ఇథియోపియా: ‘యుద్ధ ట్యాంకులతో నగరాన్ని చుట్టుముడుతున్నాం... పౌరులని కూడా కనికరం చూపం’’

ఇథియోపియా

ఫొటో సోర్స్, Reuters

‘‘మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎవరిపైనా కనికరం చూపించం’’అంటూ టీగ్రే ప్రాంతవాసులను ఇథియోపియా సైన్యం హెచ్చరించింది. టీగ్రే రాజధాని మెకైలే దిశగా తమ సైన్యం ముందుకు వెళ్తోందని సైన్యం తెలిపింది.

‘‘యుద్ధ ట్యాంకులు, ఆయుధాలతో నగరం చుట్టుముట్టడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’అని సైనిక అధికార ప్రతినిధి కల్నల్ డెజెనే సెగాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ టీవీలో ప్రసారమయ్యాయి.

ఈ ప్రాంతంలో దాదాపు ఐదు లక్షల మంది నివసిస్తారు.

‘‘టీగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (టీపీఎల్‌ఎఫ్)కు దూరంగా ఉండండి.. లేకపోతే పౌరులైనా వదిలిపెట్టం’’అని సెగాయ్ హెచ్చరించారు.

ఇక్కడి పర్వత ప్రాంతాలు టీపీఎల్‌ఎఫ్ ఆధీనంలోనే ఉన్నాయి. సైన్యంతో సమర్థంగా పోరాడతామని, ఎవరూ భయపడొద్దని టీపీఎల్‌ఎఫ్ చెబుతోంది.

ప్రభుత్వ సైన్యం ముందుకు అడుగులు వేయకుండా తమ సైన్యం అడ్డుకుందని టీపీఎల్‌ఎఫ్ నాయకుడు డెబ్రెట్సన్ గెబ్రెమికెల్ రాయిటర్స్ వార్తా సంస్థకు చెప్పారు.

‘‘గత వారం రోజుల్లో దక్షిణం వైపుగా వారు కనీసం అంగుళం కూడా కదల్లేదు. వారు ఒకటి తర్వాత మరొకటిగా ప్రకటనలు చేస్తున్నారు. కానీ నిజం ఏమిటంటే.. వారు ముందుకు అడుగు వేయలేకపోతున్నారు’’అని ఆయన చెప్పారు.

ఇథియోపియా

ఫొటో సోర్స్, AFP

మరోవైపు టీగ్రే ప్రాంతంలోని కొన్ని ప్రధాన నగరాలను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది.

టీగ్రే ప్రాంతం నుంచి సమాచారం సేకరించడం చాలా కష్టం. ఇటు ప్రభుత్వం, అటు టీపీఎల్‌ఎఫ్ చేస్తున్న ప్రకటనల్లో ఏది నిజమో స్వతంత్రంగా తెలుసుకోవడం దాదాపుగా అసాధ్యమే. ఎందుకంటే, ఘర్షణలు మొదలైనప్పుడే ఇక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

గత మూడు వారాల్లో ప్రభుత్వ సైన్యం, టీగ్రే తిరుగుబాటుదారుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో వందల మంది ప్రజలు మరణించారు. మరోవైపు వేలమంది పొరుగునున్న సూడాన్‌కు తరలివెళ్లిపోయారు.

గత శుక్రవారం ఘర్షణలకు ముగింపు పలకడమే లక్ష్యంగా, ముగ్గురు మాజీ అధ్యక్షులు చర్చలకు రావాలని ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్షుడిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా పిలుపునిచ్చారు.

అయితే, ఈ ప్రతిపాదనను ఇథియోపియా తిరస్కరించింది. సైనిక చర్యలను చట్టాలను అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలుగా ఇథియోపియా చెబుతోంది.

ఇథియోపియా ప్రధాన మంత్రి అబి అహ్మద్‌కు సన్నిహితుడు మెమో మిహ్రెటు బీబీసీతో మాట్లాడారు. ‘‘మేం నేరస్థులతో చర్చలు జరపం. వారిని కోర్టుకు తీసుకెళ్లి బోనులో నిలబెడతాం’’అని ఆయన చెప్పారు.

ఇథియోపియా

ఇక్కడ ఏం జరుగుతోంది?

కేంద్ర ప్రభుత్వం, టీపీఎల్‌ఎఫ్‌ల మధ్య ఎప్పటినుంచో నడుస్తున్న ఉద్రిక్తతలే ఈ ఘర్షణలకు కారణం.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ గత జూన్‌లో జరగాల్సిన ఎన్నికలను అబి అమ్మద్ వాయిదా వేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వ చర్యలు అక్రమమని, వారికి ఆధిక్యంలేదని టీపీఎల్‌ఎఫ్ చెబుతోంది.

నవంబరు 4న టీపీఎల్‌ఎఫ్‌పై చర్యలకు ప్రధాన మంత్రి ఆదేశించారు. మెకైలేలోని సైనిక కేంద్రంపై టీపీఎల్‌ఎఫ్‌ తిరుగుబాటుదారులు దాడి చేశారని ఆయన చెప్పారు.

