ఇథియోపియా: ఇక్కడ యువకులు తమ పేర్లను ఎందుకు మార్చుకుంటున్నారు?

ఇథియోపియా

ఫొటో సోర్స్, AFP

ఇథియోపియాలోని ఒరొమో తెగలో చాలా మంది తమ పేర్లను మార్చుకుంటున్నారు. తమ తెగ ప్రతిష్ఠను పేర్లలో ప్రతిబించేలా వారు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.

అలా పేరు మార్చుకున్న వారిలో 40ఏళ్ల మోతీ బేగి ఒకరు. ఇదివరకు ఆయన పేరు డెరెజే బేగి.

డెరెజే అనేది అమ్హారిక్ పదం. దీనికి ‘‘వృద్ధి చెందినది’’ అనే అర్థముంది. మోతీ అనేది అఫాన్ ఒరొమో పదం. దీని అర్థం ‘‘రాజు’’.

ఇథియోపియాలో మొదటి పేర్లు చాలా ముఖ్యమైనవి. రెండో పేరుగా ఇక్కడ ఇంటి పేరుకు బదులుగా తండ్రి మొదటి పేరును ఉపయోగిస్తారు.

తాజాగా మోతీతోపాటు ఆయన ఏడుగురు స్నేహితులు కూడా ఒరొమో జాతి ప్రతిష్ఠను ఇనుమడించేలా పేర్లు మార్చుకున్నారు.

శతాబ్దాలుగా ఒరొమో తెగ భాష ‘‘అఫాన్ ఒరొమో’’ను ఇక్కడి పాలకులు చిన్న చూపు చూసేవారు. ముఖ్యంగా ఇక్కడ రాజకీయాల్లో ఉత్తర భాగంలోని అమ్హారిక్ భాష మాట్లాడేవారి ఆధిపత్యం ఎక్కువగా ఉండేది.

ఇథియోపియా

ఫొటో సోర్స్, Getty Images

ఒక దేశంగా మార్చేందుకు..

భిన్న ప్రాంతాలను కలిపి దేశంగా మార్చే ప్రక్రియలో భాగంగా అమ్హారిక్‌ను దేశ భాషగా ఇథియోపియా పాలకులు ప్రకటించారు.

దీంతో చాలా మంది అమ్హారిక్ పేర్లను పెట్టుకోవడం మొదలుపెట్టారు. అయితే, 1991 తర్వాత అధికారం చేతులు మారడంతో పరిస్థితుల్లోనూ మార్పు వచ్చింది. అబీ అహ్మద్‌ ప్రధానిగా మారడంలో యువత ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం అదే యువత పేర్లను మార్చుకుంటూ తమ జాతి ప్రతిష్ఠకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

2018లో అబీ అహ్మద్ అధికారంలోకి వచ్చారు. ఆయనే తొలి ఒరొమో ప్రధాన మంత్రి.

‘‘ఒరొమో ప్రతిష్ఠను పెంచేలా మేం చేయగలిగే సులువైన మంచి పని మా పేర్లను మార్చుకోవడమే’’అని బీబీసీతో మోతీ చెప్పారు.

ఇథియోపియా

ఫొటో సోర్స్, Getty Images

కారణం ఏమిటి?

ఇటీవల 2,000 మంది వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఇథియోపియా అధికారులు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. అఫాన్ ఒరొమో మాట్లాడేవారు మాత్రమే దీనికి దరఖాస్తు చేయాలని సూచించారు.

దీంతో అఫాన్ ఒరొమో భాషకు చెందని వారి నుంచి పెద్దయెత్తున వ్యతిరేకత వ్యక్తమైంది.

ఆ నిరసనలు తనను రెచ్చగొట్టినట్లు అనిపించిందని మోతీ చెప్పారు. ‘‘ఒరొమో మాట్లాడే ఒరొమియాలోనే పుట్టి వారు ఇక్కడ భాషను నేర్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు’’అని ఆయన అన్నారు.

సంకుచిత, కుటిల బుద్ధికి ఆ నిరసనలు అద్దం పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

అందుకే ఒరొమో తెగ ప్రతిష్ఠను ప్రతిబింబించేలా తన పేరును మార్చుకున్నట్లు ఆయన వివరించారు.

