విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్: ఏడాది గడిచినా బాధితులకు న్యాయం ఎందుకు జరగలేదు... ఏపీ ప్రభుత్వం చేతులు దులిపేసుకుందా?

ఎల్జీ పాలిమర్స్
ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫొటో
    • రచయిత, శ్రీనివాస్ లక్కోజు
    • హోదా, బీబీసీ కోసం...

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున దేశమంతా విశాఖపట్నం వైపు చూసింది. గత ఏడాది మే 7న ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే... విశాఖలోని వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌ సంస్థలో స్టైరీన్ గ్యాస్ లీకైంది.

ఇళ్లలో నిద్రిస్తున్నవారంతా ప్రాణాలు అరచేత పట్టుకుని పాలిమర్స్ పరిసరాల నుంచి దూరంగా పారిపోయేందుకు ప్రయత్నించగా, అప్పటికే గ్యాస్ పీల్చిన వారు, పారిపోలేని వారు రోడ్డు మీదే కుప్పకూలిపోయారు.

12 మంది ప్రాణాలను బలి తీసుకున్న ఈ ప్రమాదం జరిగి ఏడాది గడిచినా, స్థానికులు, బాధితుల కళ్లలో ఆ రోజు కనిపించిన భయమే నేటికీ కనిపిస్తోంది.

ప్రమాదం జరిగిన తర్వాత 6 నెలలకి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఎల్జీ పాలిమర్స్ పరిసర గ్రామాల్లో బీబీసీ పర్యటించింది. స్థానికుల సమస్యలను తెలుసుకుని...అధికారుల దృ‌ష్టికి తీసుకుని వెళ్లింది.

సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ, త్వరలోనే వారి సమస్యలను పరిష్కరిస్తామని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అప్పట్లో బీబీసీతో అన్నారు.

అయితే, ఏడాదైనా తమకు న్యాయం జరగలేదని స్థానికులు చెప్తున్నారు.

ఎల్జీ పాలిమర్స్

‘ఆఖరి రోజులు అనుకున్నాం‘

పాలిమర్స్‌లో స్టైరీన్ గ్యాస్ లీక్ కాగానే...ఆ గ్యాస్‌ ఉన్న ట్యాంక్ కాసేపట్లో పేలిపోతుందనే వదంతులు వ్యాపించాయి. దీంతో పాలిమర్స్ సంస్థకు సమీపంలోని వెంకటాపురం, వెంకటాద్రినగర్, పద్మనాభనగర్, జనతాకాలనీ, కంపరపాలెం, నందమూరినగర్, ఎస్సీ, బీసీ కాలనీ ప్రజలుతో పాటు...అడవివరం, వేపగుంట, పెందుర్తి, చిన ముషిడివాడ, సుజాతనగర్ ప్రాంత వాసులు సైతం ఇల్లు వదిలి రోడ్లపైకి వచ్చేశారు.

పిల్లా పాపలను తీసుకుని కట్టుబట్టలతో రాత్రంతా రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు. ఆ సమయంలో కోవిడ్ ఫస్ట్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది.

ఒక వైపు కోవిడ్, మరోవైపు గ్యాస్ లీక్ తో మా గ్రామాలకు ఇవే చివరి రోజులు అనుకున్నామని పాలిమర్స్ బాధిత గ్రామాల ప్రజలు ఆనాటి భయానక పరిస్థితులను బీబీసీకి వివరించారు.

ఎల్జీ పాలిమర్స్

''ప్రమాదంలో చనిపోయిన 12 మందికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు. గ్యాస్ వల్ల ఎవరు చనిపోయినా వారికి కూడా అదే పరిహారం ఇస్తామన్నారు. ఆ తరువాత మరో ముగ్గురు స్టైరీన్ గ్యాస్ కారణంగానే చనిపోయారు. అయినా వారికి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు.'' అని బాధితులు కొందరు చెప్పారు.

''కోవిడ్ ఫస్ట్‌ వేవ్‌లో మా గ్రామాల్లో ఒక్క కోవిడ్ కేసు కూడా రాలేదు. ఇప్పుడు 70 వరకు కేసులు వచ్చాయి. ప్రమాదం తర్వాత ఇక్కడ ప్రజల ఇమ్యూనిటీ పవర్ తగ్గిందనడానికి ఈ కేసులే నిదర్శనం.'' అని పద్మనాభనగర్ నివాసి రాజేంద్ర కుమార్ బీబీసీతో చెప్పారు.

ఎల్జీ పాలిమర్స్
ఫొటో క్యాప్షన్, వైద్యానికి అరకొర సౌకర్యాలే కల్పించారు.

మల్టీ స్పెషాలిటీ వద్దు...కనీస వైద్యం అందిస్తే చాలు...

స్టైరీన్‌ గ్యాస్‌ స్టోరేజ్‌ ట్యాంకర్‌కు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజల్లో ఎక్కువ మంది ఇప్పటికీ తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

‘‘ప్రమాదం జరగక ముందు మా పొలాల్లో ఎన్ని గంటలైనా పని చేసుకునే వాళ్లం. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రెండు గంటలు కష్టపడితే చాలు అలసట వచ్చేస్తోంది. ఊర్లోని చాలా మంది ఆడవాళ్లు ఆయాసం, తలనొప్పి, అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారు'' అని వెంకటపురం రైతు సన్యాసి నాయుడు బీబీసీతో అన్నారు.

