భోపాల్ నవాబు పాకిస్తాన్ ప్రధాని పదవి చేపట్టబోయారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫరూక్ ఆదిల్
- హోదా, రచయిత, కాలమిస్ట్
పాకిస్తాన్ రాజకీయ చరిత్రలో 1956 జూలై నెలకు ఒక ప్రాముఖ్యత ఉంది.
'పాకిస్తాన్ క్రానికల్'లో వచ్చిన కథనం ప్రకారం... జూలై 31వ తేదీన ప్రధాని చౌదరి మహ్మద్ అలీని పదవి నుంచి తొలగించడానికి కుట్రలు జరిగాయి. ఆయన రాజకీయాల్లో ఒంటరివారైపోయారు.
ప్రధానమంత్రి ఒక్కసారిగా ఈ చిక్కులో పడిపోలేదు. జూలై 13న జరిగిన ఓ ఘటన ఆయన ప్రభుత్వంపై పట్టు కోల్పోయేందుకు కారణమైంది.
ఆ రోజు కరాచీ కమిషనర్, హోంశాఖ కార్యదర్శి కలిసి ఇంటెలిజెన్స్ కార్యాలయంపై దాడి చేసి, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల టెలిఫోన్ రికార్డింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంఘటన దేశంలో రాజకీయ అస్థిరతకు దారి తీసింది. రాజకీయనాయకులకు, బ్యూరోక్రసీ నిచ్చెనగా పైకి ఎగబాకి అధికారంలోకి రావాలనుకునే వర్గానికి మధ్య ఎప్పటినుంచో ఉన్న చీలికను మరింత పెంచింది.
ఈ పరిస్థితుల్లో అప్పటి దేశ అధ్యక్షుడైన మేజర్ జనరల్ (రిటైర్డ్) ఇస్కందర్ మీర్జా అధికారంలో కొనసాగడానికి ఉపాయాలు ఆలోచించారు. వాటిలో ఒకటి ఎన్నికలను వాయిదా వేయడం.
చౌదరి మొహమ్మద్ అలీని అధికారం నుంచీ దించేసాక, ఆయన తర్వాత ఆ పదవి చేపట్టిన హుస్సేన్ షహీద్ సహర్వర్దీని కూడా పదవి నుంచి దింపడంలో ఇస్కందర్ మీర్జా సఫలమయ్యారు.
ఆ తర్వాత ఆ పదవిలోకి వచ్చిన ఫిరోజ్ ఖాన్‌ను ఎలా తప్పించాలి, ఎన్నికలు రాకుండా ఎలా ఆపాలి అనేది ఇస్కందర్ మిర్జా ముందున్న సవాలు.
ఈ పని కోసం ఆయన మాజీ సంస్థాన పాలకుడు, ‘ఖాన్ ఆఫ్ కలాత్’ మీర్ అహ్మద్ యార్ ఖాన్‌తో చేతులు కలిపారు.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ను అప్పట్లో కలాత్ అని పిలిచేవారు. ఈ సంస్థానం పాలకుడిని ‘ఖాన్ ఆఫ్ కలాత్’ అనేవారు.
"నేను భోపాల్ నవాబుకి కబురుపెట్టాను. ఆయన ప్రధానమంత్రి అవుతారు. నేనెలాగో అధ్యక్షుడిగానే కొనసాగుతాను. మెల్లిగా పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటాయి. ఈ పనులన్నీ ఏ ఆటంకం లేకుండా సక్రమంగా జరిగేట్టు నువ్వు చూడు" అని ఖాన్ ఆఫ్ కలాత్‌కు ఇస్కందర్ చెప్పారు.
మరుసటి రోజు ఉదయం భోపాల్ నవాబు హమీదుల్లా ఖాన్ పాకిస్తాన్ రాజధాని కరాచీకి చేరుకున్నారు.
ఇదంతా ఖాన్ ఆఫ్ కలాత్ రాసిన ‘ఇన్‌సైడ్ బలూచిస్తాన్’ అనే పుస్తకంలో ఉన్న సమాచారం.

