స్టైలిష్‌గా కనిపించే ఈ 'హిడెన్ డోర్ హ్యాండిల్స్‌' ప్రమాదకరమా? చైనా ఎందుకు నిషేధించింది?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

చదివే సమయం: 4 నిమిషాలు

ఎలక్ట్రిక్ వాహనాల్లో పైకి కనిపించని డోర్ హ్యాండిళ్లను (హిడెన్ డోర్ హ్యాండిల్స్) చైనా నిషేధించింది.

ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ద్వారా ప్రాచుర్యం పొందిన ఈ వివాదాస్పద డిజైన్‌ను నిషేధించిన మొదటి దేశంగా చైనా నిలిచింది.

భారత్‌లోనూ కొన్ని కంపెనీల కార్లకు ఇలాంటి హ్యాండిల్స్ కనిపిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా, ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ఏజెన్సీలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న తరుణంలో, చైనా ఈ నిర్ణయం తీసుకుంది.

చైనాలో నిషేధానికి షావోమీ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన రెండు ప్రమాదాలు కారణం. ఆ రెండు తీవ్రమైన ప్రమాదాల్లోనూ విద్యుత్ సరఫరా వైఫల్యం కారణంగా కారు డోర్లు తెరుచుకోలేదు.

గత అక్టోబర్‌లో అలాంటి ఒక ప్రమాదం గురించి చైనా అధికారిక మీడియాలో వార్తలొచ్చాయి. షావోమీ ఎస్‌యూ 7 అల్ట్రా సెడాన్ కారు డ్రైవర్ ఆ ప్రమాదంలో మరణించారు. ప్రమాదం జరిగినప్పుడు, అటుగా వెళ్తున్న వారు డ్రైవర్‌ను రక్షించడం కోసం డోర్ తీసేందుకు ప్రయత్నించారు. కానీ, డోర్ తెరుచుకోలేదని కథనాల్లో పేర్కొన్నారు.

రాయిటర్స్ కథనం ప్రకారం, ఈ ప్రమాద ఘటనపై షావోమీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. చైనా నూతన విధానంపై కూడా ఆ కంపెనీ ఇంకా స్పందించలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందా?

చైనా ప్రభుత్వ మీడియా ప్రకారం.. కార్ల డోర్ లోపల, బయట మెకానికల్ డోర్ హ్యాండిల్స్ తప్పనిసరి. లేకుంటే అలాంటి వాహనాల విక్రయాలను కొత్త నిబంధనలు అనుమతించవు. ఈ కొత్త రూల్స్ 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

చైనా ఇండస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, ప్రతి ప్యాసింజర్ డోర్‌కు బయట వైపు 6 సెంమీ x 2 సెంమీ x 2.5 సెంటీమీటర్ల కొలతలతో సులువుగా తెరించేందుకు వీలుగా డోర్ హ్యాండిల్ ఉండాలి. బూట్‌(డిక్కీ)కు మినహా అన్ని డోర్లకూ ఇది వర్తిస్తుంది.

లోపలి వైపు కనీసం 1 సెం.మీ x 0.7 సెంటీమీటర్ల కొలతలతో, డోర్ ఎలా తెరవాలో తెలిపే సూచికతో డోర్ హ్యాండిల్ ఉండాలి. అయితే, ఇప్పటికే అధికారికంగా ఆమోదం పొంది, చైనా మార్కెట్లెకి ప్రవేశించేందుకు చివరి దశలో ఉన్న కార్ల డిజైన్‌ను అప్డేట్ చేసుకునేందుకు మరో రెండేళ్ల గడువునిచ్చారు.

చైనాలోని న్యూ ఎనర్జీ వెహికల్స్(ఎన్‌ఈడబ్ల్యూ)లో ఈ తరహా హిడెన్ హ్యాండిల్స్ విరివిగా వాడుతున్నారు. వాటిలో ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ కార్లతో పాటు ఇంధనంతో నడిచే మోడళ్లు కూడా ఉన్నాయి.

ప్రభుత్వ నియంత్రణలోని చైనా డైలీ వార్తాపత్రిక డేటా ప్రకారం, చైనాలో ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 100 ఎన్‌ఈవీలలో 60 శాతం వాహనాలకు ఇలాంటి హ్యాండిల్సే ఉంటున్నాయి.