''ప్రమాదం జరిగిన వెంటనే మంత్రులు, అధికారులు ఇక్కడికి వచ్చి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఏడాదైన ఎటువంటి ఆసుపత్రి లేదు. ప్రభుత్వ పాఠశాలలో రెండు గదులు తీసుకుని...అందులో మూడు బల్లలు, నాలుగు మాత్రలు, కొన్ని టానిక్కులు పెట్టి అదే ఆసుపత్రి అనిపించేశారు.

కోవిడ్ కారణంగా వైద్య సిబ్బంది కూడా రావడం లేదు. ఏ ఆరోగ్య సమస్యపై వెళ్లినా...అక్కడ వాళ్లిచ్చేది ఒకటి, రెండు టాబ్లెట్లే. అందుకే మాకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వద్దు...అత్యవసర సమయంలో ప్రాథమిక చికిత్స అందించే డిస్పెన్సరీ అయినా ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం'' అన్నారు సన్యాసి నాయుడు.

ఎల్జీ పాలిమర్స్
ఫొటో క్యాప్షన్, గ్యాస్ కారణంగా పరిసరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని స్థానికులు చెబుతున్నారు

రంగు మారిన నీళ్లు, చెట్లు, గడ్డి

పాలిమర్స్ ప్యాక్టరీ పరిసరాలన్ని పచ్చని పొలాలతో ఉండేవి. దాదాపు 2 వేల ఎకరాల్లో వ్యవసాయం చేస్తారు. రైతులు కూరగాయలు పండిస్తూ విశాఖ నగరంలో అమ్ముకుంటారు. పాల వ్యాపారం కూడా ఎక్కువగా జరుగుతుంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు తలకిందులైయ్యాయి.

''పొలాలు పాడైపోయి...పంటలు సరిగా పండటం లేదు. పండినా వాటిలో నాణ్యత లేకపోవడంతో గిరాకీ పడిపోయింది. ఇదంతా స్టైరీన్ లీకైన తర్వాతే జరుగుతోంది. ముఖ్యంగా పాలిమర్స్ ప్రమాదం జరిగిన తర్వాత నుంచి ఇక్కడ నీటి రంగు మారింది. ప్రమాద సమయంలో పశువులు పెద్ద సంఖ్యలో చనిపోయాయి. మా గ్రామాల్లోని చెట్లు, పశువులు తినే గడ్డి రంగు మారిపోయాయి. దీంతో ఇక్కడ పశువులు ఇచ్చే పాలు కూడా ఎవరూ కొనడం లేదు.'' అని వెంకటాపురానికి చెందిన శ్రీనివాసరావు అన్నారు.

''ప్రమాదం నుంచి తప్పించుకున్నా... గ్యాస్ లీక్ ప్రభావం మమ్మల్ని ఆర్థికంగా చంపేస్తోంది.'' అని అన్నారాయన.

ఎల్జీ పాలిమర్స్

ప్రభుత్వ కమిటీ...బాధిత సొసైటీ

స్టైరీన్ గ్యాస్ ప్రభావానికి గురై నష్టపోయిన పరిసర గ్రామాల ప్రజలకు జరిగిన నష్టాన్ని మూడు రకాలుగా అంచనా వేస్తూ వారికి ఆ మేరకు నష్ట పరిహారాన్ని చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, ఈ పరిహారం చాలా తక్కువ మందికే అందిందని...మిగతా వారంతా అధికారుల చుట్టూ తిరుగడంతోనే సరిపోతుందంటూ గ్రామస్తులు బీబీసీతో చెప్పారు.

అలాగే స్టైరీన్ గ్యాస్ లీక్ ప్రమాదంపై ప్రభుత్వం నీరబ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ 319 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించింది.

స్ఠూలంగా ఆ నివేదిక "నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను దూరంగా తరలించాలి లేదా గ్రీన్ కేటగిరీ పరిశ్రమలుగా మార్చాలి" అని పేర్కొంది.

స్థానికులు సైతం కంపెనీని అక్కడ నుంచి తరలించాలని అనేక పోరాటాలు చేశారు. బాధితులు ఏర్పాటు చేసుకున్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితుల సంక్షేమ సంఘం న్యాయ పోరాటం చేస్తోంది.

''ఇక్కడ కంపెనీ ఉండటం మా ప్రాణాలకు ముప్పు. అందుకే దీన్ని తొలగించమంటున్నాం. బాధితుల్లో చాలా మందికి ప్రమాద పరిహారం అందలేదు. బాధిత గ్రామాల ఆరోగ్యాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే మా ఆర్థిక, ఆరోగ్య హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలు గుర్తు పెట్టుకున్నట్లు లేదు.'' అని గ్యాస్ బాధితుల సంఘం ప్రతినిధి కిరణ్ కుమార్ చెప్పారు.

