మొజాంబిక్: మిలిటెంట్లు ‘పిల్లలను కూడా తల నరికి చంపుతున్నారు’

ఫొటో సోర్స్, RUI MUTEMBA/SAVE THE CHILDREN
మొజాంబిక్ లోని కాబో డెల్గాడో ప్రాంతంలో 11 సంవత్సరాల వయసున్న చిన్న పిల్లలను కూడా తల నరికి చంపేస్తున్నట్లు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సేవ్ ది చిల్డ్రన్ తెలిపింది.
తన కళ్ల ముందే తన 12 ఏళ్ల కొడుకును తల నరికి చంపేస్తుంటే.. తన మిగతా పిల్లలతో తను దాక్కున్నానని ఒక బిడ్డను కోల్పోయిన తల్లి ఈ సంస్థకు చెప్పారు.
ఈ ప్రాంతంలో 2017లో అంతర్గత పోరు మొదలైనప్పటి నుంచి 2,500 మందికి పైగా హత్యకు గురి కాగా 7,00,000 మందికి పైగా ఇళ్ళు వదిలి పారిపోయారు.
కాబో డెల్గాడో ప్రావిన్స్‌లో విద్రోహ చర్యలకు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో ప్రమేయం ఉన్న తీవ్రవాదులే కారణం అని చెబుతారు.
అయితే, ఈ దాడుల వెనకెవరున్నారో సేవ్ ది చిల్డ్రన్ నివేదికలో పేర్కొనలేదు. కానీ, టాంజానియా సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతం నుంచి నిరాశ్రయులైన వారు అక్కడ చూసిన భీకరమైన దృశ్యాల గురించి వివరించిన విషయాలను ఆ నివేదికలో రాశారు.

ఫొటో సోర్స్, AFP
వారేమి చెప్పారు?
ఒకామె తన పిల్లలతో కలిసి హతులకు కనిపించకుండా తన పెద్ద బిడ్డను తన కళ్లెదుటే తల నరికి చంపడాన్ని చూసినట్లు చెప్పారు. ఆమె పేరు వెల్లడించలేదు.
"ఆ రోజు రాత్రి మా గ్రామం పై దాడి చేసి మా ఇళ్లను కాల్చేశారు’’ అని ఆమె చెప్పారు.
"అదంతా మొదలయ్యేటప్పటికి నేను నా నలుగురు పిల్లలతో ఇంటి దగ్గరే ఉన్నాను. మేము అడవిలోకి పారిపోవాలని చూశాం. కానీ, వాళ్ళు నా పెద్ద కొడుకును తీసుకుని వెళ్లి తల నరికేశారు. మేమేమి చేయలేకపోయాము. మేము ఎదుర్కొంటే మమ్మల్ని కూడా చంపేసి ఉండేవారు" అని పేర్కొన్నారు.
మరొక మహిళ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఆమె మిగిలిన ముగ్గురు పిల్లలతో కలిసి పారిపోవలసి వచ్చింది.
"నా 11 సంవత్సరాల బిడ్డను చంపేశాక ఇక అక్కడ ఉండటం క్షేమం కాదని అనిపించింది" అని ఆమె చెప్పారు.
"ఇంకొక గ్రామంలో ఉన్న మా నాన్నగారి ఇంటికి వెళ్లాం. కానీ, కొన్ని రోజులకు అక్కడ కూడా దాడులు మొదలయ్యాయి" అని తెలిపారు.
ఈ హత్యలు మమ్మల్ని తీవ్రంగా కలచివేశాయి" అని సేవ్ ది చిల్డ్రన్ మొజాంబిక్ కంట్రీ డైరెక్టర్ ఛాన్స్ బ్రిగ్స్ చెప్పారు.
"నిర్వాసిత శిబిరాల్లో ఉన్న తల్లుల కథలు వింటూ మా సిబ్బంది ఏడుపు ఆపుకోలేకపోయారు" అని చెప్పారు.
"ఇది మాటల్లో చెప్పలేని క్రూరత్వం" అని ఎక్స్ట్రా జ్యూడిషియల్ ఎగ్జిక్యూషన్స్ యునైటెడ్ నేషన్స్ స్పెషల్ రిపోర్టర్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP
ఈ తీవ్రవాదులెవరు?
ఈ తిరుగుబాటుదారులను స్థానికంగా అల్ షబాబ్ అని అంటారు. అరబిక్ భాషలో అల్ షబాబ్ అంటే యువత అని అర్ధం.
దీనిని బట్టి చూస్తే ముస్లింలు అధికంగా ఉండే కాబో డెల్గాడో ప్రాంతంలోని నిరుద్యోగ యువత నుంచి మద్దతు పొందుతున్నారని అర్ధమవుతోంది.
సొమాలియాలో కూడా ఇలాంటి పేరుతోనే ఒక గ్రూపు ఒక దశాబ్ద కాలానికి పైగా ఉంది. ఆ సంస్థ తీవ్రవాద సంస్థ అల్-ఖైదాతో అనుబంధం కలిగి ఉండేది.
మొజాంబిక్ సంస్థ ఇస్లామిక్ ఉద్యమంతో అనుబంధం కలిగి ఉంది.
ఈ మిలిటెంట్లను మధ్య ఆఫ్రికాకు చెందినవారిగా ఇస్లామిక్ స్టేట్ పరిగణిస్తుంది.
కాబో డెల్గాడోలో మిలిటెంట్లు ఏకే 47 రైఫిళ్లు, రాకెట్ ప్రొపెల్లర్ గ్రెనేడ్లతో ఉన్న చిత్రాలను విడుదల చేశారు.
ఈ చిత్రాలు తీవ్రవాద నిరోధక నిపుణులను అప్రమత్తం చేశాయి.
అంతర్జాతీయ జిహాదీలు వారి లాభాల కోసం స్థానిక తిరుగుబాటులను అవకాశంగా తీసుకుంటున్నారని సూచన అందింది.

