ఆమె భర్త అపహరణ మలేసియాలో అతిపెద్ద మిస్టరీ.. ఓ అధికారి నేరాంగీకారం ఈ కేసును ఎలాంటి మలుపు తిప్పిందంటే..

సుసన్నా ల్యూ తన భర్తకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి దాదాపు దశాబ్ద కాలంగా పోరాడుతున్నారు
ఫొటో క్యాప్షన్, సుసన్నా ల్యూ తన భర్తకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి దాదాపు దశాబ్ద కాలంగా పోరాడుతున్నారు
    • రచయిత, తీస్సా వాంగ్
    • హోదా, ఆసియా డిజిటల్ రిపోర్టర్
    • నుంచి, కౌలాలంపూర్

సుసన్నా ల్యూ గత నెలలో కౌలాలంపూర్ హైకోర్టు వద్ద టీవీ కెమెరాల ముందుకు వచ్చినప్పుడు ఆ క్షణాన్ని ఒక చారిత్రాత్మక, భావోద్వేగ మైలురాయిగా ఆమె అభివర్ణించారు.

''పాస్టర్ రేమండ్ కోహ్ తీవ్ర అన్యాయానికి గురయ్యారని మేం చాలాకాలంగా నమ్ముతున్నాం. ఈరోజు హైకోర్టు అదే తీర్పు ఇచ్చింది'' అని 69 ఏళ్ల సుసన్నా వణుకుతున్న గొంతుతో చెప్పారు.

మలేసియాలోనే అతిపెద్ద మిస్టరీలలో ఒకటిగా నిలిచిన ఈ కేసులో ఇదో సంచలన న్యాయ విజయం.

సుసన్నా భర్తను దాదాపు తొమ్మిది సంవత్సరాల కిందట పట్టపగలే ముసుగు ధరించిన కొంతమంది అపహరించారు. ఆ కిడ్నాప్ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇన్నేళ్ల విచారణ తర్వాత, రేమండ్ కోహ్‌ను పోలీసు విభాగానికి చెందిన ఎలైట్ స్పెషల్ బ్రాంచ్ వారే తీసుకెళ్లారని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దేశంలోనే కోర్టు ముందుకు విచారణకు వచ్చిన మొట్టమొదటి 'బలవంతపు అదృశ్యం' కేసులో పోలీసులు, మలేసియా ప్రభుత్వం బాధ్యులని న్యాయస్థానం పేర్కొంది.

తన భర్తకు ఏమైందో తెలుసుకోవడానికి సుసన్నా ఇన్నాళ్లూ చేసిన సుదీర్ఘ పోరాటం, ఆమెను ఒక సాధారణ పాస్టర్ భార్య అనే స్థాయి నుంచి ఒక బలమైన ఉద్యమకారిణిగా మార్చింది. పాస్టర్ రేమండ్‌ను ఎందుకు తీసుకెళ్లారో బహుశా ఆమెకు ఇప్పటికీ కచ్చితంగా తెలియకపోవచ్చు. కానీ, మలేసియాలో మెజారిటీ మతమైన ఇస్లాంకు రేమండ్ ముప్పుగా ఉన్నారని పోలీసులు భావించినట్లు రెండు స్వతంత్ర అధికారిక విచారణలు తేల్చాయి.

కోర్టు తీర్పు వెలువడిన తర్వాత, సుసన్నా బీబీసీతో మాట్లాడారు. న్యాయం కోసం పోరాడాలనే పట్టుదలే తనను ముందుకు నడిపించిందని చెప్పారు.

''ఆయనను వారు రహస్యంగా తీసుకెళ్లారు, కానీ నేను ఈ విషయాన్ని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేస్తాను'' అని తన అంతరాత్మ తనకు చెప్పిందన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాస్టర్ రేమాండ్ కోహ్ అపహరణ దృశ్యం

ఫొటో సోర్స్, screengrab

ఫొటో క్యాప్షన్, పాస్టర్ రేమాండ్‌ కోహ్‌ను అపహరించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి

ఆ రోజు ఏం జరిగిందంటే...

కౌలాలంపూర్ శివారులోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో 63 ఏళ్ల రేమండ్ కోహ్ నివాసం ఉంది. ఆయన తన స్నేహితులను కలిసేందుకు 2017, ఫిబ్రవరి 13న, ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయల్దేరారు.