ఎల్జీ పాలిమర్స్
ఫొటో క్యాప్షన్, ఏడాది కిందట ఎల్జీ పాలిమర్స్ ప్రమాద దృశ్యాలు

పరీక్షలు లేవు...పర్యవేక్షణ లేదు

ప్రమాదం జరిగిన తర్వాత సమీప గ్రామాల్లో కాలుష్య కారకాలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయన్నదానిపై కాలుష్య నియంత్రణ మండలి తరుచూ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

అయితే ప్రమాదం జరిగిన తొలి రోజుల్లో శాంప్లింగ్ చేసినా, తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎప్పుడూ తమ గ్రామాలలో కనిపించలేదని బాధితులు చెప్పారు.

అయితే, ప్రస్తుతం అక్కడ కాలుష్యం ఏ స్థాయిలో ఉందన్న బీబీసీ ప్రశ్నకు విశాఖ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సమాధానం చెప్పేందుకు నిరాకరించాయి.

హైవపర్ కమిటీయే దీనిపై స్పందించాలని అధికారులు తెలిపారు.

హైపవర్ కమిటీ అధ్యక్షుడు నీరబ్ కుమార్ ప్రసాద్‌ కార్యాలయాన్ని బీబీసీ సంప్రదించగా...ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించారు.

అలాగే, ఎల్జీ పాలిమర్స్ ప్రమాద బాధిత గ్రామాల్లో ఆసుపత్రి నిర్మాణం, కొందరికి పరిహారం అందకపోవడం, ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల లాంటి అంశాలను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి దృష్టికి బీబీసీ తీసుకుని వెళ్లింది. అయితే ప్రస్తుతం దీనిపై స్పందించలేనని...అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడతానని గౌతమ్ రెడ్డి బీబీసీతో అన్నారు.

''నీరబ్ కుమార్ ప్రసాద్ ఇచ్చిన కమిటీ రిపోర్టే తప్పుల తడక. ప్రమాదం జరిగిన ప్రాణ, పర్యావరణ, పశు, ఆర్థిక, దీర్ఘకాలిక ప్రభావంపై అసెస్మెంట్స్ కూడా చేయలేదు. కనీసం అక్కడున్న చెట్లు ఎందుకు రంగు మారాయో కూడా అంచనా వేయలేదు.'' అని ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ బాబురావు బీబీసీతో అన్నారు.

ఎల్జీ పాలిమర్స్
ఫొటో క్యాప్షన్, ప్రమాద ఘటన తెలుసుకుని కొందరు పరుగులు పెట్టారు.

పాలిమర్స్‌ను పంపించండి...స్టీల్‌ప్లాంట్‌ను ఇవ్వకండి

విశాఖలో అన్ని పరిశ్రమలపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని మానవహక్కుల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, పర్యావరణ వేత్తలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కానీ, దానిపై ఏ ప్రభుత్వం స్పందించ లేదు.

పాలిమర్స్ ప్రమాదానికి ఏడాదైన సందర్భంగా మానవహక్కుల సంఘం మళ్లీ సేఫ్టీ ఆడిట్ డిమాండ్ చేస్తోంది.

''విశాఖ నగర పరిధిలో ఉన్న అనేక పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. హై పవర్ కమిటీ చెప్పినా విశాఖలోని పరిశ్రమల సేఫ్టీ ఆడిట్‌ను ప్రభుత్వం చేపట్టలేదు.

నగరంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ వంటి ప్రమాదకరమైన కంపెనీలను దూరంగా తరలించాలి. పెట్టుబడుల పేరుతో విదేశి కంపెనీలను అనుమతులిస్తే...సామాజిక బాధ్యత లేకుండా వ్యాపార కోణంలోనే ఆలోచిస్తాయి. ఇప్పుడు స్టీల్‌ప్లాంట్‌ను కూడా మరో విదేశీ కంపెనీకి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు.'' అని ఏపీ, తెలంగాణా మానవ హక్కుల సంఘం కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు వీఎస్.కృష్ణ అన్నారు.

ఎల్జీ పాలిమర్స్
ఫొటో క్యాప్షన్, ఎల్జీ పాలిమర్స్ సంస్థ (ఫైల్ ఫొటో)

కోర్టులో కేసు

ఎల్జీ పాలీమర్స్‌ సంస్థలో ఉత్పత్తులు, యంత్రాలను విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని విశాఖ జిల్లా కలెక్టర్‌ వద్ద జమ చేయాలని గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది.

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఎల్జీ పాలిమర్స్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

''మృతులు, బాధితుల కుటుంబాలకు ఇప్పటికే రూ. 37.10 కోట్ల పరిహారం చెల్లించాం. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ ఆదేశాల ప్రకారం రూ.50 కోట్లు డిపాజిట్ చేశాం.

అందువల్ల ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఉన్న ఉత్పత్తులు, ముడి సరకు అమ్మగా వచ్చిన సొమ్మును కలెక్టర్‌ వద్ద జమ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలి'' అని పాలిమర్స్ తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు.

ఈ వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ఇతర సంస్థలకు తమ వాదన తెలపాలంటూ నోటీసులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)