‘బాబును నాకు చూపించకుండానే హాస్పిటల్ వాళ్లు తీసుకున్నారు’’.. విశాఖలో బయటపడ్డ పసిపిల్లల వ్యాపారం

ఫొటో సోర్స్, Getty Images
విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పేద వారి నుంచి పసి పిల్లలను కొని, పిల్లలు లేని దంపతులకు అమ్ముతున్న రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఈ రాకెట్ తో సంబంధం ఉన్న హాస్పిటల్ డాక్టర్ని జులై 26 వ తేదీన కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు సహాయ పడిన ఇతర వైద్య సిబ్బందిపై కూడా కేసు నమోదు చేశారు.
అసలు ఈ విషయం ఎలా బయట పడింది? ఈ రాకెట్ వెనుక ఎవరెవరు ఉన్నారు? పిల్లలను అమ్ముతున్న విషయం పోలీసులకు ఎలా తెలిసిందనే లాంటి అంశాలను బీబీసీ న్యూస్ తెలుగు తెలుసుకునే ప్రయత్నం చేసింది.
అంగన్వాడీ టీచర్ గుంటు సరోజిని ఆ ఆస్పత్రిలో జరుగుతున్న అక్రమాల్ని గుర్తించి పై అధికారులకు సమాచారం అందించడంతో మొత్తం విషయం వెలుగు చూసింది. ఆమె బీబీసీ న్యూస్ తెలుగుతో మాట్లాడారు.
విశాఖపట్నం జిల్లాలో వి.మాడుగుల కి చెందిన 34 సంవత్సరాల సుందరమ్మ భర్త మరణించడంతో , ఆమెకున్న వివాహేతర సంబంధం ద్వారా గర్భం దాల్చారు. అది అవాంఛిత గర్భం కావడంతో ఆమెకు ఏమి చెయ్యాలో పాలు పోలేదు. ఆమెకు అంతకు ముందే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
ఆమె జనవరి 20 వ తేదీన గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళినప్పుడు అక్కడ అంగన్వాడీ టీచర్ గా పని చేస్తున్న గుంటు సరోజిని ఆమె వివరాలు నమోదు చేసుకుని, ఆమెని ప్రతి రోజు వచ్చి భోజనం చేసి వెళ్ళమని చెప్పారు.

“అప్పటికి ఆమెకి ఎన్నో నెలో కూడా తెలియదు. ఆమెని అడిగితే ఏ వివరమూ సరిగ్గా చెప్ప లేక పోయారు” అని ఆమె చెప్పారు.
ఆ తరువాత, "ఫిబ్రవరి 19 వ తేదీ నుంచి ఆమె గ్రామంలో కనిపించలేదు. నేను ఆమె అత్తింటి వారిని కనుక్కుంటే పుట్టింటికి వెళ్లినట్లు తెలిపారు. అలా వెళ్లిన మనిషి సుందర్మ్మ తిరిగి మార్చి 14న కనిపించారు. డెలివరీ అయిందా, బాబా, పాపా, బాబు ఎక్కడ అని అడిగిన ప్రశ్నకి ఆమె ఏడుస్తూ 'బాబును నాకు చూపించకుండానే హాస్పిటల్ వారు తీసుకున్నారు' అని చెప్పింది. ఆ మాటలు విన్న వెంటనే ఒక అమ్మగా నేను స్పందించకుండా ఉండలేకపోయాను" అని సరోజిని అన్నారు.
ఆమెని కేంద్రానికి తీసుకుని వెళ్లి వివరాలు చెప్పమని అడిగితే, హాస్పిటల్ వారు బాబును తీసుకుని డబ్బులు ఇస్తామని చెబితే కొంత మంది ఆశా వర్కర్ల సహాయంతో వెళ్లి డెలివరీ పూర్తి చేసుకుని వచ్చినట్లు చెప్పారు.
“నాకంతా అయోమయంగా అనిపించింది. నాకు ఆమె వివరాలు ఎలా నమోదు చేసుకోవాలో అర్ధం కాలేదు" అని చెప్పిన సరోజిని వెంటనే సుందరమ్మను తీసుకుని తన పై అధికారులను కలిశారు. విషయం వివరించి వి మాడుగుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో పాటు జిల్లా చైల్డ్ లైన్ కి కూడా సమాచారం అందించారు.
