పాదాలపై పచ్చి ఉల్లిపాయలను ఉంచితే జలుబు తగ్గుతుందా?

అరికాళ్లపై ఉల్లిపాయ
ఫొటో క్యాప్షన్, ఉల్లిపాయలు అల్లియమ్ కూరగాయల కుటుంబానికి చెందినవి. ఇవి ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
    • రచయిత, ఎస్తర్ కహుంబి
    • హోదా, గ్లోబల్ హెల్త్
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

‘‘ఒకవేళ మీరు జలుబుతో బాధపడుతుంటే.. రింగులుగా కోసిన ఉల్లిపాయను సాక్సులో వేసి, రాత్రంతా వాటిని ధరిస్తే చాలు’’ అంటూ ఓ తల్లి తన కుమార్తె జలుబు లక్షణాలను వివరిస్తూ ఓ టిక్ టాక్ వీడియో చేశారు. వీడియో చేస్తున్నప్పుడు ఆమె చేతిలో ఓ ఎర్ర ఉల్లిపాయను చూపుతున్నారు.

పచ్చి ఉల్లిపాయలకు వ్యాధులను నయం చేసే శక్తి ఉందంటూ సోషల్ మీడియాలో పదేపదే కనిపించే అనేక వాదనల్లో ఈ మహిళ చేసిన వీడియో కూడా ఒకటి.

'జ్వరాన్ని తగ్గిస్తుంది', 'సూక్ష్మక్రిములను, బ్యాక్టీరియాను చంపుతుంది', 'విష పదార్థాలను (టాక్సిన్స్) పీల్చుకుంటుంది', చివరకు 'రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది' అనే నమ్మకంతో కొందరు ఈ చిట్కాను సిఫార్సు చేస్తున్నారు.

కానీ, పాదాలపై ఉల్లిపాయలు ఉంచడం వల్ల వీటిల్లో ఏదైనా జరుగుతుందని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయా?

ఉల్లిపాయలు అల్లియమ్ కూరగాయల కుటుంబానికి చెందినవి. ఇవి ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటిలో విటమిన్ సి, పీచుపదార్థం యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే, ఇందులో క్వెర్సిటిన్ అనే సహజ పదార్థం కూడా ఉంటుంది. శరీరంలో వాపులను తగ్గించేఈ క్వెర్సిటిన్ గుణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతోపాటు గుండె, పేగుల ఆరోగ్యంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయితే ఉల్లిపాయలు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయని లేదా ఇన్‌ఫెక్షన్‌ను నయం చేస్తాయని చెప్పడం పూర్తి భిన్నమైన విషయమని అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణురాలు, ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ కేటీ సులేటా పేర్కొన్నారు.

గది చుట్టూ ఉల్లిపాయలు ఉంచడం వల్ల బ్యుబోనిక్ ప్లేగు వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందనే నమ్మకంతో 1500వ దశకం నుంచే ఈ వాదనలు మొదలయ్యాయని అమెరికాలోని ఉల్లిపాయల పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే 'నేషనల్ ఆనియన్ అసోసియేషన్' తెలిపింది.

గతంలో ప్రజలు తమ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయనే నమ్మకంతో ఉబ్బిన శోషరస గ్రంథులపై కూడా దీన్ని రుద్దేవారు.

జలుబుమందు
ఫొటో క్యాప్షన్, ఆరోగ్యకరమైన ఆహారంగా ఉల్లిపాయను తీసుకోవచ్చు. కానీ అది అనారోగ్యాన్ని నయం చేయదు

విషపదార్థాలను బయటకు పంపలేవా?

శరీరంలోకి సూక్ష్మక్రిములు ప్రవేశించకుండా అడ్డుకోవడంలో చర్మం మొదటి రక్షణ కవచంగా పనిచేస్తుంది. కొన్ని విష పదార్థాలు చర్మం ద్వారా లోపలికి చొచ్చుకుపోగలవు కానీ, అవి అదే మార్గం గుండా బయటకు రాలేవు, కనీసం చెమట ద్వారా కూడా బయటకు పోలేవని నిపుణులు చెబుతున్నారు.

