పాంబన్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని: ప్రత్యేకతలేంటంటే...

 పాంబన్ బ్రిడ్జి, రామేశ్వరం

ఫొటో సోర్స్, ANI

కొత్త పాంబన్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఇది భారత్‌లో తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి. శ్రీరామనవమి సందర్భంగా పాంబన్ బ్రిడ్జితో పాటు రామేశ్వరం-తాంబరం(చెన్నై)కొత్త సర్వీసును మోదీ ప్రారంభించారు.

రామేశ్వరం నుంచి భారతదేశపు ప్రధాన భూభాగాన్ని పాంబన్ రైలు వంతెన అనుసంధానిస్తుంది.

భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెన పాంబన్ బ్రిడ్జ్. ఈ వంతెన ప్రాచీన సాంస్కృతిక ప్రాముఖ్యత ఉట్టిపడేలా నిర్మించారు.

వర్టికల్ సస్పెన్షన్ బ్రిడ్జ్‌తో ఉన్న ఈ సరికొత్త రైల్వే వంతెనను మండపం రైల్వే స్టేషన్- రామేశ్వరం రైల్వే స్టేషన్‌ను కలుపుతూ..సముద్రం మధ్యలో నిర్మించారు.

గత ఏడాది నవంబర్‌లో ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. రైల్వే సేఫ్టీ కమిషనర్ ఈ వంతెనను పరిశీలించి, పాసింజర్ రైళ్లు ప్రయాణించడానికి అనుమతులు ఇస్తూ సర్టిఫికేట్ జారీ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సముద్రం మధ్యలో కొత్తగా నిర్మించిన వర్టికల్ బ్రిడ్జి
ఫొటో క్యాప్షన్, వర్టికల్ సస్పెన్షన్ బ్రిడ్జ్‌తో ఉన్న ఈ సరికొత్త రైల్వే వంతెనను మండపం రైల్వే స్టేషన్- రామేశ్వరం రైల్వే స్టేషన్‌ను కలుపుతూ..సముద్రం మధ్యలో నిర్మించారు.

పాంబన్ బ్రిడ్జ్ గురించి..

రామాయణం ప్రకారం రామసేతు నిర్మాణం రామేశ్వరం సమీపంలోని ధనుష్కోడి నుంచి ప్రారంభమైంది.

రామేశ్వరాన్ని ప్రధాన భూభాగానికి అనుసంధానించే ఈ వంతెన, భారతీయ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటుతోంది. దీనిని రూ. 550 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించారు.

ఈ వంతెన సుమారుగా 99 స్పాన్లు, 72.5 మీటర్ల పొడవున్న వర్టికల్ లిఫ్టుతో 2.08 కి.మీ. పొడవు ఉంటుంది. ఈ లిఫ్టును 17 మీటర్ల ఎత్తు వరకు పెంచవచ్చు.

రైలు, ఓడల ప్రయాణాన్ని సజావుగా సాగడానికి ఇది ఉపయోగపడుతుంది.

పూర్తిగా స్టెయిన్‌లెస్ స్టీల్, హై-గ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్, పూర్తిగా వెల్డింగ్ చేసిన జాయింట్‌లతో ఈ వంతెన నిర్మించారు.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డబుల్ రైలు ట్రాకులు ఏర్పాటు చేసేలా దీన్ని నిర్మించారు.

కఠినమైన సముద్ర వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ రైలు వంతెన తుప్పు పట్టకుండా పాలీసిలోక్సేన్ పూత వేశారు.

పాంబన్ రైల్వే వంతెన

ఫొటో సోర్స్, The Engineer

పాంబన్ వంతెన చరిత్రేంటి?

భారత ప్రధాన భూభాగాన్ని, రామేశ్వరం ద్వీపంతో అనుసంధానిస్తూ పాంబన్, మండపం మధ్యలో ఒక రైలు వంతెనను నిర్మించాలని శతాబ్దం కిందటే బ్రిటీష్ ప్రభుత్వం ప్లాన్ చేసింది.

ధనుష్కోడి, తలైమన్నార్, శ్రీలంక మధ్యలో చిన్న నౌకలు కార్యకలాపాలు నిర్వహించేలా... రైలు వంతెన కింద నుంచి ప్రయాణికుల నౌకలు వెళ్లేందుకు అనువుగా సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణానికి బ్రిటీష్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ వంతెన నిర్మాణ పనులు 1911లో ప్రారంభమయ్యాయి.

కేవలం రెండేళ్లలోనే ఈ పనులు పూర్తి చేశారు. చెన్నై ఎగ్మోర్ నుంచి పాంబన్ రైల్వే వంతెన మీదుగా ధనుష్కోడి వరకు తొలి బోటు ట్రైన్ 1914 ఫిబ్రవరి 24న ప్రయాణించింది.