“నేను కేవలం సుందరమ్మ బిడ్డను తల్లికి అప్పగించాలనే ఉద్దేశ్యంతో ఈ పని చేసాను కానీ, దీని వెనక ఇంత పెద్ద రాకెట్ నడుస్తుందని ఊహించలేకపోయాను" అని ఆమె అన్నారు.

చైల్డ్ లైన్ వారు ఏం చేశారు?
చైల్డ్ లైన్ కి మార్చ్ 17 వ తేదీన ఫిర్యాదు అందగానే చైల్డ్ లైన్ సిబ్బంది వెంటనే స్పందించి విచారణ చేపట్టినట్లు చైల్డ్ లైన్ విశాఖపట్నం జిల్లా కోఆర్డినేటర్ డేవిడ్ రాజు బీబీసీతో చెప్పారు.
సుందరమ్మను ఇద్దరు ఆశా వర్కర్లు డెలివరీ నిమిత్తం విశాఖపట్నం లోని సృష్టి హాస్పిటల్ కి తీసుకుని వెళ్లినట్లు విచారణలో తెలిసిందని డేవిడ్ రాజు చెప్పారు. ఈ ఆశ వర్కర్లు సుందరమ్మను గ్రామంలో కలిశారు.
సుందరమ్మకు మార్చి 9న డెలివరీ అయింది.
“మేము బిడ్డను తెచ్చి ఇవ్వాలని ఆశ వర్కర్లను బెదిరించడంతో వారు బిడ్డను తీసుకుని వచ్చి మార్చి 20 వ తేదీన అప్పగించారు”. అప్పుడు తల్లీ బిడ్డలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచినట్లు తెలిపారు.
ఆ బాబుని శిశు గృహ లో పెట్టారు . చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు వెంటనే విశాఖపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంతలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వలన ఈ కేసు ముందుకు సాగలేదని ఆయన చెప్పారు.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎలా స్పందించింది?
చైల్డ్ లైన్ ద్వారా కేసు వివరాలు తెలుసుకున్న వెంటనే ఆ శిశువుని శిశు గృహకు చేరే ఏర్పాట్లు చేసినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ఆర్. శ్యామల రాణి బీబీసీ కి వివరించారు.
అయితే, ఈ ఒక్క కేసుతో ఫిర్యాదులు ఆగలేదు. ఏప్రిల్ 14 వ తేదీన తన బిడ్డను హాస్పిటల్ వారు తీసుకున్నారంటూ విశాఖపట్నం వాంబే కాలనీ కి చెందిన ఒక మహిళ చైల్డ్ లైన్ కి నేరుగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కూడా నగరంలో ఉన్న సృష్టి హాస్పిటల్ మీదే వచ్చింది.
నేను వెంటనే హాస్పిటల్ కి ఫోన్ చేసి, బిడ్డని అప్పగించమని అడగడంతో వారు ముందు ఒప్పుకోలేదు. బిడ్డ తల్లిని సిజేరియన్ నిమిత్తం 80000 రూపాయిలు చెల్లించమని డిమాండ్ చేశారు. ఆ సమయంలో డాక్టర్ హాస్పిటల్ లో లేరు.
లాక్ డౌన్ కావడంతో నేను వీడియో కాల్ చేసి, వెంటనే బిడ్డని ఇవ్వకపోతే పోలీస్ కేసు పెడతానని బెదిరించడంతో వెంటనే హాస్పిటల్ సిబ్బంది చైల్డ్ లైన్ ద్వారా ఆ బిడ్డను తల్లికి అప్పగించారు.
అయితే ఈ రెండు కేసులలోనూ తల్లి మత్తులోంచి బయటకు వచ్చే ముందే బిడ్డలను తీసేసుకున్నారు, అని శ్యామల రాణి చెప్పారు. వెంటనే ఈ రెండు సంఘటనల గురించి పోలీస్ కమీషనర్ కి ఈ మెయిల్ పంపినట్లు చెప్పారు.
