India COVID: ఆక్సిజన్ దొరికితేనే ఆయువు.. దిల్లీ ప్రజల నిస్సహాయ స్థితి

- రచయిత, వికాస్ పాండే
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
భారత్‌లో వరుసగా నాలుగో రోజు 3 లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 3,49,691 పాజిటివ్ కేసులు నమోదవగా2,767 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలతో రాజధాని దిల్లీ కూడా ఒకటి.
ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రజలంతా తీవ్ర నిరాశనిస్పృహలో కూరుకుపోయారు.
అశ్విన్ మిత్తల్ బామ్మ కరోనావైరస్ బారినపడడంతో ఆమె శరీరంలో ఆక్సిజన్ స్థాయి గతవారం పడిపోయింది. అప్పటి నుంచి అశ్విన్ ఆసుపత్రి బెడ్ కోసం అనేక ప్రయత్నాలు చేశారు.
ఎన్ని ఆసుపత్రులకు ఫోన్ చేసినా ఎక్కడా బెడ్ దొరకలేదు.
గురువారం సరికి ఆమె పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో ఆమెను తీసుకుని ఆసుపత్రులన్నీ తిరిగారు అశ్విన్. అన్ని ఆసుపత్రులలోనూ ఎమర్జెన్సీ రూములన్నీనిండిపోయి ఉన్నాయి. ఎక్కడా చేర్చుకోలేదు. చికిత్స దొరక్కపోతే ఆమె చనిపోతారనీ చెప్పేశారు.
చాలా ఆసుపత్రులు తిరిగిన తరువాత అశ్విన్ బామ్మకు ఉత్తర దిల్లీలోని ఓ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్చుకున్నారు. అది కూడా కొద్దిగంటలే ఉంచగలమని వారు చెప్పారు. దాంతో అశ్విన్ మళ్లీ హాస్పిటల్ బెడ్స్ కోసం తన ప్రయత్నాలు ప్రారంభించారు.
అశ్విన్ కూడా కరోనా పాజిటివ్.. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులతోనే ఆయన ఆసుపత్రులన్నీ తిరిగారు. కానీ, ఎక్కడా బెడ్ దొరకలేదు. చివరకు అశ్విన్ బామ్మను ఎమర్జెన్సీ వార్డులో చేర్చుకున్న ఆసుపత్రి ఆమెకు అక్కడే చికిత్స కొనసాగించింది.
అయితే, ఆమెను ఐసీయూలో చేర్చాలని.. లేకపోతే బతకడం కష్టమని అక్కడి వైద్యులు చెప్పారు. ఆ ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ నిల్వలు అయిపోతున్నాయని.. అందుకే వారు ఆమెను డిశ్చార్జ్ చేయాలని చూస్తున్నారని అశ్విన్‌కు ఆయన కుటుంబ స్నేహితులు చెప్పారు.
దిల్లీలోని చాలా ఆసుపత్రులలో ఇదే పరిస్థితి. ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఒకటీరెండు బెడ్‌లు ఖాళీగా ఉన్న ఆసుపత్రులు కూడా ఆక్సిజన్ సరఫరా లేక కొత్తగా రోగులను చేర్చుకోవడం లేదు.
కొందరికి బెడ్‌లు దొరికినా కూడా ఆక్సిజన్ సదుపాయం ఉన్న అంబులెన్స్‌లు దొరకడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
సకాలంలో ఆక్సిజన్ అందక ఇప్పటికే చాలామంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రతి ఉదయం కూడా ఆసుపత్రి బెడ్‌ల కోసమో.. ఆక్సిజన్ సిలిండర్‌ల కోసమో సాయమడిగే వారి ఫోన్ కాల్స్‌తోనే మొదలవుతోంది.
అయితే, గతంలో సాయం చేయగలిగే స్థితిలో ఉన్న డాక్టర్లు, అధికారులు కూడా ఇప్పుడు నిస్సహాయంగా ఉండడం, ఫోన్‌లో దొరక్కపోతుండడంతో ఒకరిద్దరికి మినహా సాయం చేయలేపోతున్నాం.
