ఎలక్ట్రిక్ వాహనాలలో ప్రయాణిస్తుంటే కొంతమందికి వికారం కలగడానికి కారణమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గ్రేస్ డీన్
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
రోడ్డు పక్కన కారు ఆపమని లోలా బైర్డ్ తన బాయ్‌ఫ్రెండ్‌ను అడిగారు. వారు ప్రయాణం మొదలుపెట్టి 40 నిమిషాలైంది. కానీ ఆమెకు కడుపులో తిప్పడం మొదలైంది. ఒకటే వికారం. అందుకే కారు దిగిన వెంటనే వాంతి చేసుకున్నారు.
లోలా వయసు 24 ఏళ్ళు. ఆమె ఉత్తర లండన్‌కు చెందినవారు. ఆమె ఏనాడూ మోషన్సిక్ నెస్‌కు గురికాలేదు. కానీ రెండేళ్ళ కిందట ఆమె బాయ్‌ఫ్రెండ్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) కొన్నప్పటి నుంచి ఇది మొదలైంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించినప్పుడల్లా ఆమెకు ‘‘తీవ్ర వికారం’’ కలిగేది.
ఈ సమస్య ఆమెకు ఎంత తీవ్రంగా అనిపించిందంటే, ఈవీని మార్చేయమని ఆమె తన బాయ్ ఫ్రెండ్‌ను అడిగారు.
ఇలాంటి సమస్య లోలాకు మాత్రమే లేదు. తాము, తమ పిల్లలు కూడా ఈవీలలో ఇలాంటి వికారానికి గురైనట్టు కొంతమంది బీబీసీ న్యూస్‌కు చెప్పారు. కానీ ఈవీలను నడిపే చాలామంది డ్రైవర్లు తమకు ఇలాంటి ఇబ్బందులేవీ లేవన్నారు.
మరి ఈ సంఘటనలన్నీ ప్రయాణంలో వికారం గురించి ఏం చెబుతున్నాయి?

లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌లో అనాటమీ అండ్ బయో మెకానిక్స్‌లో సీనియర్ లెక్చరర్ డాక్టర్ ఐరీన్ డి జూలియో చేస్తున్న పరిశోధనలలో మోషన్సిక్ నెస్ కూడా భాగంగా ఉంది. కొంతమందికి సాధారణ వాహనాలలో కంటే ఈవీలలోనే ఎక్కువ వికారానికి గురవుతున్నట్టుగా పరిశోధనలో గుర్తించినట్టు చెప్పారు.
కళ్లు తిరగడంపై స్పెషలైజేషన్ చేసిన షికాగోకు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ నికోలస్ హాక్ తన పేషెంట్లలో కొంతమంది నుంచి ఇలాంటి సమస్యలు విన్నట్టు చెప్పారు. ‘‘ఈవీలలో తాము వికారానికి గురవుతున్నట్టు వారు గుర్తించారు’’ అని ఆయన తెలిపారు. నేను దీని గురించి చాలాసార్లు విన్నా. నెలకు ఇద్దరైనా ఇలాంటి సమస్యతో కనిపిస్తారు అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Lola Baird
అయితే, ఈవీలకు, వికారానికి మధ్య ఏదైనా సంబంధం ఉందనే అంశంపై పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని కొందరు విద్యావేత్తలు చెబుతున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్‌లో మోషన్ సిక్నెస్పై పరిశోధన చేసిన డాక్టర్ బిల్ యేట్స్ మాట్లాడుతూ, ఈ విషయానికి సంబంధించిన పరిశోధనా సమాచారం "ప్రస్తుతానికి చాలా తక్కువగా ఉంది" అని చెప్పారు.
"కొన్ని వ్యక్తిగత అనుభవాలు వినబడుతున్నప్పటికీ, దీనిపై ఇంకా ఎలాంటి లోతైన లేదా విస్తృతమైన అధ్యయనాలు జరగలేదు" అన్నారు బిల్ యేట్స్.

