కరోనావైరస్: ముంబయి మురికి వాడల్లో సగానికి పైగా ప్రజలకు ఇప్పటికే కోవిడ్ సోకిందా?

- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహరాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో మూడు మురికి వాడల్లో నివసించే సగం మందికి పైగా ప్రజల్లో కరోనావైరస్‌కు సంబంధించిన యాంటీ బాడీలు ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది.
మురికివాడలకు బయట నివసించే వారిలో కేవలం 16 శాతం మంది మాత్రమే ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు.
జూలై మొదటి వారంలో ముంబయి లో కిక్కిరిసిన మూడు ప్రాంతాలలో 7000 మందికి ర్యాండమ్ పరీక్షలు నిర్వహించగా ఈ ఫలితాలు వచ్చాయి.
ముంబయి లో జులై 28 వ తేదీ నాటికి 1,10,000 కేసులు నమోదు కాగా 6187 మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ సర్వేను ముంబయి మున్సిపాలిటీ, నీతి ఆయోగ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కలిపి నిర్వహించాయి.
ముంబయి లో చెంబూర్, మాతుంగ , దహిసర్ ప్రాంతాలలో నివసించే ప్రజల్లో 57 శాతం మంది కరోనావైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు ఈ సర్వే తెలిపింది. ఈ ప్రాంతాలలో సుమారు 15 లక్షల జనాభా నివాసం ఉంటారు.
కరోనావైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ప్రబలిన ఈ నగరంలో ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అంచనా వేయడానికి సర్వే లో వెల్లడైన ఫలితాలు పనికొస్తాయని సర్వే లో భాగమైన శాస్త్రవేత్తలు బీబీసీ కి వివరించారు.
ఈ సర్వే నిర్వహించడానికి గణనీయమైన శాంపిల్ ని ఎంచుకున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు..
“సర్వే నిర్వహించడానికి ఎంచుకున్న మూడు ప్రాంతాలలో అధిక సంఖ్యలో కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అందులో మురికివాడలు, కొన్ని గృహ సముదాయాలు, స్వతంత్ర గృహాలు కూడా ఉన్నాయి. ఇన్ఫెక్షన్ సోకడాన్ని జనాభా సాంద్రత ప్రభావితం చేస్తుందో లేదో చూడటం కూడా ఈ సర్వే ఉద్దేశ్యమని డాక్టర్ కొల్తూర్ చెప్పారు..
ఈ సర్వే ఫలితాలను నగరం మొత్తం మీద ఉన్న ఇన్ఫెక్షన్ స్థాయిని తెలియచేసేందుకు వాడలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని కేవలం 24 వార్డులలో మూడు చోట్ల నిర్వహించారు.

అయితే, మిగిలిన ప్రదేశాలలో ఈ సర్వేలో వచ్చిన ఫలితాలకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఏమి ఉండవని డాక్టర్ జునేజా అన్నారు.
కొన్ని పెద్ద నగరాలలో నిర్వహించిన సర్వే ఫలితాలు జనాభాలో తక్కువ శాతంలో యాంటీ బాడీలు ఉన్నట్లు వెల్లడించాయి.
లండన్ నగరంలో మే జూన్ నెలల్లో నిర్వహించిన సర్వే లో ప్రతి ఆరుగురిలో ఒక్కరికి, న్యూ యార్క్ నగరంలో ప్రతి ఐదుగురిలో ఒక్కరికి యాంటీ బాడీల పరీక్షలో పాజిటివ్ అని తేలింది. దిల్లీలో జులై లో నిర్వహించిన ఒక ప్రభుత్వ సర్వే లో ప్రతి నలుగురిలో ఒక్కరికి కోవిడ్ సోకినట్లు తెలిసింది.
ముంబయి మురికివాడల్లో చాలా మంది కామన్ టాయిలెట్లను వాడటం కూడా ఇన్ఫెక్షన్ వ్యాప్తి ఎక్కువగా ఉండటానికి కారణమని భావిస్తున్నారు. కిక్కిరిసిన ప్రాంతాలు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందడానికి ఎలా దారి తీస్తాయనే విషయాన్ని ఈ సర్వే ఫలితాలు తెలియచేస్తున్నాయని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో పని చేస్తున్న డాక్టర్ సందీప్ జునేజా చెప్పారు.
అధిక శాతం మంది ప్రజలు ఇన్ఫెక్షన్ బారిన పడి , లక్షణాలు లేకుండానే కోలుకోవడం వలన కొన్ని ప్రాంతాలలో మరణాల రేటు కూడా తక్కువగా ఉందని ఈ సర్వే వెల్లడి చేస్తోందని అన్నారు.
మురికివాడలలో, బయట కూడా మహిళలు ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు తెలుస్తోంది. “ఇది చాలా ఆసక్తికరమైన అంశం. దీనికి కారణం మాకు తెలియదు. దీనికి సామాజిక ప్రవర్తన నుంచి శారీరక బేధాల వరకు ఏదైనా కారణం కావచ్చు అని టిఐఎఫ్ఆర్ కి చెందిన డాక్టర్ ఉల్లాస్ ఎస్ కొల్తూర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ముంబయి లో కేసుల సంఖ్య తగ్గు ముఖం పడుతూ వస్తున్న నేపథ్యంలో ముంబయిలో హెర్డ్ ఇమ్మ్యూనిటి మొదలైందా అనే ప్రశ్నను కూడా ఈ సర్వే లేవదీస్తోంది. మంగళవారం నాడు ముంబయి లో 717 కొత్త కేసులు నమోదయ్యాయి. గత మూడు నెలల్లో ఇంత తక్కువగా నమోదవడం ఇదే మొదటిసారి.
"పూర్తిగా ఇప్పుడే ఏమి చెప్పలేం. ఈ ఇన్ఫెక్షన్ తో పోరాడేందుకు రోగ నిరోధక శక్తి ఎన్ని రోజులు ఉంటుందో అనే విషయం పట్ల ఎవరికీ స్పష్టత లేదు. ఈ సర్వే లను మరిన్ని సార్లు చేసిన మరి కొన్ని సార్లు నిర్వహించిన తర్వాతే పూర్తి అవగాహనకు రావడం సాధ్యపడుతుందని” అని డాక్టర్ కొల్తూర్ అన్నారు.