మోతి బేగి

ఫొటో సోర్స్, Moti Begi

ఫొటో క్యాప్షన్, మోతి బేగి

ఒరొమో పేరు రాసేందుకు తిరస్కరణ

గత 30ఏళ్లలో ఇక్కడ పుట్టిన ఒరొమో పిల్లల్లో చాలా మందికి రెండు తెగల పేర్లను కలిపి పెట్టారు.

అయితే, ఇక్కడ మార్క్సిస్టు ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వాలు జాతుల భిన్నత్వానికి పెద్దపీట వేశారు. అమ్హారిక్ అధికార భాషగా కొనసాగించినప్పటికీ, మాతృభాషల్లో విద్యా బోధనకు కూడా అనుమతించారు.

ఫలితంగా ఒరొమో పిల్లలకు అఫాన్ ఒరొమో పేరుతోపాటు అమ్హారిక్ పేరు కూడా పెట్టడం మొదలుపెట్టారు.

30ఏళ్ల అబ్ది గమచుకు ‘‘గిర్మా’’అనే అమ్హారిక్ పేరు కూడా ఉండేది. దీనికి ‘‘వెలుగు’’ అనే అర్థముంది. అయితే, 2005లో అధికారికంగా అబ్ది గమచు అని పేరు మార్చుకున్నారు.

ఆయన పుట్టిన తర్వాత టీకాలు వేయించడానికి వెళ్లినప్పుడు అబ్ది (అఫాన్ ఒరొమోలో దీనికి ఆకాంక్ష అనే అర్థముంది) పేరును రాసేందుకు నర్సు నిరాకరించారు. దీంతో ఆయన తల్లి ‘‘గిర్మా’’ అనే పేరును రాయించారు.

‘‘అన్ని పత్రాల్లోనూ నాకు నచ్చిన పేరును మార్పించుకోవడంతో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా పేరు ఒరొమో తెగ ప్రతిష్ఠను ప్రతిబింబిస్తోంది’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ఇథియోపియా: యుద్ధం మిగిల్చిన విషాదం.. రోడ్లపై సగం కాలిన మృతదేహాలు

‘‘అప్పట్లో ప్రభుత్వం మారినప్పుడు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా నాకు అబ్ది అనే పేరుపెట్టారు’’అని ఆయన వివరించారు.

మరోవైపు ఇబిసా బయిస్సాది ఇదే పరిస్థితి. ఆయన అఫాన్ ఒరొమో భాషలో చాలా పుస్తకాలు రాశారు.

ఆయన మొదటి పేరు ఎండల్కచ్యూ. ఇది అమ్హారిక్‌ పేరు.

‘‘ఎండల్కచ్యూ’’ అంటే ‘‘వారు ఆజ్ఞాపించినది’’అనే అర్థముంది. మాజీ ప్రధాని హైలీ సెలస్సీకి విపరీత అభిమాని అయిన తన తండ్రి స్నేహితుడు ఆ పేరును సూచించినట్లు ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఇక్కడున్న పిల్లల్లో 40 శాతం మంది ఆకలితో అల్లాడుతున్నారు

అధికారిక పత్రాల్లో అన్నిచోట్లా ‘‘ఎండల్కచ్యూ’’ అనే పేరు ఉండేది. కానీ, అందరూ ఆయన్ను ఇబిసా అని పిలిచేవారు. దీనికి ఒరొమోలో ఆశీర్వాదం అనే అర్థముంది.

అయితే, పుస్తకాలతో ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన తర్వాత తన పేరుతోనే ఆయన రచనలు చేయడం మొదలుపెట్టారు. ‘‘నాకు నిజమైన గుర్తింపు ఒరొమో పేరుతోనే వస్తుంది’’అని ఆయన అన్నారు.

సమాజంలో తమకు, తమ భాషకు గుర్తింపు తీసుకురావడానికి తాము చేయాల్సిన సులువైన పని పేరు మార్చుకోవడమేనని మోతీ అంటున్నారు.

అమ్హారిక్ పేర్లను పూర్తిగా తొలగించడంతో తమ సంస్కృతీ, సంప్రదాయాలకు గుర్తింపు వస్తుందని ఆయన నమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)