బడ్జెట్ 2021: కరోనా మహమ్మారి, మాంద్యం గుప్పిట్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను నిర్మలా సీతారామన్ గట్టెక్కించగలరా?

ఫొటో సోర్స్, PIB
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశం తొలిసారి అధికారికంగా ఆర్థిక మాంద్యంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం కుంచించుకుపోతుందని అంచనా.
ప్రపంచంలోని ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ నెమ్మదిగా తిరిగి పట్టాలు ఎక్కుతున్నప్పటికీ, బడ్జెట్లో భారీ చర్యలు లేకపోతే ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి పథంలోకి తీసుకురావడంలో అది విఫలమవుతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
కొన్నేళ్లుగా బడ్జెట్లను విశ్లేషిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ ప్రియా రంజన్ దాస్, "ఇది ప్రభుత్వం లోతుగా ఆలోచించాల్సిన సమయం’’ అని ఉద్ఘాటించారు.
పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పలు కొత్త ఆలోచనలను చర్చిస్తున్నారు. కరోనా సెస్ లేదా సర్-చార్జ్ విధించే అంశాన్ని క్రియాశీలంగా పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. దీనిని ‘‘గరిష్టంగా మూడు సంవత్సరాలు’’ విధించే అవకాశముందని చెబుతున్నాయి. ఈ సెస్ కానీ, సర్ చార్జ్ కానీ.. ‘‘వ్యక్తుల కంటే కార్పొరేట్ రంగం ఎక్కువగా చెల్లిస్తుంది’’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇబ్బడిముబ్బడిగా సమస్యలు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంవత్సరం ఎదుర్కొంటున్నంత భారీ సమస్యలను స్వతంత్ర భారతదేశంలో మరే ఆర్థికమంత్రి కూడా ఎదుర్కోలేదేమో.
బడ్జెట్ కోసం సిద్ధమవుతున్నప్పుడు ఆమె పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని సమస్యలను చూడండి: ఇప్పటికే 1.5 లక్షలకు పైగా మరణాలకు కారణమై, కోటి మందికి పైగా సోకి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నీడలో తాజా బడ్జెట్‌ను పార్లమెంటులో (ఫిబ్రవరి 1 న) ప్రవేశపెట్టాలి. ఒకవైపు.. తీవ్ర ఒత్తిడికి గురైన ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించాలి. మరోవైపు.. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో పార్లమెంటు భవనానికి ప్రదర్శనగా వస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇంకోవైపు చైనాతో అవాంఛిత సరిహద్దు ఉద్రిక్తత కొనసాగుతోంది.
అయితే.. ఇది ఈ శతాబ్దంలోనే ఉత్తమ బడ్జెట్ అవుతుందని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఆమె చెప్పినట్లు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. కానీ బడ్జెట్ అనేది దేశం ఎదుర్కొంటున్న అన్ని ఆర్థిక కష్టాలనూ తీర్చే మంత్రదండం కాదనేది ఆర్థికవేత్తల ఏకాభిప్రాయం.
కరోనా మహమ్మారి ప్రభావం నుంచి గట్టెక్కటానికి ఒక బడ్జెట్ సరిపోదని ముంబైలోని చురీవాలా సెక్యూరిటీస్ సంస్థకు చెందిన అలోక్ చుడీవాలా చెప్తున్నారు. ‘‘దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు మరమ్మతు చేయటానికి చాలా సమయం పడుతుంది. మన ఉద్దేశం సరైనదైతే.. మనం ఈ బడ్జెట్లోనే కొలుకోవటం మొదలవుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
అయితే ప్రియా రంజన్ డాష్ మాత్రం.. బడ్జెట్ గురించి జరుగుతున్న ప్రచారం చాలా అతి అంచనాలతో ఉందని భావిస్తున్నారు. ‘‘నాకు పెద్దగా ఆశావహంగా కనిపించటం లేదు. మీడియాలో కథనాలను మేనేజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. శతాబ్దపు గొప్ప బడ్జెట్‌ను సమర్పిస్తామంటున్న ఆర్థిక మంత్రి ప్రకటన మాట గొప్పలే. ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో కానీ, ప్రస్తుత సవాలును సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కానీ ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని నేను పెద్దగా ఆశించను’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే, బడ్జెట్ అనేది ఆర్థికాభివృద్ధికి చోదకశక్తినిచ్చే ఉద్దేశ వ్యక్తీకరణ తరహాలోనే.. ప్రభుత్వ రాజకీయ వ్యక్తీకరణ కూడా అవుతుంది. కానీ ప్రతి సంవత్సరం అనేక బడ్జెట్ ప్రతిపాదనలు ఎన్నడూ నెరవేరకపోవటం సాధారణంగా జరిగేదే.
