ట్రైజెమినల్ న్యూరాల్జియా: ‘ఈ నొప్పి మాటల్లో చెప్పలేం’

ఫొటో సోర్స్, Aneeta Prem
- రచయిత, గారీ ఓవెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
ముఖం పక్క భాగంలో స్క్రూడ్రైవర్‌తో గుచ్చినంత నొప్పితో విలవిల్లాడుతూ, ఇక ఈ బాధతో తాను బతకలేననుకున్నారు గెర్విన్ టుమెల్టీ.
ఓ ముద్ద ఆహారం తీసుకోగానే ముఖం పక్కభాగంలో కలిగే నొప్పి భరించలేక 52 ఏళ్ల గెర్విన్ డైనింగ్ టేబుల్ నుంచి లేచి వెళ్లిపోయేవారు. ఈ దృశ్యం ఆయన ముగ్గురు పిల్లలకు అలవాటైపోయింది.
‘‘వైద్యప్రపంచం అత్యంత బాధాకరమైనదిగా భావించే ఈ నొప్పితో'' ఆయన బాధపడుతున్నారని యూకేకు చెందిన ట్రైజెమినల్ న్యూరాల్జియా అసోసియేషన్ తెలిపింది.
ఈ నొప్పి ముఖంలోని ఒక నరాన్ని రక్తనాళం ఒత్తిడికి గురిచేయడం వల్ల ఏర్పడుతుంది. దీన్ని చాలా సార్లు పంటినొప్పని పొరపాటుపడుతుంటారు.
దీనికి అనేక కారణాలుంటాయి. కొన్నిసార్లు బలమైన గాలి స్పర్శ కూడా కూడా నొప్పికి కారణమవుతుంది.

‘విద్యుత్ షాక్ తగిలినట్టు ఉంటుంది’
లక్ష మందిలో సుమారు ఎనిమిది మంది ఏటా ట్రైజెమినల్ న్యూరాల్జియా (టీఎన్) బారిన పడుతుంటారని నైస్ (ఎన్ఐసీఈ) తెలిపింది.
ఈ వ్యాధి నిర్ధరణ కావడానికి ఏడేళ్లు పట్టిందని మరో బాధితురాలు చెప్పారు. విద్యుత్ షాక్ లాంటిది తగిలినట్టుగా తన ముఖం నొప్పిపెడుతోందని చెబుతున్నప్పటికీ డాక్టర్లు ఆమెకు ఏ సమస్యా లేదని చెప్పేవారు.
"నాకు దవడలో ఎంత నొప్పి వచ్చేదంటే కరెంటు షాక్ తగిలినట్టే ఉండేది'' అని స్వాన్‌సీలోని పోంటార్డులైస్‌కు చెందిన గెర్విన్ వివరించారు.
"ఎవరో నా ముఖం పక్కన స్క్రూడ్రైవర్‌తో గుచ్చుతున్నట్టు అనిపించేది. ఆ నొప్పి చాలా భయంకరంగా ఉండేది" అని ఆయన తెలిపారు.
విజయవంతమైన వ్యాపారవేత్త అయిన గెర్విన్ 2017 నుంచి రెండేళ్ల పాటు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఇది ఆయన జీవితంపై తీవ్ర పభావం చూపింది.
"నేనిక బతకలేననే ఆలోచనలు వచ్చేవి. నేనుచనిపోతే బావుంటుందనేపించేది" అని గెర్విన్ చెప్పారు.
"అలా చేస్తే నా కుటుంబం ఏమైపోతుందనే ఆలోచనే నన్ను ముందుకుసాగేలా చేసింది"
"కానీ ఈ బాధకి ముగింపు కనిపించలేదు. అది చాలా నిరాశాజనకమైన కాలం" అని ఆయన గుర్తుచేసుకున్నారు.

గాలి తగిలినా నొప్పే
ట్రైజెమినల్ న్యూరాల్జియా సాధారణంగా ముఖం, దంతాలు, నోటి నుంచి నొప్పి, స్పర్శకు సంబంధించిన సంకేతాలను మెదడుకు పంపే ట్రైజెమినల్ నరంపై ఒత్తిడి కారణంగా వస్తుంది.
