ప్రపంచ దేశాలపై కొత్తగా 10 శాతం సుంకాలను ప్రకటించిన ట్రంప్, భారత్ పరిస్థితేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నటాలీ షెర్మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
ప్రపంచ దేశాల నుంచి అమెరికా చేసుకునే దిగుమతులపై కొత్తగా 10 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. సుప్రీంకోర్టు కొట్టివేసిన మునుపటి సుంకాల స్థానంలో ఇది అమలవుతుందని తెలిపారు.
కిందటేడాది శ్వేతసౌధం ప్రకటించిన సుంకాలను అమెరికా సుప్రీం కోర్టు కొట్టివేసిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ సుంకాలు ప్రకటించారు.
అత్యవసర పరిస్థితుల కోసం ఉద్దేశించిన చట్టాన్ని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా సుంకాలు విధించడం అధ్యక్షుడు తన అధికార పరిధిని అతిక్రమించడమేనని 6 - 3 సభ్యుల మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
దీంతో, కోర్టు నిర్ణయాన్ని 'భయంకరమైనది'గా ట్రంప్ అభివర్ణించారు. తన వాణిజ్య విధానాన్ని తిరస్కరించిన న్యాయమూర్తులను విమర్శించారాయన.
సుంకాలను సవాలు చేసిన వ్యాపారులు, అమెరికా రాష్ట్రాలకు ఈ సుప్రీం తీర్పు భారీ విజయం. వారు ఇప్పుడు సుంకాల రూపంలో చెల్లించిన బిలియన్ డాలర్లను తిరిగి పొందే అవకాశముంది. అయితే, ఈ తీర్పు ప్రపంచ వాణిజ్యంలో కొత్త అనిశ్చితిని కూడా సృష్టించింది.
శుక్రవారం వైట్‌హౌస్‌లో డోనల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, కంపెనీలు తమ డబ్బును అంత సులభంగా తిరిగి పొందకపోవచ్చని, ఈ సమస్య చాలా సంవత్సరాలు కోర్టులో కొనసాగ వచ్చని అభిప్రాయపడ్డారు.
అమెరికాకు మరిన్ని పెట్టుబడులు, తయారీ రంగానికి ఊతమివ్వడానికి సుంకాలను కొనసాగించేందుకు ఇతర చట్టాలను ఉపయోగిస్తానని చెప్పారాయన.
"మా దగ్గర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి - చాలా మంచి ప్రత్యామ్నాయాలు, వాటి కారణంగా మేం బలంగా మారతాం" అన్నారు ట్రంప్.
ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశం నుంచి వచ్చే వస్తువులపై ట్రంప్ గత సంవత్సరం ప్రకటించిన దిగుమతి పన్నులపై కోర్టులో కేసులున్నాయి. మొదట్లో మెక్సికో, కెనడా, చైనాలపై ట్రంప్ సుంకాలు విధించారు.
తరువాత, 2025 ఏప్రిల్‌లో "లిబరేషన్ డే" పేరుతో అనేక ఇతర వాణిజ్య భాగస్వాములకు సుంకాలు విస్తరించారు. దీనికోసం, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (ఐఈఈపీఏ-1977) వైట్‌హౌస్ ఉపయోగించింది. ఈ చట్టం జాతీయ అత్యవసర పరిస్థితిలో వాణిజ్యాన్ని నియంత్రించడానికి అధ్యక్షుడికి అనుమతిస్తుంది.


ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ అధికారమది..
ట్రంప్ విధించిన సుంకాలు అమెరికా, ఇతర దేశాలలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. అమెరికాలోకి వచ్చే వస్తువులపై అకస్మాత్తుగా అధిక పన్నులు చెల్లించాల్సి రావడంతో చాలా కంపెనీలు ఆందోళన చెందాయి. వినియోగదారుల ధరలు పెరుగుతాయనే భయాలు మొదలయ్యాయి.
