యూట్యూబ్ వీడియోలను చూస్తే సంతోషం కలగడానికి కారణమేంటి?

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శివాని చౌదరి, థియో బీవర్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

సాధారణ స్నేహితులతో మాట్లాడటం కంటే యూట్యూబ్ వీడియోలను చూడటం ప్రజలను ఉత్సాహంగా ఉంచుతుందని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది.

యూనివర్శిటీ ఆఫ్ ఎసెక్స్ పరిశోధకులు నిర్వహించిన మూడు అధ్యయనాలలో బ్రిటన్, అమెరికాకు చెందిన 1,080 మందికి పైగా వ్యక్తులను, "పారాసోషల్’’ సంబంధాలపై వారి అభిప్రాయం ఏమిటని ప్రశ్నించారు.

పారాసోషల్ సంబంధం అనేది మానసిక శాస్త్ర పరిభాష. తాము ఎప్పుడూ నేరుగా కలవని, ముఖాముఖి మాట్లాడని వ్యక్తులతో తమకు స్నేహం లేదా బంధం ఉన్నట్టు భావించడాన్నే పారాసోషల్ సంబంధాలుగా అభివర్ణిస్తుంటారు. సహజంగా ఓ సెలబ్రిటీకి, అభిమానికి మధ్య ఉండే బంధం లాంటిదన్నమాట.

ఈ అధ్యయనంలో పాల్గొన్న కొందరు వ్యక్తులు, తమ సహోద్యోగులు లేదా ఇరుగుపొరుగువారితో మాట్లాడటం కంటే యూట్యూబ్ వీడియోలను చూడటమే తమకు ఎక్కువ సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.

52% మంది తమకు బలమైన పారాసోషల్ సంబంధాలు ఉన్నాయంటే, 36% మంది తమకు ఇష్టమైన యూట్యూబర్‌తో సన్నిహితంగా ఉన్నట్లు అనిపిస్తోందని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
 ఎమిలీ నోరిస్

ఫొటో సోర్స్, Kika Mitchell

ఫొటో క్యాప్షన్, పదేళ్లుగా యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తున్న ఎమిలీ నోరిస్

'సురక్షితమైన ప్రదేశం'

ఆన్‌లైన్ సెలబ్రిటీలను చూడటం వల్ల వీక్షకులకు ఎంతో ధైర్యంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయని ఇంగ్లండ్‌లోని కోల్చెస్టర్‌‌కు చెందిన సైకాలజీ నిపుణులు డాక్టర్ వెరోనికా లామార్చ్ చెప్పారు.

"వాళ్లు తమకు ఇష్టమైన వ్యక్తిని చేతితో పట్టుకోలేకపోవచ్చు. కానీ ఈ ఆన్‌లైన్ సెలబ్రిటీలు మిమ్మల్ని తిరస్కరించరు లేదా తాము చాలా బిజీగా ఉన్నామని చెప్పరు. మీరు మీకు వీలున్న సమయంలో, మీకు అనుకూలమైనట్లు వాళ్లను చూడవచ్చు. ఈ సంబంధాలలో ఉన్న శక్తి, ఆకర్షణ అదే అని నేను భావిస్తాను. ఒక కోణంలోంచి చూస్తే, మీకిష్టమైన వాళ్లు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటారు" అని వెరోనికా చెప్పారు.

ఎసెక్స్‌లోని బ్రెంట్‌వుడ్‌కు చెందిన ఎమిలీ నోరిస్ 10 సంవత్సరాలుగా యూట్యూబ్‌లో లైఫ్ స్టైల్, తల్లులకు సంబంధించిన కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నారు.

"మీరు మీ సహోద్యోగితో లేదా ఎవరితోనైనా చాట్ చేస్తే, వాళ్లు ఏదో ఒక కోణం నుంచి మీపై కామెంట్ చేసే అవకాశం ఉంది. అదే మీరు కేవలం ఎవరినైనా చూస్తూ ఉంటే - అలాంటిది జరగదు’’ అని నోరిస్ వివరించారు.

"కొన్నిసార్లు మనం యూట్యూబ్‌లో ఎవరినైనా చూస్తున్నప్పుడు, వాళ్లు మీతో ఏకీభవిస్తున్నట్లు అనిపిస్తుంది’’ అంటారామె.

"మన జీవితాలు చాలా బిజీ అయిపోయాయి. కానీ మీకు ఎవరికైనా దగ్గరగా ఉండాలనిపిస్తే - మీరు మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను ఆశ్రయించవచ్చు. అప్పుడు మీరు ఎవరో ఒకరితో ఉన్నట్లు అనిపిస్తుంది’’ అని చెప్పారు.