ముఖ్యంగా కపాలంలోని రక్తనాళం ఆ నరంలో కొంత భాగాన్ని ఒత్తిడికి గురి చేయడం వల్ల ఇది జరుగుతుంది.
ముఖం కడుక్కోవడం భోజనం తినడం, పళ్లు తోమడం లాంటి పనుల వల్ల ఎటాక్స్(అకస్మాత్తుగా నొప్పి తీవ్రంగా, ఒక షాక్‌లా కలగడం) రావచ్చు.
చిన్నగా గాలి తాకినా ఆ నొప్పి బాగా ఎక్కువైపోతుంది.
ఈ నొప్పి కొన్ని సెకన్ల నుంచి రెండు నిమిషాల వరకు ఉండొచ్చు. పరిస్థితి తీవ్రంగా ఉన్న కేసుల్లో రోజుకు వందల సార్లు కూడా ఈ నొప్పి రావచ్చు.
ఆహారం తింటున్నప్పుడు తీవ్రమైన నొప్పి రావడంతో గెర్విన్ 2019లో న్యూరోసర్జరీ చేయించుకున్నారు.
మత్తు మందు ఇచ్చి చేసే ఈ శస్త్రచికిత్సలో, తల ఎముకలో చిన్న భాగాన్ని తీసి నొప్పికి కారణమవుతున్న నరంపై ఒత్తిడిని తగ్గిస్తారు.
ఈ శస్త్రచికిత్స వల్ల ముఖం నిస్సత్తువగా మారడం, వినికిడి కోల్పోవడం, గుండెపోటు వంటివాటితో పాటు వెయ్యిమందిలో ఒకరు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
అయితే శస్త్రచికిత్స దీర్ఘకాలిక ఉపశమనం అందిస్తుంది. శస్త్రచికిత్స తర్వాత 10 నుంచి 20 ఏళ్లలో ప్రతి 10 మందిలో ముగ్గురికి మాత్రమే నొప్పి తిరిగి కలిగినట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Gerwyn Tumelty
‘అందరితో మాట్లాడుతుండాలి’
గెర్విన్‌కు సర్జరీ విజయవంతమైంది. ఆయన అద్భుతంగా కోలుకున్నారు.
శారీరకంగా నొప్పి తగ్గినా ఆయన మానసిక ఆరోగ్యంపై ఆ నొప్పి కలిగించిన ప్రభావం మాత్రం అలాగే ఉంది.
2022లో మళ్లీ ఆయనకు ఆ నెగటివ్ ఆలోచనలు వచ్చాయి. వాటిగురించి మొదట్లో ఆయన ఎవరికీ చెప్పలేదు.
"నాకు చాలా దిగులుగా, ఒంటరిగా అనిపించింది" అని ఆయన అన్నారు.
"మాట్లాడగలిగే స్నేహితులు నాకు దగ్గరగా ఉండడం నా అదృష్టం. అది నాకు సాయపడింది. దాని గురించి అప్పటివరకూ నేనెవరికీ చెప్పలేదు. ఆ తర్వాత నేను మాట్లాడడం మొదలుపెట్టాను''
మాజీ నేవీ సహచరులతో కలిసి కూర్చొని డ్రింక్ చేస్తున్నప్పుడు తన భావాలను వారితో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అది తన జీవితాన్ని మార్చేసిందని ఆయన చెప్పారు.
అప్పటి నుంచి ఆయన ఆరోగ్యకరమైన జీవనం, వ్యాయామం, అవుట్‌డోర్‌లైఫ్‌పై దృష్టి పెట్టగలిగారు.
ఆయన లండన్ మారథాన్ పూర్తి చేశారు. అలాగే మొరాకో వంటి దేశాల్లో పర్వత యాత్రలు చేశారు.