బడ్జెట్‌కు ముందు ఆర్థికమంత్రి అన్నీ సరైన సంకేతాలే ఇచ్చారు. వృద్ధిని పునరుద్ధరించడం, మహమ్మారి వల్ల దెబ్బతిన్న రంగాలకు మద్దతు అందించడం, ఉపాధి కల్పించడం, 2020లో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన వారికి సహాయం చేయడం తన ప్రాధాన్యతలుగా ఆమె చెప్పారు.
కానీ ఆమె ఉద్దేశాలను ఆచరణలో పెట్టడం ఎంత కష్టం? మరో మాటలో చెప్తే.. బడ్జెట్ రూపకల్పనలో ఆమె ఎదుర్కొంటున్న భారీ సవాళ్లు ఏమిటి?

ఫొటో సోర్స్, PTI
రికార్డు స్థాయి నిరుద్యోగం
ఉపాధి కల్పన అతిపెద్ద సవాళ్లలో ఒకటి. దేశంలో 2012లో నిరుద్యోగిత రేటు రెండు శాతంగా ఉంది. ఇప్పుడిది 9.1 శాతానికి పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందనేది నిజమే. కానీ చాలా దేశాలు నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకున్నాయి.
రికార్డు స్థాయిలో నిరుద్యోగం అనేది ఆర్థికమంత్రికి అతిపెద్ద తలనొప్పి అని స్వతంత్ర ఆర్థిక నిపుణుడు ప్రియా రంజన్ డాష్ అభివర్ణించారు.
‘‘విధాన నిర్ణేతలు నిరుద్యోగ సమస్యను ఓ పెద్ద సవాలుగా గుర్తించకపోవటమే అతి పెద్ద సమస్య’’ అని ఆయన పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం కోవిడ్ -19కి ముందే 45 సంవత్సరాల రికార్డు స్థాయిలో ఉంది. కోవిడ్ అనంతర కాలంలో పరిస్థితి మరింతగా దిగజారింది’’ అని ఆయన వివరించారు.
నిరుద్యోగ సమస్య కొన్నేళ్లుగానే ఉందని, కొత్తగా పుట్టుకొచ్చింది కాదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ‘‘ప్రభుత్వం ఈ సమస్య లేదంటోంది కాబట్టి దీనిని ఎదుర్కోబోవటం లేదు’’ అని ప్రియా రంజన్ దాస్ పేర్కొన్నారు.
‘‘తీవ్రమైన నిరుద్యోగమే అసలు సవాలు. ఈ సమస్య చాలా ఏళ్లుగా ఉందనేది నిజమే. కానీ కోవిడ్ ప్రభావం కారణంగా ఇది మరింత పెద్ద సమస్యగా మారింది’’ అన్నారాయన.
ప్రభుత్వం నిరుద్యోగిత వివరాలను కూడా జారీ చేయటం లేదని డాష్ విచారం వ్యక్తంచేస్తున్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ).. ఉపాధి, ఉద్యోగాలకు సంబంధించి చిత్తు అంచనాలను విడుదల చేస్తుంది.
ఆ సంస్థ తాజా నివేదిక ప్రకారం.. కోవిడ్ -19కి ముందు దేశంలో జీతాలు పొందే ఉద్యోగాలు 8.6 కోట్లు ఉన్నాయి. కోవిడ్ విజృంభించిన ఐదు నెలల్లో (ఆగస్టు 2020) వాటిలో 2.1 కోట్ల ఉద్యోగాలు పోయాయి.
అసంఘటిత రంగంలోని శ్రామికుల్లో అత్యధికులుగా ఉన్న రోజువారీ కూలీలు 12 కోట్ల ఉద్యోగాలు కోల్పోయారని ఒక అంచనా. వీరిలో చాలామంది ఇప్పుడు ఉపాధిలోకి తిరిగి వచ్చారు.
