ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
భారత ప్రభుత్వం ఈమధ్య 17వ శతాబ్దం నాటి మొఘల్ యువరాజు దారా షికోహ్ సమాధి కోసం వెతుకుతోంది.
దారా షికోహ్ మృతదేహాన్ని దిల్లీలోని హుమయూన్ సమాధికి దగ్గరలో ఎక్కడో ఖననం చేసినట్లు మొఘల్ చక్రవర్తి షాజహాన్ కాలం నాటి చరిత్రకారుల రచనలు, కొన్ని పత్రాల్లో ఉన్న వివరాలను బట్టి తెలుస్తోంది.
దారా సమాధిని గుర్తించడానికి మోదీ ప్రభుత్వం పురాతత్వ వేత్తలతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. సాహిత్యం, కళ, వాస్తుకళను బట్టి వారు ఆయన సమాధిని గుర్తించే పనిలో ఉన్నారు.
దారా షికోహ్ షాజహాన్ కొడుకులందరిలో పెద్దవాడు. మొఘల్ సంప్రదాయం ప్రకారం తండ్రి తర్వాత సింహాసనానికి వారసుడు.
కానీ, షాజహాన్ అనారోగ్యానికి గురవడంతో ఆయన రెండో కొడుకు ఔరంగజేబ్ తన తండ్రిని గద్దె దించి, ఆగ్రా జైలులో బంధించాడు.
తర్వాత ఔరంగజేబ్ తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. సింహాసనం కోసం జరిగిన యుద్దంలో దారా షికోహ్‌ను ఓడించి కారాగారంలో పడేశాడు.
అప్పుడు దారా షికోహ్ ఏ పరిస్థితిలో ఉన్నారో షాజహాన్ పాలనలోని చరిత్రకారుడు మొహమ్మద్ సాలెహ్ కంబోహ్ లాహౌరీ తన 'షాజహాన్ నామా' పుస్తకంలో వివరించారు.
"యువరాజు దారా షికోహ్‌ను బంధించి, దిల్లీకి తీసుకువచ్చినపుడు, ఆయన శరీరంపై నలిగి, మాసిన బట్టలు ఉన్నాయి. అక్కడి నుంచి ఆయన్ను చాలా దారుణమైన పరిస్థితుల్లో, ఒక తిరుగుబాటుదారుడులా ఏనుగుపై ఎక్కించి ఖిజ్రాబాద్ తరలించారు. కొంతకాలం వరకూ ఆయన్ను ఒక ఇరుకైన, చీకటిగదిలో ఉంచారు. తర్వాత ఆయనను చంపేయాలని ఆదేశించారు" అని చెప్పారు.
"దారాను చంపడానికి కారాగారంలోకి వెళ్లిన కొందరు క్షణంలో ఆయన తల నరికి హత్య చేశారు. తర్వాత మాసిపోయి, రక్తంతో తడిచిన అవే బట్టలతో దారా మృతదేహాన్ని హుమయూన్ సమాధిలో ఖననం చేశారు" అని రాశారు.
అదే కాలంలో ఉన్న మరో చరిత్రకారుడు మొహమ్మద్ కాజిమ్ ఇబ్నే మొహమ్మద్ అమీన్ మున్షీ కూడా తన 'ఆలంగీర్ నామా' పుస్తకంలో దారా షికోహ్ సమాధి గురించి రాశారు.
"హుమయూన్ సమాధిలో అక్బర్ చక్రవర్తి కొడుకులు డానియాల్, మురాద్‌ను ఖననం చేసిన గుమ్మటం కిందే దారాను కూడా సమధి చేశారు. తర్వాత అక్కడ తైమూర్ వంశంలోని మిగతా యువరాజులు, యువరాణుల మృతదేహాలను కూడా ఖననం చేశారు" అని తెలిపారు.
పాకిస్తాన్ విద్యావేత్త అహ్మద్ నబీ ఖాన్ 1969లో దీవాన్-ఎ-దారా షికోహ్ పేరుతో లాహోర్‌లో ఒక పరిశోధనా పత్రం సమర్పించారు. అందులో దారా సమాధికి సంబంధించిన ఒక ఫొటో ప్రచురించారు. అందులోని వివరాల ప్రకారం, అక్కడ వాయవ్యంలో ఉన్న మూడు సమాధులు పురుషులవి, వాటిలో తలుపు వైపు ఉన్న సమాధి దారా షికోహ్‌ది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)