దీంతో, పలు అమెరికా రాష్ట్రాలు, చిన్న వ్యాపారాల తరపు న్యాయవాదులు సుంకాలపై గత సంవత్సరం సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అధ్యక్షుడు ఉపయోగించిన చట్టంలో "సుంకాలు" అనే పదాన్ని కూడా ప్రస్తావించలేదని వాదించారు. పన్నులు నిర్ణయించే అధికారాన్ని కాంగ్రెస్ వదులుకోలేదని వారు చెప్పారు. ఇప్పటికే ఉన్న వాణిజ్య ఒప్పందాలు, సుంకాల నియమాలను రద్దు చేయడానికి లేదా విస్మరించడానికి అధ్యక్షుడికి అపరిమిత అధికారం ఇవ్వలేదని వాదించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. అధ్యక్షుడికి సుంకాలపై కాంగ్రెస్ అధికారం ఇవ్వాలనుకుంటే, అది స్పష్టంగా, కఠినమైన పరిమితులతో ఉండేదని తీర్పులో చెప్పారాయన.
సుంకాలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని కోర్టులోని ముగ్గురు లిబరల్ న్యాయమూర్తులు, ట్రంప్ నామినేట్ చేసిన మరో ఇద్దరు న్యాయమూర్తులు (అమీ కోనీ బారెట్, నీల్ గోర్సుచ్) సమర్థించారు. మరో ముగ్గురు కన్జర్వేటివ్ న్యాయమూర్తులు (క్లారెన్స్ థామస్, బ్రెట్ కవనాగ్, సామ్యూల్ అలిటో) ఈ నిర్ణయంతో విభేదించారు.
రిపబ్లికన్లు ఎంపిక చేసిన న్యాయమూర్తులు కూడా తన వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా ఓటు వేశారని, వారి పట్ల "చాలా సిగ్గుపడుతున్నట్లు" ట్రంప్ చెప్పారు. వారు 'మూర్ఖులు' అని, రాజ్యాంగానికి విధేయులుగా లేరని ఆరోపించారు.
సుప్రీం తీర్పుతో, అమెరికన్ స్టాక్ మార్కెట్లు లాభల బాటలో పయనించాయి. ఎస్ అండ్ పీ 500 దాదాపు 0.7 శాతం పెరిగింది. అనేక అమెరికా వ్యాపారాలు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని జాగ్రత్తగా స్వాగతించాయి.
తన ఛాతీ నుంచి 'భారీ బరువు' దించినట్టు ఉందని మిన్నెసోటాలోని బిజీ బేబీ యజమాని బెత్ బెనికే అన్నారు. ఆమె కంపెనీ చైనాలో ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ కేసులో పిటిషనర్, టెర్రీ ప్రెసిషన్ సైక్లింగ్ కంపెనీ సీఈవో నిక్ హోమ్ మాట్లాడుతూ, ఈ తీర్పు 'ఉపశమనం' కలిగించిందని అన్నారు.
"మా సరఫరా సాధారణ స్థితికి రావడానికి నెలలు పట్టవచ్చు. ప్రభుత్వం ఇప్పటికే వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లిస్తుందని ఆశిస్తున్నాం" అన్నారు నిక్.
కొత్తగా 10 శాతం సుంకం
కోర్టు తీర్పుతో వ్యాపారులు ఆశించిన వాపసులు, ఉపశమనం అంత సులభం కాకపోవచ్చు.
సెక్షన్ 122 చట్టాన్ని ఉపయోగించి దిగుమతులపై 10 శాతం సుంకం విధిస్తూ శుక్రవారం కొత్త ఉత్తర్వుపై సంతకం చేశారు ట్రంప్. ఈ చట్టం ఇంతకుముందు ఎప్పుడూ ప్రయోగించలేదు.
అధ్యక్షుడు 150 రోజుల పాటు 15 శాతం వరకు సుంకాలను నిర్ణయించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఆ తర్వాత, ఏం చేయాలనేది కాంగ్రెస్ నిర్ణయించుకోవాలి. ఈ కొత్త సుంకం ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమవుతుంది.