భారతదేశ నిరుద్యోగ సమస్యకు వృద్ధి ఒక్కటే పరిష్కారమని దాస్ చెప్తారు. ‘‘21వ శతాబ్దంలో భారతదేశపు ప్రఖ్యాత రెండంకెల వృద్ధి రేటు మహమ్మారి విజృంభణకన్నా ముందే పట్టాలు తప్పింది. కోవిడ్ దానిని నాశనం చేసిందని మనకు తెలుసు. మనమిప్పుడు మాంద్యంలో ఉన్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE
కోలుకుని, వేగంగా వృద్ధిచెందడం ఎలా?
కోవిడ్ వల్ల వాటిల్లిన నష్టాల నుండి కోలుకోవడం, వృద్ధి రేటును వేగవంతం చేయడం ఆర్థికమంత్రి ఎదుర్కొంటున్న రెండో అతిపెద్ద సవాలని ప్రియా రంజన్ డాష్ చెప్పారు.
కరోనా మహమ్మారి, దానిని నియంత్రించటానికి విధించిన లాక్‌డౌన్ కారణంగా భారతదేశం జీడీపీలో నాలుగు శాతం కోల్పోయిందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. మహమ్మారికి ముందు నాటి ఆర్థిక పరిస్థితికి తిరిగి చేరుకోవాలంటే మూడేళ్ల పాటు 8.5 శాతం చొప్పున సుస్థిర వృద్ధి సాధించాల్సి ఉంటుందని ఆర్థికవేత్తల అంచనా. ఆర్థికమంత్రి సీతారామన్ చేయాల్సిన పని ఇంత పెద్దదన్నమాట.
ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి పథంలోకి తీసుకురావడం ఎలా అనేది ఆర్థికమంత్రి ఎదుర్కొంటున్న ప్రధాన సవాలని అలోక్ చుడివాలా చెప్పారు. ‘‘ఈ సవాలును ఎదుర్కోవడానికి ప్రభుత్వం భారీ ఉద్దీపన ప్యాకేజీని తీసుకురావాల్సి ఉంటుంది. డిమాండ్‌ను పెద్ద ఎత్తున పెంచాల్సి ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటివరకు కరోనా ప్రభావాల మీద పోరాడే విషయంలో ప్రభుత్వం ఆర్థికంగా పొదుపు పాటిస్తూ, జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. భారతదేశం ఆర్థిక క్రమశిక్షణ గురించి పెద్దగా పట్టించుకోకుండా, ఆర్థిక పొదుపువాదాన్ని ఒక్కసారి పక్కనపెట్టి, భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు వాదిస్తున్నారు.
‘‘ఇది అసాధారణమైన కాలం’’ అంటారు ఫైనాన్షియల్ జర్నలిస్ట్ ఆశిష్ చక్రవర్తి. ‘‘అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీల గురించి పట్టించుకుంటే కుదరదు. ఖర్చు చేయాలి. విపరీతంగా ఖర్చు చేయాలి. ఖర్చు చేయటమే పరిష్కారం. మన ఆర్థిక క్రమశిక్షణను రేటింగ్ ఏజెన్సీలు ప్రశ్నిస్తాయి. కానీ రాబోయే మూడేళ్ళ పాటు మనం వాటిని విస్మరించి తీరాలి’’ అని ఆయన చెప్తున్నారు.
‘‘నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను ఇతర సంవత్సరాలకు భిన్నంగా పరిగణించాలి. మనం 2020లో చాలా పొదుపుగా వ్యవహరించాం. అది డిమాండ్‌ను పెంచడానికి తోడ్పడలేదు. వినియోగం మందగమనంలోనే ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.
అయితే.. ‘‘గుడ్డిగా ఖర్చు పెట్టాలని నేను చెప్పటం లేదు’’ అని చక్రవర్తి పేర్కొన్నారు. ‘‘తెలివిగా, వేగంగా వ్యయం చేయాలని నేను చెప్తున్నాను. డిమాండ్‌ను పుట్టించగలిగేలా, సానుకూలతను వ్యాప్తి చేయగలిగేలా ఖర్చు చేయాలని చెప్తున్నాను. తద్వారా మనం వినియోగాన్ని సృష్టించగలం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో వ్యయమే ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉంటుంది’’ అని వివరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది మే నెలలో రూ. 20 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. అది ఉద్దీపన ప్యాకేజీ అని చెప్పారు. అత్యంత పేదలకు కొంత నగదు పంపిణీ కూడా చేశారు.