ఫొటో సోర్స్, AFP
ఈ తిరుగుబాటుదారులకు ఏం కావాలి?
ఈ తిరుగుబాటు మూలాలు సామాజిక, ఆర్ధిక బాధలలో దాగి ఉన్నాయని కొంత మంది విశ్లేషకులు భావిస్తారు.
ఈ ప్రాంతంలో ఉన్న కెంపులు, గ్యాస్ పరిశ్రమల వలన స్థానికులు లాభపడింది తక్కువే అని స్థానికులు ఫిర్యాదు చేస్తారు.
"ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని చెప్పడానికి మేము ఈ పట్టణాలను ఆక్రమిస్తాం. ఈ ప్రభుత్వం పేద వారిని అవమానపరిచి యజమానులకు లాభాలను ఇస్తోంది" అని ఒక తీవ్రవాద నాయకుడు విడుదల చేసిన వీడియోలో ప్రకటించుకున్నారు.
ఆయన ఇస్లాం గురించి వక్కాణిస్తూ ఇస్లామిక్ ప్రభుత్వ స్థాపన చేయాలనే తన కోరికను వ్యక్తం చేశారు. మొజాంబిక్ మిలిటరీ హింస పెడుతుందని ఆరోపిస్తూ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని పదే పదే అన్నారు.
వారి ఉద్దేశాలేమిటో కచ్చితంగా చెప్పడం కష్టమని బ్రిగ్స్ బీబీసీకి చెప్పారు.
"వారు యువతను తమ గ్రూపుల్లోకి చేరాలని ఒత్తిడి చేస్తారు. ఎవరైనా తిరగబడితే, వారి తల నరికేస్తారు. చివరకు ఏమవుతుందో చూడటం చాలా కష్టంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.
మల్టీ నేషనల్ సంస్థలు ఆ ప్రాంతంలో ఉన్న ఖనిజ, ఇంధన వనరులపై ఆధిపత్యం సాధించడం వల్లే ఇక్కడ యుద్ధం జరుగుతోందని ఆ ప్రాంతాన్ని గత సంవత్సరం సందర్శించిన సౌత్ ఆఫ్రికన్ బిషప్ కాన్ఫరెన్స్ చెప్పింది.