ఈ అడ్డంకి ద్వారా విష పదార్థాలను బయటకు లాగాలంటే ఒక ఉల్లిపాయ "భౌతిక శాస్త్ర నియమాలను బద్దలు కొట్టాల్సిందే" అని సులేటా చెప్పారు.

"చర్మం ద్వారా, అరికాళ్ల ద్వారా లేదా చర్మంలోని ఏ భాగం నుంచైనా విష పదార్థాలను బయటకు పంపేలా చేసే అద్భుత శక్తులేవీ ఉల్లిపాయకు లేవు" అన్నారామె.

రాత్రంతా సాక్స్‌లో ఉంచిన ఉల్లిపాయల రంగు మారడాన్ని కొన్నిసార్లు విష పదార్థాలు బయటకు వచ్చాయనడానికి రుజువుగా చూపిస్తుంటారు. కానీ, ఇది కేవలం ఆక్సీకరణ ప్రక్రియ, చర్మంపై ఉన్న సూక్ష్మజీవులతో కలవడం వల్ల జరిగే చర్య మాత్రమేనని సులేటా స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో డైట్స్, డిటాక్స్‌ మార్కెటింగ్‌లో "టాక్సిన్" అనే పదాన్ని విరివిగా వాడుతుంటారు. శరీరానికి హాని చేసే కొన్ని పదార్థాలు లోపల పేరుకుపోతాయని, వాటిని తొలగించాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ పదాన్ని ఉపయోగిస్తారు.

వైద్యపరంగా చూస్తే, టాక్సిన్స్ అంటే బ్యాక్టీరియా లాంటి జీవుల ద్వారా ఉత్పత్తి అయ్యే విష పదార్థాలు. యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, మోతాదుకు మించి తీసుకునే మందులు లేదా హానికరమైన రసాయనాలు కూడా ఈ కోవలోకే వస్తాయి.

కానీ వ్యర్థాలను తొలగించడానికి శరీరంలో ఇప్పటికే సొంత వడపోత వ్యవస్థలు ఉన్నాయి. రక్తం నుంచి కాలేయం వ్యర్థాలను ఫిల్టర్ చేస్తుంది, శరీరాన్ని శుభ్రంగా, హానికరమైన పదార్థాలు లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది. కిడ్నీలు అదనపు నీటిని, వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. కాలేయం, కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి ప్రత్యేక చిట్కాలేమీ అవసరం లేదు. సమతుల్య ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన బరువుతో ఉండటం, తగినంత నీరు తాగడం వల్ల ఈ అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి.

ఇంట్లో డిటాక్స్ చేయడానికి ప్రయత్నించే బదులు, ఎవరైనా హానికరమైన పదార్థాలను మింగారని, పీల్చారని లేదా మోతాదుకు మించి మందులు తీసుకున్నారని అనుమానం వస్తే.. వెంటనే వైద్య సలహా తీసుకోవాలని యూకేకి చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ సూచిస్తోంది.

ఆన్‌లైన్ వైద్యం
ఫొటో క్యాప్షన్, చికిత్సతో సంబంధం లేకుండా వారం రోజుల్లో జలుబు నుంచి ఉపశమనం లభిస్తుందని డాక్టర్ సులేటా చెప్పారు

జలుబుకు మందు ఏంటి?

కొన్నిరకాల వైరస్‌ల వల్ల జలుబు వస్తుంది. సాధారణంగా దీనికి ఎలాంటి చికిత్స అవసరం లేదని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) సూచిస్తోంది. దీన్నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి తగినంత విశ్రాంతితోపాటు, నీరు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, ఆరోగ్యకరమైన ఆహారం తినాలని సలహా ఇచ్చింది.