"నేను యూట్యూబ్‌లో మాట్లాడుతుంటే మన ఇంటి పక్కన వాళ్లతో, నా స్నేహితులతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కానీ నిజజీవితంలో నేను అంతమంది వ్యక్తులతో మాట్లాడ్డం ఊహించుకోలేను" అని వివరించారు.

వీడియో క్యాప్షన్, యూట్యూబ్ వీడియోలను చూస్తే ఆనందంగా ఉంటుందా?

ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు తమ ఫాలోయర్లతో కనెక్ట్ అయినట్లు అనిపించడం సాధారణమని డాక్టర్ లామార్చ్ చెప్పారు. ఎందుకంటే ఇలాంటి సంబంధంలో పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుందన్నారు.

నిజానికి ఇలాంటి సంబంధాలు ఏకపక్షమేనని ఆమె అన్నారు.

"ఉదాహరణకు మన మూడ్ బాగా లేకుంటే నిజజీవితంలో మాదిరి మన స్నేహితులను కాఫీ తాగడానికి వెళ్ళొద్దామా అని అడిగినట్టుగా, వీరిని అడగడానికి ఉండదు. ఇదే పారాసోషల్ సంబంధాలకు, సాధారణ మానవ సంబంధాలకు మధ్య తేడా. ఇక్కడ ఒకరంటే ఒకరికి పరస్పర గౌరవం ఉంది, కానీ మనకు ఏదైనా జరిగితే మనం వాళ్లతో [ఫాలోయర్లు] పంచుకోలేం అనే కోణంలో ఇది ఏకపక్షంగా ఉంటుంది. మన వ్యక్తిగత సంబంధాలతో పోలిస్తే ఈ పారాసోషల్ సంబంధాలు మరింత ప్రభావవంతంగా కనిపించడం నిజంగా ఆసక్తికరమైన విషయం, బహుశా అందుకే ప్రజలు తమ సామాజిక సంబంధాలపై ఆధారపడటానికి ఇష్టపడడం లేదని ఇది సూచిస్తోంది" అని చెప్పారు.

ఎమిలీ నోరిస్

ఫొటో సోర్స్, Kika Mitchell

ఫొటో క్యాప్షన్, ప్రజలు సాధారణంగా యూట్యూబ్‌లోని వ్యక్తిని తమకు తెలిసినట్లుగా భావిస్తారని ఎమిలీ నోరిస్ అంటున్నారు

'ప్రమాదకర ప్రభావం'

"కొంతమంది దీనిని పలాయనవాదంగా చూడవచ్చు. వాళ్లు ఎవరినైనా చాలా కాలం పాటు ఫాలో చేస్తే, వాళ్లకు సురక్షితంగా అనిపించవచ్చు లేదా ఎవరినైనా చూసినప్పుడు వాళ్లకు సంతోషంగా అనిపించవచ్చు. కానీ వాళ్లు బయటికి వెళ్లే బదులు యూట్యూబ్‌ చూస్తూ ఇంట్లో కూర్చోవడానికి ఇష్టపడితే అది వారి సామాజిక జీవితం మీద ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతుంది" అని ఎసెక్స్‌లోని బెన్‌ఫ్లీట్‌ యుఎస్‌పీ కాలేజీకి చెందిన 18 ఏళ్ల విద్యార్థి జాక్ చెప్పారు.

18 ఏళ్ల ఎమిలీ సైతం, "ప్రజలకు నిజ జీవితంలో ఎవరితోనైనా మాట్లాడటం కంటే యూట్యూబ్‌ని చూడటం ఎందుకు బాగుంటుందో నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ మీరు అవతలి వారి ప్రతిచర్యల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు లేదా అవతలి వ్యక్తులు మిమ్మల్ని ఎలా చూస్తారనే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు" అన్నారు.

ఎమిలీ తాను యూట్యూబ్‌ను ఎక్కువగా చూడనని చెప్పారు.

"నా స్నేహితుల్లో కొంతమందికి ఇన్‌ఫ్లుయెన్సర్ గురించి పెద్దగా తెలియకపోయినా, వాళ్లు తమకు చాలా ఎక్కువ తెలుసనుకుంటారు’’ అని తెలిపారు.

"సోషల్ మీడియా పెరుగుదలతో ఈ పారాసోషల్ సంబంధాల దోరణి సర్వసాధారణమైందని నేను భావిస్తున్నాను’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)