కొన్ని కార్లు, మోటారు సైకిళ్లతో కూడిన ఒక వాహన శ్రేణి ఒక్కసారిగా ఆయన వాహనాన్ని చుట్టుముట్టింది. నల్లటి దుస్తుల్లో, ముసుగు వేసుకొన్న వ్యక్తులు బయటకొచ్చి కోహ్ కారు అద్దాన్ని పగులగొట్టారు. గాజుముక్కలు అన్నివైపులా ఎగిరిపడ్డాయి.

కోహ్‌ను కారు నుంచి బలవంతంగా బయటకు లాగి, తమ కారులోకి ఎక్కించారు. కోహ్‌తో పాటు ఆయన కారును కూడా అపహరించుకుపోయారు.

కోహ్ అపహరణ సినీఫక్కీలో క్షణాల్లో జరిగిపోయింది. అది ఎంత నాటకీయంగా ఉందంటే, సినిమా షూటింగ్ ఏదైనా జరుగుతోందేమో అనుకున్నానని ప్రత్యక్ష సాక్షి తర్వాత తన వాగ్మూలంలో చెప్పారు.

రేమండ్ కోహ్ ఆచూకీ కోసం ఆధారాలేమైనా దొరుకుతాయేమోనని ఆయన పిల్లలు పరిసరాల్లో ప్రతి ఇంటినీ వెతికారు. ఆ క్రమంలో రెండు ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను గమనించారు. ఈ మొత్తం సంఘటనను అవి రికార్డు చేసినట్లు గుర్తించారు.

వాటి ఫుటేజీని చూసిన తర్వాత, ఇదేదో సాధారణమైన అపహరణ కాదని కోహ్ కుటుంబసభ్యులకు అర్థమైంది. అది ఎంతో పకడ్బందీగా, పక్కా ప్రణాళికతో జరిగినట్లు కనిపించింది.

పైగా, కిడ్నాపర్లు డబ్బు లేదా, మరే డిమాండ్లతోనూ కోహ్ కుటుంబసభ్యులను ఎప్పుడూ సంప్రదించలేదు.

ఈ సంఘటనకు కొన్ని నెలల ముందే, 2016 నవంబర్‌లో మలేసియాలోని ఉత్తర రాష్ట్రమైన పెర్లిస్‌లో అమ్రి చే మత్ అనే సామాజిక కార్యకర్త సరిగ్గా ఇలాగే అపహరణకు గురయ్యారు.

సీసీటీవీ ఫుటేజీని కోహ్ కుటుంబం మీడియాకు అందించింది. అది వైరల్ అయ్యింది. దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది.

దీంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండు చేశారు.

చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ 'మలేసియా మానవ హక్కుల కమిషన్' విచారణను ప్రారంభించింది. ఆ తర్వాత, ప్రభుత్వం కూడా విడిగా మరో విచారణను చేపట్టింది.

పోలీసుల చూపించిన ఆధారాలు 'అంత నమ్మశక్యంగా లేవు'...

కోహ్ అపహరణకు పోలీసు స్పెషల్ బ్రాంచ్ బాధ్యత వహించాలని చాలామంది పౌరులు అభిప్రాయపడ్డారు.

కానీ, పోలీసులు మాత్రం ఇందులో తమకు ఎలాంటి సంబంధమూ లేదని వాదించారు. పోలీసు చీఫ్ ఇంకాస్త ముందుకెళ్లి, సవ్యంగా విచారణ జరగడానికి వీలుగా ప్రజలు దయచేసి నోరు మూసుకోవాలి అని వ్యాఖ్యానించారు.

కొన్ని నెలల తర్వాత, ఈ కేసులో తమ దర్యాప్తు ముగిసినట్లు పోలీసులు ప్రకటించారు.

కోహ్‌ను మత్తుపదార్థాల స్మగ్లింగ్ ముఠా అపహరించిందని పేర్కొన్నారు.

అంతేకాదు, ఈ కిడ్నాప్‌ ఆరోపణలతో 'ఉబెర్' కారు డ్రైవర్'ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

అయితే, ఈ రెండూ అంత నమ్మశక్యంగా లేవని మానవ హక్కుల కమిషన్ తన తుది నివేదికలో తేల్చి చెప్పింది.

పాస్టర్ రేమండ్ కోహ్ ఫైల్ ఫోటో

ఫొటో సోర్స్, Family of Raymond Koh

ఫొటో క్యాప్షన్, పాస్టర్ రేమండ్ కోహ్ ఫైల్ ఫోటో

బాధిత కుటుంబానికి తీవ్ర మానసిక వేదన...