దీంతో, ఒకే టిక్కెట్‌పై చెన్నై నుంచి ఎగ్మోర్, కొలంబో వరకు ప్రయాణికులు వెళ్లవచ్చు.

శతాబ్దం కిందట షికాగోలోని షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ బ్రిడ్జ్ కంపెనీ ఈ వంతెనను డిజైన్ చేయగా.. ఇంగ్లండ్‌లోని థార్నాబీ-ఆన్-టీస్‌కు చెందిన హెడ్ రైట్సన్ అండ్ కో లిమిటెడ్‌ దీన్ని నిర్మించింది.

సముద్ర మట్టానికి 12.5 మీటర్ల పైన ఈ వంతెన ఉంటుంది. 2.05 కిలోమీటర్ల పొడవు, 143 పీయర్స్ (దిమ్మలు) ఉంటాయి. నౌకలు వెళ్లగలిగేలా వంతెన మధ్యలో 289 అడుగుల పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది.

(ఈ వివరాలను ది ఇంజనీర్ అనే పుస్తకం నుంచి తీసుకున్నాం. భారత్‌లో నిర్మించిన ప్రత్యేక వంతెనల గురించి ఈ పుస్తకంలో రాశారు. ఈ వంతెనలు నిర్మించిన ఇంజనీర్ల ఇంటర్వ్యూలతో పాటు, పలు వివరాలు దీనిలో ఉన్నాయి.)

పాంబన్‌లో పాత రైల్వే వంతెన గుండా ప్రయాణించిన 86 ఏళ్ల వ్యక్తి సింగమ్ తన అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు. ''నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు పాంబన్ రైల్వే వంతెన గుండా ప్రయాణించాను. సముద్రం గుండా పాంబన్ రైల్వే స్టేషన్ నుంచి కాన్‌కోర్సు చేరుకునేందుకు అరగంట పట్టింది. వంతెనపై వెళ్లేటప్పుడు రైలు చాలా నెమ్మదిగా వెళ్లింది. పాంబన్ నుంచి రామనాథపురం ప్రయాణించినప్పుడు, టిక్కెట్ ధర రూపాయి. సముద్రంపైన రైలులో వంతెనపై ప్రయాణించడం నాకు తొలిసారి. భయం వేసింది. కానీ, రైలు శబ్దం, వైబ్రేషన్ భలే నచ్చాయి. అప్పటి నుంచి పాంబన్ రైల్వే వంతెనపై చాలాసార్లు ప్రయాణించాను. ఈ రైల్వే సస్పెన్షన్ బ్రిడ్జ్ మా పాంబన్ ప్రాంతానికి ఒక చిహ్నం.'' అని తెలిపారు.

పాంబన్ రైల్వే వంతెన

ఫొటో సోర్స్, The Engineer

1964 తుపాను సమయంలో ఏం జరిగింది?

1964 తుపాను ధనుష్కోడిపై తీవ్ర ప్రభావం చూపింది. పాంబన్ రైల్వే వంతెనకు చెందిన 124 స్పాన్లు కొట్టుకుపోయాయి.

కేవలం షెర్జర్ స్పాన్, 19 కాంక్రీట్ పిల్లర్లు మాత్రమే మిగిలాయి. యుద్ధ ప్రాతిపదికన ఈ వంతెన తిరిగి నిర్మాణ పనులను అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధరన్ నేతృత్వంలో చేపట్టారు. సముద్రంలో మునిగిపోయిన్ గిర్డర్లను తీసుకొచ్చి, 67 రోజుల్లో పున:నిర్మాణ పనులను పూర్తి చేశారు.

1964లో ధనుష్కోడిలో వచ్చిన పెను తుపాను సమయంలో పాంబన్ వంతెన ధ్వంసం కావడాన్ని కళ్లారా చూసిన 70 ఏళ్ల అంబికాపతి బీబీసీతో మాట్లాడారు. ''నా కుటుంబంతో ధనుష్కోడిలో నివసించేవాణ్ని. ఈ పెను తుపానుతో ధనుష్కోడి పూర్తిగా ధ్వంసమైంది. అక్కడి నుంచి బయటపడి, రామేశ్వరం చేరుకున్నాం. ఆ తర్వాత, రామేశ్వరం నుంచి పాంబన్ రైల్వే స్టేషన్‌కు వచ్చాం. ఆ సమయంలో, రైలు సర్వీసులన్నీ రద్దు అయ్యాయి. అప్పుడు పాంబన్ నుంచి మండపం వచ్చేందుకు రోడ్డు వంతెన కూడా లేదు. మండపం చేరుకునేందుకు మేం రెండు గంటల పాటు చెక్క వంతెన వాడాం. మూడు నెలల తర్వాత, ఈ రైలు మార్గంలో సర్వీసులు తిరిగి ప్రారంభించారు. ఆ తర్వాత 1974లో మరోసారి పాంబన్ సమీపంలో తుపాను వచ్చింది. కానీ, ఈసారి పాంబన్ రైల్వే వంతెనకు ఏం కాలేదు. '' అని అంబికాపతి చెప్పారు.

