తెలంగాణ రైతు ఆత్మహత్య: ‘‘చనిపోవాలనుకున్నోడే వ్యవసాయం చేయాలి, నా దృష్టిలో..’’

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ‘చనిపోవాలనుకున్నోడే వ్యవసాయం చేయాలి, నా దృష్టిలో..”’
  • రిపోర్టర్ - సురేఖ అబ్బూరి
  • కెమెరా - సూర్యారెడ్డి
  • ఎడిటింగ్ - సంగీతం ప్రభాకర్

తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివపురం గ్రామానికి చెందిన రైతు బేతల్లి కుమార్ నవంబర్ 30వ తేదీన పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చేతికొచ్చిన పంటను కొనేవాళ్లు లేక తాను పోగు చేసిన వడ్ల కుప్పపైనే ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఆయన భార్య, ఇద్దరు ఆడ పిల్లలు దిక్కు తోచని స్థితిలో పడ్డారు.

తన సొంత భూమి రెండెకరాలతో పాటు కౌలుకు తీసుకున్న ఆరు ఎకరాల భూమిలో వరి పండిచారు కుమార్. ఈ పంటను అమ్మి, కొన్నైనా పాత అప్పులు తీర్చవచ్చని అనుకున్నారు. కనీసం కౌలుకు తీసుకున్న భూమిలో పండిన ధాన్యమైనా సమయానికి అమ్ముడైతే ఎంతో కొంత ఊరట కలిగి ఉండేది. కానీ కౌలు భూముల్లో పండిన ధాన్యాన్ని కొనేవాళ్లు లేక, సొంత భూముల్లో పండిన పంటను కోసే పరిస్థితి లేక ఎటూ తోచని దుస్థితి నెలకొంది. దీనికి తోడు పాత అప్పులు ఆయన్ను ఆత్మహత్యకు పురికొల్పేలా చేశాయన్నది కుటుంబ సభ్యలు మాట.

"కౌలుకు తీసుకొని పండించిన ధాన్యం అలానే ఉంది, రెండు ఎకరాల భూమిలో ఉన్న పంట ఇంకా అసలు కోయనే లేదు. ఇప్పుడు ఎవరు చేస్తారు. నాకు ఏమి తెలియదు వాటి పనులు. పంట పనులు మొదలు పెట్టాలి అంటే అప్పు ... పంట చేతికి వచ్చే దాక అప్పు, పంట వచ్చాక అప్పులు తీర్చుకోవడం. సరిపోతే ఓకే, సరిపోకపోతే మళ్లీ వడ్డీకి రాసుకోవడమే. ఇవన్నీ ఆలోచించే.. ఉన్నా వేస్ట్ అనుకున్నాడేమో. పొద్దున్నే లేస్తే ఇదే రొదన నాకు అనుకున్నాడు గావొచ్చు. ఇట్లా వెళ్లి పోయాడు" అని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుమార్‌ భార్య బేతల్లి రాణి బీబీసీతో అన్నారు.

కుమార్ కుమార్తె అఖిల
ఫొటో క్యాప్షన్, కుమార్ కుమార్తె అఖిల

తన తండ్రి ఎప్పుడూ ఆర్థిక సమస్యల గురించి చెప్పలేదని కుమార్ కుమార్తె అఖిల బీబీసీతో అన్నారు. ఆమెకు నర్సింగ్‌ కోర్సులో సీటు వచ్చింది. కానీ తండ్రి మరణంతో ఆమె చదువు సందిగ్దంలో పడింది.

" ఫీజు వచ్చేసి ఇయర్‌కి 40 వేలు మేడమ్. ఇప్పుడు కాలేజీకి ఎల్లాల్సి ఉండె. పంపిస్తా బిడ్డా నిన్ను అన్నాడు. ఇట్లా అయిపోయింది. ఇంగ నన్ను చదివిపిచ్చేవాళ్లు కూడా లేరు ఎవరూ. మస్తు చూసుకునేది మేడమ్ మమ్ముల్ని. ఆడపిల్లల్లా మాత్రం ఎప్పుడూ చూళ్లేదు. మంచిగ చూసుకునేది మా డాడీ .." అంటూ ఆమె తన దీనావస్థ చెప్పుకున్నారు.

