ఇథియోపియా అంతర్యుద్ధానికి విరామం, టిగ్రే సంఘర్షణలో శాంతి ఒప్పందం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సిసీలియా మెకాలే, అన్నీ సాయ్
- హోదా, బీబీసీ న్యూస్
ఇథియోపియాలో వేలాది మరణాలకు కారణమైన రెండేళ్ల అంతర్యుద్ధాన్ని ఆపాలని ప్రభుత్వం, టిగ్రే బలగాలు శాంతి ఒప్పందం చేసుకున్నాయి.
ఇది 'నవోదయం' అని ఆఫ్రికన్ యూనియన్ అభివర్ణించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.
కరవుతో తల్లడిల్లుతున్న ఇథియోపియాలో ప్రభుత్వానికి, టిగ్రే బలగాలకు మధ్య జరిగిన ఈ శాంతి ఒప్పందం ఫలితంగా.. అంతర్జాతీయ సహాయ కార్యక్రమాలు పునరుద్ధరణ అయ్యే అవకాశముంది.
టిగ్రే ప్రాంతంలోని ఉత్తర భాగంలో దాదాపు 90 శాతం మంది ప్రజలకు ఆహార సహాయం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది.
ఈ ప్రాంతంలోని చిన్నారుల్లో మూడో వంతు మంది తీవ్ర పోషకాహారలోపంతో బాధపడుతున్నారు.
తాజా శాంతి ఒప్పందం గణనీయమైన ముందడుగే అయినప్పటికీ.. దీని విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
ఈ సంఘర్షణలో కాల్పుల విరమణ ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు ఈ ఏడాది ఆరంభంలో ఇరు పక్షాలూ కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని కొన్ని నెలలల్లోనే ఆగస్టులో ఉల్లంఘించారు.
అయితే ఈసారి ఈ ఒప్పందం మరికొంత ముందుకుసాగాయి. ఇథియోపియా ప్రభుత్వ అధికారులు, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (టీపీఎల్ఎఫ్) ప్రతినిధులు.. నిరాయుధీకరణ ప్రణాళికతో పాటు, సహాయ సరఫరాలు సహా కీలక సేవల పునరుద్ధరణ కోసం ఒప్పందంపై సంతకాలు చేశారు.
''ఇథియోపియాకు ఒకే ఒక్క జాతీయ భద్రతా దళం మాత్రమే ఉంది. టీపీఎల్ఎఫ్ తన బలగాలను నిరాయుధీకరించి, దేశ సైన్యంలో కలపాలని కీలక నిర్ణయం తీసుకుంది'' అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఒప్పందం చాలా విశిష్టమైనదని అభివర్ణించిన ప్రధానమంత్రి అబీయ్ అహ్మద్.. దీని అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఈ ఒప్పందానికి నైజీరియా మాజీ అధ్యక్షుడు ఒలుసెగున్ ఒబాసాన్జో మధ్యవర్తిత్వం వహించారు. వారం రోజుల పాటు దక్షిణాఫ్రికాలో చర్చల అనంతరం ఒప్పందం ఖరారైంది. ఇది శాంతి ప్రక్రియకు ఆరంభం మాత్రమేనని ఒబాసాన్జో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఈ ఒప్పందాన్ని ఆహ్వానించారు. ''ఈ సంఘర్షణలో నిజంగా బాధలుపడ్డ లక్షలాది మంది ఇథియోపియన్ పౌరులకు దీనిద్వారా కొంత ఊరట లభిస్తుందని ఆశిస్తున్నా'' అని చెప్పారు.
గత రెండేళ్లుగా టిగ్రేకు బయటి ప్రపంచంతో దాదాపు సంబంధాలు తెగిపోయాయి. ఆస్పత్రుల్లో మందులు అడుగంటాయి. విద్యుత్, ఫోన్, బ్యాంకింగ్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
ఇరుపక్షాలూ పరస్పరం జాతినిర్మూలన, లైంగిక హింస వంటి అకృత్యాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసుకున్నాయి.
ప్రభుత్వ బలగాలతో కలిసి పోరాడుతున్న ఎరిత్రియా సైన్యం దారుణ అకృత్యాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. కాల్పుల విరమణ చర్చల్లో ఎరిత్రియా ప్రతినిధులు పాల్గొనలేదని కొందరు పరిశీలకులు ఉటంకిస్తున్నారు.

దాదాపు రెండేళ్ల కిందట 2020 నవంబర్ 4వ తేదీన.. టిగ్రేలో అధికారంలో ఉన్న టీపీఎల్ఎఫ్‌కు విధేయంగా ఉండే బలగాలు మిలటరీ బారాక్‌లను స్వాధీనం చేసుకోవటంతో ఈ అంతర్యుద్ధం మొదలైంది. దీంతో ఇథియోపియా సైన్యం టిగ్రే ప్రాంతాన్ని దిగ్బంధించింది. ఈ పోరులో ఇథియోపియా సైన్యాన్ని టిగ్రే ప్రాంతం నుంచి దాదాపుగా తరిమివేశారు.
ఈ సంఘర్షణతో.. ఇథియోపియాలో 2018లో అబీయ్ అహ్మద్ ప్రధానమంత్రి కాకముందు వరకూ దాదాపు రెండు దశాబ్దాల పాటు దేశంలో ప్రాబల్యం చాటుకున్న టీపీఎల్‌ఎఫ్‌కు ఇథియోపియా ప్రభుత్వానికి మధ్య సంబంధాలు కుప్పకూలాయి.
ఇవి కూడా చదవండి:
- టూ ఫింగర్ టెస్టు అంటే ఏంటి, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయాలని ఆదేశించింది?
- ‘జూ’లో మనుషులను ఉంచి ప్రదర్శించేవారు.. ఐరోపా దేశాల ‘అమానుషం’
- కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలు
- గ్రహణం సమయంలో ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు? నమ్మకాలేంటి, వాటి శాస్త్రీయత ఎంత?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