ఫొటో సోర్స్, 1 Rupee Clinic
ఇప్పుడు సర్వే నిర్వహించిన ప్రాంతాలలోనే తిరిగి ఆగస్ట్ నెలలో సర్వే నిర్వహించి ఇన్ఫెక్షన్ స్థాయి పెరిగిందో, తగ్గిందో తెలుసుకోగలిగితే నగరంలో కోవిడ్ వ్యాప్తిని అంచనా వేయవచ్చని చెప్పారు.
శరీరంలో యాంటీ బాడీలు ఉండటం వలన వైరస్ బారి నుంచి రక్షణ కల్గుతుందని పూర్తిగా చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తటస్థంగా ఉండే శక్తివంతమైన యాంటీ బాడీలే ఇన్ఫెక్షన్ నుంచి పోరాడేందుకు కావల్సిన రోగ నిరోధక స్థాయిని నిర్ణయిస్తాయి.
ఈ యాంటీబాడీల స్థాయిలు 90 రోజుల్లో తగ్గిపోవచ్చని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. "ఇలా జరిగితే హెర్డ్ ఇమ్మ్యూనిటి , వ్యాక్సీన్ ల పరిస్థితి ఏమిటని” పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కె శ్రీనాథ్ రెడ్డి ఒక వ్యాసంలో రాశారు.
“ఈ వైరస్ తో పోరాడేందుకు మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎలా రూపాంతరం చెందుతుందో ఇంకా ఎవరికీ తెలియదని, కేవలం ఆశతో ఎదురు చూడాల్సిందేనని,” కె శ్రీనాథ్ రెడ్డి రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఏపీజే అబ్దుల్ కలామ్‌ను ప్రజల రాష్ట్రపతి అని ఎందుకు అంటారు ?
- తల్లుల నుంచి పసిబిడ్డలకు కరోనావైరస్ సోకే అవకాశం తక్కువే
- ఆక్స్ఫర్డ్ వ్యాక్సీన్ తయారీ బృందానికి నేతృత్వం వహిస్తున్న సారా గిల్బెర్ట్ ఎవరు
- ‘నాన్న పుర్రెను, ఎముకలను సూట్‌కేసుల్లో పెట్టుకుని వచ్చా’: ఉత్తర కొరియాలో యుద్ధ ఖైదీ కుమార్తె
- ఉత్తర కొరియా: సముద్రంలో ఈదుకుంటూ వచ్చిన వ్యక్తే కరోనాను వెంట తెచ్చాడా?
- సోనూ పంజాబన్: ఈ మహిళకు వ్యభిచారం ‘ప్రజాసేవ’, 'కామం' ఒక భారీ మార్కెట్
- చైనా విద్యార్థులు తమను తామే కిడ్నాప్ చేసుకుంటున్నారు.. పోలీసులు అసలు కథ బయటపెట్టారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








