భారత్ ఆర్థిక వృద్ధి ఆశాజనకంగా ఉన్నా స్టాక్ మార్కెట్లు ఎందుకు పతనమవుతున్నాయి - 5 కారణాలు

Indian Stock Market
ఫొటో క్యాప్షన్, 2026లో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన ప్రధాన ఈక్విటీ మార్కెట్‌లలో భారత్ ఒకటి
    • రచయిత, నిఖిల్ ఇమాన్దార్,
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల షాక్‌లు, వడ్డీ రేట్ల పెరుగుదల, సుంకాల అనిశ్చితి, వాతావరణ సంబంధిత అంతరాయాలు ఉన్నప్పటికీ, భారత్ ఆర్థికవ్యవస్థ 7శాతం వృద్ధిరేటుతో ఆశాజనంగా ముందుకు సాగుతోంది.

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, 2026లో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన ప్రధాన ఈక్విటీ మార్కెట్‌లలో కూడా ఒకటిగా ఉంది. నిజానికి భారతీయ స్టాక్స్‌లో జరుగుతున్న ఈ పతనం ఇటీవల వారాలలో మరింత తీవ్రమైంది.

దేశంలోని అతిపెద్ద కంపెనీల పనితీరును ప్రతిబింబించే బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ, వరుసగా ఎనిమిది వారాల నష్టాల తర్వాత సోమవారం నుంచి స్వల్పంగా కోలుకున్నాయి. ఇది గత 25 ఏళ్లలో భారత్ స్టాక్‌ మార్కెట్‌ ఎదుర్కొన్న అత్యంత దీర్ఘకాల నష్టాల పరంపర అని రాయిటర్స్ తెలిపింది.

నిఫ్టీలో పెట్టుబడి పెట్టిన భారత్‌లోని సాధారణ పెట్టుబడిదారులు ఈ ఏడాది తమ సంపదలో సుమారు 15 శాతం నష్టాన్ని చవిచూశారు. అదే సమయంలో, వారు దక్షిణ కొరియా కోస్పి సూచిలో పెట్టుబడి పెట్టి ఉంటే జనవరి నుంచి 62 శాతం లాభాలు, గత రెండేళ్లలో 170 శాతం వరకు రాబడులు పొందేవారు.

మొత్తంగా చూసుకుంటే, గత పదేళ్లలో విదేశీ పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్‌లో పెట్టిన పెట్టుబడుల నుంచి వారు విక్రయించిన లేదా వెనక్కి తీసుకున్న మొత్తాన్ని తీసివేస్తే మిగిలే నికర పెట్టుబడి దాదాపు సున్నాకు చేరుకుంది. అలాగే బెర్న్‌స్టీన్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం, గత రెండేళ్లలోనే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుంచి భారీగా 40 బిలియన్ డాలర్లు ఉపసంహరించుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మ్యూచువల్‌ ఫండ్స్ వంటి పెట్టుబడి సాధనాల్లో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు, రిటైల్ పెట్టుబడిదారుల నుంచి పెద్దఎత్తున డబ్బు వస్తుండటం భారత్ స్టాక్‌మార్కెట్‌లు భారీ పతనానికి చేరకుండా అడ్డుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత్‌లోని మ్యూచువల్‌ ఫండ్స్ నిర్వహణలో ఉన్న దేశీయ ఆస్తుల విలువ 2016లో సుమారు 125 బిలియన్ డాలర్ల నుంచి ఈ ఏడాది దాదాపు 900 బిలియన్ డాలర్లకు పెరిగింది. అదే సమయంలో, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే భారతీయుల సంఖ్య మూడింతలకు పైగా పెరిగి 15 కోట్ల మందికి చేరుకుంది.

దీంతో ఇటీవలి మార్కెట్ పతనం మరింత ఆందోళనకరంగా మారుతోంది. ఎందుకంటే, ఇప్పటికే బలహీనమైన ఉద్యోగ మార్కెట్, అధిక ద్రవ్యోల్బణం, మందగించిన వినియోగ వ్యయం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు ఇప్పుడు తమ షేర్లు, ఈక్విటీ ఫండ్స్‌లో చేసిన పొదుపు కూడా విలువ కోల్పోతున్న పరిస్థితి ఎదుర్కొంటున్నాయి.

మరి తప్పటడుగులు ఎక్కడపడుతున్నాయి?

భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతున్నప్పటికీ, ఆ ఊపు స్టాక్ మార్కెట్‌లో ఎందుకు కనిపించడం లేదో చెప్పే ఐదు కారణాలు ఇవే.