మరోవైపు, కోహ్ అదృశ్యంతో ఆయన కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురైంది.

కుటుంబ పోషణ కోసం చేతితో తయారుచేసిన ఆభరణాలను సుసన్నా అమ్మేవారు. పొదుపు సొమ్ము, దాతల విరాళాలతో తన చిన్న కుమార్తెను యూనివర్సిటీలో చదివించారు.

పోలీసుల నుంచి తమకు సానుభూతి లభిస్తుందని ఆశించానని సుసన్నా చెప్పారు.

కానీ అందుకు భిన్నంగా, ఆమె భర్త అదృశ్యం గురించి ఫిర్యాదు చేసిన రోజు రాత్రి ఐదు గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. ముస్లింలను క్రైస్తవ మతంలోకి మార్చడానికి రేమండ్ ప్రయత్నించారా అని ప్రశ్నలు సంధించారు.

''ఆ సమయంలో నేను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాను'' అని సుసన్నా అన్నారు.

కోహ్ పాస్టర్ కాబట్టి, ఆ కోణంలోనే విచారణ జరపాలని ఉన్నతాధికారులు తనను ఆదేశించారంటూ ఆ విచారణ బృందంలోని ఒక అధికారి మానవ హక్కుల కమిషన్ విచారణలో వాంగ్మూలం ఇచ్చారు.

కోహ్ 2011లో ఒక చర్చిలో ఏర్పాటుచేసిన విందు కార్యక్రమానికి కొంతమంది ముస్లింలు కూడా హాజరయ్యారు. దీంతో ఆయనపై 'మత మార్పిడి' ఆరోపణలు వచ్చాయి. మలేసియాలో ఇది నేరం. దీనిపై ఇస్లామిక్ అధికారులు విచారణ జరిపినప్పటికీ, కోహ్‌పై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.

అయితే, తాము మత మార్పిడికి ఎప్పుడూ ప్రయత్నించలేదని కోహ్ కుటుంబం తొలి నుంచీ ఖండిస్తూనే ఉన్నారు.

కోహ్ అదృశ్యమైన తర్వాత, గడిచిన కాలంలో పోలీసులు ఎప్పుడూ తమ విచారణ వివరాలను వెల్లడించడానికి ఇష్టపడలేదని, పైగా కొన్ని సందర్భాల్లో తాము నిజం తెలుసుకోకుండా అడ్డుకున్నారని, తప్పుడు ఆధారాలు చూపించి తప్పుదోవ పట్టించారని సుసన్నా చెప్పారు.

పోలీసులు చెబుతున్న కట్టుకథలన్నీ కోహ్ అపహరణలో వారి ప్రమేయాన్ని దాచిపెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలేనంటూ ఆయన కుటుంబం తొలి నుంచీ వాదిస్తోంది.

ఈ ఆరోపణలపై వివరణ కోరుతూ బీబీసీ మలేసియా పోలీసులను సంప్రదించినా, వారు ఇప్పటివరకూ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.

ఈ కేసులో అదే కీలక మలుపు...

కోహ్ కంటే ముందు అపహరణకు గురైన అమ్రి చే మత్ ఇంటికి 2018 మే నెలలో ఒకరోజు అర్ధరాత్రి ఒక వ్యక్తి వచ్చారు. తానొక పోలీసు అధికారినని మత్ భార్య నొర్హయతీతో పరిచయం చేసుకున్న ఆయన, అసలు రహస్యాన్ని బయటపెట్టారు.

మత్‌, కోహ్‌లను కిడ్నాప్ చేసింది స్పెషల్ బ్రాంచ్‌ పోలీసులేనని వెల్లడించారు.

కోహ్ ముస్లింలను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, మత్ కూడా సున్నీ ముస్లింలు మెజారిటీగా ఉన్న మలేసియాలో నిషేధిత 'షియా ఇస్లాం'ను ప్రచారం చేస్తున్నారని పోలీసులు భావించారని ఆ వ్యక్తి చెప్పారు.

స్పెషల్ బ్రాంచ్ చేసిన పని తప్పేనని, అందుకే నిజమేమిటో చెప్పాలని వచ్చానని ఆ పోలీసు అధికారి నొర్హయతీకి వివరించారు.

