ప్రెస్ రివ్యూ: ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తా.. శివాజీ

ఫొటో సోర్స్, fb.com/ActorSivaji
ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష: నటుడు శివాజీ
కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటించకపోతే అమరణ నిరాహార దీక్ష చేస్తానని సినీనటుడు శివాజీ వెల్లడించారని ఈనాడు తెలిపింది.
ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన మోదీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని శివాజీ అన్నారు.
పవన్ కల్యాణ్ గుంటూరులో నివాసం ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ప్రత్యేక హోదా కోసం మరింత పోరాడేందుకు ఈనెల 19న అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
రాయలసీమపై మాట్లాడే నైతిక హక్కు భాజపాకు లేదన్నారు. రాష్ట్రానికి నష్టం కలిగే చర్యలు తీసుకుంటే తాము తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
గ్రామీణ బ్యాంకులపై ప్రై'వేటు'
బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం చకచకా పావులు కదుపుతోందని సాక్షి ఓ కథనం ప్రచురిచింది. ఆ కథనం ప్రకారం..
ప్రైవేటీకరణ ప్రక్రియను ముందుగా గ్రామీణ బ్యాంకులతో మొదలుపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో 49 శాతం వరకూ వాటాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.
3-4 నెలల్లో ప్రారంభ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా స్టాక్ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించనున్నామని.. దీనికి సిద్ధంగా ఉండాలని గ్రామీణ బ్యాంకులకు నాబార్డ్ ఉత్తర్వులను కూడా జారీచేసింది.
దీనిపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
చిన్న, సన్నకారు రైతులు, చేతివృత్తులు, దారిద్ర రేఖకు దిగువనున్న ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా గ్రామీణ బ్యాంక్‌లు ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండే ఏకైక వాణిజ్య బ్యాంక్‌లు గ్రామీణ బ్యాంక్‌లే. ఈ ప్రైవేటీకరణతో రాష్ట్రాలకు ప్రాతినిథ్యం లేకుండా పోతుందని బ్యాంకింగ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయని సాక్షి వివరించింది.

ఫొటో సోర్స్, youtube
అసెంబ్లీలో కంటతడి పెట్టిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం అసెంబ్లీలో భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.
ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై సభలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.
''ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాం? రాష్ట్రాన్ని తిరిగి కోలుకునేలా చేస్తామని, అభివృద్ధి చేస్తామని, దిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ఇప్పుడు 1500 కోట్లిచ్చి హేళన చేస్తారా? ప్రత్యేక హోదా ఐదేళ్లపాటు ఇస్తామన్నారు. అందుకే చేతులు కలిపాం! సెంటిమెంటుతో తెలంగాణ ఇచ్చారు. 60 ఏళ్లు కష్టపడిన తర్వాత కట్టుబట్టలతో వచ్చేసిన వారికి మాత్రం సెంటిమెంట్‌తో నిధులు ఇవ్వరా?'' అంటూ కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివిధ అంశాలను గణాంకాలతో సహా వివరిస్తూ కేంద్రంపై తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలోనే సంపన్న ఎంపీ జయా బచ్చన్
బాలీవుడ్ మాజీ నటీమణి, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సతీమణి ఎంపీ జయా బచ్చన్ రూ.1000 కోట్ల విలువైన ఆస్తులతో దేశంలోనే సంపన్న పార్లమెంటు సభ్యురాలిగా రికార్డెకెక్కారని ఆంధ్రప్రభ పేర్కొంది.
అంతే కాదు, ఈ రికార్డుతో దేశంలోనే సంపన్న అత్తగా మారిపోయారు ఆమె. 2004 నుంచి ఉత్తర్ ప్రదేశ్ నుంచి మూడు సార్లు రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన జయా బచ్చన్, ఇప్పుడు నాలుగోసారి నామినేషన్ వేశారు.
ఈ సందర్భంగా ఆమె తన ఆస్తులను వెల్లడించారు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