ఫొటో సోర్స్, Mark Quigg
‘ మా అమ్మాయికి ఈవీ ప్రయాణం పడటం లేదు’
లింకల్న్షైర్కి చెందిన మార్క్ క్విగ్ (45), తక్కువ నిర్వహణా ఖర్చును దృష్టిలో పెట్టుకొని కిందటేడాది ఓ విద్యుత్ కారు కొన్నారు. అందులో ప్రయాణించడం అద్భుతంగా ఉందని కానీ 9 ఏళ్ల తన కుమార్తెకు మోషన్ సిక్నెస్ మరింత తీవ్రమైందని వెల్లడించారు.
స్కూల్ సెలవుల్లో ఫ్రాన్స్‌కు వెళ్లే 600 మైళ్ల సుదీర్ఘ ప్రయాణాల్లో మాత్రమే ఆమెకు గతంలో వికారం కలిగేది. కానీ ఇప్పుడు, కనీసం దగ్గర్లోని నగరానికి వెళ్లే 30 నిమిషాల చిన్న ప్రయాణంలో కూడా తన కుమార్తె అసౌకర్యానికి గురవుతోందనిఆయన చెబుతున్నారు.
ఎలక్ట్రిక్ వెహికల్ డ్రైవర్స్ అసోెసియేషన్ ఈవీఏకి సీఈఓగా వ్యవహరిస్తున్న వికీ ఎడ్మండ్స్ మాట్లాడుతూ ‘‘ఇది ఎప్పుడూ ఒక సమస్య కాలేదు’’ అన్నారు.
ఎలక్ట్రిక్ వాహనచోదకుల సంఘమైన 'ఈవీఏ ఇంగ్లాండ్' సీఈఓ విక్కీ ఎడ్మండ్స్ మాట్లాడుతూ, తమ సభ్యులలో మోషన్ సిక్నెస్ ఒక సమస్యే కాదని చెప్పారు. " ఇప్పటివరకు ఒక సమస్యగాఇదెప్పుడూ మా ముందుకు రాలేదు" అని ఆమె అంటారు.
అయితే, యూకే వ్యాప్తంగా షోరూమ్‌లను కలిగి ఉన్న చైనా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'ఎక్స్‌పెంగ్' గతంలో బహిరంగంగానే ఈ సమస్యను ప్రస్తావించింది. ఈవీలకు మోషన్ సిక్నెస్కి మధ్య సంబంధం ఉందని గుర్తించిన పలువురు వ్యక్తులను ఉద్దేశించి, "ఇది న్యాయమైన ప్రశ్న. ఇది ఎంతమాత్రం మీ ఊహ కాదు. ఇవి విద్యుత్ వాహనాల తయారీ విధానం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్" అని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images/Cyndi Monaghan
కారణమేంటి..
మోషన్ సిక్నెస్ "జ్ఞానేంద్రియ సంకేతాల మధ్య సమన్వయ లోపం వల్ల వస్తుందని’’ హాక్ చెబుతున్నారు. మనం కదులుతున్నామని గుర్తించడానికి మనం కళ్లతో చూసే విషయాలు, మన చెవి గ్రహించే శబ్దాలు, మన నాడీ వ్యవస్థ స్పర్శ ద్వారా తెలుసుకునే వాటిపై మన శరీరం ఆధారపడుతుంది. వీటిలో ఏ ఒక్కటి మిగతా వాటితో అనుసంధానం కాకపోయినా, అంటే మీరు ఫోన్ చూసుకుంటూ, కిటిలోంచి బయట కదలికలను చూడకపోవడం కూడా మోషన్ సిక్నెస్కు దారితీస్తుంది. అని తెలిపారు.
అయితే ఇలాంటి భావన ఈవీలలో ఎక్కువగా కలగడానికి అనేక కారణాలు ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
"వాహనాల్లో వచ్చే శబ్దంతో మనం కదులుతున్నాం అనే భావన ఏర్పడుతుంది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో మనకు అదే అలవాటైంది. కానీ, ఈవీలలో ఎలాంటి శబ్దం గానీ, వైబ్రేషన్ గానీ లేకపోవడంతో మనకు అలాంటి భావన ఏర్పడదు. దీంతో మోషన్ సిక్నెస్ వస్తుంది" అని డి జూలియో చెప్పారు.