ఫొటో సోర్స్, KHAN OF KALAT FAMILY ARCHIVE
ఇస్కందర్ మిర్జా ప్లాన్
‘ఇన్‌సైడ్ బలూచిస్తాన్’ పుస్తకం ప్రకారం... అప్పట్లో పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా సోదరి ఫాతిమా జిన్నా, ముస్లిం లీగ్ అధ్యక్షుడు మహ్మద్ ఖాన్ అబ్దుల్ ఖయ్యూమ్ ఖాన్, తూర్పు పాకిస్తాన్ రాజకీయ నాయకుడు హుస్సేన్ షాహీద్ సహర్వర్దీ ప్రతిపక్షాలకు నేతృత్వం వహిస్తున్నారు.
ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి రాజకీయ ఉద్దండుల మధ్య తన ప్లాన్ ప్రకారం భోపాల్ నవాబును, ఖాన్ ఆఫ్ కలాత్‌ను ప్రభుత్వంలోకి తీసుకురావడం ఇస్కందర్ మిర్జాకు కష్టమైన పనే!
1957 వేసవి నాటి మరో సంగతి. బలూచిస్తాన్లో కలాత్ సంస్కృతి, బలూచిస్తాన్ పరంపర కనుమరుగైపోతాయని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కానీ, వాటి భద్రతకు స్వయంగా జిన్నా రాతపూర్వక హామీ ఇచ్చారు. వన్ యూనిట్ విధానం దీనికి ఆధారం. కానీ, దీనికి ముగింపు పలికేందుకు అప్పుడప్పుడు ప్రభుత్వ అధికారులు... స్థానికులను ఆందోళనను రేకెత్తించే పద్ధతులకు దిగేవారు.
ఆ తర్వాత చలికాలంలో ఓసారి జిన్నా జూనియర్ సహచరుడు జవాద్ బేగ్‌తో ఖాన్ ఆఫ్ కలాత్ భేటీ అయ్యారు. అప్పట్లో కరాచీలో చలి ఎక్కువగా ఉండేది. అందుకోసం జనాలు ఓవర్ కోట్లు వేసుకునేవారు.
ఆ రోజు సాయంత్రం ఖాన్ ఆఫ్ కలాత్ కూడా ఓవర్ కోట్ వేసుకుని ఉన్నారు. ఆయన తలపై టోపీ ఉంది. ఆ టోపీ తీసి, ఆయన బాధపడుతూ... ‘‘చూడు మీర్జా. ఈ ద్వారాల నుంచి వచ్చే దొంగల అధికార దాహం మనల్ని విడిచిపెట్టదు’’ అని అన్నారు.
ఆ సమయంలో కలాత్, బలూచిస్తాన్‌లోని ఇతర పట్టణాల్లో స్థానిక పెద్దలు, తెగల నాయకుల మధ్య జోరుగా సంప్రదింపులు సాగుతున్నాయి. బలూచిస్తాన్‌లో శాంతి కొనసాగేందుకు ఏవైనా గట్టి చర్యలు తీసుకోకపోతే, సవాళ్లు తప్పవని ఖాన్ ఆఫ్ కలాత్ భావించారు.
కొన్ని రోజుల తర్వాత స్థానిక పెద్దల ప్రతినిధుల సంఘం ఖాన్ ఆఫ్ కలాత్‌తో భేటీ అయ్యింది. తమ భద్రత, అభ్యంతరాల గురించి ఆరు పాయింట్ల మెమొరాండం ఇచ్చింది.
1948లో కలాత్ పాకిస్తాన్‌లో విలీనం అవుతున్నప్పుడు జిన్నా స్థానిక సంస్కతి, పరంపరను గౌరవిస్తామని, రక్షిస్తామని హామీ ఇచ్చారని, కానీ పరిస్థితి ఇప్పుడు తీవ్రంగా మారిందని అందులో వారు పేర్కొన్నారు.