అయితే.. అది ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి అవసరమైన ఆర్థిక ప్యాకేజీగా విమర్శకులు భావించటం లేదు. పలు ప్రధాన ఆర్థిక దేశాల్లో ఇచ్చినట్లుగా.. చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు కనీసం ఒక్కసారి కూడా నగదు సహాయం లభించలేదు. కానీ ప్రభుత్వ ప్రయత్నాలు.. మార్కెట్లో వారికి తగినంత ద్రవ్యతను సృష్టించాయి. ‘‘సరఫరా విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు కానీ డిమాండ్ సమస్యను పెద్దగా పరిష్కరించలేదు’’ అంటారు చక్రవర్తి.
‘‘అభిమానుల హర్షాతిరేకాల మధ్య ప్రారంభించిన ఆ ఆర్థిక ప్యాకేజీ డిమాండ్‌ను పెంచలేదనే విషయం మనకు కనిపిస్తోంది. డిమాండ్, వినియోగం ఇంకా మందకొడిగానే కొనసాగుతున్నాయి. డిమాండ్ పెద్ద ఎత్తున పెరిగేలా ఆర్థికమంత్రి ప్రేరేపించాలి’’ అని ఆయన పేర్కొన్నారు.
ఎటువంటి నగదు ప్రోత్సాహకమైనా ఉపాధికి అనుసంధానంగా ఉండాలంటారు ప్రియా రంజన్ డాష్. ‘‘నైపుణ్యం లేని రోజువారీ కూలీల కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద మూడు నెలల పాటు ఉపాధి కల్పించే భరోసా ఉన్న విధంగా’’ అది ఉండాలని ఉదహరించారు.

ఫొటో సోర్స్, SOPA IMAGES/GETTY IMAGES
ప్రాథమిక కనీస సార్వత్రిక ఆదాయం
ప్రభుత్వం తెగువ చూపాలని, వివిధ నైపుణ్య కార్మికుల కోసం ప్రాథమిక కనీస సార్వత్రిక ఆదాయ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఇది ఉత్తమ సమయమని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇది సాహసోపేతమైన చర్యే కానీ సరైన చర్య’’ అంటారాయన.
ఇది నగదు వితరణగా ఉండకూడదని, గ్రామీణ ఉపాధి హామీ పథకం తరహాలో ఏదైనా ఉపాధి పథకానికి అనుసంధానంగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనాలు నేరుగా కార్మికుల ఖాతాల్లోకి బదిలీ అవుతున్నాయి.
‘‘వివిధ స్థాయి నైపుణ్యాలు గల కార్మికులకు, గ్రామీణ, పట్టణ కార్మికులకు ప్రతిపాదిత పథకం అమలుచేయాలి. సంవత్సరానికి కనీసం 100 రోజులు ఉపాధి హామీ ఉండాలి’’ అని సూచించారు.
ఆర్థికమంత్రికి రాజకీయ సంకల్పం ఉంటే ఆమె దీనిని అమలు చేయగలరని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘దేశంలో 17 కోట్ల మందిని దారిద్య్రరేఖకు దిగువ నుండి పైకి ఎదగడానికి దోహదపడిన ప్రపంచంలోని అతిపెద్ద ఉపాధి హామీ కార్యక్రమాన్ని (ఎంజీఎన్ఆర్ఈఏ)ను అమలుచేస్తున్న అనుభవం భారతదేశానికి ఉంది. దీనిని మరింతగా విస్తరించవచ్చు’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వనరుల లేమి ఆటంకం అవుతుందా?
‘‘ప్రభుత్వం వనరులను సమీకరించగలదు’’ అంటారు ప్రియా రంజన్ డాష్. అంతర్జాతీయంగా చమురు ధరలు అతి తక్కువగా ఉన్న సమయంలో భారత ప్రభుత్వం అదనపు ఎక్సైజ్ సుంకాల ద్వారా నిశ్శబ్దంగా రూ. 20 లక్షల కోట్లు సమకూర్చుకుంది. మనకు చాతుర్యం అవసరం. గతంలో ఆర్థిక మంత్రులకు ఎదురయ్యే తరహా వనరుల పరిమితులు ఇప్పుడు లేవు. రూ. 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర ప్యాకేజీని పరిశీలిస్తే వనరులు ఒక సమస్య కాదని మనకు తెలుస్తుంది. దృఢ చిత్తం ఉంటే అది జరుగుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన సమయమే.. ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనకు సరైన సమయమని భారత ముఖ్య ఆర్థిక సలహాదారు కె.వి. సుబ్రమణియన్ గత జూలైలో పేర్కొన్నారు.