ఒక్కసారిగా కారు వేగాన్ని మార్చినప్పుడు ఏర్పడే కుదుపుల్లో వచ్చే తేడా కూడా ఇందుకు కారణం అని హాక్ వివరించారు.
కొందరు వ్యక్తులకు మోషన్ సిక్నెస్ ముప్పు అధికంగా ఉంటుందని, అందులో జన్యుపరమైన ప్రభావం చాలా ఎక్కువని హాక్ చెబుతున్నారు. మహిళలు, చిన్నారులు దీని బారినపడే ప్రమాదం ఎక్కువని నిపుణులు అంటున్నారు.
"8 నుంచి 10 ఏళ్ల వయసు వారిలో మోషన్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత తగ్గుముఖం పడుతుంది" అని యానివర్సిటీ ఆఫ్ వెస్ట్మిన్స్టర్ ప్రొఫెసర్ జాన్ గోల్డింగ్ తెలిపారు.
ఈవీల ప్రాముఖ్యం పెరిగేకొద్దీ వాటికి దూరంగా ఉండటం సవాలుగా మారొచ్చు. రవాణా విభాగం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2026 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో యూకేలో ఈవీల రిజిస్ట్రేషన్లు 40.5శాతం పెరిగాయి.
యూకేలో పూర్తిగా పెట్రోల్ లేదా డీజిల్ ఆధారిత కార్లపై 2030 నుంచి నిషేధం విధించనున్నారు.
లండన్‌కు చెందిన లూసిండా హారిసన్ (24) తను టాక్సీ బుక్ చేసిన చాలా సందర్భాల్లో ఈవీలే వస్తున్నాయని వాపోయారు. దానివల్ల ప్రయాణంలో చాలా వికారంగా అనిపించేదని చెప్పారు. దీంతో ఈవీలో వెళ్లాలనే ఆలోచనే భయానకంగా మారిపోయిందని ఆమె చెప్పారు.
ఏం చెయ్యాలి..
కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ మోషన్ సిక్నెస్ నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధకులు అంటున్నారు. అవి
- ప్రయాణ సమయంలో ఫోన్ చూడటం కానీ, పుస్తకం చదవడం గానీ చేయద్దు. కారులో ముందు ఉన్న కిటికీలోంచి బయటకు చూడాలి.
- వీలైతే డ్రైవర్ పక్కసీటులో కూర్చోవాలి. ఒకవేళ వెనుక కూర్చోవాల్సి వస్తే మధ్యలో కూర్చొండి. అప్పుడు కూడా కారుకి ముందు ఉన్న అద్దం ద్వారా బయట చూడగలుగుతారు.
- తలను వెనక్కి వాల్చి కూర్చోవాలి
- విశ్రాంతిగా కూర్చోవాలి
- శ్వాస నెమ్మదిగా తీసుకోవాలి
- తాజా గాలి కోసం కిటికీ అద్దం తెరిచి ఉంచాలి
- అవసరమైతే ట్రావెల్ సిక్నెస్ ట్యాబ్లెట్లు వెంటపెట్టుకోండి. అయితే అవి మైకం కలగజేయవచ్చు.
- సుదీర్ఘ ప్రయాణాలకు ముందు సరిపడా నీరు తాగాలి. తగినంత నిద్రపోవాలి. నూనె తక్కువగా ఉన్న ఆహారం తినాలి.
ఈవీ ప్రయాణాలకు అలవాటు పడుతున్నకొద్దీ మోషన్ సిక్నెస్ భావన తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
కారు తయారీదారులు సైతం బ్రేకింగ్ వ్యవస్థలో మార్పులు, కారు కదులుతుందని తెలిసేలా శబ్దాలు వచ్చేలా చేస్తే ఈ మోషన్ సిక్నెస్ కొంత తగ్గే అవకాశం ఉంది.
అయితే లోలా మాత్రం తన బాయ్‌ఫ్రెండ్ ఎట్టిపరిస్థితుల్లో కారు మార్చాలనే అంటున్నారు. ఈవీల్లో మార్పునకు చాలా సమయం పడుతుందని ఆమె చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