ఇలాంటి భేటీలు ఆ తర్వాత రోజుల్లో మరిన్ని జరిగాయి. 1957 అక్టోబర్ 8న బలూచిస్తాన్‌లోని 48 మంది తెగల నాయకుల ప్రతినిధుల సంఘం ఖాన్ ఆఫ్ కలాత్ నేతృత్వంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఇస్కందర్ మిర్జాతో సమావేశమైంది. కొన్ని నెలల ముందు నుంచి సిద్ధం చేస్తున్న ఓ అభ్యర్థన పత్రాన్ని సమర్పించింది.
ఇస్కందర్ మిర్జా వారి డిమాండ్ల పట్ల సహానుభూతి వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి ఆలోచిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని పెద్ద చర్యలు తీసుకునేందుకు న్యాయ సలహా తీసుకోవాలని ఖాన్ ఆఫ్ కలాత్‌కు హామీ ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖాన్ ఆఫ్ కలాత్‌కు ఆతిథ్యం
ప్రతినిధి సంఘం లేచి వెళ్లిపోతుండగా, తమ వ్యక్తిగత అతిథిగా కొన్ని రోజులు ఉండాలని ఖాన్ ఆఫ్ కలాత్‌ను ఇస్కందర్ కోరారు. ఆ తర్వాత 15 రోజులు అంటే, 1957 అక్టోబర్ 7 నుంచి 20 వరకు ఖాన్ ఆఫ్ కలాత్ అధ్యక్ష భవనంలో అతిథిగా ఉన్నారు.
ఇస్కందర్ మిర్జా మదిలో ఉన్న ప్లాన్‌కు అప్పుడే తెర తొలగింది.
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ న్యాయ నిపుణుడు మెక్ నాయర్‌ను కలిసి వన్ యూనిట్ నుంచి కలాత్ పాత సంస్థానాన్ని విడదీయడం ఎలాగో సలహా తీసుకోవాలని ఖాన్ ఆఫ్ కలాత్‌కు ఇస్కందర్ మిర్జా సలహా ఇచ్చారు.
ఖాన్ ఆఫ్ కలాత్‌కు ఇది సరైన చర్యే అనిపించి, లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. (ఈ పర్యటన కోసం ఇస్కందర్ మిర్జా పెద్ద మొత్తంలో ఖాన్‌కు విదేశీ నగదు కూడా ఇచ్చారు)
‘‘ఎన్నికలు వచ్చేశాయి. వచ్చేసారి కూడా నేను అధ్యక్షుడిని కావాలనుకుంటున్నానని మీకు తెలుసు. కానీ, ఎన్నికల ప్రచారానికి నా దగ్గర పెట్టుబడి లేదు. మీరు 50 లక్షల రూపాయలు దానం చేస్తే, నా పని సులువు అవుతుంది. బహావల్‌పుర్, ఖైర్‌పుర్ మాజీ సంస్థానాల పాలకులపై ఒత్తిడి తెచ్చి, వారి నుంచి కూడా రూ.40 లక్షలు, రూ.10 లక్షలు ఇప్పించండి’’ అని ఇస్కందర్ మిర్జా ఖాన్ తనతో అన్నట్లు ‘ఇన్‌సైడ్ బలూచిస్తాన్’ పుస్తకంలో ఖాన్ ఆఫ్ కలాత్ పేర్కొన్నారు.
ఈ సాయానికి బదులుగా అధ్యక్ష పదవి చేపట్టగానే... తాను కలాత్, బహావల్‌పుర్, ఖైర్‌పుర్‌లను వన్ యూనిట్ నుంచి విడదీస్తానని ఇస్కందర్ హామీ ఇచ్చినట్లు ఆ పుస్తకంలో ఉంది.
దేశంలోని బాగా ప్రజాదరణ ఉన్న నాయకులతో సంబంధాలను స్నేహపూర్వకంగా మార్చుకుంటేనే మరోసారి అధ్యక్ష పదవి చేపట్టగలరని ఇస్కందర్‌కు ఖాన్ ఆఫ్ కలాత్ సలహా ఇచ్చారు.