కానీ ప్రతిరోజూ ఓ కష్టమైన పని ముఖ్యంగా ఐస్ బాత్ వంటివాటితో ఆయన జీవితంలో ఎక్కువ మార్పు ఇంట్లో ఉండేటప్పుడే జరిగింది.
జీవితంలో స్వీయ క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరాన్ని ఇది కల్పిస్తుందని, ఇది రోజును, జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు మనల్ని సిద్ధం చేస్తుందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, The Content Creators
వ్యాధి నిర్ధరణకే ఏళ్ల సమయం
అనితా ప్రేమ్ అంత అదృష్టవంతురాలు కాదు.
గెర్విన్‌లానే సర్జరీ చేయించుకున్నప్పటికీ, ఆ సర్జరీ విజయవంతం కాలేదు.
ఆమెకు బిలాటరల్ టీఎన్ ఉంది. ఈ వ్యాధి రకాల్లో ఇది చాలా అరుదైనది. దీనివల్ల ముఖం రెండు వైపులా విద్యుత్ షాక్ తగిలినట్టుగా ఒకేసారి నొప్పి రావొచ్చు.
ఆమెకు ఈ వ్యాధి నిర్ధరణ కావడానికి ఏడేళ్లు పట్టింది.
"నా ముఖం బాగా నొప్పిపుట్టేది. ముఖానికి విద్యుత్ షాక్ కొట్టినట్టనిపించేది.ముందు నేను దీన్ని పంటినొప్పనుకున్నాను. అందుకే ఒక జ్ఞానదంతాన్ని తొలగించుకున్నా. అది అలాగే కొనసాగి ఉంటే నేను పళ్లన్నీ తొలగించుకోవాల్సి వచ్చేదేమో" అన్నారు అనితా ప్రేమ్.
కానీ 'మీకు ఏమీ సమస్య లేదు' అని డాక్టర్లు చెప్పడంతో ఆమె తన బాధ గురించి మాట్లాడడం మానేశారు.
చివరికి ఒక డాక్టర్ క్లినిక్‌లో ఆమెను అదనపు పరీక్షలకు పంపడం వల్లే సరైన నిర్ధరణ జరిగింది.
ఇప్పటికీ చలికాలంలో బయటకు వెళ్లడం ఆమెకు కష్టం. చల్లగాలి తగిలితే నొప్పి రావొచ్చు.
ఇప్పుడు ఆమె ట్రైజెమినల్ న్యూరాల్జియా అసోసియేషన్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్.
తొలిదశలోనే వ్యాధిని నిర్ధరించి,సాయం చేయడం చాలా ముఖ్యం. సాధారణ క్లినిక్కులు, పంటిచికిత్సల దగ్గరే గుర్తించగలిగితే బాగుంటుందని అనితా భావిస్తారు.
వేల్స్‌లో వ్యాధిని గుర్తించడానికి ఒక విజయవంతమైన విధానం ఉందని ఆమె చెప్పారు.
"ఒకసారి నిర్ధరణ అయితే, వారికి అత్యుత్తమ చికిత్స అందేందుకు అవకాశాలు ఏర్పడతాయి'' అని ఆమె అన్నారు.
ఈ నొప్పి వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆమె చెప్పారు.
"చాలా బాధాకరమైన విషయమేంటంటే చాలామంది తమ ప్రాణాలు తీసుకోవాలని ఉందని చెబుతున్నారు. 33శాతం అలాగే ఆలోచించారు. 80శాతం కంటే ఎక్కువ మంది ఎప్పుడూ సహాయం కోరలేదు" అని అనీతా చెప్పారు.
"వారికి తీవ్రమైన నొప్పి ఉన్నా, ఆ నొప్పి, దాని వల్ల కలిగే భావాల గురించి మాట్లాడటానికి సిగ్గుపడుతున్నారు"
"ఒంటరిగా ఉండిపోతున్నారు. ఒక్కరే ఉంటున్నారు. నొప్పి శ్వాసను కూడా ఆపివేస్తున్నంత బాధ ఉండడంతో బయటకు వెళ్లలేకపోతున్నారు" అని ఆమె చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