ఉల్లిపాయ సూప్‌లాంటి ద్రవాలు శరీరానికి నీరు, పోషకాలు అందించడంలో సాయపడతాయి. అలాగే గొంతులో గరగర,మంటను తగ్గించడంలో కూడా కొంత ఉపశమనం కలిగించవచ్చు. అయితే ఉపశమనం కలిగించడం వేరు, వ్యాధిని నయం చేయడం వేరని నిపుణులు అంటున్నారు.

" సాధారణంగా చికిత్స చేసినా, చేయకపోయినా వారం రోజుల్లోపు జలుబు తగ్గుతుంది. ఉల్లిపాయ సూప్‌ ఈ సమయాన్నేమీ తగ్గించదు" అని సులేటా వివరిస్తున్నారు.

అలాగే ఉల్లిపాయలను వండేటప్పుడు విటమిన్ సీ కొంత తగ్గిపోతుంది. అయితే అందులో కొంత భాగంనీటిలో కలుస్తుంది. ఈ సూప్ తీసుకోవడం ద్వారా శరీరానికి విటమిన్ సీ అందడంతోపాటు, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి శరీరానికి సాయపడుతుంది.

అంటే పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సీ ఎక్కువ ఉంటుంది. ఉల్లిపాయలను మరిగిస్తే దానిలోని విటమిన్ పరిమాణం తగ్గిపోతుంది.

జలుబుతో వచ్చిన జ్వరం వంటి లక్షణాలు ఎక్కువ రోజులు కొనసాగితే వైద్య సలహా అవసరం కావచ్చు. పిల్లల విషయంలో ముందుగానే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

వాపు

వాపు తగ్గడంలో...

ఇక వాపు విషయానికి వస్తే, అది తగ్గడానికి ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఇన్ఫెక్షన్ లేదా గాయానికి శరీర రోగనిరోధక వ్యవస్థ స్పందించే విధానమే వాపు. ఈ స్పందన శరీరాన్ని రక్షించడంలో, దెబ్బతిన్న కణజాలాన్ని తిరిగి బాగు చేయడానికి సాయపడుతుంది.

శరీరంలో వాపు ఎక్కడ వచ్చింది, దానికి కారణమేమిటనేదాన్ని బట్టి ఏ చర్య తీసుకోవాలో నిర్ణయించాలి.

దీని సాధారణ లక్షణాలు వాపు, నొప్పి, వేడి. అయితే ఇవి ఎక్కువకాలం కొనసాగుతూ, కారణం తెలియని ఇతర లక్షణాలు కూడా ఉంటే, ఉల్లిపాయలు వాడటం కంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

"ఈ వాదనల వల్ల కలిగే మరో చాలా విచారకరమైన పరిణామం ఏమిటంటే, అవి చివరకు ప్రజలు చికిత్స తీసుకోవడాన్ని ఆలస్యం చేస్తాయి" అని సులేటా చెప్పారు.

ఆన్‌లైన్‌లో కనిపించే ఆరోగ్య సలహాలు తరచుగా ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా వైద్యం, సైన్స్‌కు సంబంధించిన భాషను ఉపయోగిస్తుంటాయని సులేటా హెచ్చరిస్తున్నారు.

ఎవరైనా ఉల్లిపాయ, లేదా మరేదైనా ఉత్పత్తి శరీరాన్ని డీటాక్స్ చేస్తుందని చెబితే వారు ఏ విషపదార్థాల గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా అడగాలని ఆమె సూచిస్తున్నారు.

"కొంచెం లోతుగా తెలుసుకోడానికి ప్రయత్నించండి. ఏ విషపదార్థాలు? అది ఎలా పనిచేస్తుంది? అని ప్రశ్నించండి. అది ఎలా పనిచేస్తుందో వారు మీకు నిజంగా వివరించలేకపోతే, దాన్ని ఒక హెచ్చరిక సంకేతంగా భావించాలి" అని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)