ఓడిపోయాననే బాధతోనే ప్రతి రోజూ నిద్రలోకి వెళ్తున్నాను. సహాయం కోరుతున్నవారి బాధను నేను అర్థం చేసుకోగలను. కొద్దిరోజుల కిందట దిల్లీలోని ఓ పెద్ద ఆసుపత్రిలో నా కజిన్ కూడా చనిపోయారు. వెంటిలేటర్ కోసం 18 గంటల పాటు నిరీక్షించినా దొరక్కపోవడంతో ప్రాణాలు కాపాడలేకపోయాం.
దిల్లీలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సహాయం కోసం చూస్తున్నవారు సోషల్ మీడియాలోనూ అభ్యర్థనలు పెడుతున్నారు.
ఆసుపత్రి బెడ్ దొరకడమన్నది ఇప్పుడు దిల్లీలో దాదాపు అసాధ్యంగా మారిపోయింది. ఆక్సిజన్ సిలిండర్లు, మందులకూ కొరతే.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో గత కొద్దిరోజులుగా ప్రతి రోజూ 24 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
ఆసుపత్రులన్నీ వాటి సామర్థ్యానికి మించి నిండిపోయాయి. హెల్త్ కేర్ వర్కర్స్ కూడా అలసిపోయారు.
కొందరైతే దిల్లీలో ఇక వైద్యం దొరకదని అర్థం చేసుకుని క్లిష్ట పరిస్థితులలో ఉన్న తమవారిని తీసుకుని 400-500 కిలోమీటర్ల దూరంలోని ఇతర నగరాలకు తీసుకువెళ్తున్నారు.
శివేశ్ రాణా అనే వ్యక్తి తన సోదరుడి కోసం దిల్లీలో ఆసుపత్రి బెడ్ కోసం ప్రయత్నించి విఫలమై పొరుగు రాష్ట్రం హరియాణాలోని ఓ నగరానికి తీసుకెళ్లారు.
అయితే, ఆ అంబులెన్స్‌లో క్రిటికల్ కేర్ ఎక్విప్‌మెంట్ లేకపోవడంతో రోగి పరిస్థితి క్షీణించింది. ఆసుపత్రిలో చేర్చిన కొద్ది గంటల్లోనే రోగి మరణించారు.
కేరళ రాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్‌కు చెందిన డాక్టర్ ఫతాఉద్దీన్ మాట్లాడుతూ.. ''ఇలాంటి సంక్షోభం మునుపెన్నడూ లేదు.. ఆక్సిజన్ సరఫరా లేకపోతే వైద్యులు కూడా ఏమీ చేయలేరు'' అన్నారు.
''వెంటిలేటర్లు, బైపాప్ మెషీన్లు సాఫీగా పనిచేయాలంటే హైప్రెజర్ ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్ ప్రెజర్ తగ్గితే మెషీన్ నుంచి రోగి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ఆక్సిజన్ తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు పోవచ్చు'' అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
రోగులకు కనీస చికిత్స అందక చనిపోతున్న ఈ తరుణంలో తక్షణం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
''తక్కువ సమయంలోనే తాత్కాలిక ఆసుపత్రులను, ఐసీయూ బెడ్‌లను ఏర్పాటు చేయడంలో ఇండియన్ ఆర్మీకి ప్రపంచంలోనే మంచి పేరుంది. వారి సేవలను ఉపయోగించుకోవాలి'' అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీయే కాదు దేశంలోని పుణె, నాసిక్, లఖ్‌నవూ, భోపాల్, ఇండోర్ వంటి ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది.
చాలా నగరాల్లో కోవిడ్ టెస్ట్ చేయించుకోవడమూ కష్టమవుతోంది.. చేయించుకున్నా రిపోర్టు రావడమూ ఆలస్యమవుతోంది. వైరస్ శరవేగంగా వ్యాపిస్తుండడంతో టెస్టులు చేసే ల్యాబ్‌లపైనా తీవ్ర ఒత్తిడి ఉండడమే దీనికి కారణం.
ఇవి కూడా చదవండి:
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
- కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయా?వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