ఈ ఉత్తర్వులో అనేక మినహాయింపులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఖనిజాలు, బీఫ్, సహజ వనరులు, ఎరువులు, నారింజ వంటి కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు, మందులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు ఉన్నాయి.
యూఎస్ఎంసీఏ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద కెనడా, మెక్సికోలకు ఇప్పటికే మినహాయింపులున్నాయి. ఆ ఒప్పందం కింద చాలా వస్తువులపై కొత్త సుంకాలు వర్తించవు.
భారత్‌పై ఎంత సుంకం?
భారత్, యూకే, యూరోపియన్ యూనియన్‌తో సహా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న దేశాలు - గతంలో చర్చించిన ప్రత్యేక తక్కువ రేట్లకు బదులుగా సెక్షన్ 122 కింద 10 శాతం గ్లోబల్ టారిఫ్స్ ఎదుర్కోవలసి ఉంటుందని వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు.
అయితే, ఆ దేశాలు ఇప్పటికీ తమ వాణిజ్య ఒప్పందాలలో చేసిన నిబద్ధతలను పాటిస్తాయని ట్రంప్ అధికారగణం భావిస్తోంది. సెక్షన్ 232, సెక్షన్ 301 వంటి ఇతర చట్టాలను కూడా వైట్‌హౌస్ ఉపయోగించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చట్టాలు జాతీయ భద్రతా కారణాల వల్ల లేదా అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు ప్రతిస్పందించడానికి సుంకాల విధింపును అనుమతిస్తాయి.
ట్రంప్ గతంలో ఈ చట్టాలను ఉపయోగించారు. వాటిలో ఉక్కు, అల్యూమినియం, కార్లపై సుంకాలు కూడా ఉన్నాయి. ఆ సుంకాలపై కోర్టు తీర్పు ఎలాంటి ప్రభావం చూపదు.
పరిస్థితి క్లిష్టంగా, గందరగోళంగా మారిందని వాషింగ్టన్ థింక్ ట్యాంక్‌లో సీనియర్ ఫెలో అయిన జెఫ్రీ గెర్ట్జ్ అన్నారు. సుప్రీం తీర్పుపై అమెరికా ప్రధాన వాణిజ్య భాగస్వాములు జాగ్రత్తగా స్పందించారు.
"అమెరికా సుప్రీంకోర్టు తీర్పును జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నాం" అని యూరోపియన్ కమిషన్ ప్రతినిధి ఓలోఫ్ గిల్ సోషల్ మీడియాలో తెలిపారు.
ఐఈఈపీఏ చట్టం ప్రకారం అమెరికా కనీసం 130 బిలియన్ డాలర్ల సుంకాలను వసూలు చేసింది. కాస్ట్‌కో, అల్కోవా, బంబుల్ బీతో సహా అనేక కంపెనీలు వాపసు పొందడానికి కోర్టును ఆశ్రయించాయి. వాపసు ఎలా జరుగుతుందో సుప్రీంకోర్టు స్పష్టంగా వివరించలేదు. ఆ నిర్ణయం ఇప్పుడు మరొక వాణిజ్య కోర్టుకు వెళ్లవచ్చు.
చట్టపరమైన కేసులు ఖరీదైనవి కావడం వల్ల చిన్న కంపెనీలు తమ డబ్బును తిరిగి పొందడం కష్టమని కేపీఎంజీ యూఎస్ చీఫ్ ఎకనామిస్ట్ డయాన్ స్వాంక్ అన్నారు.
కంపెనీలు వ్యాజ్యాలు దాఖలు చేయవలసిన అవసరం లేని రీఫండ్‌ల కోసం ప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించడమే ఉత్తమ పరిష్కారం అని పిల్స్‌బరీ అనే లా కంపెనీ హెడ్ స్టీవ్ బెకర్ అన్నారు.
కంపెనీలు తమ డబ్బును తిరిగి పొందే అవకాశం ఉందని, అయితే దానికి ఎంత సమయం పడుతుందనేది ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