ఈ కొత్త నిబంధనలు చైనా మార్కెట్‌లో విక్రయించే మోడళ్లకు మాత్రమే వర్తిస్తాయి. అయితే, ప్రపంచ కార్ల మార్కెట్‌లో చైనా ప్రాబల్యం కారణంగా ఈ నిబంధనలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశముంది.

టెస్లా డోర్ హ్యాండిల్స్‌ గురించి అమెరికాలోనూ భద్రతాపరమైన పరిశీలన జరుగుతోంది. యూరప్‌లోనూ ఇలాంటి హ్యాండిల్స్‌కు సంబంధించిన నిబంధనలపై చర్చలు జరుగుతున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలోనూ దర్యాప్తు

టెస్లా ఎలక్ట్రిక్ కార్ల డోర్ హ్యాండిల్స్‌పై దృష్టి సారించిన యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ) నవంబర్‌లో దర్యాప్తు ప్రారంభించింది.

డోర్ హ్యాండిల్స్ అకస్మాత్తుగా పనిచేయకపోవడం, దాని కారణంగా పిల్లలు కార్ల లోపల చిక్కుకుపోవడం వంటి కథనాల నేపథ్యంలో ఎన్‌హెచ్‌టీఎస్ఏ విచారణ చేపట్టింది.

టెస్లాకు చెందిన 2021 మోడల్ Y కార్ల హ్యాండిల్స్ గురించి 9 ఫిర్యాదులు అందినట్లు ఆ సంస్థ తెలిపింది. టెస్లా Y మోడల్‌ కార్లకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల్లో, సమస్య నుంచి బయటపడేందుకు నలుగురు యజమానులు కారు అద్దాలు పగలగొట్టాల్సి వచ్చింది.

భారత్‌లోనూ కొన్ని కంపెనీలు హిడెన్ డోర్ హ్యాండిల్స్‌ వాహనాలను విక్రయిస్తున్నాయి. కొన్ని టాటా మోటార్స్ కార్లకు కూడా ఇలాంటి హిడెన్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.

వీటితో పాటు దక్షిణ కొరియాకు చెందిన కార్ల కంపెనీ కియా కూడా భారత్‌లో విక్రయిస్తున్న కొన్ని కార్ల మోడళ్లలో ఫ్లష్ ఫిట్టెడ్ డోర్ హ్యాండిల్స్‌ను వినియోగిస్తోంది. అలాగే, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన కొన్ని వాహనాలు కూడా హిడెన్ డోర్ హ్యాండిల్స్‌తో వస్తున్నాయి.

ఎస్ అండ్ పీ గ్లోబల్ మొబిలిటీలో ఇండియా అండ్ ఏసియన్ ఆటోమోటివ్ మార్కెట్స్ డైరెక్టర్ పునీత్ గుప్తా బిజినెస్ టుడేతో మాట్లాడుతూ, "ప్రపంచంలో కార్ల అతిపెద్ద తయారీదారు అయిన చైనా ఈ అంశాన్ని లేవనెత్తింది. పరిస్థితి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ను నిషేధించే స్థాయికి చేరిందంటే, దానికి సరైన(ఆచరణాత్మక) పరిష్కారం దొరకలేదని అర్థం. అలాంటి హ్యాండిల్స్‌ను నిషేధించడం వంటి కఠిన చర్యలకు పూనుకుంటే, భారత్ కూడా హిడెన్ హ్యాండిల్స్‌ వల్ల తలెత్తే భద్రతాపరమైన అంశాలను పున:పరిశీలన చేయాల్సి ఉంటుంది" అని అన్నారు.

"విద్యుత్ సాయంతో పనిచేసే అలాంటి హ్యాండిల్స్ ప్రమాదాల సమయంలో పనిచేయకపోవచ్చు. అలాంటి విద్యుత్ ఆధారిత ఫీచర్ల కారణంగా హై ఎండ్ కార్లలో బ్యాటరీపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అలాంటప్పుడు బ్యాటరీ దిగిపోయే ప్రమాదముంటుంది. ఫలితంగా, ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు తలుపులు తెరవలేకపోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇది మరింత ప్రమాదకరం" అన్నారాయన.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)