పీర్‌డాంటే పిచోని : కారు ప్రమాదం తర్వాత 12 ఏళ్లు వెనక్కి వెళ్లిన డాక్టర్

ఫొటో సోర్స్, Sylvain Lefevre/Getty Images
- రచయిత, జోయ్ ఫిడ్జెన్, ఎడ్గార్ మాడికాట్, ఆండ్రూ వెబ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
డాక్టర్ పీర్‌డాంటే పిచోని ఒక అవాంఛిత 'టైమ్ ట్రావెలర్'. 2013లో జరిగిన కారు ప్రమాదంలో ఆయన మెదడుకు తీవ్ర గాయం అయింది.
దీని కారణంగా, పీర్‌డాంటే తన జీవితంలోని 12 సంవత్సరాల జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోయారు. ఈ ప్రమాదం తర్వాత, మరుసటి రోజు ఆసుపత్రిలో మేల్కొన్నప్పుడు, అది 2001 సంవత్సరంగా భావించారాయన. తన భార్య, కొడుకులను కూడా గుర్తించలేకపోయారు.
పీర్ (ఇది ఆయన సన్నిహితులు పిలిచే పేరు) ఈ షాక్‌తో జీవితంలో పోరాడుతున్నారు. ఆయన తన వైద్య వృత్తిని కొనసాగించలేకపోతున్నారు.
తన గతాన్నివెతుకుతున్నారు పీర్. వేల కొద్దీ ఇ-మెయిళ్లను పరిశీలించగా, తన జీవితంలో చీకటి కోణం ఉందని ఆయనకు తెలిసింది.
అంతేకాదు, ఆయన జీవింతపై ఒక ఇటాలియన్ టీవీ షో కూడా వచ్చింది.


ఫొటో సోర్స్, Sylvain Lefevre/Getty Images
ఈరోజు తేదీ ఏమిటి?
2013 మే 31న ఇటలీలోని లోడి నగరంలో డాక్టర్ పీర్‌డాంటే తాను పనిచేస్తున్న ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో ఒక మంచం మీద పడుకొని ఉన్నారు.
"నేను మొదట చూసినది తెల్లని కాంతి. అత్యవరసర గదిలోని కాంతి అది. దాదాపు ఆరు గంటలు కోమాలో ఉన్నా. నేను మేల్కొన్నప్పుడు మొదట చూసినది నా సహోద్యోగులను" అని పీర్ గుర్తుచేసుకున్నారు.
" ఈ రోజు తేదీ ఏమిటి? డాక్టర్లు నన్ను అని అడిగినప్పుడు, ఐదారు సెకన్ల పాటు ఆలోచించి.. 25 అక్టోబర్ 2001 అని బదులిచ్చాను" అన్నారు.
ఆ సమయంలో, పీర్ తన సహోద్యోగులలో ఒకరు ఐప్యాడ్‌లో ఏదో టైప్ చేయడం చూశారు. 2001లో అసలు ఐప్యాడ్ అనేదే లేదు. ఆ సమయంలో మొబైల్ ఫోన్లు కేవలం కాల్స్ చేయడం, సందేశాలు పంపడం, వార్తల అప్‌డేట్స్ కోసమే పరిమితం అయ్యాయి.