Crude Oil, Indian Stock Market
ఫొటో క్యాప్షన్, భారత్ తన చమురు అవసరాల్లో 90శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది.

1. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు

హార్ముజ్ జలసంధి గుండా నౌకాయానానికి ఏర్పడిన అంతరాయాల కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 90 నుంచి 100 డాలర్ల మధ్య కొనసాగుతున్నాయి. ఇది విశ్లేషకులు ఊహించినదాని కంటే ఎక్కువగా, ఇప్పుడు ఎనిమిదో నెలలోకి ప్రవేశించింది. అంతేకాక, ఈ పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందనే విషయంపై కూడా స్పష్టత కనిపించడం లేదు.

"ఈ ఒక్క అంశమే మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది" అని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అసెట్ మేనేజ్మెంట్ ఇండియాకు చెందిన ఫండ్ మేనేజర్ హరి శ్యాంసుందర్ బీబీసీతో చెప్పారు. "ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 70 నుంచి 90 డాలర్ల మధ్య ఉంటే మార్కెట్లు వాటిని తట్టుకోగలవు. కానీ ధరలు 100 డాలర్లను దాటితే, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక సూచీలపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే కంపెనీల ఆదాయాలు, లాభాల మార్జిన్లపై ప్రభావం పడుతుంది" అని వివరించారు.

భారత్ తన ఇంధన అవసరాల్లో 90 శాతానికిపైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశానికి అవసరమైన ముడి చమురు దిగుమతుల్లో దాదాపు సగం, అలాగే భారీ మొత్తంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ సరఫరా కూడా హార్ముజ్ జలసంధి గుండా వస్తాయి.

దీంతో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను పెంచే ప్రయత్నం చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇటీవల మాస్కోతో వ్యాపారం చేసే దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరిచండం పరిస్థితులను మరింత క్లిష్టంగా మార్చింది.

2. వడ్డీ రేట్లు పెరుగుదల

చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం కూడా పెరుగుతోంది. దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ బాండ్లపై వచ్చే రాబడి 5 శాతానికి పైగా ఉంది. ఇది గత 25 ఏళ్లలో నమోదైన అత్యధిక స్థాయికి చేరువలో ఉంది.

వీటిని సురక్షితమైన పెట్టుబడులుగా భావిస్తారు. అందువల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, విదేశీ పెట్టుబడిదారులు భారత్ స్టాక్‌మార్కెట్‌ వంటి ఎక్కువ ప్రమాదం ఉన్న పెట్టుబడుల నుంచి డబ్బు తీసుకొని, అమెరికా బాండ్ల వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు.

3. రూపాయి పతనం

విదేశీ పెట్టుబడిదారులకు తక్కువ రాబడుల సమస్యకు రూపాయి పతనం తోడైంది. భారత కరెన్సీ విలువ పడిపోవడంతో, డాలర్లలో లెక్కించినప్పుడు వారి పెట్టుబడులపై వచ్చే నిజమైన రాబడి మరింత తగ్గిపోయింది.

గత పదేళ్లలో డాలర్ల పరంగా నిఫ్టీ సగటున ఏడాదికి కేవలం 6 శాతం రాబడినే ఇచ్చింది. ఇతర పోటీ మార్కెట్‌లతో పోలిస్తే ఇది పెద్దగా ఆకర్షణీయమైన రాబడి కాదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు

Indian Stock Market
ఫొటో క్యాప్షన్, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే, భారతీయ స్టాక్‌లు,వాటి రాబడితో పోల్చుకుంటే ఇప్పటికీ ఖరీదుగానే ఉన్నాయి

4. భారతీయ షేర్లు చౌకైనవే కానీ..

గత రెండేళ్లుగా మార్కెట్‌లో జరిగిన పతనం వల్ల, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్‌లతో పోలిస్తే భారతీయ షేర్ల ప్రీమియం కొంత తగ్గింది.

"గత పదేళ్ల సగటుతో పోలిస్తే ప్రస్తుతం షేర్ల ధరలు కొంత చౌకగా ఉన్నాయి," అని శ్యాంసుందర్ అంటున్నారు. అలాగే, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్‌లతో పోలిస్తే భారత షేర్లకు ఉన్న అదనపు విలువ కూడా గత కొన్ని సంవత్సరాల్లో గణనీయంగా తగ్గిందని తెలిపారు.