కానీ, ఇస్కందర్ మిర్జాకు ఈ సలహా నచ్చలేదు. ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా రాని పక్షంలో, మార్షల్ లా విధించేందుకు వెనుకాడకూడదని ఆయన నిర్ణయించుకున్నారు.
ఓసారి ఖాన్‌తో ఏకాంతంగా మాట్లాడుతూ తాను భోపాల్ నవాబును పాకిస్తాన్ రమ్మని ఆహ్వానించానని, ఆయనకు ప్రధాని పదవి ఇస్తానని హామీ ఇచ్చానని ఇస్కందర్ చెప్పారు.
మార్షల్ లా విధించి, ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా వచ్చేంత వరకు దాన్ని అమలు చేయాలన్నది ఇస్కందర్ ఉద్దేశం.

ఫొటో సోర్స్, AMAZON.COM
షాక్ తిన్న ఖాన్
ఈ మాట విని ఖాన్ షాక్ తిన్నారు. ఈ విషయానికి సంబంధించి కమాండర్ ఇన్ చీఫ్ (అప్పటి సైన్యాధిపతి) అయ్యూబ్ ఖాన్ అభిప్రాయం కూడా తీసుకున్నారా అని ఇస్కందర్‌ను ఖాన్ అడిగారు. ఎందుకంటే సైన్యంపై పూర్తి నియంత్రణ ఆయన చేతుల్లో ఉంటుంది.
అప్పుడు ఇస్కందర్ చెప్పంది విని, ఖాన్ మరింత హైరానాకు గురయ్యారు.
‘‘అయూబ్ ఖాన్ ఒకవేళ దారికి అడ్డువచ్చే ప్రయత్నం చేస్తే, సమయం వృథా చేయకుండా ఆయన్ను అంతం చేస్తా’’ అని ఇస్కందర్ అన్నారు.
అదే రోజు సాయంత్రం ఓ పార్టీలో అయూబ్‌ను ఖాన్ ఆఫ్ కలాత్ కలిశారు. పష్తో భాషలో మాట్లాడుతూ ఇస్కందర్ ఉద్దేశాల గురించి అయూబ్‌కు ఆయన సంకేతాలు ఇచ్చారు. ఇది విన్న తర్వాత అయూబ్ ముఖం ఎరుపెక్కిపోయిందని, దేశ అధ్యక్షుడు ఈ విధంగా చేయమని సలహాఇచ్చేవాళ్లలో తాను ఆఖరి వ్యక్తిని అవుతానని ఆయన అన్నారని ఖాన్ ఆఫ్ కలాత్ పుస్తకంలో రాశారు.
మరుసటి రోజు భోపాల్ నవాబు హమీదుల్లాహ్ ఖాన్ కరాచీ చేరుకున్నారు.
కానీ, ఖాన్ ఆఫ్ కలాత్‌ను ఇస్కందర్ మిర్జా అంతటి విశ్వాసపాత్రుడిగా ఎందుకు పరిగణించారు? భోపాల్ నవాబుకు అంతటి కీలక పదవి ఇవ్వాలనుకున్నారు?
భోపాల్ నవాబు, ఇస్కందర్ కుటుంబాల మధ్య పాత స్నేహం ఉందని పాకిస్తాన్ మాజీ విదేశాంగ కార్యదర్శి షహర్యార్ ఖాన్ భార్య అన్నారు.
భోపాల్ నవాబు ఎప్పుడు పాకిస్తాన్ వచ్చినా, ఇస్కందర్ మిర్జా దగ్గర ఉండేవారు. ఇస్కందర్ మిర్జా కూడా విశ్రాంతి తీసుకునేందుకు కరాచీలోని మలేర్‌లో ఉన్న నవాబు ఫామ్‌హౌస్‌కు వెళ్లేవారు.