అయితే, మేం ఎలాంటి దాడులకూ తెగబడలేదని టీపీఎల్‌ఎఫ్‌ ఖండించింది.

టీపీఎల్‌ఎఫ్‌ సైన్యంలో దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. వీరిలో చాలా మంది పార్లమెంటరీ దళాల నుంచి వచ్చి చేరిన వారే.

అబి అమ్మద్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అబి అహ్మద్

విదేశీ నాయకుల పర్యటనల రద్దు

‘‘ఈ ఘర్షణల్లో ఆఫ్రికా నాయకులు కీలక పాత్ర పోషించే అవకాశముంది. వారు టీపీఎల్‌ఎఫ్‌ లొంగిపోయేలా ఒప్పించగలిగితే సైన్యం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు’’అని మెమో చెప్పారు.

ఘర్షణల నడుమ మొజాంబిక్, లిబేరియా, దక్షిణాఫ్రికా ప్రాంత నాయకుల టీగ్రే పర్యటనలను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.

ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో రవాణా, కమ్యూనికేషన్లు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.

టీగ్రే ప్రాంత ప్రజలకు ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సంస్థలు సాయం చేసేందుకు వీలు కల్పించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మెమో చెప్పారు.

ఇథియోపియా

ఫొటో సోర్స్, Reuters

పరిస్థితి ఎంత దారుణంగా ఉంది?

ఘర్షణలు జరుగుతున్న ప్రాంతంలోకి సహాయక సంస్థలు వెళ్లలేకపోతున్నాయి. అయితే నవంబరు మొదటివారం నుంచి ఇప్పటివరకు వేల మంది మరణించి ఉండొచ్చని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

దాదాపు 33 వేల మంది శరణార్థులు ఇప్పటికే సూడాన్‌కు వెళ్లిపోయారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే వచ్చే ఆరు నెలల్లో మరో రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తెలిపింది.

అమ్హారా ప్రాంతంలోని బహిర్ దర్ నగరంపై టీపీఎల్‌ఎఫ్‌ రాకెడ్ దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే, దాడిలో ఎవరూ మరణించలేదని అమ్హారా ప్రభుత్వం తెలిపింది.

అమ్హారా, టీగ్రేలకు ఎప్పటినుంచో సరిహద్దు వివాదాలున్నాయి. ఘర్షణలు ఇలానే కొనసాగితే, కేంద్ర సైన్యంతో కలిసి పోరాడేందుకు మా సైన్యాన్ని పంపిస్తామని అమ్హారా ప్రభుత్వం హెచ్చరించింది.

సూడాన్‌కు భారీగా శరణార్థులు తరలిరావడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. సూడాన్‌లో ఇప్పటికే లక్షల మంది వివిధ దేశాల నుంచి చేరారని, ఇంకా శరణార్థులు వచ్చి చేరితే దేశ సుస్థిరతకే ముప్పు పొంచివుందని తెలిపింది.

సూడాన్‌కు తరలివస్తున్న శరణార్థుల్లో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. వెంటనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే వేల మంది పౌరుల మరణాలను అడ్డుకోవచ్చని సహాయక సంస్థలు చెబుతున్నాయి.

ఇథియోపియా

ఫొటో సోర్స్, Getty Images

టీగ్రే నుంచి ఐదు విషయాలు

  • అక్సుమ్ సామ్యాజ్యానికి ఇది కేంద్రం. అతిగొప్ప ప్రాచీన సంస్కృల్లో ఒకటిగా దీనికి పేరుంది. రోమన్, పర్షియన్ సామ్రాజ్యాల సమయంలో ఇదొక శక్తిమంతమైన సామ్రాజ్యం.
  • అక్సుమ్ సామ్యాజ్య శిథిలాలను ఐక్యరాజ్యసమితి ప్రపంచ వారసత్వ స్థలాల్లో చేర్చారు. 1 నుంచి 13 శతాబ్దాల మధ్య విలసిల్లిన ఈ సామ్రాజ్యంలో పెద్దపెద్ద కోటలు, కట్టడాలు, రాజుల సమాధులు, పెద్దపెద్ద చర్చలు ఉండేవి.
  • టీగ్రేలోని చాలా మంది ప్రజలు ఇథియోపియన్ ఆర్థోడాక్స్ క్రీస్టియన్లు. 1600 ఏళ్ల నుంచి ఇక్కడ క్రైస్తవులు నివసిస్తున్నారు.
  • ఇక్కడి ప్రజల్లో ఎక్కువమంది టిగ్రినాయను మాట్లడారు. సెమిటిక్ భాషల్లో ఇదీ ఒకటి. వీటిని ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల మంది మాట్లాడతారు.
  • ఇక్కడి వాణిజ్య పంటగా నువ్వుల్ని పండిస్తారు. వీటిని అమెరికా, చైనా, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)