అయితే, భారత్ షేర్ల ధరలు కొంత తగ్గినా, కంపెనీల లాభాలతో పోలిస్తే మాత్రం అవి ఇంకా ఖరీదైనవిగానే ఉన్నాయి. కృత్రిమ మేధ(AI) బూమ్‌తో దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాల్లోని సంస్థల లాభాలు గణనీయంగా పెరగడంతో అక్కడి మార్కెట్‌లు పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మారాయి.

5. ఏఐ రంగం ఏమైంది?

భారత్ అభివృద్ధి కథనంలో ఏఐ పాత్ర కనిపించడం లేదు.

"భారత్‌లోని అనేక పెద్ద కంపెనీలు పాత ఆర్థిక వ్యవస్థలోనివే" అని ఇటీవల ఒక నివేదికలో బెర్న్‌స్టీన్ రిసెర్చ్‌ పేర్కొంది. "ఈ కంపెనీల్లో చాలా వరకు భవిష్యత్ అవకాశాలపై పెట్టుబడులు పెట్టడంలేదు. దీనికి బదులుగా, గతంలో ఏర్పరుచుకున్న వ్యాపార బలాన్ని కాపాడుకోడానికి ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. అలాగే, అంతర్జాతీయ పోటీ నుంచి ప్రభుత్వ విధానాలు తమను రక్షిస్తూనే ఉంటాయని ఆశిస్తున్నాయి" అని ఆ నివేదిక వ్యాఖ్యానించింది.

అలాగే, భారత్‌లోని చిన్న కంపెనీలు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులను ఆకర్షించే స్థాయికి ఇంకా ఎదగలేదు.

భారతీయ కంపెనీలు డేటా సెంటర్లు, చిప్ తయారీ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, అమెరికాలోని ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్, చైనాలోని డీప్‌సీక్ లాంటి ప్రపంచస్థాయి ఏఐ దిగ్గజ సంస్థలతో పోటీ పడే ఉత్పత్తులు రావడం లేదు. ఏఐ వాల్యూ చైన్‌లో అత్యధిక లాభాలు అందించే విభాగం ఇదే.

ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న కొత్త రంగాల్లో ప్రపంచస్థాయిలో పోటీపడే పరిశ్రమలను భారత్ రూపొందించగలిగితేనే విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తి మళ్లీ భారీగా పెరుగుతుందని బెర్న్‌స్టీన్ చెప్పింది.

"అంతరిక్షం, రక్షణ, చిప్ తయారీ, అధునాతన సాంకేతిక రంగాల్లో భారత్ పురోగతి సాధిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ రంగాలు ఇంకా చిన్నవిగానే ఉండటంతో విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడి నిర్ణయాలను మార్చుకునేంత ప్రభావాన్ని ఇప్పుడే చూపలేకపోతున్నాయి" అని ఆయన తెలిపారు.

Indian Stock Market
ఫొటో క్యాప్షన్, మార్కెట్ కరెక్షన్ ఉన్నప్పటికీ, మ్యూచువల్ ఫండ్లలో దేశీయ పొదుపు తగ్గలేదు.

భవిష్యత్తు ఏమిటి?

రాబోయే రోజుల్లో భారత్ స్టాక్ మార్కెట్‌ దిశను నిర్ణయించే ఎన్నో కీలక అంశాలు ఉన్నాయి.

"అంతర్జాతీయ భౌగోళిక- రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం, భారతీయ షేర్ల విలువలు పెట్టుబడిదారులకు కొంత ఆకర్షణీయంగా మారడం వల్ల విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల నిధుల ప్రవాహం మళ్లీ పెరగవచ్చు" అని కేర్‌ఎడ్జ్‌ బ్రోకరేజ్ పేర్కొంది. అయితే, వాణిజ్య ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల మాత్రం రాబోయే కాలంలో కంపెనీల పనితీరుకు సవాల్‌గా మిగిలే అవకాశం ఉందని ఆ సంస్థ పేర్కొంది.

ప్రస్తుతం విదేశీ పెట్టుబడిదారులు భారత్ మార్కెట్‌పై ఆశలు వదులుకున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, ఆందోళన పెరుగుతున్నా భారతీయ పొదుపుదారులు మాత్రం మ్యూచువల్ ఫండ్లలో ప్రతి నెలా చేస్తున్న పెట్టుబడులను తగ్గించడం లేదు.

భవిష్యత్‌లో మార్కెట్ మరింత తీవ్రంగా పడిపోయినా, భారతీయ పెట్టుబడిదారులు ఇదే స్థిరత్వం, సహనాన్ని కొనసాగిస్తారా లేదా? ఇదే అసలైన పరీక్ష.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)