ఈ ఇద్దరూ భారత్, పాకిస్తాన్‌ల్లోని ఇదివరకటి సంస్థానాల పాలకుల కుటుంబాలకు చెందినవాళ్లు. ముందు నుంచి వీరి కుటుంబాల మధ్య సంబంధాలు ఉన్నాయి. ఇదే తరహాలో భోపాల్ నవాబుతో తమకు కూడా దగ్గరి బంధం ఉందని ఖాన్ ఆఫ్ కలాత్ పుస్తకంలో రాశారు.
ఇస్కందర్ మిర్జా ముర్షీదాబాద్ సంస్థాన పాలకుల కుటుంబానికి చెందినవారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కరాచీ చేరిన భోపాల్ నవాబు
కరాచీ చేరుకున్న వెంటనే భోపాల్ నవాబు ఖాన్ ఆఫ్ కలాత్‌ను కలిశారు. ఇస్కందర్ మిర్జా చేసిన ప్రతిపాదనపై ఖాన్ ఆఫ్ కలాత్ అభిప్రాయం అడిగారు.
తమ భేటీ గురించి ఖాన్ ఆఫ్ కలాత్ ‘ఇన్‌సైడ్ బలూచిస్తాన్’ పుస్తకంలో సవివరంగా రాశారు.
అందులో వారి సంభాషణ గురించి ఇలా ఉంది.
భోపాల్ నవాబు: ‘‘నేను ఓ స్కీమ్ కోసం ఇక్కడికి వచ్చా. ఇస్కందర్ మిర్జా ప్రతిపాదనను నేను అంగీకరించా. ఇప్పుడు ఆ స్కీమ్ గురించి వివరంగా తెలుసుకోవాలని అనుకుంటున్నా’’
ఖాన్ ఆఫ్ కలాత్: ‘‘పరిస్థితి మారిపోవచ్చు కూడా. ఎందుకంటే ఆ స్కీమ్‌లో మీ నుంచి ప్రయోజనం పొందాలన్న ఉద్దేశంతోనే ఆయన (ఇస్కందర్ మిర్జా) మీ పేరును చేర్చారు’’
ఈ మాట విని భోపాల్ నవాబు హైరానాపడ్డారు.
భోపాల్ నవాబు: ‘‘విషయం ఇదే అయితే, అధ్యక్షుడి మదిలో ఉన్న ఆ స్కీమ్‌తో నాకు ఏ సంబంధమూ లేదు’’
అధికారం దూరమవుతుందన్న భయంతో ఇస్కందర్ మిర్జా ఎలాంటి కార్యనిర్వాహక చర్యలకు, కుట్రలకు దిగుతున్నారన్నది కూడా భోపాల్ నవాబుకు వివరించానని ఖాన్ ఆఫ్ కలాత్ రాశారు.
ఇస్కందర్ మిర్జా ఇంకా కొన్ని రోజులు మాత్రమే అధికారంలో ఉంటారని, అధ్యక్ష పదవి నుంచి త్వరలోనే ఆయన్ను తొలగిస్తారని... ఈ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు తమ ఇద్దరినీ బలిపశువులను చేయాలనుకుంటున్నారని చెప్పినట్లు కూడా పేర్కొన్నారు.
‘‘ఇదంతా తెలుసుకున్నాక భోపాల్ నవాబు నాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘అల్లా దయ వల్ల మిమ్మల్ని కలిశా. ఈ కుట్ర గురించి తెలుసుకున్నా’ అని అన్నారు’’ అని ఖాన్ ఆఫ్ కలాత్ రాశారు.
భారత ప్రభుత్వం నుంచి ఏటా లభించే రూ.20 లక్షల వేతనం, గౌరవపురస్కారాలు, ప్రత్యేకాధికారాలు, బ్రిటన్‌లో తన భారీ వ్యాపారాల వంటివన్నీ పాకిస్తాన్ ప్రధాని పదవి చేపడితే భోపాల్ నవాబు కోల్పోవాల్సి ఉంటుంది. పైగా ఇస్కందర్ మిర్జా ప్లాన్ విజయవంతమవుతుందన్న భరోసా కూడా లేదు. ఈ విషయం గురించి కూడా భోపాల్ నవాబు, ఖాన్ ఆఫ్ కలాత్‌ల మధ్య చర్చ జరిగింది.
