3 లక్షల రూపాయల విలువైన డబ్బు తినేసిన పెంపుడు కుక్క

- రచయిత, క్లోయ్ కిమ్
- హోదా, బీబీసీ న్యూస్
ఆకలితో ఉన్న ఒక కుక్క ఇంటి యజమానికి చెందిన 4 వేల డాలర్లను అంటే సుమారు రూ.3 లక్షలకు పైగా నగదును హాంఫట్ చేసేసింది.
పెన్సిల్వేనియాలో ఓ వ్యక్తి కాంట్రాక్టర్‌కు ఇవ్వడానికి కవర్‌లో ఉంచిన డబ్బును ఆయన పెంచుకుంటున్న గోల్డెన్‌డూడుల్ రకం కుక్క సెసిల్ నమిలి తినేసింది.
ఈ వీడియో వైరల్‌గా మారింది.
సెసిల్ తిని కక్కేసిన చిరిగిపోయిన నోట్లను ఇంటి యజమానులు క్లేటన్, క్యారీ లాలు ఒక దగ్గరకు చేర్చారు.
సెసిల్ నమిలేసిన 4 వేల డాలర్ల నగదులో చాలావరకు వారు తిరిగి అతికినా 450 డాలర్లను మాత్రం రికవరీ చేసుకోలేకపోయారు.
కరెన్సీ నోట్లను తిన్న ఈ కుక్క ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఫర్వాలేదని పశు వైద్యులు చెప్పారు.

ఫొటో సోర్స్, CLAYTON AND CARRIE LAW
డిసెంబర్ ప్రారంభంలో 4 వేల డాలర్ల నగదును ఒక కవర్లో పెట్టి పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో ఉన్న తమ ఇంటి కిచెన్‌లో దాచి ఉంచారు క్లేటన్ లా.
తమ ఇంటికి కంచె వేసేందుకు కాంట్రాక్టర్‌కు క్లేటన్ లా, క్యారీలు 4 వేల డాలర్లను నగదు రూపంలో చెల్లించాల్సి ఉంది.
ఆ డబ్బును కిచెన్‌లో పెట్టిన 30 నిమిషాల తర్వాత జరిగిన సంఘటనను చూసి వారు ఆశ్చర్యపోయారు.
వారు ప్రేమగా పెంచుకుంటోన్న కుక్క ఈ డబ్బులను తింటూ కనిపించింది. కిచెన్‌లో ప్రతి దగ్గర ముక్కముక్కలైన కరెన్సీ పేపర్లు కనిపించాయి.
‘‘క్లేటన్ నన్ను గట్టిగా పిలిచాడు. సెసిల్ 4 వేల డాలర్లను తినేస్తోంది! అంటూ అరిచాడు’’ అని పిట్స్‌బర్గ్ సిటీ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యారీ లా చెప్పారు.
‘‘నేను దాన్ని వినకూడదని అనుకున్నాను. నాకు గుండెపోటు వచ్చినంత పనైంది’’ అని చెప్పారు.
సెసిల్ చాలా తెలివి తక్కువ కుక్క అని వాషింగ్టన్ పోస్టుతో మాట్లాడేటప్పుడు క్యారీ లా అన్నారు. ఎందుకంటే టేబుల్‌పై మాంసం ముక్క పెట్టి వెళ్లినా కూడా అసలు ముట్టుకునేది కాదన్నారు.
దానికి తినాలన్న ఆసక్తి ఉండదని క్యారీ లా వాషింగ్టన్ పోస్టుతో మాట్లాడేటప్పుడు తెలిపారు. కానీ, డబ్బును చూడగానే అది పిచ్చిది అయిపోయిందని అన్నారు.

ఫొటో సోర్స్, CLAYTON AND CARRIE LAW
సెసిల్ డబ్బు కట్టలను తిని కక్కుకోవడంతో దానికి ఏదైనా వైద్య చికిత్స అవసరమేమోనని వెంటనే పశువైద్యున్ని పిలిపించారు. సెసిల్ పెద్ద కుక్క కావడంతో, ఇంట్లోనే దాన్ని చూడాల్సి వచ్చింది.
తమ కుక్క ముక్కలు ముక్కలు చేసిన నోట్లను కలిపేందుకు ఈ జంట నానాపాట్లు పడ్డారు. ఇదొక జిగ్‌సా పజిల్ మాదిరిగానే వారికి అనిపించింది.
ఈ పజిల్‌ను పూరించడాన్ని మొదలు పెట్టడానికి ముందు, సెసిల్ తిన్న నగదును కక్కే దాకా వారు వేచిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత వాటన్నంతా ఒక దగ్గర పేర్చారు.
‘‘యుటిలిటీ సింక్ వద్దకు వెళ్లినప్పుడు, అక్కడ బాగా దుర్వాసన వచ్చినట్లు’’ క్యారీ తెలిపారు.
చిరిగిపోయిన 50 డాలర్లు, 100 డాలర్ల బిల్లును మెల్లమెల్లగా టేప్ ద్వారా అంటించేందుకు ప్రయత్నించారు ఆ జంట. కరెన్సీ నోట్లకు ఇరు వైపులా ఉన్న సీరియల్ నెంబర్ల ప్రకారం వాటిని అమర్చాల్సి ఉంది. అప్పుడే బ్యాంకులు వాటిని తీసుకుని, కొత్త నోట్లను ఇస్తాయి.
చాలా వరకు నోట్లను బ్యాంకు తీసుకుంది. కానీ, 450 డాలర్లను మాత్రం ఆ జంట రికవరీ చేసుకోలేకపోయింది. ఇలాంటి రకమైన సంఘటనలు చాలా సాధారణంగా జరుగుతుంటాయన్నారు.
ఇలాంటి ఒక సంఘటనే 2022లో జరిగిందని న్యూస్‌వీక్ రిపోర్టు చేసింది. ఫ్లోరిడాలోని ఒక మహిళకు చెందిన లాబ్రాడార్ 2 వేల డాలర్ల నగదును తినేసింది. ఈ సంఘటన వీడియో ఆ డాగ్‌ను ఇంటర్నెట్ స్టార్ చేయగా.. ఆ యజమానికి మాత్రం కంటనీరు తెప్పించింది.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర కొరియా: కిమ్ వారసత్వాన్ని ఎవరు దక్కించుకుంటారో తెలిసిందన్న సౌత్ కొరియా స్పై ఏజెన్సీ.. ఇంతకీ ఎవరా లీడర్?
- ఈడీ-సీబీఐ: బీజేపీలో చేరితే కేసులు ఉండవా, ప్రతిపక్షాల ఆరోపణ నిజమేనా?
- చిన్న వజ్రం కోసం వెతుకుతున్న నిరుపేద కుర్రాళ్లకు రూ. కోట్ల విలువైన డైమండ్ కనిపించింది...ఆ తర్వాత వారికి ఏమైంది?
- కెమెరాకు చిక్కిన సగం ఆడ, సగం మగ పక్షి ఇది....
- అయోధ్య: రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళడం వల్ల కాంగ్రెస్‌కు లాభమా, నష్టమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