విశాఖపట్నంకు చెందిన ఆ మహిళతో బీబీసీ మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు ఆమె పూర్తిగా భయపడిపోయి ఉన్నారు. “నన్ను వదిలేయండి ప్లీజ్. నేను క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాను. నా భర్త జైలులో ఉన్నారు. నేనిక ఈ పోలీస్ ఫిర్యాదులు, వేదన భరించలేను. ఈ విషయమై నేనేమి మాట్లాడను” అని ఫోన్ పెట్టేసారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో -2018 విడుదల చేసిన డేటా ప్రకారం దేశ వ్యాప్తంగా నమోదైన పిల్లల పై జరుగుతున్న నేరాలలో కిడ్నాప్, అపహరణకు గురైన నేరాల శాతం 44. 2 శాతం ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ లో ఆ సంఖ్య 749, తెలంగాణ లో 1076 ఉంది.
భారతదేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక శిశువు తప్పిపోతున్నట్లు, ప్రతి సంవత్సరం దేశంలో సుమారు 70,000 మంది పిల్లలు తప్పిపోతున్నట్లు అంచనా అని 2020 మే నెలలో బీబీసీ ప్రచురించిన కధనం పేర్కొంది.
విశాఖపట్నం పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా బీబీసీ న్యూస్ తెలుగుతో ఈ కేసును పరిశోధించిన తీరుని వివరించారు.

ఫొటో సోర్స్, VisakhaPolice/FB
పోలీసుల కథనం
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి విషయం గురించి ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపట్టినట్లు తెలిపారు. పోలీసుల విచారణలో ఆ బిడ్డలను హాస్పిటల్ కి అమ్మినట్లు తెలిసిందని చెప్పారు.
ఈ కేసులో డాక్టర్ నమ్రత ను పోలీసులు కర్ణాటకలోని దావణగెరె లో అరెస్ట్ చేసి సోమవారం సాయంత్రం విశాఖపట్నం తీసుకుని వచ్చినట్లు చెప్పారు. ఆమెతో పాటు ఆమెకి సహకరించిన కోడి వెంకట లక్ష్మి బొట్టా అన్నపూర్ణ , అనే ఇద్దరు ఆశ వర్కర్లను , వెంకట లక్ష్మి అల్లుడు అర్జీ రామకృష్ణ , ఈ ప్రక్రియలో డాక్టర్ కి సహకరించిన వైద్యులు తిరుమల, లోపిని చంద్ర మోహన్ పై కూడా కేసు నమోదు చేశారు. బిడ్డను హాస్పిటల్ నుంచి కొనుక్కున్న కోల్ కతా కి చెందిన వ్యక్తుల పై కూడా కేసు నమోదు చేశారు.
పోలీసులు సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం గత సంవత్సరంలో ఈ హాస్పిటల్లో మొత్తం 56 డెలివరీలు చోటు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. అందులో కొన్ని సాధారణ డెలివరీలు కూడా ఉండవచ్చని మీనా చెప్పారు.
ఈ ప్రక్రియలో సహకరించిన ఏజెంట్ కి ఒక లక్ష రూపాయిలు అందినట్లు చెప్పారు.
సృష్టి టెస్ట్ ట్యూబ్ క్లినిక్‌కు చెందిన డాక్టర్ నమ్రతపై గతంలో విశాఖపట్నంలో రెండు క్రిమినల్ కేసులు, గుంటూరులో కూడా ఒక క్రిమినల్ కేసు నమోదు కావడంతో క్లినిక్ పేరుని 2018 లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ గా మార్చారు. ఆమెకు హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, కోల్‌కతాలో కూడా టెస్ట్ ట్యూబ్ కేంద్రాలు ఉన్నాయి.
ఆమె తన సిబ్బంది తో కలిసి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిషా రాష్ట్రాలలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించేవారు. ఆమె నియమించుకున్న ఏజెంట్ల ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన వారు, ఎవరూ లేని వారు, అవాంఛిత గర్భాలు ధరించిన వారిని గుర్తించి వారికి తమ హాస్పిటల్ లో ఉచితంగా డెలివరీ చేస్తామని చెప్పి డబ్బు ఆశ చూపించే వారు. ఆ విధంగా ఆమె గ్రామీణ ప్రాంతాలలో తన నెట్‌వర్ విస్తరించుకున్నారని పోలీసులు తెలిపారు.
