స్పైడర్ మ్యాన్-నో వే హోం: కరోనా కాలంలో వంద కోట్ల డాలర్ల కలెక్షన్లు సాధించిన తొలి సినిమా

స్పైడర్ మాన్

ఫొటో సోర్స్, SONY PICTURES

తాజాగా విడుదలైన 'స్పైడర్ మ్యాన్: నో వే హోం' కరోనా కాలంలో విడుదలై, వంద కోట్ల డాలర్లు(రూ.7500 కోట్లు) వసూలు చేసిన తొలి సినిమాగా నిలిచింది.

2021లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమా ఘనతను కూడా ఇది సొంతం చేసుంది.

చైనా నిర్మాత కొరియా యుద్ధంపై నిర్మించిన 'బాటిల్ ఆఫ్ లేక్ ఛాంగ్జిన్' సినిమా కలెక్షన్లను స్పైడర్ మ్యాన్: నో వే హోం మించిపోయింది.

మాండరిన్ సినిమా టబాటిల్ ఆఫ్ ఛాంగ్జిన్' ప్రపంచవ్యాప్తంగా 905 మిలియన్ డాలర్లు(రూ.6800 కోట్లు) వసూలు చేసింది.

మీడియా డేటాను విశ్లేషించే కేమ్‌స్కోర్ సంస్థ వివరాల ప్రకారం కరోనా వ్యాప్తికి ముందు వంద కోట్ల డాలర్లు వసూలు చేసిన చివరి సినిమా 'స్టార్ వార్స్-ది రైజ్ ఆఫ్ స్కైవాకర్'.

రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత విడుదలైన హాలీవుడ్ సినిమాలేవీ ఈ బాక్సాఫీస్ మైలురాయిని అందుకోలేకపోయాయి.

వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన కలెక్షన్లు తాజా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రం వసూళ్లను 1.05 బిలియన్ డాలర్ల(రూ.7880 కోట్లు)కు చేర్చాయి.

ఈ సినిమాలో టామ్ హాలెండ్, జెండాయాస్ ఎంజేకు జంటగా కనిపిస్తాడు

ఫొటో సోర్స్, Getty Images

సోనీ, డిస్నీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న సమయంలో విడుదలైంది.

ప్రీమియర్ తర్వాత రెండు వారాల్లోనే ఇది వంద కోట్ల డాలర్ల కలెక్షన్ల మైలురాయిని అందుకుంది.

స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ ప్రపంచంలోనే అతిపెద్ద సినీ మార్కెట్ అయిన చైనాలో కూడా విడుదలయ్యింది.

2019లో విడుదలైన 'స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్' 1 బిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించిన మొదటి స్పైడర్ మ్యాన్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1.132 బిలియన్ డాలర్ల(రూ.8493 కోట్లు) కలెక్షన్లతో ఈ ఫ్రాంచైజీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిందని కేమ్‌స్కోర్ చెప్పింది.

'ఫార్ ఫ్రమ్ హోం'లో విలన్ మిస్టీరియో తను చనిపోయే ముందు స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కరే అనే గుట్టు బయటపెట్టిన తర్వాత నుంచి తాజా చిత్రం ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)