తర్వాత, నొర్హయతీ వివరించిన ఈ వాంగ్మూలాన్ని నిశితంగా పరిశీలించిన మానవ హక్కుల కమిషన్, అదంతా విశ్వసించదగిన విషయమని నిర్ధరించింది.

కానీ ఆ పోలీసు అధికారి మాత్రం, నొర్హయతీకి తానేమీ చెప్పలేదని అడ్డంతిరిగినప్పటికీ, ఆయన పొంతనలేని విషయాలు చెబుతున్నట్లు కమిషన్ గుర్తించింది.

రేమండ్ కోహ్, అమ్రి చే మత్ అపహరణలకు 'స్పెషల్ బ్రాంచ్' బాధ్యులని కమిషన్ తేల్చి చెప్పింది.

ఇస్లాంకు వ్యతిరేక కార్యక్రమాల్లో వీరి ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో మతాధికారులు, పోలీసులు టార్గెట్ చేశారని పేర్కొంటూ కమిషన్ 2019 ఏప్రిల్‌లో ఒక నిర్ధరణకు వచ్చింది.

మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన ఈ నివేదిక మలేసియా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండు చేశారు.

కొన్ని నెలల తర్వాత, ప్రభుత్వం విచారణ ప్రారంభించింది.

అయితే, ఆ నివేదిక కోసం సుసన్నా, నొర్హయతీ కోర్టుకెళ్లిన తర్వాతే, ప్రభుత్వం దాన్ని బహిర్గతం చేసింది.

మరోవైపు, ప్రభుత్వ విచారణలోనూ పోలీసుల పాత్ర ఉన్నట్లే తేలింది.

అవాలుద్దీన్ బిన్ బదిద్ అనే వ్యక్తి పేరునూ నివేదిక ప్రస్తావించింది. ఆయన స్పెషల్ బ్రాంచ్‌లో సామాజిక తీవ్రవాదాన్ని అరికట్టే విభాగానికి అధిపతిగా పనిచేసే సీనియర్ అధికారి.

ఆయనకు షియా ఇస్లాం, క్రైస్తవ మతాలపై తీవ్రవాద భావాలున్నాయని, ఆ మతాలను ఇస్లాంకు ముప్పుగా చిత్రీకరిస్తూ బహిరంగంగా ప్రసంగించేవారని ఆ నివేదిక వెల్లడించింది.

ఉద్యోగ విరమణ చేసిన అవాలుద్దీన్‌ను ఈ నివేదికలోని అంశాలపై వివరణ కోరడానికి బీబీసీ ప్రయత్నించింది. అయితే, ఆయన నుంచి ఇప్పటివరకూ ఎటువంటి స్పందనా రాలేదు.

అయితే, గతంలో అమ్రి చే మత్ అదృశ్యంతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని అవాలుద్దీన్ ఖండించారు. అంతేకాదు, ఈ నివేదికను రూపొందించిన ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్ తనపై పక్షపాతం చూపిందని ఆయన ఆరోపించారు.

సుసన్నా ల్యూ 2020లో మెలానియా ట్రంప్, మైక్ పాంపియాల నుంచి విశిష్ట పతకాన్ని అందుకున్నారు.

ఫొటో సోర్స్, US Department of State

ఫొటో క్యాప్షన్, మెలానియా ట్రంప్, మైక్ పొంపియో నుంచి సుసన్నా మెడల్ అందుకున్నారు

‘అధికారి తప్పుకు ప్రభుత్వానిదే బాధ్యత...’

ఉన్నత స్థాయి పోలీసు అధికారులు, రాయల్ మలేసియన్ పోలీసు, మలేసియా ప్రభుత్వంపై సుసన్నా వ్యక్తిగతంగా, అలాగే తన భర్త తరఫున 2020లో సివిల్ దావా వేశారు.

రోమండ్ కోహ్ అపహరణకు, హాని కలిగించేలా జరిగిన కుట్రకు పోలీసు అధికారులు, రాయల్ మలేసియన్ పోలీసులో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది బాధ్యులని గత నెలలో హైకోర్టు తేల్చి చెప్పింది.

బాధ్యులు ప్రభుత్వాధికారులు కాబట్టి, వారి వల్ల జరిగిన హానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.