ఉద్దీపన ప్యాకేజీ అవసరమా అనేది ప్రశ్న కాదని, అది ‘ఎప్పుడు’ అవసరం అనేదే ప్రశ్న అని ఆయన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) నిర్వహించిన వెబ్నార్లో స్పష్టంగా చెప్పారు. టీకా దొరికినపుడు సరైన సమయం అవుతుందనేది తన అభిప్రాయంగా తెలిపారు.
ఇప్పుడు భారతదేశంలో ప్రజలకు వ్యాక్సిన్లు అందిస్తున్నారు. కాబట్టి ఆర్థికమంత్రి ‘‘భారీ ఉద్దీపనను ప్రకటిస్తార’’ని చక్రవర్తి ఆశిస్తున్నారు.
2021-22 బడ్జెట్.. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి కీలక రంగాలను బలోపేతం చేయడంతో పాటు వృద్ధి, పునరుద్ధరణపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. 2020 లో ఆదాయ సేకరణలు తక్కువగా ఉన్నందున.. ప్రభుత్వం ఆదాయపు పన్ను విషయంలో ఎటువంటి ప్రయోజనాలనైనా ప్రకటించే అవకాశం కనిపించటం లేదు.
ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రజారోగ్య వ్యయాన్ని పెంచాలని, ఆరోగ్య సంరక్షణ రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలని చాలా మంది నిపుణులు కోరారు. మహమ్మారి నేపథ్యంలో ఔషధ పరిశోధన, వ్యాధి వ్యాప్తిపై నిఘా కోసం మరింత వ్యయం పెంచే అవకాశముంది.

ఫొటో సోర్స్, Manish Rajput/SOPA Images/LightRocket via Getty
డబ్బు ఎక్కడ నుండి వస్తుంది?
భారీగా ఖర్చు చేయాలంటే భారీగా డబ్బు అవసరం. ఆ నిధుల సమీకరణకు ప్రభుత్వానికి గల అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయని అలోక్ చుడీవాలా అంటారు.
‘‘డబ్బుల విషయంలో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. పన్నులు పెంచకూడదు. చాలా డబ్బు అవసరం కాబట్టి సెస్ ప్రవేశపెట్టవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం నగదు కొరతను ఎదుర్కొంటోందని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు నిధులు సమకూర్చడం ఆర్థికమంత్రికి కష్టమవుతుందని వారు నమ్ముతున్నారు. అయితే నగదు పుట్టించటంలో ప్రభుత్వం వినూత్నంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రియా రంజన్ డాష్ అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వానికి నాలుగు ప్రధాన ఆదాయ వనరులు ఉన్నాయి:
జీఎస్‌టీ 28.5 శాతం; కార్పొరేట్ పన్ను 28.1 శాతం; వ్యక్తిగత ఆదాయ పన్ను 26.3 శాతం; ఎక్సైజ్ సుంకం 11 శాతం; కస్టమ్స్ సుంకం 5.7 శాతం
జీఎస్‌టీ వసూళ్లు గత కొన్ని నెలలుగా స్థిరమయ్యాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను నుండి వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడానికి పన్ను పరిధిని ప్రభుత్వం విస్తరించాల్సి ఉంటుంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) విడుదల చేసిన సమాచారం ప్రకారం.. 2018-19 సంవత్సరంలో 5.78 కోట్ల మంది తమ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేశారు.
ఆ నివేదిక ప్రకారం.. ‘‘ఆదాయ పన్ను చెల్లించేది కేవలం సుమారు 1.46 కోట్ల వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు మాత్రమే. సుమారు ఒక కోటి మంది వ్యక్తులు రూ. 5-10 లక్షల మధ్య ఆదాయం ఉందని వెల్లడించగా.. 46 లక్షల మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు మాత్రమే రూ. 10 లక్షలకు మించి ఆదాయం ఉందని వెల్లడించారు’’.
