
- కళ్ల ముందు జరిగే అక్రమాలకు సంబంధించి ఫొటో, వీడియో లేదా ఆడియోను ఈ యాప్‌లోనే రికార్డు చేసి పంపించొచ్చు.
- ఫిర్యాదు చేసే వారు తమ వ్యక్తిగత సమాచారం ఇష్టం ఉంటేనే తెలియజేయవచ్చు.
- ఫిర్యాదుదారులు పంపించిన ఫొటో, వీడియోలు ఏ ప్రాంతంలోనివో జీపీఎస్ ద్వారా గుర్తించి అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు.
- ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేసే వారు ఆ సమాచారం సరిగ్గా ఉందో లేదోనని మొబైల్‌కు మెసేజ్ రూపంలో తెలిసిపోతుంది.
- అంతేకాక.. ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
- యాప్‌ను తమ మొబైల్ ఫోనులో డౌన్‌లోడ్ చేసుకునే వారు మొదట తమ ఫోను నంబర్‌ను రిజస్టర్ చేస్తే, ఆ తర్వాత ఆ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ నంబర్‌ను యాప్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. ఒకసారి ఈ ప్రక్రియ చేస్తే.. తర్వాత యాప్‌ను ఎప్పుడైనా సులభంగా ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి:
- యస్ బ్యాంక్: ఖాతాదారులకు పైసా నష్టం లేకుండా చూస్తామన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- అర్జెంటీనాలో 12,000 మంది నాజీల జాబితా.. వారు స్విస్ బ్యాంక్‌లో దాచిన లూటీ సంపద వెలుగు చూస్తుందా?
- బాంబుల శబ్దానికే కాదు.. ఇప్పుడు మాములు పరిస్థితుల్లో కూడా ఈ చిన్నారి నవ్వుతోంది
- భారత్‌లో పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు ఉన్నాయా?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు
- దిల్లీ హింస: తప్పి పోయిన పది రోజుల తర్వాత తిరిగి ఒడికి చేరిన మూడేళ్ల చిన్నారి సఫియా
- రేవంత్ రెడ్డి అరెస్ట్: డ్రోన్లతో ప్రైవేట్ ఆస్తులను చిత్రీకరించారనే కేసులో 14 రోజుల రిమాండ్
- కరోనావైరస్ తెలంగాణలో లేదన్న మంత్రి ఈటల... యూపీలో మరో కోవిడ్-19 కేసు... భారత్‌లో 30కి పెరిగిన బాధితుల సంఖ్య
- వెనెజ్వెలా: మహిళలు ఒక్కొక్కరు ఆరుగురు పిల్లల్ని కనాలని చెప్పిన అధ్యక్షుడు మదురో
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