మరుసటి రోజు భోపాల్ నవాబు ఇస్కందర్ మిర్జాను కలిశారు. అప్పుడు ఖాన్ ఆఫ్ కలాత్‌తో తన భేటీ గురించి ఆయన ఏమీ చెప్పలేదు.
ఇస్కందర్ మిర్జా ప్లాన్ మీద భోపాల్ నవాబు అసంతృప్తి గానీ, ఆగ్రహం గానీ వ్యక్తం చేయలేదు. భారత్‌లో తన సంపద, బ్రిటన్‌తో తన వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలను చక్కదిద్దుకునేందుకు కాస్త సమయం ఇవ్వాలని మాత్రం కోరారు.
భోపాల్ నవాబు భారత్ వచ్చిన మరుసటి రోజు ఖాన్ ఆఫ్ కలాత్‌తో ఇస్కందర్ మిర్జా భేటీ అయ్యారు. మూడు, నాలుగు గంటలపాటు ఇది సాగింది.
భోపాల్ నవాబు 1958 ఏప్రిల్‌లో పాకిస్తాన్‌కు తిరిగివస్తానని హామీ ఇచ్చారని ఇస్కందర్ మిర్జా ఖాన్ ఆఫ్ కలాత్‌కు చెప్పారు. ఆయన వస్తారో, రారో అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఖాన్ ఆఫ్ కలాత్ ఆయనకు కాస్త భరోసా ఇచ్చే మాటలు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పుస్తకంతో వెలుగుచూసిన పరిణామాలు
పాకిస్తాన్ రాజకీయాల్లో సంచలనాత్మకమైన, నాటకీయమైన ఈ పరిణామాల గురించి ఖాన్ ఆఫ్ కలాత్ తన పుస్తకంలో వివరించారు. 1975లొ ఇది అచ్చైంది.
ఈ ఘటనలన్నీ ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగినవి కావడంతో అంతకుముందు ఈ వివరాలు బయటకు రాలేదు.
ఇస్కందర్ మిర్జా ప్లాన్ నుంచి భోపాల్ నవాబు దూరం జరిగారు. కానీ, ఇస్కందర్ మిర్జా తన కోరికలను నియంత్రించుకోలేదు. అనుకున్నట్లే దేశంలో మార్షల్ లా విధించారు. కానీ, ఆయన తన వలలో తానే చిక్కుకున్నారు. పదవీచ్యుతుడయ్యారు.
కానీ, భోపాల్ నవాబు కుటుంబం మాత్రం పాకిస్తాన్‌లో పెద్ద పెద్ద పదవులనే పొందింది. వారిలో శహర్యార్ ఖాన్ ఒకరు. ఆయన పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ కూడా అయ్యారు.
భోపాల్ నవాబుకు ఇస్కందర్ మిర్జా ప్రధాని పదవి ఇస్తానని చేసిన ప్రతిపాదన నిజమేనని ఆయన కూడా బీబీసీకి ధ్రువీకరించారు.
మరోవైపు తన ప్లాన్ విఫలమైందన్న కోపాన్ని ఇస్కందర్ మిర్జా ఖాన్ ఆఫ్ కలాత్‌పై చూపించారు. లాహోర్‌లోని ఓ జైల్లో ఆయన్ను పెట్టారు.
పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్‌ను విడదీసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణను ఆయనపై మోపారు.
అయితే, ఇవన్నీ మార్షల్ లా విధించేందుకు ఇస్కందర్ చూపించిన సాకులు అని ‘పోలిటిక్స్ అండ్ ద స్టేట్ ఇన్ పాకిస్తాన్’ అనే పుస్తకంలో డాక్టర్ మోహమ్మద వసీమ్ రాశారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- దక్షిణ చైనా సముద్ర వివాదంలో భారత్‌ను అమెరికా ఓ అజేయ శక్తిగా ఎందుకు చూస్తోంది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