మొత్తం 135 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో వాస్తవంగా పన్నులు చెల్లించిన వారి సంఖ్య విస్మరించదగ్గ స్థాయిలో ఉంది. ఒకవేళ కరోనా-సెస్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లయితే.. అది ఈ చిన్న సమూహమైన పన్ను చెల్లింపుదారుల పైనే పడుతుంది. అది చాలా అన్యాయమని వీరు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక పెట్టుబడుల ఉపసంహరణ, ప్రయివేటీకరణ లక్ష్యాలను సాధించడం పెద్ద సవాలు. అయితే, ప్రభుత్వానికి పరిస్థితులు మరీ అంత దిగాలుగా, దివాలుగా లేవు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాను విక్రయించడం ద్వారా, ప్రభుత్వం నడుపుతున్న ఎయిర్ ఇండియా వంటి కొన్ని సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా, ప్రభుత్వ ప్రధాన ఆస్తులను వేలం వేయడం ద్వారా నిర్మలా సీతారామన్ లక్షల కోట్ల రూపాయలను సమకూర్చుకోవచ్చు.
గత ఏడాది బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 215 లక్షల కోట్లు సంపాదించాలని నిర్దేశించుకున్నారు. కానీ రూ. 30,000 కోట్లు మాత్రమే వచ్చాయి. మహమ్మారి ప్రభావం వల్ల ఈ ఆదాయానికి కొరత పడింది.
ఈ ఏడాది బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రయివేటీకరణ, ప్రభుత్వ ఆస్తుల వేలం వంటి అంశాలు ఉంటాయి. ‘‘పెట్టుబడుల ఉపసంహరణపై మునుపెన్నడూ కనిపించనంత భారీ స్థాయిలో దృష్టి ఉంటుంది’’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు ఇటీవల బీబీసీతో చెప్పాయి.
పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో మోదీ ప్రభుత్వం చాలా తరచుగా లక్ష్యాలను సాధించడంలో విఫలమైందని.. కానీ ఈసారి అనుకున్న లక్ష్యాలను సాధించి తీరుతుందని అలోక్ చూడీవాలా అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి భారీగా డబ్బులు అవసరం. అంతేకాదు.. ‘‘మార్గరెట్ థాచర్ తరహా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రయివేటీకరణ చేపట్టాల’’నే రాజకీయ సంకల్పం కూడా ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తోందని ఆయన చెప్తున్నారు.
పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ప్రభుత్వం సాధించలేకపోయినా కానీ.. భారీ లక్ష్యాలను పెట్టుకోవటంలో ఎటువంటి హానీ లేదంటారు ప్రియా రంజన్ డాష్.
‘‘ఏ ప్రభుత్వ హయాంలోనూ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను సాధించలేదు. అలాగని భారీ లక్ష్యాల వల్ల జరిగే హాని లేదు. అది వనరుల సమీకరణకు ఒక మార్గం. కానీ అదే అతి ముఖ్యమైన మార్గం కాదు’’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం నడిపే మేథో బృందం నీతి అయోగ్.. 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ నిర్వహణలోని సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టాలని సిఫారసు చేసింది.

ఫొటో సోర్స్, AFP
సెస్ విధించడం సవాలు అవుతుందా?
ప్రభుత్వం నిధులు సమీకరించుకోవడానికి సాయపడేలా ఉంటే సెస్ విధించటం వల్ల సమస్య ఉండదని అలోక్ చుడివాలా అంటారు. ప్రియా రంజన్ డాష్ కూడా కోవిడ్-సెస్ విధించినట్లయితే చెల్లించడానికి సానుకూలంగానే ఉన్నానని చెప్పారు.
‘‘విద్యా సెస్సు పనిచేసింది. కోవిడ్-సెస్ మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడానికి, ప్రజలకు టీకాలు అందించడానికి సహాయపడుతుంది. మనం ఆరోగ్య సంక్షోభంలో ఉన్నప్పుడు.. ఆరోగ్య సంరక్షణ వ్యయం పెరుగుదల అనివార్యం. ఆరోగ్య రంగం కోసం ప్రభుత్వ వ్యయాన్ని పెంచడానికి సెస్ విధించటం అవసరమనుకుంటే దాన్ని పరిశీలించాలి. దానికి నేను అనుకూలమే’’ అని చెప్పారాయన.
ఇవి కూడా చదవండి:
- గీతా గోపీనాథ్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశంసల మీద ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- ISWOTY - సుశ్రీ దివ్యదర్శిని ప్రధాన్: ఒడిశా నుంచి దూసుకొచ్చిన ఆఫ్-స్పిన్నర్
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