అలా డెలివరీ చేసిన బిడ్డలను సంతానంలేని దంపతులకు అక్రమంగా విక్రయించేవారు. మున్సిపల్ కార్పొరేషన్ కి తప్పుడు తల్లి తండ్రుల వివరాల ను పంపి నకిలీ బర్త్ సర్టిఫికేట్లను సంపాదించేవారు.
సుందరమ్మ కి పుట్టిన బిడ్డని కోల్ కతా లో ఒక దంపతులకి సియన్ రాయ్ అనే పేరు పెట్టి అమ్మారు. గత సంవత్సరం కూడా ఇదే హాస్పిటల్ లో పిల్లలను అక్రమంగా అమ్ముతున్న విషయం బయటపడింది. అయితే, ఈ హాస్పిటల్ వారు పేరు మార్చి ఇదే పనిని కొనసాగిస్తున్నారు.
ఈ కేసు విషయమై బీబీసీ న్యూస్ తెలుగు హాస్పిటల్‌ను సంప్రదించాలని చూడగా అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఫోన్ నంబర్లేవీ పని చేయలేదు.
పేదరికమే కారణమా?
కరోనా నేపథ్యంలో చాలా మంది పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని బాల వికాస్ ఫౌండేషన్ కార్యదర్శి నరవ ప్రకాశరావు చెప్పారు. “నగరంలో అధికారికంగా ఎన్ని ఐ వి ఎఫ్ సెంటర్లు, ప్రైవేట్ హాస్పిటళ్లు ఉన్నాయి అనేది తెలియదు. అలాగే,పిల్లలు పుట్టినప్పుడు ఆ వివరాలు కే జి ఎచ్ కి అందించటంలేదు. ఇవన్నీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పర్యవేక్షణ చేయవలసిన అవసరం ఉందని” ఆయన అభిప్రాయ పడ్డారు.
గతంలో ఇలాంటి సంఘటనలు వెలుగు చూసినప్పటికీ శిక్షలు పడని కారణంగా ఈ ఆగడాలు ఆగటం లేదని అన్నారు. పేదరికం వలనే ఇలాంటి పనులకు పాల్పడతారని ఆయన అన్నారు.
పిల్లలు లేని వారు మాతా శిశు సంరక్షణ శాఖ ద్వారా పిల్లలను దత్తత తీసుకోవచ్చని, అంతే కానీ, ఇలా అక్రమంగా కొనుక్కోవడం నేరమని చెబుతూ, ఇందుకు తగిన ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, ఆయన సూచించారు.
“క్షణికావేశంలో భయంతో బాబుని ఇచ్చేసాను కానీ, ఇప్పుడు బాబు వచ్చాక చాలా ఆనందంగా ఉందని” సుందరమ్మ అన్నారని తెలిపిన సరోజిని, "తల్లీ బిడ్డలు ఒకటవ్వడం చూసిన నాకు చాలా ఆనందంగా కలిగింది" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- టీవీ రిపోర్టర్ మెడపై క్యాన్సర్ కణితిని గుర్తించి అప్రమత్తం చేసిన ప్రేక్షకురాలు
- ప్రజాస్వామ్యం బలహీనపడుతోందా? ప్రభుత్వం ముందు భారత మీడియా మోకరిల్లుతోందా?
- వీడియో గేమింగ్‌లో విపరీతంగా పెరుగుతున్న మహిళల సంఖ్య
- కిమ్ జోంగ్ ఉన్: ప్రపంచ రాజకీయాల్లో ఈ పేరంటే ఎందుకంత సంచలనం?
- కరోనావైరస్ - ఉత్తర కొరియా: 'వెలిగిపోయే విజయం మాది' అంటున్న కిమ్ జోంగ్ ఉన్
- కిమ్ జోంగ్ ఉన్ తరువాత ఉత్తర కొరియాను పాలించేదెవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