పాంబన్ రైల్వే వంతెనపై చివరి ప్రయాణం

శతాబ్దం వరకు రాకపోకలు సాగించిన తర్వాత, పాంబన్ వంతెన మధ్య భాగంలో సస్పెన్షన్ బ్రిడ్జ్ వద్ద రైలు వెళ్తున్న సమయంలో విపరీతమైన వైబ్రేషన్స్ వస్తున్నట్లు ఐఐటీ మద్రాసుకు చెందిన నిపుణుల బృందం గుర్తించింది. దీని కారణంగా, 2022 డిసెంబర్ 23 నుంచి పాంబన్ వంతెన గుండా వెళ్లే రైలు రాకపోకలను నిలిపివేశారు.

పాంబన్ వంతెన

ఫొటో సోర్స్, UGC

కొత్త రైల్వే వంతెన నిర్మాణం..

2019 రైల్వే గ్రాంట్ రిక్వెస్ట్‌ల సమయంలో పాంబన్ వంతెన సమీపంలో కొత్త రైల్వే వంతెన నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు వచ్చాయి.

2019 మార్చి 1న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

తుప్పు పట్టేందుకు అవకాశం ఉన్న ప్రాంతమైన పాంబన్‌లో ఈ కొత్త వంతెన నిర్మాణం చేపట్టడంతో, వంతెనకు తప్పు పట్టుకుండా పలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

పలు లేయర్లలో యాంటీ-రస్ట్ పెయింట్స్ (తప్పు పట్టుకుండా పెయింట్స్) వేశారు.

తొలి లేయర్ 200 మైక్రోన్ జింక్ అలాయ్, తదుపరి లేయర్ 25 మైక్రోన్ జెల్లీ మాదిరి ఎపాక్సీ పూత, చివరి లేయర్ సిలికాన్ ఆక్సీజన్‌తో కలగలసిన సింథటిక్ పాలీమార్ కోటింగ్ వేశారు.

ఇవి సముద్ర గాలి నుంచి తప్పు పట్టుకుండా వంతెన నిర్మాణాలను 35 ఏళ్ల వరకు కాపాడనున్నాయని రైల్వే అధికారులు చెప్పారు.

పాంబన్ బ్రిడ్జి

ఫొటో సోర్స్, Smriti Z Irani

ఎందుకింత ప్రాధాన్యం?

భారతదేశంలో ఉన్న మిగిలిన రైలు బ్రిడ్జిలకన్నా పాంబన్ వంతెన కాస్త భిన్నమైనది. ఎందుకంటే నౌకాయానానికి వీలుగా ఈ బ్రిడ్జిని నిర్మించారు.

లండన్ బ్రిడ్జి మాదిరిగానే ఇక్కడ కూడా నౌకలు వెళ్లేటప్పుడు బ్రిడ్జిలో కొంత భాగం రెండుగా విడిపోయి పైకి లేస్తుంది.

తమిళనాడు టూరిజం శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇది భారతదేశంలో మొదటి సముద్ర వంతెన.

పాత రైల్వే వంతెనకు చెందిన సస్పెన్షన్ బ్రిడ్జ్‌ను ఐరన్‌తో నిర్మించారు. దీన్ని, మనుషులే ఆపరేట్ చేసేవారు .

కానీ, కొత్త రైల్వే వంతెన మధ్యలో నిర్మించిన వర్టికల్ సస్పెన్షన్ బ్రిడ్జ్‌ను ఏవియేషన్‌ టెక్నాలజీలో వాడే అల్యూమినియం అలాయ్‌తో ఏర్పాటు చేశారు.

దీని బరువు 650 టన్నులు. ఈ వర్టికల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎత్తు 33 మీటర్లు, పొడవు 77 మీటర్లు.

మనుషుల ప్రమేయం లేకుండానే మోటార్ల ద్వారా హైడ్రాలిక్ లిఫ్ట్‌లతో దీన్ని ఆపరేట్ చేయొచ్చు.

నౌకలు వెళ్లేందుకు వీలుగా 17 మీటర్ల ఎత్తు ఇది పైకి లేస్తుంది. ఇది రోడ్డు వంతెన ఎత్తుకు సమానం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)