ఊరంతా రైతులే.. అందరూ సాగు చేసేది వరే..

3 - 4 తరాలుగా శివపురంలోనే ఉంటున్నా తాము సాగు చేస్తున్న భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదని, దీంతో తమకు ప్రభుత్వ సాయం అందటం లేదని చెబుతున్నారు స్థానిక రైతులు.

శివపురం గ్రామంలో దాదాపు 250 కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ రైతు ఉన్నారు. అంతా వరే పండిస్తారు.

" చాలా ఇబ్బంది కదా మేడమ్... (ధాన్యం) కొనకుంటే. అన్నింటికాడా అప్పే.. పట్టగేర్ కాడ అప్పే, ట్రాక్టర్ కాడ అప్పే, పరదాలు తెస్తాం మేడమ్, కిరాయికని.. ఒక్కో పరదాకి 20 రూపాయలు (రోజుకు). ఆడా ఇబ్బందే.. వాళ్లూ డబ్బులు అడుగుతూనే ఉంటరు. నానారకాలుగా మేడమ్.. ఆ డబ్బులు (ధాన్యం అమ్మిన తర్వాత వచ్చే డబ్బులు) పంచేయడమే తప్ప, ఒకవేళ కరెక్ట్‌గా వస్తే ఏమో చెప్పలేం. రాకుంటే వాళ్లకాడ కూడా వడ్డీకి రాసుకోవడమో, సగం కట్టి, సగం ఆపుకోవడమో. ఎట్నోగట్టా నడుస్తా ఉంది. దాన్నే రొటేషన్ చేసుకుంటూ రావడం, అంతే. వ్యవసాయం తప్ప ఇంకోటి లేదు కదా. 40 క్వింటాళ్లలో 4 క్వింటాలు పోతే ఇంకేముంటుంది మేడమ్. కష్టమది. వ్యవసాయం చేయడం అనేది ఈ రోజులల్ల వేస్ట్ మేడమ్. వ్యవసాయం చేయొద్దు. వ్యవసాయం చేస్తే చచ్చిపోవడం తప్ప ఇంకో మార్గం అనేది లేదు. చనిపోవాలనుకున్నోడే వ్యవసాయం చేయాలి, నా దృష్టిలో.." అని విష్ణు అనే రైతు అన్నారు.

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు..

NCRB తాజా నివేదిక ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన రైతు ఆత్మహత్యల సంఖ్య 7409.

అయితే గత మూడేళ్లుగా రైతుల ఆత్మహత్యలు తగ్గుతూ వస్తున్నట్టు NCRB వివరాల చెబుతున్నాయి.

ఈ ఏడాది ఇప్పటి వరకు 700 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నది రైతు సంఘాల అంచనా. బలవంతంగా తనువు చాలిస్తున్న వారిలో ఎక్కువమంది కౌలు రైతులే అని రైతు సంఘాలు చెబుతున్నాయి.

సరైన సమయంలో ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడం వల్ల రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనను స్థానిక ఎమ్మార్వో సయ్యద్ సర్వర్ వద్ద బీబీసీ ప్రస్తావించింది.

వరిలో ఇంకా తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్లే కొనుగోళ్లలో ఆలస్యం అవుతోందని ఎమ్మార్వో చెప్పారు. చాలా ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేస్తున్నప్పటికీ అసైన్డ్ కమిటీ సమావేశం కాకపోవడం వల్లే వాళ్లకు పట్టాలు ఇవ్వలేదని తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు బేతల్లి కుమార్‌ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని ఎమ్మార్వో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)