కాబో డెల్గాడో ఎలా ఉంటుంది?
మొజాంబిక్‌లో ఉన్న అత్యంత పేద ప్రాంతాల్లో కాబో డెల్గాడో ఒకటి. ఇక్కడ నిరక్షరాస్యత, నిరుద్యోగం తీవ్ర స్థాయిల్లో ఉన్నాయి.
ఈ ప్రాంతంలో 2009 -10 ప్రాంతంలో భారీ కెంపుల నిక్షేపాలు, ఇంధన వనరులు ఉన్నట్లు కనుగొన్నారు.
దీంతో ఈ ప్రాంతంలో ఉద్యోగావకాశాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయేమోనని ఆశించారు. కానీ, వారి ఆశలు కుప్పకూలిపోయాయి.
1975 నుంచి మొజాంబిక్‌ని పరిపాలిస్తున్న ఫ్రెలిమో పార్టీకి చెందిన అత్యున్నత వర్గాల వారు దీని నుంచి వచ్చే లాభాలను తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
విదేశాల్లో కొత్తగా ఇస్లాం శిక్షణ పొందిన తూర్పు ఆఫ్రికా దేశస్థులు, మొజాంబిక్ ప్రజలు అక్కడ మసీదులు నిర్మించి స్థానిక ఇమామ్‌లు ఫ్రె లిమో పార్టీతో జత కట్టి డబ్బు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు.
ఇందులో కొన్ని కొత్త మసీదులు స్థానికులకు కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం ప్రారంభించాయి.
షరియా అధీనంలో సమాజంలో న్యాయం జరుగుతుందని వాదించడం మొదలు పెట్టారు. ఇది స్థానిక యువతను ఆకర్షించింది. వీరే ఇప్పుడు తిరుగుబాటులకు వెన్నెముకగా మారారు.

ఫొటో సోర్స్, AFP
ప్రభుత్వం ఏమంటోంది?
సైనికపరంగా ఒక పరిష్కారాన్ని వెతకాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కానీ, తిరుగుబాటుదారులను తిప్పికొట్టడానికి ఆ దేశపు సైన్యం దగ్గర తగిన నైపుణ్యం లేదు.
అమెరికా సేనలు మొజాంబిక్ సైన్యానికి రెండు నెలల పాటు శిక్షణ ఇవ్వడంతో పాటు తగిన వైద్య, సమాచార పరికరాలను సరఫరా చేస్తామని అమెరికా ఎంబసీ అధికారులు చెప్పారు.
యూరోపియన్ యూనియన్ కూడా వారికి శిక్షణ ఇస్తామని గత సంవత్సరమే ప్రకటించింది.
అయితే, మొజాంబిక్ తీవ్రవాదులతో పోరాడేందుకు రష్యా, సౌత్ఆఫ్రికాకు చెందిన సైనికులను రప్పించిందని వార్తలు వచ్చాయి.
కానీ, తిరుగుబాటుదారుల చేతుల్లో ఓటమి చవి చూసి రష్యా సేనలు వెనుతిరిగాయి.
గత సంవత్సరం తీవ్రవాదులు కొంత కాలం పాటు మొకిం బోవాడా ప్రయ్యా మరో ముఖ్య పట్టణం కిస్సాన్గాను స్వాధీనం చేసుకున్నారు. కానీ, ప్రస్తుతం అది తిరుగుబాటుదారుల స్వాధీనంలో లేదు.
గత సంవత్సరం ఇంధనం సమృద్ధిగా ఉండే ప్రాంతం త్వారాలో చాలా సరిహద్దు దాడులు కూడా చోటు చేసుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వూహాన్లో కోవిడ్-19 విజృంభణకు ఏడాది: కరోనావైరస్పై చైనా విజయం సాధించిందా? లేక నిజాలను దాచిపెడుతోందా?
- అశోక్ గజపతి రాజు ఇంటర్వ్యూ: ‘రాజకీయాలు దిగజారాయని మనం దిగజారకూడదు’
- సింగర్ సునీత వివాహం: మహిళలు రెండో పెళ్లి చేసుకోవడం తప్పా
- అతి సాధారణ మహిళలు నాజీ క్యాంపుల్లో ‘రాక్షసుల్లా’ ఎలా మారారు?
- భారత్‌ను పొగిడిన పాకిస్తానీ టీవీ ప్రజెంటర్ - దేశద్రోహి అంటున్న నెటిజన్లు.. సమర్థిస్తున్న సెలబ్రిటీలు
- ఇస్లామిక్ స్టేట్: పాకిస్తాన్ నుంచి సిరియాలోని మిలిటెంట్లకు నిధులు ఎలా వెళ్తున్నాయి?
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సిరాజ్: తండ్రి కల నెరవేర్చాడు.. కానీ చూసి సంతోషించడానికి ఆ తండ్రి ఇప్పుడు లేరు
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