అంతేకాదు, మానసిక వేదనకు గురైన సుసన్నా ల్యూకు కొన్ని మిలియన్ల రింగిట్లు (మలేసియా కరెన్సీ) చెల్లించాలని, అలాగే కోహ్ ఆచూకీ తెలిసేవరకూ ఆయన అదృశ్యమైన నాటి నుంచి రోజుకు 10,000 రింగిట్లు (దాదాపు రూ.2,21,893) చొప్పున ఒక ట్రస్టుకు చెల్లించాలని ఆదేశించారు.

ఇప్పటివరకూ ఈ మొత్తం 32 మిలియన్ రింగిట్లు (సుమారు రూ.71 కోట్లు) దాటిపోయింది.

మలేసియా చరిత్రలోనే ఇది అత్యంత భారీ పరిహారంగా నిలిచే అవకాశం ఉంది.

కోహ్ అచూకీ వెల్లడైన తర్వాతే ఆ సొమ్ము ట్రస్టు ద్వారా సుసన్నా ల్యూకు, ఆమె పిల్లలకు అందుతుంది.

ఇదే తరహా దావా వేసిన నొర్హయతీ కూడా విజయం సాధించారు. కొన్ని మిలియన్ల రింగిట్లను పరిహారంగా ప్రభుత్వం నుంచి పొందారు.

అయితే, హైకోర్టు తీర్పులపై ప్రభుత్వం అప్పీలు చేస్తోంది. ఆ తీర్పులో ఆర్థిక బాధ్యతలకు సంబంధించిన అంశాలు ఉన్నాయని, తాము సార్వత్రిక న్యాయసూత్రాన్ని కాపాడాల్సిన ఉందని వాదిస్తోంది.

రేమండ్ కోహ్ ఏమయ్యారు?

''పాస్టర్ రేమండ్ ఎక్కడ ఉన్నారో తెలియని అనిశ్చితి మమ్మల్ని ఇప్పటికే కుంగదీసింది. మేమంతా బాధలో ఉన్నాం. ముందుకు సాగలేకపోతున్నాం'' అని సుసన్నా అన్నారు.

తన భర్త మరణించి ఉండవచ్చన్న ప్రస్తావన రాగానే ల్యూ గొంతు మూగబోయింది. ''ఆ నిజాన్ని అంగీకరించడం చాలా కష్టం'' అని చెబుతూనే, తన భర్త జీవించే ఉంటారని ఆశిస్తున్నానని అన్నారు.

నిరాశా నిస్పృహల నుంచి బయటపడేందుకు తన సహాయం చేసిన కౌన్సెలర్లనే స్ఫూర్తిగా తీసుకొని సుసన్నా ఇప్పుడు తానూ కౌన్సెలర్ కావడానికి శిక్షణ పొందుతున్నారు.

తన భర్త కేసు గురించి ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నంలో ఆమె, 'బలవంతపు అదృశ్యాల'పై గళమెత్తే సాహసోపేత విమర్శకురాలిగా మారారు.

ఆమె చేస్తున్న కృషికి గాను అమెరికా 2020లో ఆమెకు 'ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్' పతకాన్ని అందించింది.

తన భర్త అపహరణ కేసులో నిందితులనూ క్షమిస్తున్నట్లు సుసున్నా చెబుతున్నారు.

కోర్టు బోనులో నిలబడిన నిందితులను తొలిసారి చూసినప్పుడు, వారి గొంతు నొక్కేయాలన్నంత కోపం వచ్చిందని, కానీ ఆ తర్వాత ప్రధాన నిందితుడిని ముఖాముఖి చూసినప్పుడు తనలో అలాంటి ద్వేషం కలగలేదని చెప్పారు.

క్షమించడం అంటే న్యాయపోరాటం ఆపేయడం కాదన్నారు.

పోలీసుల ప్రవర్తనను పర్యవేక్షించడానికి ఒక క్రమశిక్షణా విభాగం, అలాగే తన భర్త అపహరణలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించడానికి విచారణా కమిషన్‌ను, టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటివరకూ ఆమె దావాలో పేర్కొన్న పోలీసు అధికారులలో ఎవరినీ అరెస్టు చేయలేదు. పైగా, వారిలో ఒకరికి ప్రమోషన్ కూడా వచ్చింది.

''నిజం, న్యాయం గెలవాలి. దోషులకు శిక్ష పడాలి. పాస్టర్ రేమండ్ ఎక్కడున్నారనేదీ మాకు తెలియాలి. మేమాశించేది ఇవే'' అని సుసన్నా అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)