ఫొటో సోర్స్, Roman Mykhalchuk/Getty Images
"నా భార్య ఇలా ఉండేది కాదు"
పీర్‌కు మతిపోయే సంఘటన తర్వాత ఎదురైంది.
"నీ భార్యను కలవాలనుకుంటున్నావా? అని వైద్యులు నన్ను అడిగారు. అవును కలవాలనుకుంటున్నానని చెప్పా'' అని పీర్ గుర్తుచేసుకున్నారు.
"నా భార్యను 12 సంవత్సరాల కిందట తన యవ్వనంలో ఉండగా చూసిన ముఖమే నాకు గుర్తుంది, ఆమె గదిలోకి వస్తుండగా అదే ముఖం ఊహించుకున్నా. గదిలోకి వచ్చిన మహిళ నా భార్యలాగే ఉన్నారు కానీ, నా భార్యలా నాకు అనిపించలేదు. ఆమె ముఖంలో చాలా ముడతలు ఉన్నాయి" అని పీర్ అన్నారు.
అంతేకాదు, తన పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారని కూడా అతను అంగీకరించాల్సి వచ్చింది.
"నేను వారితో మీరెవరు, నా పిల్లలు ఎక్కడ? అని అడిగాను. ఎందుకంటే వాళ్లు నా కొడుకులని నమ్మలేకపోయా" అన్నారు పీర్.
అప్పుడు పీర్ భార్య అతనికి మరో దిగ్భ్రాంతికరమైన విషయం చెప్పారు, ఆయన తల్లి మూడు సంవత్సరాల కిందట మరణించడం.
"నేను మేల్కొన్నప్పుడు నాకు 53 ఏళ్లనిపించింది. కానీ, నా అసలు వయస్సు 65 సంవత్సరాలని గ్రహించాను" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Ada Masella / Mondadori Portfolio via Getty Images
మంచివాడినా? లేదా చెడ్డవాడినా?
పీర్‌డాంటే మర్చిపోయిన తన 12 సంవత్సరాల జీవితం గురించి తెలుసుకోవడం ప్రారంభించినప్పుడు, ఆ సమయంలో మంచి వ్యక్తిలా ప్రవర్తించలేదని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.
"నేను ఎలాంటి వ్యక్తిని, మంచివాడినా, చెడ్డవాడినా? అని నా స్నేహితులు, సహోద్యోగులు, భార్యను అడిగాను. అత్యవసర విభాగానికి హెడ్ అయినప్పుడు, దాదాపు 230 మంది నా కింద పనిచేశారని నా సహోద్యోగులు చెప్పారు" అని పీర్ చెప్పారు.
'నేను చాలా బలవంతుడినని.. కానీ, ఇతరుల పట్ల చాలా కఠినంగా ఉండేవాడినని నా సహోద్యోగి చెప్పారు' అని పీర్ తెలిపారు.
12 ఏళ్ల కాలంలో ప్రపంచం ఎంత ముందుకు వెళ్లిందో అర్థం చేసుకోవడం ప్రారంభించారు పీర్. తన పాత ఇ-మెయిల్స్‌లో వాస్తవాలు వెతకడం ప్రారంభించారు.
"అన్ని ఇ-మెయిల్స్ చదివాను. 76 వేలకు పైగా ఉన్నాయి. కొన్ని ఇ-మెయిల్స్ చదివిన తర్వాత, నేను నిజంగా చెడ్డవాడిని, కఠినమైన విభాగాధిపతిని, కఠినమైన వ్యక్తిని అనిపించింది" అన్నారు పీర్.
"నాకు చాలా బాధగా అనిపించింది"
తన తల్లి మరణించిన తర్వాత ఒంటరి వాడిననే భావన కలిగిందని, ఒకానొక సమయంలో ఆత్మహత్య ఆలోచన కూడా వచ్చినట్లు పీర్ తెలుసుకున్నారు. ఆ నెగెటివ్ ఆలోచనల నుంచి ఆయన ఇప్పుడు బయటపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
మళ్లీ ప్రేమలో..
కారు ప్రమాదానికి ముందు, పీర్ ప్రతిరోజూ 15 నుంచి 16 గంటలు పనిచేసేవారు. అత్యవసర విభాగానికి హెడ్ అయినప్పటి నుంచి, ఇంట్లో చాలా అరుదుగా ఉండేవారని ఆయన భార్య చెప్పారు.
ఇపుడు పీర్ మంచి భర్తగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కోమా నుంచి బయటకు వచ్చిన వెంటనే, ఆయన మళ్లీ భార్యతో ప్రేమలో పడ్డారు.
"నా భార్య గది నుంచి బయటకు వెళ్లడానికి అలా తిరిగినప్పుడు, నేను ఆమెతో ప్రేమలో ఉన్నట్లు నాకు అనిపించింది. ఆ క్షణం చాలా ప్రత్యేకమైనది, నిజంగా బాగుంది" అని చెప్పారు పీర్.
"నా భార్య కోసం.. నా భార్యనే మోసం చేశానని చెప్పగలిగే ఏకైక వ్యక్తి నేనే అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె ఇప్పుడు వేరే వ్యక్తిలా అనిపిస్తున్నారు. నేను ఆమెతో మళ్లీ ప్రేమలో పడ్డాను" అంటారు పీర్.
చాలాసార్లు తనకు తాను ఒంటరి అనుకున్నారు పీర్ ఈ ప్రపంచం ఆయనకు కొత్తగా అనిపించేది. అప్పుడే ఆయన మంచితనంతో జీవించాలని నిర్ణయించుకున్నారు. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలనుకున్నారు. అలాగే మంచి భర్తగానూ ఉండాలనుకున్నారు. గతాన్ని మరిచిపోవడమనే అనుభవం తనకు బోలెడు పాఠాలు నేర్పిందని, కానీ అన్నింటికన్నా ముఖ్యమైనది ‘‘నువ్వు జీవించాలనుకుంటే గతం గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఇప్పటి నుంచి ప్రతిక్షణం వర్తమానంలో జీవించు, కొత్తవైన అందమైన ఆనందపు క్షణాలను పోగుచేసుకో... ఇదే అసలైన మంత్రం’’ అంటారు పీర్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














